Saturday, May 11, 2024

శిష్యగణమే పెన్నిధి

డా.ఆరవల్లి  జగన్నాథస్వామి

ఆరు దశాబ్దాల పాటు వివిధ పత్రికలకు సేవలు అందించి, లెక్కకు మిక్కిలి రచనలు చేసిన ఆయనకు  శిక్షణ ఇవ్వడమంటే ఆసక్తి. తాను నేర్చిన నాలుగు విషయాలను నలుగురి పంచాలన్నదే ధ్యేయంగా జీవించారు. అంతిమ క్షణం దాకా  శిక్షణ కోరే వారిని కాదనలేదు. ఎంతో మందిని పాత్రికేయులుగా తీర్దిదిద్దారు. ఆయనే రాంభట్ల కృష్ణమూర్తి గారు. 1943లో `మీజాన్` పత్రికలో శిక్షణ  పొందిన జి.కృష్ణ గారిని తొలి విద్యార్థిగా చెప్పేవారు. శిష్యబృందాన్ని వెంటపెట్టుకుని  కిలోమీటర్ల తరబడి నడుస్తుండేవారు. ఆ సమయంలోనే అనేక అంశాలపై చర్చోప చర్చలు సాగుతుండేవి. ఏథెన్స్‌ వీథుల్లో సోక్రటిస్‌ నిర్వహించాడని చెప్పే ‘ఎలింకస్‌’ తరహా సంచారచర్చా గోష్ఠులను రాంభట్ల గారు  ఏళ్ల తరబడి కొనసాగించారు. తెలుగునాట ఇలాంటి కార్యక్రమం చేపట్టిన ఘనత ఆయనదేనని ఆయన సన్నిహితులు, అందులో పాలుపంచుకున్నవారు  చెబుతారు.

వయోభేదంతో నిమిత్తం లేకుండా శిష్యులందరినీ ’ఏం ఫ్రెండూ` అనే . సంబోధించేవారు (అలా పిలిపించుకున్న వారిలో  ఈ వ్యాసకర్త  ఒకరు(.1940వ దశకంలో ఆయన పనిచేసిన `మీజాన్` సంపాదకుడు అడవి బాపిరాజు గారూ రాంభట్ల వారిని ‘మైడియర్‌ యంగ్‌మ్యాన్‌!’ అని పలకరించే వారట.) వీరు కూడా ఆ సంప్రదాయాన్నే  కొనసాగించి ఉంటారు

పాత్రికేయ ప్రస్థానం

‘మీజాన్‌’ పత్రికలో పాత్రికేయ ప్రస్థానం ప్రారంభిన ఆయన దాదాపు  ఆరు  దశాబ్దాలలో పలు పత్రికలలో పనిచేశారు. 1946లో తెలుగు ‘మీజాన్‌’లో నైజామ్‌ నవాబును, ఆయన కొలువులో పనిచేసే మంత్రుల్నీ అధిక్షేపిస్తూ కవితా  వ్యంగ్య చిత్రాలు  వేసి,‘నైజాము నవాబును నారాయణగూడా చౌరస్తాలో ఉరితీయాలి’ అనే సంపాదకీయాన్నిరాశారు.దాని ప్రభావం పత్రికా సంపాదకుడు బాపిరాజు గారి మీద పడుతుందన్న భయంతో   నైజామ్‌ రాష్ట్ర ప్రధానమంత్రి మీర్జా ఇస్మాయిల్‌ దగ్గరి పౌర సంబంధాల అధికారి కుందూరి ఈశ్వరదత్‌ ఆ సంచిక ప్రతులన్నీ తెప్పించు కుని  తగుల బెట్టించారట.

మరో రెండేళ్లకు రాంభట్ల గారు  ‘మీజాన్‌’ పత్రికకు రాజీనామా చేసి, ‘తెలుగుదేశం’ పక్షపత్రికలో (విజయవాడ), ‘సందేశం’ (మద్రాసు), ‘ప్రజాశక్తి’ పక్ష పత్రికలో,‘విశాలాంధ్ర’ దినపత్రికలో సేవలు అందిచారు. ‘ప్రజాశక్తి’, ‘విశాలాంధ్ర’ పత్రికల   ‘అక్షరశిల్పి’ రాంభట్ల గారే.  అరసం రాష్ట్ర  ప్రధాన కార్యదర్శిగా (1973-76)పని చేశారు. పాత్రికేయుల సమస్యలపై దేశంలోనే మొదటిసారి (1946) సమ్మెకు నాయకత్వం వహించారు.ప్రూఫ్‌ రీడర్ల జీతాలను పెంచాలంటూ ‘మీజాన్‌’ పత్రికలోని సిబ్బంది 18 రోజుల పాటు సమ్మెచేశారు.`పనిచేసే పత్రికకు అనుగుణంగా  నడచుకునేవాడే నా దృష్టిలో  నిజమైన జర్నలిస్టు`అనేవారు. అందులోనే ఎన్నో అర్థాలు.

విద్యార్జన- ప్రజ్ఞాశీలత

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని  అనాతవరం గ్రామంలో 1920 మార్చి 24న పుట్టిన రాంభట్ల,  రెండు సంవత్సరాల వయసులోనే తండ్రి కోల్పోయారు.తాత, పినతండ్రి, మేనమామల వద్ద పెరిగారు. పరిస్థితులు అనుకూలించక ఫిఫ్తు ఫారమ్‌తో చదువుకు స్వస్తి చెప్పినా స్వశక్తితో సంస్కృతాంధ్ర, ఆంగ్ల, ఉర్దూ, కన్నడ భాషల్ని అధ్యయనం చేసి  వాటిలో పాండిత్యాన్ని సంపాదిం చారు.66 ఏళ్ల వయస్సులో కన్నడంలో వీర శైవ వచనాలను చదువుతూ ఆ  భాష నేర్చుకున్నారు.

రాంభట్ల గారు  నిజంగానే బహుముఖ ప్రజ్ఞాశీలి. పత్రిక రచయితంత సమానంగా తెలుగులో తొలి  వ్యంగ్య చిత్రకారుడిగా ప్రసిద్ధులు. తెలుగులో జర్నలిజం అధ్యయన కేంద్రానికి మొట్టమొదటి ప్రధాన అధ్యాపకుడు.`ఒక చేతితో వేదోపనిషత్తుల్నీ, మరోచేతితో మార్స్కిజాన్ని ఔపోసన పట్టిన ఆయనను నడుస్తున్న/సంచార విజ్ఞాన సర్వస్వం అనేవారు. `శంకరుని వేదాంతం నన్ను హేతువాదిని చేస్తే తాంత్రిక వేదాంతం  భౌతికవాదిని చేసింది` అని చెప్పేవారు.

`బడు`కు వ్యతిరేకి

వార్తారచనలో  కర్మణి ప్రయోగం `బడు` ధాతువు కనిపించగా  మొదటగా  గుర్తుకు వచ్చేది వీరే. ఆ పద ప్రయోగం  ఆయనకు నచ్చేది కాదు. `తెలుగు  పాత్రికేయుల దౌర్భాగ్యవశాత్తూ వార్తలన్నీ ఇంగ్లీషులోనే వస్తాయి.ఇండో యూరిపి యన్  భాషలన్నిటిలోనూ `కర్మణి`  ప్రయోగం మర్యాద. తెలుగు దానికి వ్యతిరేకం. ఇక్కడ `కర్తరి`ప్రయోగం తప్ప మరోరకం  వాడుకలో లేదు. అందువల్ల  కర్మణి ప్రయోగ అనువాదంలో `బడు` ప్రాయికంగా వస్తూ ఉంటుంది.దశాబ్దాల నా పాత్రికేయ జీవితంలో  ఇంతవరకు  `నాచే బడు రాయబడలేదు`. బడు వాడని వాణ్ణి నేను అంటే కొంతమందికి కోపం వస్తుంది. నార్ల వారు కూడా  `బడు`కు గర్భ శత్రువే కాదు..ఆజన్మాంతర శత్రువు కూడాను‘ అని    చెప్పేవారు. సుమారు 27 ఏళ్ల క్రితం  దీనిపై   ప్రత్యేకంగా వ్యాసమే (అప్పటి ఆంధ్రప్రభ) రాశారు.

రాంభట్ల గారికి  కన్యాశుల్కమంటే ప్రాణసమానం.కందుకూరి, చిలకమర్తి, పానుగంటి,గురజాడ సాహిత్యాన్ని చదివిన ఆయన ‘కన్యాశుల్కం’ నాటకాన్ని కంఠస్థం చేశారు.అది అంతగా ఆయనను కట్టిపడేసింది.ఒకరకంగా ఆ నాటకమే ఆయనను  అభ్యుదయ రచయితను చేసిందంటారు

దాదాపు ఆరు దశాబ్దాలకు పైగా సాహిత్య ప్రస్థానంలో సొంతపేరుతో కాకుండా వివిధ కలం పేర్లతో రాసినవే ఎక్కువ. శవివిషాణం, కృష్ణ, అగ్నివేశ,అగ్నిమిత్ర,  పుష్యమిత్ర,  ‘విశ్వామిత్ర’,  కవిరాక్షస, ‘పాణిని’, కృష్ణాంగీరస్‌,   ‘కాట్రేని యెర్రయ్య’ తదతర  మొదలైన అనేక కలం పేర్లతో రచనలు చేసిన ఆయన  2001 డిసెంబర్ 7న  కన్నుమూశారు.

(సోమవారం…డిసెంబర్ 7న రాంభట్ల కృష్ణమూర్తి వర్ధంతి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles