Friday, April 26, 2024

అభ్యుదయ సీత

రాత్రి ఒంటి గంట. ఆపరేషన్ ముగించి బయటకు వచ్చింది సీత. పేషేంట్ కండిషన్ బాగుంది వెళ్లి చూడొచ్చు అని కన్నీళ్లు పెట్టుకుని రోదిస్తున్న పేషంటు తల్లిని ఓదార్చింది డాక్టర్ సీత. పేషెంటుకి నిండా పదమూడు ఏండ్లుకూడా ఉండవని బాధ పడింది సీత. ఎందుకిలా పసిపిల్లలను క్రూర మృగాలవల్లే బలితీసుకుంటున్నారు అని లోలోపల మదనపడింది తాను కాపాడిన పేషంటుని తలచి సీత. తన కారును ఇంటిముఖం పట్టించింది నెమ్మదిగా. తన సెకండ్ కీ ద్వారా తన ఇంట్లోకి ప్రవేశించింది సీత. బెడ్ రూమ్ లో ఆదమరచి నిద్రపోతున్న తన కూతురు భవిత, తన శ్రీవారు రఘులను చూసి ఆనందించింది సీత.

భవిత నిద్ర లేస్తూనే నిన్న సాయంత్రం మన అందరిని పండగ సెలవులకు అమ్మమ్మ రమ్మని ఫోన్ చేసి చెప్పింది అని అన్నది సీతతో. భవిత మాటలు విన్న రఘు ఎప్పుడు వాళ్ళే వస్తారు కదా అన్నాడు. అందుకు భవిత బుంగమూతి పెట్టి మీరు ఎప్పుడు ఇంతే నాన్న అంటూ బెడ్ రూమ్ లోకి వెళ్ళింది. భవిత వెనకాలే అడుగులేస్తూ రఘు అమ్మకి హాస్పిటల్లో కుదరాలి కదా అని సర్ధిచెప్పబోయాడు. ఈ సంభాషణ విన్న సీత ఈసారి మనం వెళదాం అన్నది. సీత మాటలకు రఘు మరోసారి ఆలోచించు అని అన్నాడు.

కనకమ్మ ఇల్లు అంత కడిగి ముగ్గులు పెట్టింది. పండగ సంబరం అంత నీ ముగ్గులతో వచ్చింది అక్క అన్నది వసంత కనకమ్మతో. సీత అల్లుడు వస్తున్నారని సంబరంగా చెప్పింది కనకమ్మ వసంతతో. కారును హుషారుగా తోలుతున్నాడు తన కూతురు భవిత చెప్పే కబుర్లు వింటూ రఘు. కారులో నుంచి వెనక్కి పరుగులు పెడుతున్న ప్రకృతి అందాలను చూస్తూ ఉంది సీత. పరుగులు పెట్టె కాలాన్ని వెనక్కి లాగే కళ్ళాలా ఈ అందాలు అని తలపోస్తూ గతంలోకి నడిచింది సీత.

 పదో తరగతి చదువుతున్న సీత బడినుంచి ఇంటికి రాగానే తన కాళ్ళుచేతులు కడుక్కుని పుస్తకాల్లో దూరింది. తల్లి కనకమ్మ జంతికలు పోసిన కప్పును సీత పక్కన ఉంచింది. వీధి తలుపు కిర్రుమనే చప్పుడు అయింది. బాబాయి వచ్చారు మంచినీళ్లు పట్టుకురాపో అన్న తన అమ్మ కనకమ్మ కేకవిని విసురుగా లోపలికెల్లింది సీత. వరండాలో వారి కబుర్ల మథ్యలోకి మంచి నీళ్లు తెచ్చి అందించింది సీత. సీతకేసి ఓరగా చూస్తూ ఇంతకీ నువ్వు కస్స బుస్స తుస్స అంటూ ఓవెకిలి నవ్వు విసిరాడు సోమనాథం. సీత చేతిలోనుంచి లోటాని అందుకుని నీళ్లు గుటకలేస్తూ ఏంటి అలా ఉలక్క పలక్క వెళతావు లోపలకు అన్నాడు సోమనాథం. అది ఒత్తి పిచ్చిది ఎదో చదువుకోడానికి వెళుతున్నది లెండి అంది కనకమ్మ వారికీ ఫలహారాలు అందిస్తూ.

తరగతి గదిలో సైన్స్ పరీక్ష జరుగుతున్నది. ఎవరికి మీ అందరిలో ఫస్ట్ వస్తే వాళ్లకు ఒక సర్ప్రైజ్ బహుమతి అని ప్రకటించాడు శేఖర్ మాస్టర్. పరీక్ష ముగిసింది. పేపర్స్ దిద్ది రేపు తెలియచేస్తాను అని వెళ్ళిపోతాడు శేఖర్. సీత బడి నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. పక్క వీధిలో ఉంటున్న తన పిన్ని ఇంటి కెళ్లిందేమో తన అమ్మ అని ఆలోచించింది సీత. తన పుస్తకాల సంచిని మోసుకుంటూ పిన్ని ఇంటికి వెళ్లి తలుపు కొట్టింది. తలుపు తెరచిన సోమనాథం ‘రావే లోపల’కు అంటూ పిలుస్తాడు. ‘మా అమ్మ వచ్చిందేమో అని వచ్చాను’ అంటుంది సీత సోమనాథంతో.. ‘మీ అమ్మ రాలేదే.. మీ పిన్ని కూడా ఇంట్లో లేదు. ఒక్కడినే ఉన్నాను’ అంటూ వెకిలిగా నవ్వాడు సోమనాథం.  ఆ మాటకు పరవాలేదు వెళతాను అమ్మ వచ్చేసి ఉంటుంది ఈ పాటికి అని చెప్పి బయటకు వచ్చింది సీత.

తరగతి గదిలో నిశ్శబ్తం తాండవిస్తోంది. విద్యార్థులు రాసిన పరీక్షా పత్రాల కట్టను చేతిలో పట్టుకుని లోపలకి శేఖర్ వడివడిగా వచ్చాడు.  శేఖర్ అందరి పేర్లు పిలచి వారి పేపర్లు అందిస్తాడు. సీత తాను రాసిన పేపర్ పై వచ్చిన ప్రశంసలను మార్కులను చూసి ఆనందించింది. శేఖర్ తన పేరు పిలచి అందరి ఎదుట అందించిన పెన్ను బహుమతిని అపురూపముగా చూస్తూ అందుకున్నది సీత.

ఇంట్లో అందరు ఆ రాత్రి హరికథ వినడానికి వెళ్లారు. సీత పరీక్షల హడావిడివల్ల ఇంటి దగ్గరే ఉన్నది. ‘చదువుకుంటున్నావా సీతా?’ అన్నసోమనాథం మాట సీత చెవిన పడింది. దేముడి ప్రసాదంతిను అని సోమనాథం సీతకు ప్రసాదాన్ని ఇచ్చాడు. సీత ఆ ప్రసాదం తిన్నది.  కాసేపటికి అలాగే కూర్చుని తాను పడుకున్న మంచంపై నుండి కదలబోతోంది సీత. వళ్ళంతా తెలియని భారంగా అనిపిస్తుంది సీతకు. సీత తన కండ్లు నులుముకుంటూ నోరుతెరచి పిలవబోతుంది. సీతకు తన ఎదురుగ్గా సోమనాథం వెకిలిగా నవ్వుతు కనిపిస్తాడు. బూచోళ్లు ఏమిచ్చినా తినొద్దు  అన్న తన అమ్మ మాటలు గొర్తొచ్చాయి సీతకు ఆ క్షణం. నాటి కాల రాత్రి లో… పులి పంజా వేటుకు బలి అయిన మేక పరిస్థితి అయినది సీత గతి. నెమ్మదిగా నిద్రాదేవి వడిలో సోకరాగం ఆలపించింది సీత.

సీత లేవవే ఇంతసేపా పడుకోవడం అని కనకమ్మ పిలవడం సీత చెవిన పడింది. టక్కున కండ్లు తెరచి పెరటి లోపలకు పరుగుతీసింది సీత. క్షణ కాలంలో తయారై వచ్చింది సీత. హడావిడిగా సోఫాలో ఉన్న పుస్తకాల సంచి పట్టుకుని గుమ్మం దాటుతున్నది సీత. ఎక్కడకు నీ  పరుగు ఈరోజు ఆదివారం. బడికి సెలవు మరిచావా అన్న తన అమ్మ కనకమ్మ మాటతో సీత విధి గుమ్మం దాటబోతు వేస్తున్న తన అడుగును వెన్నక్కి తీసుకున్నది. సీత వెనక్కి తిరిగి ఆదివారమా అంటూ ఆశ్చర్యపోయింది. ఇంతలో బయటినుంచి వచ్చిన సోమనాథం సీతకు దగ్గరగా నడుస్తూ తన భుజంపై చేయివేసి నొక్కుతాడు. ఇంతకీ నువ్వు కస్స.. బుస్సా.. తుస్సా అని వ్యంగ్యంగా అంటాడు. సీత అయోమయంలో పడింది.

రోజులు గడుస్తున్నాయి. సీత మనసు మునపటిల ఉరకలువేయలేదు. సోమనాథం చేసే వెకిలి చేష్టలు తన మనసుకు సంకేళ్లుగా మారాయి. చదువు భారమై బడి ముఖం మరచిపోయింది సీత. సీత తుదకు తన తల్లిదండ్రుల బలవంతం మీద ముక్కున చదివి ఫైనల్ పరీక్షలు రాసింది. తుది ఫలితాలు అత్తెసరు మార్కులును చూపించాయి. సీత తన మనోవేదనను ఎవరికీ చెప్పుకోలేక తల్లడిల్లిపోయింది. పరుగు పరుగున వెళ్లి వాడి గొంతు నులుముదామనుకుని  సోమనాథం ఇంటి తలుపు తట్టింది. కానీ సోమనాథం తన ఇంటి తలుపు తెరిచే సమయానికే సీత మళ్లీ పరిగెత్తుకుంటూ తన ఇంటికి వచ్చేసింది. సీత తండ్రి పరమేశం సీతను కాలేజీ చదువు కోసం పట్నంలో చేర్పించాడు. సీత తాను చదివే కాలేజీలో కూడా చదువుపై శ్రద్ధ చూపకుండా ఉండేది. ఒకరోజు సీత తోటి విద్యార్థి రఘు సీతను అడిగాడు ఇలా… నువ్వు బాగా చదివేదానివి మన బడిలో. నువ్వు మా అందరికి ఆదర్శం అనుకున్నాను నాడు. ఎందుకు ఇలా చదువును నిర్లక్ష్యం చేస్తున్నావు అన్నమాటలకు కన్నీటి పర్యంతం అయింది సీత. చివరికి సీత తన అశ్రద్దతకు గల కారణం పంచుకుంది రఘుతో. సీత మాటలకు నీ కన్నీళ్లను తుడిచే చేయి నేను అవుతాను. ఎందరో చిన్నారులను కాపాడే అభ్యుదయ సీతవు కావాలి నీవు అన్నాడు రఘు. రఘు చేయినందుకుని ముందుకు నడిచింది సీత. రఘుతో కలసి వైద్యవృత్తిని చేపడుతుంది సీత. తమ కారు చేరాల్సిన గమ్యం ముంగిట్లో ఆగడంతో సీత తన గత జ్ఞాపకాల పేజీ చదవడాన్ని ఆపుతుంది.

అందరు మథ్యాహ్నం భోజనాలు ముగించి మాట్లాడుకుంటూ ఉన్నారు. కనకమ్మ అందరికి  తాంబూలం అందించింది. భవిత ఎక్కడ అని రఘు అడుగుతాడు సీతను. మీతో ఉండి కదా అని అంటుంది సీత. ఇల్లంతా అందరు వెతుకుతారు. ఎక్కడ కనబడదు భవిత. అందరు వెతకడానికి వెళతారు. సీత ఆవేదనగా రోడ్డుపై వెతుకుతూ వెళుతూ ఉండగా అపస్మారకస్థితిలో ఉన్న భవితను ఎత్తుకుని సోమనాథం తీసుకు వెళ్లడం చూస్తుంది సీత. సీత ఆక్రోశంతో సోమనాథాన్నికిందకు తోస్తుంది. భవితను పట్టుకుని ఇంటికి తీసుకువచ్చింది. వారిరువురి వెనకే సోమనాథం కూడా వస్తాడు.  భవితను మంచంపై పడుకోబెట్టింది. రోడ్డుమీద ఆడుకుంటూ ఎండకు తూలి పడిపోతున్న భవితను ఎత్తుకుని తీసుకువస్తున్నాను అని అందరికి చెబుతాడు సోమనాథం. కనకమ్మ సోమనాథం చేసిన సాయానికి  కృతజ్ఞతలు చెబుతుంది.

కాసేపటికి కళ్లుతెరచిన భవితను చూసి హత్తుకుని ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది సీత. నేను బయట ఆడుకుంటూ ఉన్నాను. తరవాత నిద్ర వచ్చిందమ్మ అన్న భవిత మాటలకు సీత వెక్కి ఏడుస్తుంది. రఘు ఏమి కాదు అంటూ ఓదారుస్తాడు సీతను. ‘మీ బాబాయ్ కి నీరసంగా ఉంటోంది ఈ మథ్య. తనకు బలానికి ఏమైనా మందు ఇవ్వమని అడిగింది వసంత పిన్ని సీతను. ‘బీకాంప్లెక్స్ వేసుకుంటే చాలు’ అంటూ మందులు ఇస్తుంది సీత సోమనాథానికి. రోజురాత్రి పుట ఒకటి వేసుకోమని చెబుతుంది సీత. ప్రతిరోజూ రాత్రి పూట సోమనాథం వేసుకుంటున్నాడు. సీత తాను ఇచ్చిన బీకాంప్లెక్స్ క్యాప్సల్ లో ఒక క్యాప్సిల్ లో మాత్రం స్లో పాయిజన్ కలిపి ఇచ్చింది.

 సెలవులు ముగిసాయి. వాళ్ళు వెళ్లే గమ్యంకేసి కారు బయలుదేరింది. ‘భవిత సారి అమ్మ నేను పడిపోయినందుకు’ అని చెప్పింది సీతతో దిగులుగా. సీత నవ్వుతు మళ్లీ నీ పరీక్షలు అవగానే వేసవి సెలవులకు వద్దామా నీ స్నేహితులతో ఆడుకోవడానికి అన్నది భవితతో. ‘మరి బైట ఆడుకోవచ్చా బూచి ఉంటుంది కదా’ అని అడిగింది భవిత సీతను. ఇక మీదట నో బూచి భయం అంటూ నవ్వుతు భవితను కౌగిలించుకుంది సీత.

ఒకరోజు రాత్రి సోమనాథం పడుకోబోతూ ‘నీరసం తలపెట్టేసింది’ అన్నాడు వసంతతో. కాసేపు పడుకోవాలని పడుకున్నాడు. నిద్రలోనే కన్ను మూశాడు. భోరున విలపిస్తూ తన వసంత పిన్ని చెప్పిన మాటలను తమ కారు వేగానికి పోటీగా వెనక్కు వెళ్లే అందాలలో కలిపేసింది సీత.

Radhika Phani Vangara
Radhika Phani Vangara
అమెరికాలో కేటీ నగరంలో నివాసం. వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. గార్డెనింగ్, కథానికలు రాయడం ఇష్టం. రేడియోకోసం ప్రముఖులను ఇంటర్వ్యూలు చేస్తుంటారు. పిల్లలు అంటే ఇష్టం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles