Sunday, April 28, 2024

ఆత్మహత్యవైపు ఆలోచనలు

నా సంజాయిషీ

My Confession

                        ————————

                                         By Leo Tolstoy

                                         లియో టాల్స్టాయ్

తెలుగు అనువాదం:

డా.సి.బి. చంద్ర మోహన్

డా. బి. సత్యవతీ దేవి

                              చాప్టర్ 4

                              ————

నా జీవితం కొనసాగడం మాని నిలిచిపోయింది. నేను ఊపిరి పీల్చుకుంటున్నాను, తింటున్నాను, తాగుతున్నాను, నిద్రపోతున్నాను. ఈ పనులు చేయకుండా ఉండలేను. ఫలానా కోరికలు నెరవేర్చుకోవడం సమంజసం — అని నేననుకునేవి లేవు. అందుచేత జీవితం అనేది లేకుండా పోయింది. నేను ఏదైనా కోరుకుంటే — నా కోరికను నెరవేర్చుకున్నా , లేకపోయినా — దాని నుంచి నాకు వచ్చేది ఏమీ లేదని నాకు ముందే తెలిసిపోయేది. ఒక దేవత ప్రత్యక్షమై నా కోరికలు తీరుస్తానంటే — నాకు ఏది కోరుకోవాలో తెలిసేది కాదు. మైకంలో (మత్తు) జోగుతున్న క్షణాల్లో, (కోరిక కాకపోయినా) పాత కోరికలు వదిలి వెళ్ళిన అలవాటును బట్టి ఏదో అనిపించేది. మత్తులో లేని క్షణాల్లో ఇదంతా భ్రమ  అని నాకు తెలిసేది. కోరుకునేది ఏమీ లేదనిపించేది . సత్యము తెలుసుకోవాలనే కోరిక కూడా ఉండేది కాదు (ఎందుకంటే — దానిలో ఏముందో నేను ఊహించగలను కాబట్టి). సత్యం ఏమిటంటే — జీవితం అర్ధరహితం. బ్రతికీ .. బ్రతికీ, నడిచీ .. నడిచీ — ఎత్తయిన కొండ శిఖరం చేరుకుని — వినాశనం తప్ప ముందేమీ లేదని స్పష్టంగా చూశాను. దాన్ని ఆపటం అసాధ్యం. వెనక్కి వెళ్లడం అసాధ్యం. నా కళ్ళు మూసుకుని ఉండడం అసాధ్యం. మున్ముందు బాధా, నిజమైన మరణమూ ( పూర్తి వినాశనం) తప్ప ఇంకేమీ లేదని చూడకుండా ఉండడం అసాధ్యం.

Also read: జవాబు దొరకని ప్రశ్నలు ఎన్నో!

చివరికి ఇట్లా అయింది — సంపూర్ణ ఆరోగ్యవంతుడినైన , అదృష్టవంతుడినైన నేను ఇంకా బ్రతకలేను అని భావించాను. ఏదో ఒక ఎదురులేని శక్తి ఈ జీవితాన్ని వదిలించుకోమని

ప్రేరేపించింది. నన్ను నేను అంతం చేసుకోవాలని కోరుకున్నానని చెప్పలేను. నన్ను జీవితం నుండి దూరంగా లాగిన శక్తి — ఏ కోరిక కన్నా కూడా బలమైనదీ, సంపూర్ణమైనదీ  ఇంకా విస్తృతమైన దీను! మునుపు ఉన్న ‘ జీవించటానికి శ్రమించడం’ — లాంటిదే ఈ శక్తి కూడా! కాకపోతే దానికి విరుద్ధమైన మార్గంలో ఉంది. నా శక్తి అంతా నన్ను జీవితానికి దూరంగా లాక్కొని పోయింది. జీవనాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి? అనే ఆలోచనలు ముందర వచ్చినట్లు — అంతే సహజంగా స్వీయ విధ్వంసం అనే ఆలోచన  ఇప్పుడు నాకు వచ్చింది. అది ఎంత మోహింప చేసింది అంటే — ఎక్కడ తొందరపడి ఆత్మ వినాశనం చేసుకుంటానో అనుకొని — అలా కాకుండా నన్ను నేను వంచన చేసుకోవాల్సి వచ్చింది. నేను తొందర పడాలని కోరుకోలేదు.  ఎందుకంటే ఈ విషయం యొక్క చిక్కుముడి తొలగించడానికి అన్ని ప్రయత్నాలూ చేయదలుచుకున్నాను. “ఒకవేళ ఈ విషయాలు పరిష్కరించుకో లేకపోతే ఎప్పుడూ సమయం ఉంటుంది.” అప్పుడు అదృష్టం వరించింది నేను — నాకు తాడు కనపడకుండా దాచేసాను. లేకపోతే నా రూములో దూలానికి ఉరేసుకుంటానేమో — అనిపించింది. ఇంకా సులభంగా నన్ను నేను పేల్చుకునే ఆశకు లొంగకుండా — తుపాకీతో బయటకు వెళ్లడం మానేశాను. పంట కోత కోయడంలో రైతులతో దీటుగా పనిచేసేవాణ్ణి. మానసికంగా — అలసటతో ఏ ఇబ్బంది లేకుండా 8, 10 గంటలపాటు లేవకుండా  పనిచేయగలిగేవాడిని. ఈ పరిస్థితిలో నేను బ్రతకలేను అనే అభిప్రాయానికి వచ్చాను. ఇంకోవైపు మరణానికి భయపడుతూ, నా ప్రాణం తీసుకోకుండా నన్ను నేను వంచన చేసుకునేవాడిని.

నా మానసిక స్థితి నాకు ఇట్లా అనిపించేది : నా జీవితం ఎవరో నా మీద ప్రయోగించిన తెలివి తక్కువ, ద్వేషపూరిత వేళాకోళంగా — అనిపించేది. నేను, నన్ను పుట్టించిన ఆ “ఎవరో’’ (సమ్ వన్) ని గుర్తించకపోయినా గాని, — ”  ‘ఎవరో’ నన్ను ఈ లోకంలో పెట్టి తెలివిలేని, ద్వేషపూరిత వేళాకోళానికి నన్ను గురి చేశారు” అనే వ్యక్తీకరణ నాకు సహజంగా కలిగింది.

Also read: నేనూ, నా మిత్రులూ పిచ్చాసుపత్రిలో ఉన్నట్టున్నాం: టాల్ స్టాయ్

నేను నేర్చుకుంటూ, వృద్ధిలోకి వస్తూ, శారీరకంగా,  మానసికంగా పరిపక్వత సాధిస్తూ — ఈ 30 ,40 ఏళ్లు ఎలా జీవించానో  — ” ఎవరో “, “ఎక్కడినుండో” నన్ను గమనిస్తూ, వినోదిస్తున్నారని నాకు అసంకల్పితంగా అనిపించింది. ఇంకా, నా పరిపక్వ మానసిక శక్తులతో నేనెలా జీవిత శిఖరాన్ని చేరుకున్నానో, ఒక అవివేకిలా — జీవితంలో ఏమీ లేదని, ఇంతకు పూర్వమూ ఏమీ లేదని, ముందు కూడా ఏమీ ఉండదని — చూడగలిగాను. ఆ ‘ఎవరో’ నన్ను చూసి వినోదించారు.

కానీ, నన్ను చూసి నవ్వుకునే ఆ  ‘ఎవరో’  నిజానికి  ‘ఉనికి లో’ ఉన్నాడో లేదో — తెలియదు. కానీ నా పరిస్థితి ఏమి మెరుగు కాలేదు. నేను చేసే ఒక కార్యానికి గానీ, నా పూర్తి జీవితానికి గాని — ఒక సహేతుకమైన అర్థం ఇవ్వలేకపోయాను. అందరికీ ఎప్పటినుండో తెలిసిన ఈ విషయాన్ని మొదటినుండీ నేను అర్థం చేసుకోవడం మానేయాలని — నాకు తట్టనందుకు ఆశ్చర్యపోయాను. నేను ప్రేమించే వారికి గాని, నాకు గాని రోగము, మరణం — ఈరోజో రేపో రావచ్చు.(ఇప్పటికే వచ్చేసాయి). దుర్వాసన, పురుగులు తప్ప ఏమీ మిగలదు. కొంచెం ముందూ , వెనకా — నా వ్యవహారాలు (అవి ఏవైనా గాని) అన్నీ మరిచిపోబడతాయి. నా ఉనికి కూడా ఉండదు. అప్పుడు దేనికైనా ఎందుకు ప్రయత్నిస్తూ పోవడం? మనిషి ఇది ఎందుకు అర్థం చేసుకోలేక పోతున్నాడు? ఎందుకలా బ్రతికేస్తూ ఉండడం? అదే విచిత్రం. జీవితంలో మత్తెక్కిన వారే బతకగలరు; ఒకసారి స్పృహలోకి వస్తే, ఇదంతా వట్టి తెలివి తక్కువ మోసం అని గ్రహించకుండా ఉండలేరు. అది ఖచ్చితంగా ఇలా చెప్పవచ్చు: జీవితం అనేది రంజింప చేసేదీ కాదు, అద్భుతమైనదీ కాదు. అది కేవలం క్రూరమైనదీ మరియు తెలివి తక్కువతో కూడుకున్నది!

ఆగ్రహించిన ఓ క్రూర మృగం ఒక బాటసారిని మైదానంలో  అడ్డుకోవడం గురించి  తూర్పు దేశాల కథ ఒకటి ఉంది. ఆ జంతువు నుండి తప్పించుకుంటూ బాటసారి ఒక ఎండిపోయిన బావిలోకి దిగుతాడు. కానీ ఆ బావి అట్టడుగున ఒక డ్రాగన్ దవడలు తెరిచి అతనిని మింగడానికి సిద్ధంగా ఉంటుంది. పాపం ఆ బాటసారి జంతువుకు భయపడి పైకి వెళ్లలేక, డ్రాగన్ కు భయపడి కిందకు వెళ్లలేక — ఆ నూతి పగుళ్లలో పెరిగిన ఒక మొక్క కొమ్మను పట్టుకుని వేలాడుతూ ఉంటాడు. అతని చేతులు సమయం గడిచిన కొద్దీ బలహీనమైపోతున్నాయి. పైనుండి గాని కింద నుండి గాని వచ్చే వినాశనానికి తాను సిద్ధపడాలని తెలిసినా గాని  బాటసారి ఆ చిన్న కొమ్మను వదలక వేలాడుతూనే ఉంటాడు. అప్పుడు రెండు ఎలుకలు (ఒకటి తెలుపు, ఒకటి నలుపు) బాటసారి వేలాడే కొమ్మను పళ్ళతో కొరకడం గమనించాడు. త్వరలోనే ఆ చిన్న కొమ్మ కాండం నుంచి విడిపోయి నూతిలో పడుతుందని, తాను  డ్రాగన్ నోట్లో చిక్కుకోబోతున్నానని ఆ బాటసారి గ్రహించాడు. తాను మరణించడం తధ్యమని అతనికి తెలుసు. అలా కొమ్మకు వేలాడుతూనే చుట్టూరా గమనించాడు. కొన్ని తేనె చుక్కలు ఆ కొమ్మ ఆకులపై పడడం చూసి తన నాలుక జాపి ఆ తేనె నాక సాగాడు. అలాగే — మరణం అనే డ్రాగన్ నాకోసం ఎదురుచూస్తోంది. నన్ను ముక్కలుగా చీలు స్తుంది — అని తెలిసినా  జీవితం అనే కొమ్మను పట్టుకొని వేళ్లాడాను. ఆ వేదనలో నేను ఎందుకు పడ్డానో నాకు అర్థం కాలేదు. నాకు మునుపు ఓదార్పు కలిగించిన తేనె ఇప్పుడేమీ ఆనంద పరచడం లేదు. రాత్రీ ,పగలుగా ఉన్న నలుపూ , తెలుపూ ఎలుకలు నేను వేలాడే కొమ్మను కొరుకుతూనే ఉన్నాయి. ఇప్పుడు డ్రాగన్ నాకు స్పష్టంగా కనబడుతోంది. తేనెలో తీపిదనం పోయింది. ఇప్పుడు నాకు తప్పించుకోవడానికి వీలు లేని విధంగా డ్రాగన్, ఎలుకలు మాత్రమే కనబడుతున్నాయి. వాటి నుంచి చూపు మరల్చుకోలేకపోయాను. ఇది కల్పిత కథ కాదు. ఇది అందరికీ అర్థమయ్యే సత్యం. నిజమైనది, సమాధానం దొరకనిదీనూ. మునుపు డ్రాగన్ అంటే నాకు ఉన్న భయాన్ని పోగొట్టిన మోసపూరిత ఆనందాలు (జీవితంలో) ఇప్పుడు నన్ను ఇంకా మోసం చేయడం మానేశాయి. “జీవితం యొక్క పరమార్థం ఏమిటో నీకు అర్థం కాదు. అందుచేత దాని గురించి ఆలోచించవద్దు. కానీ జీవనం కొనసాగించు” అని ఎన్నిసార్లు నాకు చెప్పినా గాని — నేను ఆ పని చేయలేకపోయాను. ఇప్పటికే దీర్ఘకాలం అలా జీవించాను. వెలుగు, చీకట్లు నా చుట్టూ తిరుగుతూ మరణానికి నన్ను దగ్గరగా తీసుకురావడం — నేను ఇంకా చూడకుండా ఉండలేను. అది మాత్రమే చూస్తున్నాను. ఎందుకంటే — అదే నిజం కాబట్టి మిగిలినదంతా అబద్ధం.

Also read: ‘చదువు’  అంటే ..  ఏమిటి?

మిగిలిన అన్నిటికన్నా ఎక్కువ సమయం — పై క్రూరమైన నిజం నుండి నా చూపుని మరల్చిన ఆ రెండు తేనె చుక్కలు — (ఒకటి కుటుంబం పైన నా ప్రేమ, రెండవది నేను కళ అని పిలిచే నా రచనలు.)– ఇప్పుడు నాకు తీపిగా లేవు!

“కుటుంబం”  నాలో నేను అనుకున్నాను. నా కుటుంబం — భార్యాబిడ్డలు — వారు కూడా మనుషులే. వాళ్లు అబద్ధం లో నైనా బ్రతకాలి. లేకపోతే క్రూరమైన సత్యాన్ని చూడాలి. వాళ్ళు ఎందుకు బ్రతకాలి? నేను ఎందుకు వాళ్లను ప్రేమించాలి? సంరక్షిస్తూ ఉండాలి? ఎందుకు పెంచాలి? వాళ్లను చూసుకోవాలి? నేను పడిన నిరాశకు వాళ్లు కూడా చేరుకోవాలా ? లేక మూర్ఖంగా ఉండాలా? వాళ్లని ప్రేమిస్తూ — వారి నుండి నిజాన్ని దాచలేను. జ్ఞానంలో ప్రతి మెట్టు వారిని సత్యానికి దగ్గర చేస్తుంది. ఆ సత్యమే — మరణం!

 “కళలు, కవిత్వం?”  … విజయం యొక్క ప్రభావమూ, జనం ప్రశంసలూ — ఈ రెండిటి వలన మరణం దగ్గరైనా గాని కళలు, కవిత్వాలను కొనసాగించవచ్చునని నాకు నేను ఎప్పటినుంచో భరోసా ఇచ్చుకున్నాను. కానీ మరణం అనేది — నా శ్రమను, దాని జ్ఞాపకాలను — అన్నిటిని నాశనం చేస్తుంది. అందుచేత నేనిచ్చుకున్న భరోసా కూడా మోసమేనని చూడగలిగాను. కళ అనేది జీవితానికి ఒక అలంకారము, ఆకర్షకము అని నాకు తెలుసు. కానీ జీవితమంటే ఆకర్షణ పోయిన నేను ఇతరులను ఎలా ఆకర్షించగలను? నేను నాదైన జీవితం బ్రతకకుండా ఇంకొకరి జీవితపు అలల మీద బ్రతికినంత కాలమూ, వ్యక్త పరచలేకపోయినా గాని జీవితం అర్థవంతమైనది అని నేను నమ్మినంత కాలమూ — కవిత్వము, అన్ని రకాల కళలలోనూ జీవితం ప్రతిబింబించడం — నాకు ఆనందాన్ని తెచ్చిపెట్టింది. కళలనే అద్దంలో మంచి జీవితాన్ని చూడడం నన్ను ఆహ్లాదపరిచింది. కానీ నేను జీవితం యొక్క అర్ధాన్ని వెతకడం మొదలుపెట్టిన నుండీ, నేను నా సొంత జీవితం బతకాల్సిన అవసరం గుర్తించినప్పటి నుండి — ఆ అర్థం నాకు నిరుపయోగమూ, హాస్యాస్పదమూ, లేక బాధాకరమూ అయింది. నా స్థితి తెలివి తక్కువగాను, నిరాశగాను ఉండటం — ఆ అద్దంలో చూసినప్పటినుండి — నన్ను నేను ఓదార్చుకోలేకపోయాను. అంతరాంతరాలలో నా జీవితం అర్థవంతమైనది అనుకున్నంత కాలం ఆ దృశ్యం ఆనందదాయకంగా ఉండింది. అప్పుడు జీవితం లో రకరకాల కాంతిపుంజాల ఆటలు — హాస్యం, విషాదం, కరుణ, సౌందర్యం, భయానకం — ఇవన్నీ నన్ను ఆహ్లాదపరిచాయి.  డ్రాగన్ నూ, నా ఆధారాన్ని కొరికి వేసే ఎలుకలనూ చూసినప్పటినుండీ — తేనెలోని తీయదనం నేను అనుభవించలేకపోయాను.

 అంతేకాదు. జీవితం నిరర్థకమని నాకు అర్థమయి ఉంటే — నా అదృష్టం అంతే అనుకుని నిశ్శబ్దంగా భరించగలిగేవాడిని. కానీ నేను దానితో సంతృప్తి చెందలేదు. బయటికి దారి లేదని తెలిసి,  అడవిలో బతికే మనిషిని అయితే — బతుక గలిగే వాడినేమో. కానీ అడవిలో మార్గం కోల్పోయిన భయంతో రోడ్డును వెతుకుతూ అటూ, ఇటూ పరిగెత్తే మనిషి లాంటి వాడిని నేను. అటువంటి మనిషికి — తన వేసే ప్రతి అడుగూ తనను ఇంకా గందరగోళ పరుస్తుందని తెలుసు. అయినా అటూ, ఇటూ పరిగెత్తడం ఆపడు.

ఇది నిజానికి భయంకరం. ఈ ఘోరమైన స్థితి నుండి తప్పించుకోవడానికి నన్ను నేను అంతం చేసుకోవాలని కోరుకున్నాను. నాకోసం ఎదురు చూసే దాని గురించి భయాన్ని అనుభవించాను. నేను ఉన్న స్థితి కన్నా ఈ భయం ఇంకా  అధ్వాన్నంగా ఉంటుందని తెలుసు! అయినా గాని చివరి వరకు ఓర్పుగా వేచి ఉండలేకపోయాను. గుండెలో ఏదో ఓ రక్తనాళం పగిలి, అంతా ముగిసిపోతుంది — అనే వాదన ఎంత ఆమోదయోగ్యంగా ఉన్నా కూడా, నేను ఓర్పుగా చివరి వరకు వేచి ఉండలేకపోయాను. భయానకమైన చీకటి చాలా దారుణంగా ఉంది. బుల్లెట్ ద్వారా గాని, ఉరి ద్వారా గానీ — నాకు నేనుగా,  ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా — స్వేచ్ఛ పొందాలని కోరుకున్నాను. ఆ భావనే నన్ను ఆత్మహత్య వైపు బలంగా లాగింది!

Also read: నా సంజాయిషీ

               ——————

Dr. C. B. Chandra Mohan
Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles