My Confession
By LEO TOLSTOY
లియో టాల్ స్తోయ్
తెలుగు అనువాదం: డా. సి.బి. చంద్ర మోహన్, డా. బి. సత్యవతి దేవి
ఛాప్టర్ – 1
నేను సాంప్రదాయక, క్రైస్తవ మత విశ్వాసంగల కుటుంబంలో పుట్టి, బాప్టిజం ఇవ్వబడి, పెంచబడ్డాను. నా పసితనంలో, బాల్యంలో మరియు యుక్త వయసులో ఆ విశ్వాసం నాకు నేర్పబడింది. కానీ యూనివర్సిటీలో రెండో కోర్సు వదిలేసినప్పుడే, (నాకు అప్పుడు 18 ఏళ్లు). నాకు నేర్పబడిన విశ్వాసాలన్నిటిని నమ్మటం మానేశాను.
కొన్ని జ్ఞాపకాలను బట్టి చూస్తే, వాటిని నేనెప్పుడూ గాఢంగా నమ్మలేదు. కానీ నా చుట్టూతా ఉన్న, నాకన్నా పెద్దవాళ్లు చెప్పిన దానిపై, నేర్పిన దానిపై మాత్రమే ఆధారపడ్డాను. ఆ ఆధారం చాలా అస్థిరమైనది.
నాకు పదకొండేళ్లు రాకముందే, వ్లాడిమర్ మిల్యూటిన్ (ఎపుడో చనిపోయిన) అనే ఒక గ్రామర్ స్కూల్ విద్యార్థి– ఒక ఆదివారం మమ్మల్ని సందర్శించి – -అతని స్కూల్లో ఆవిష్కరించబడిన, ఒక వినూత్నమైన వింత గురించి చెప్పినట్లు నాకు గుర్తుండిపోయింది. అదేమిటంటే ‘దేవుడనేవాడు లేడు’ అని. ఇంకా దేవుని గురించి మనకు నేర్పబడినదంతా ఊహాజనితం (అది 1838వ సంవత్సరం ) అని. ఈ సమాచారంపట్ల నా పెద్దన్నలు ఎంత ఆసక్తి చూపారో నాకు ఇంకా గుర్తు ఉంది. వాళ్లు, వారి గ్రూపులోకి నన్ను కూడా పిలిచారు. పై విషయంపట్ల అందరమూ చాలా ఉత్సాహం చూపాము. అది చాలా ఆసక్తికరమైన, సుసాధ్యమైన విషయమని అందరం ఆమోదించాం.
నాకు ఇంకో విషయం కూడా గుర్తుంది. అప్పుడు యూనివర్సిటీలో చదువుతున్న నా పెద్ద సోదరుడు డిమిట్రీ అకస్మాత్తుగా (అతని సహజ, ఉద్వేగ భరితమైన స్వభావంతో) మతానికి అంకితమైపోయి, చర్చి సేవలన్నిటికీ హాజరవుతూ– ఉపవాసం చేయడం, పవిత్ర నైతిక జీవితం గడపడం–మొదలుపెట్టాడు. మేమంతా– మా పెద్దలతో సహా–నిరంతరం అతన్ని అపహాస్యం చేయడం మొదలుపెట్టాం. కారణం తెలియదు గానీ, అతన్ని “నోవా” (Noah) అని పిలిచేవాళ్ళం. అప్పటి కజన్ యూనివర్సిటీ సూపర్నెంట్– మ్యూసిన్- పుష్కిన్, అతని ఇంట్లో డాన్స్ కు మమ్మల్ని ఆహ్వానిస్తూ, నా అన్న డిమిట్రీని ఒప్పించడానికి (అతను ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ ఉంటే) వ్యంగ్యంగా–డేవిడ్ కూడా ఆర్కు ముందు డాన్స్ చేశాడు–అని చెప్పినట్లు గుర్తు. నా పెద్దలందరూ వేసిన జోకులకు నేనూ సమ్మతి చూపాను. మత సంబంధిత ప్రశ్నోత్తరాలు నేర్చుకోవడం, చర్చికి వెళ్లడం – అవసరమైనప్పటికీ, వాటిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని వారి నుంచి సారాంశం గ్రహించాను. నేను చిన్న వయసులో ఉన్నప్పుడే వోల్టేర్ రచనలు చదివినట్లు జ్ఞాపకం. అతని పరిహాస, ధిక్కార గొంతు నన్ను దిగ్భ్రాంతున్ని చేయలేదు సరి కదా, రంజింప చేసింది.
మామూలుగానే మన విద్యా స్థాయి ఉన్నవారిలో జరిగినట్లు, నా విశ్వాసం కూడా బీటలువారింది. నేను అనుకోవడం చాలా విషయాల్లో అది ఈ క్రింది విధంగా జరుగుతుంది – మత సిద్ధాంతానికి సంబంధించిన సూత్రాలకు సంబంధం ఏమి లేకపోగా, మనిషి వాటికి విరుద్ధంగా అందరిలానే జీవిస్తుంటాడు; మత సిద్ధాంతానికి జీవితంలో ఏ పాత్రా ఉండదు. పరస్పర మానవ సంబంధాల్లో ఇది ఎక్కడా తటస్థపడదు. ఇంకా– మనిషి తన సొంత జీవితంలో కూడా దీన్ని ఎప్పుడూ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం రాదు. మత సిద్ధాంతం జీవితానికి సంబంధం లేకుండానూ, స్వతంత్రంగానూ ఉంటుంది. ఆ సిద్ధాంతం ఎక్కడైనా ఎదురైతే, అది జీవితానికి సంబంధం లేని ఒక బాహ్య దృగ్విషయంగానే ఉంటుంది.
ఇప్పటి లాగానే అప్పుడు కూడా—ఒక మనిషి ఆస్తికుడా లేదా నాస్తికుడా అనే విషయం ఆ మనిషి జీవన విధానం, ప్రవర్తనను బట్టి తెలుసుకోవడం అనేది దాదాపు అసాధ్యం. బహిరంగంగా సనాతనవాదాన్ని బలపరిచే మనిషికి, దాన్ని వ్యతిరేకించే మనిషికీ మధ్య తేడా కనబడితే– ఆ తేడా ఖచ్చితంగా సనాతన వాదికి అనుకూలంగా ఉండదు. అప్పటి లాగానే ఇప్పుడు కూడా ప్రజావృత్తి, సనాతన ధర్మం యొక్క ఒప్పుకోలు ఎక్కువగా — నిస్తేజమైన, క్రూరమైన మనుషుల్లోనూ మరియు తమకు తాము చాలా ముఖ్యులం అని తలచే వారిలోనూ — ఎక్కువగా కనబడుతుంది. సామర్థ్యం, నిజాయితీ, విశ్వసనీయత, మంచితనం, నైతిక ప్రవర్తన ఎక్కువగా నాస్తికుల్లోనే కనబడుతుంది.
స్కూళ్లు — మత సంబంధ ప్రశ్నోత్తరాలు నేర్పుతాయి. విద్యార్థులను చర్చిలకు పంపిస్తాయి. ఇంకా– ప్రభుత్వాధికారులు కమ్యూనియన్ తీసుకున్నట్లుగా యోగ్యతా పత్రాలు సమర్పించాలి. కానీ విద్య పూర్తి చేసిన, ప్రభుత్వ ఉద్యోగంలోలేని మన గ్రూపులోని ఒక మనిషి (ఇదివరకు అతనికి ఈ పని చేయడం చాలా సులువుగా ఉండేది) తాను క్రైస్తవుల మధ్య జీవిస్తున్నానని, తాను ఒక సనాతన క్రైస్తవ చర్చి యొక్క సభ్యునిగా పరిగణింపబడుతున్నానని– ఒక్కసారి కూడా జ్ఞాపకం చేసుకోకుండా పదీ, ఇరవై ఏళ్లు బ్రతికేయగలడు.
అందుచేత– పూర్వం లాగానే ఇప్పుడు (నమ్మకంతో అంగీకరించబడిన, బాహ్య ఒత్తిడిలతో మద్దతు ఇవ్వబడిన) మత సిద్ధాంతం – జ్ఞానము యొక్క ప్రభావము, మరియు దానితో ( మత సిద్ధాంతముతో) సంఘర్షించే జీవితానుభవము వలన — క్రమంగా కరిగిపోతుంది. ఇంకా — ఒక మనిషి చాలాసార్లు — తన బాల్యంలో తనకు నేర్పబడిన మత సిద్ధాంతాన్ని ( నిజానికి దానిలో మత సిద్ధాంతం జాడలు కొంచెం కూడా మిగిలి ఉండవు) ఇంకా పాటిస్తున్నానని ఊహించుకుంటూ — జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. తెలివి, నిజాయితీగల ఎస్ అనే ఒక మనిషి తాను మత విశ్వాసాలపై నమ్మకం ఎట్లా కోల్పోయాడో నాకు వివరించాడు. ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు, (అప్పుడు అతనికి 26 ఏళ్లు) రాత్రి బసకు ఒక చోట ఆగారు. అతను మోకరిల్లి ప్రార్థించాడు. (ఆ అలవాటు అతనికి చిన్నప్పటి నుంచి కొనసాగుతోంది) అదే సమయంలో అతని పెద్దన్న గడ్డి మీద పండుకొని అతనినే గమనిస్తున్నాడు. ఎస్ తన ప్రార్థన ముగించి రాత్రి విశ్రమించే సమయంలో అతని అన్న” నువ్వు ఇంకా ఇవన్నీ చేస్తూనే ఉన్నావా?” అని అడిగాడు.
ఆ తరువాత వారు ఒకరితో ఒకరు ఇంకేమి మాట్లాడుకోలేదు. ఆ రోజు నుండి ఎస్ ప్రార్థనలు చేయడం, చర్చికి వెళ్లడం మానేశాడు. ఇప్పుడు అతను చర్చికి వెళ్లి, ప్రార్థన చేసి, కమ్యూనియన్ పొంది — దాదాపు 30 ఏళ్లు అవుతుంది. ఇది — అతని సోదరుని విశ్వాసాలు తెలియడం మూలానా కాదు; అతను సోదరునితో చేరడం మూలానా కాదు; అతని అంతరాత్మలో ఒక నిర్ణయానికి రావడం మూలానా కాదు. ఇది ఎలా జరిగిందంటే — (అతడి సోదరుడు అడిగిన ఒకే ఒక్క ప్రశ్న) — తన బరువుతో తానే పడడానికి సిద్ధంగా ఉన్న గోడను ఒక వేలితో తోయగలిగినట్లు! అతను ఎక్కడైతే విశ్వాసం ఉందనుకున్నాడో అక్కడ నిజానికి శూన్యం ఉందని అతని సోదరుని మాట బయట పెట్టింది. అందుచేత — ప్రార్థన సమయంలో పదాల ఉచ్చారణ, సిలువ గుర్తులు వేయడాలు, ఇంకా మోకరిల్లడాలూ — ఇవన్నీ అర్థంలేని చర్యలేనని తెలుసుకున్నాడు. వాటి గురించి తెలిసిన తర్వాత వాటిని కొనసాగించలేకపోయాడు.
ఎక్కువమంది మనుషుల విషయంలో గతంలో ఇలాగే జరిగింది, ఇంకా జరుగుతోంది — అని నేను అనుకుంటాను. వారికి వారు నిజాయితీ గలిగి, మన విద్యా స్థాయి గల మనుషుల గురించి — నేను మాట్లాడుతున్నాను. లౌకిక లక్ష్యాలు నెరవేర్చకుంటా నికి మత విశ్వాసాన్ని ఒక వృత్తిగా చేసుకునే వారి గురించి కాదు.( అటువంటివారు ప్రధానంగా అవిశ్వాసులు. మత విశ్వాసం వారికి లౌకిక లక్ష్యాలు పొందే సాధనం అయితే — అది ఖచ్చి తంగా విశ్వాసం కాదు) మన విద్యా స్థాయి గలవారికి — వారి విజ్ఞాన జ్యోతి, వారి జీవితం, వారి విశ్వాసాన్ని కరిగిపోయేట్లు చేస్తాయి. ఆ విషయం వారు ఇప్పటికే గ్రహించి ఉండవచ్చు లేదా ఇంకా గ్రహించకపోయి ఉండవచ్చు.
చిన్నతనం నుండీ నాకు నేర్పబడిన మత సిద్ధాంతం మిగిలిన వారిలో లాగానే నాలోనూ మాయమైంది. నేను 15 ఏట నుండి తత్వశాస్త్ర గ్రంధాలు చదవడం మొదలుపెట్టాను. దానితో చిన్న వయసులోనే నేను మత సిద్ధాంతాన్ని బహిరంగంగా త్రోసిపుచ్చాను. 16వ ఏట నుండి నేను ప్రార్థనలు చేయడం మానేశాను. చర్చికి వెళ్లడం, నాకు నేనుగా ఉపవాసాలు చేయడం మానేశాను. నాకు చిన్నతనంలో నేర్పబడిన వాటిని నేను నమ్మలేదు. కానీ ‘ ఏదో ఒక దాన్ని’ నమ్మాను. నేను నమ్మింది ‘ఏమిటి?’ అనేది — నేను చెప్పలేకపోయాను. నేను భగవంతుని నమ్మాను, లేక దేవుని ఉనికిని తిరస్కరించలేదు. కానీ నేను నమ్మిన దైవం ఏ రకమైన దైవమో నేను చెప్పలేకపోయాను. నేను క్రీస్తుని, అతని బోధనలను త్రోసిపుచ్చలేదు. కానీ అతని బోధనలలో ఏముందో నేను చెప్పలేకపోయేవాడిని.
ఆ కాలాన్ని ఇప్పుడు మననం చేసుకుంటే ‘నా విశ్వాసం (నా నిజమైన విశ్వాసం) (జంతు ప్రవృత్తి పక్కన పెడితే) నా జీవితానికి ప్రేరణ ఇచ్చింది అనే నమ్మకం నన్ను నేను పరిపూర్ణ మానవునిగా చేసుకొనడానికి దోహద పడిందని నాకు స్పష్టంగా కనబడుతోంది.’ కానీ’ ఈ పరిపూర్ణత దేనిలో ఉంది? దాని లక్ష్యం ఏమిటి?’ అనేది నేను చెప్పలేకపోయాను. మానసికంగా నాకు నేను పరిపూర్ణత సాధించడానికి ప్రయత్నించాను. నేను చదవదగ్గవన్నీ చదివాను. నా జీవన పథంలో ఎదురైన అన్నిటినీ చదివాను. నా సంకల్పాన్ని పరిపూర్ణం చేసుకునేందుకు ప్రయత్నించాను. కొన్ని నియమాలు నిర్దేశించుకుని వాటిని అనుసరించడానికి ప్రయత్నించాను. రకరకాల వ్యాయామాలతో బలాన్ని చురుకుదనాన్ని పెంపొందించుకోవడం, అన్ని రకాల లేమితో ఓర్పు సహనం అలవర్చుకోవడం — నేర్చుకొని నాకు నేను భౌతికంగా పరిపూర్ణత సాధించాను. ఇదంతా పరిపూర్ణతా సాధన కింద పరిగణించాను. సహజంగానే దీని ప్రారంభం నైతిక పరిపూర్ణతయే! కానీ అది త్వరలోనే — (నా దృష్టిలో లేదా దైవం దృష్టిలో కాక మిగతా మనుషుల దృష్టిలో మంచి మనిషిగా ఉండాలనే కోరిక) – సాధారణ పరిపూర్ణతతో భర్తీ చేయబడింది. అతి త్వరలోనే ఈ ప్రయత్నం, మిగిలిన వారి కంటే శక్తివంతుడిని, కీర్తిమంతుడిని, ముఖ్యమైన మనిషిని, ధనికుడిని — అవ్వాలనే కోరిక కింద రూపుదిద్దుకుంది.