ప్రియమైన బోధకులారా,
ఏ మనిషి కనలేని, కనరాని
దృశ్యాలు చూసేయి నా కళ్ళు
సమర్థులైన ఇంజనీర్లు
గ్యాస్ ఛాంబర్లు తయారు చేశారు.
చదువుకున్న వైద్యులు
పిల్లలకు విషాలెక్కించారు
శిక్షణ పొందిన నర్సులు
పసి గుడ్లను చిదిమేశారు
హైస్కూలు, కాలేజీ విద్యార్థులు
అబలలను, పిల్లలను
తుపాకులతో కాల్చేశారు
నిప్పుల్లో తగలెట్టారు!
వద్దు సార్లూ .. వద్దు, వద్దు;
ఈ సందేహపూరిత చదువులు మనకొద్దు!
నేనొక అభాగ్య భాగ్యుడిని!!
బంది ఖానాల్లో గొప్ప బందిఖానా —
కాన్సన్ట్రేషన్ క్యాంపు నుండి
— బతికి బట్టకట్టిన వాణ్ణి
మీకు చేతులెత్తి మొక్కుతాను సార్లూ!
మీ శిష్యుల్లో మనిషితనం నింపండి
మీ బోధనలు —
నేర్పు గల రాక్షసుల్ని
నైపుణ్యత గల మానసిక రోగుల్ని,
చదువుకున్న నిరక్షరాస్యుల్ని —
తయారు చేయనీకండి!
అక్షరజ్ఞానం, అంకెల జ్ఞానం
సార్ధకమయ్యేది
పిల్లలు మానవతను ఆకళింపు చేసుకున్నప్పుడే!!
మూలం: నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంపులో దొరికిన ఒక లేఖ ఆధారంగా ….
స్వేచ్ఛానువాదం: డా. సి. బి. చంద్ర మోహన్