Monday, May 27, 2024

ఒకే ఒక్క శ్రీరమణ

ఆధునిక తెలుగు సాహిత్యంలో శిఖరసమానుడు శ్రీరమణ. భారత రచయితలలో ప్రముఖుడుగా ఎన్నదగినవాడు. సాహిత్యంలో ఆయన చేసినన్ని ప్రయోగాలు చేసిన రచయితలు బహుతక్కువ.  ఆయన రాసిన ‘మిథునం’ ఆయనను కథకుడుగా చిరకాలం నిలబెడుతుంది. గొప్ప కథకుడు, మంచి పాత్రికేయుడు, బాపూ, రమణలతో కలసి సినిమాలలో పని చేసిన అరుదైన అనుభవం కలిగిన వ్యక్తి, సరససంభాషణాప్రియుడు, సృజనశీలి, స్నేహశీలి శ్రీరమణ. దినపత్రికలలో ఆయన కాలమ్ ని మెచ్చనివారు లేరు.

శ్రీరమణ

శ్రీరమణ బుధవారం (19 జులై 2023)ఉదయం అయిదు గంటలకు ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. భార్య జానకి, కొడుకులు ఆయనను అత్యంత ప్రేమగా, గౌరవంగా చూసుకున్నారు. ఇద్దరు కుమారులు – చైత్ర, వంశీకృష్ణ. ఇద్దరూ ఉన్నత చదువులు చదివారు. శ్రీరమణ చాలా మాసాలు మంచంలో ఉన్నారు. తెనాలి నుంచి మిత్రులు సురేష్, గిరిధర్ గౌడ్ వచ్చినప్పుడు వారితో పాటు నేనూ, నగ్నముని, షికాగో నుంచి వచ్చిన ప్రఖ్యాత చిత్రకారుడు ఎస్ వి రామారావు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కలసి శ్రీరమణ నివాసానికి వెళ్ళి ఆయనను పలకరించాం. మమ్మల్ని గుర్తు పట్టి మాట్లాడారు. అప్పుడే ‘మిథునం’ గురించి రెండు మాటలు మాట్లాడారు. జానకిగారు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఆయనే చిక్కిశల్యమైనారు.

తెనాలి శ్రీరమణ అభిమానుల కేంద్రం. ‘మాదీ తెనాలే’ అనేవారు శ్రీరమణ.

తెనాలిలో శ్రీరమణకు సన్మానం జరిగిన సభలో పన్నాల సుబ్రహ్మణ్యంభట్టు, అప్పాజోస్యులు సత్యనారాయణ, మల్లాపగడ శ్రీమన్నారాయణ, ఆలపాటి రాజేంద్రప్రసాద్, రామచంద్రమూర్తి, బీఎస్ నాగేశ్వర్, రెంటాల జయదేవ్, వెనిగెళ్ళ వెంకటరత్నం.

తెనాలిలో రామకృష్ణ కళాక్షేత్రమ్ లో 28 జులై 2018న, అంటే సరిగ్గా అయిదు సంవత్సరాల కిందట, తెలుగు జ్ఞానపీఠ పురస్కార స్వీకర్తలైన విశ్వనాథ సత్యనారాయణ, సి.నారాయణరెడ్డి, రావూరి భరద్వాజలను స్మరించుకుంటూ అప్పటి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో  జరిగిన సాహిత్య సభలో పాల్గొన్నప్పుడు సభా నిర్వాహకులలో ఒకరైన శ్రీరమణ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు.

ఖదీర్ బాబు, శ్రీరమణ, మోహన్, సజ్జల రామకృష్ణారెడ్డి

నాకు ప్రాణమిత్రుడు. విలువైన సహచరుడు. కొన్ని వందల గంటలు కబుర్లు చెప్పుకున్న స్నేహితులం. ఆయన నవ్వకుండా సీరియస్ గా మొహం పెట్టి మాట్లాడుతూ మనలను పొట్టచెక్కలయ్యేలాగా నవ్వించగల నేర్పరి ఆయన. చాలాకాలం నుంచి స్నేహం ఉన్నప్పటికీ 2002లో ‘ఆంధ్రజ్యోతి’ పునఃప్రారంభం తర్వాత అంతకు పూర్వం ఉన్న వారపత్రికను పేరు నవ్యగా మార్చి పునరుద్ధరించినప్పుడు దానికి సంపాదకుడుగా శ్రీరమణ వచ్చారు. నేను (ఆంధ్రజ్యోతి సంపాదకుడిగా) స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి ఆఫీసుకు తీసుకొని వచ్చి బాధ్యతలు అప్పగించాను. అప్పటికే ఆయన చేయితిరిగిన రచయిత. నవ్యలో అనేక ప్రయోగాలు చేశారు. నవ్య జగన్నాథశర్మకి అప్పగించి బయటికి వచ్చిన తర్వాత ఇనగంటి వెంట్రావ్ గారు నడిపిన ‘పత్రిక’ మాసపత్రికకు గౌరవ సంపాదకుడుగా ఉండేవారు. ఎన్ టీవీలో కొంతకాలం పని చేశారు. నేను నడుపుతున్న వెబ్ సైట్ ‘సకలం’లో అనేక శీర్షికల కింద వ్యంగ్య రచనలు చేశారు. ఆంధ్రజ్యోతిలో, సాక్షిలో కాలమ్ రాసేవారు. అవి రసగుళికలు. నడుస్తున్న చరిత్రపైన వ్యంగ్య వ్యాఖ్యానం. రాజకీయాలపైన సునిశిత విమర్శ.

ఎన్సీఎల్ రామచంద్రరాజు, బాపు, బ్నిం, శ్రీరమణ

 

గుంటూరు జిల్లా వేమూరి మండలం వరాహపురంగ్రామంలో 21 సెప్టెంబర్ 1952న జన్మించిన కామరాజ రామారావు వేమూరులో ఎస్ఎస్ఎల్ సీ చదివారు. పశ్చిమబెంగాల్ కు చెందిన రామకృష్ణ మిషన్ వారు స్వామి వివేకానందుడిపైన వ్యాసరచన పోటీ పెడితే శ్రీరమణ ప్రథమ స్థానంలో నిలిచారు. జాతీయ స్థాయి వ్యాసరచన పోటీలలో వరుసగా ఆరేళ్ళు ప్రథమ స్థానం సంపాదించారు. బాపట్ల వారి మాతామహుల గ్రామం. అక్కడ కళాశాలలో పీయూసీ చేశారు. అప్పుడే కామరాజ వారికి దత్తత పోయారు. బియస్సి ఫిజిక్స్ మెయిన్ చదువుకున్న తర్వాత వ్యంగ్య రచనలు చేస్తూ ప్రముఖ సంపాదకుడు నండూరి రామమోహనరావుని ఆకర్షించారు. కరణంగారి అబ్బాయిగా గ్రామసీమలలో మనుషుల మధ్య సంబంధబాంధవ్యాలు  క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి. హాస్యం ఆయనకు రక్తగతమైనది. చతురోక్తులు లేకుండా ఆయన సంభాషణ సాగదు.  రమణమహర్షిని స్ఫూర్తిగా తనపేరును శ్రీరమణగా మార్చుకున్నారు. ఆ పేరుతోనే ప్రసిద్ధులు. అసలు పేరు చాలామందికి తెలియదు. ఆంధ్రజ్యోతి సచిత్రవారపత్రికలో ‘టీ కప్పులో సూర్యుడు’ పేరుతో రాసిన కాలమ్ అద్భుతం. నండూరివారూ, పురాణం శర్మగారూ శ్రీరమణ చేత పేరడీలు రాయించేవారు. శ్రీకాలమ్, శ్రీచానెల్, చిలకల పందిరి, హాస్యజ్యోతి, మొగలిరేకులు వంటి అనేక శీర్షికలు హృద్యంగా నిర్వహించారు. శ్రీరమణ, ఇంద్రకంటి శ్రీకాంతశర్మ మంచి మిత్రులు. ఛలోక్తులు విసురుతూ చతుర సంభాషణ సాగించడంలో దిట్టలు. ఇద్దరూ ఇద్దరే.

మిథునం

శ్రీరమణ రచనలలో మిథునం కథ తలమానికమైనది. ఈ కథ అనేక భాషలలోకి అనువాదమై జాతీయ స్థాయిలో ఆయనకు కీర్తి తెచ్చింది. కన్నడంలోకి వసుధేంద్ర, అజయ్ వర్మ అల్లూరి అనువదించారు.  కృపానందన్ తమిళంలోకి తర్జుమా చేశారు.  మిథునంతో పాటు ఇతర కథలు చేర్చి సంపుటిగా ప్రచురిస్తే అది మూడు లక్షల కాపీలకు పైగా అమ్ముడు పోయిందని శ్రీరమణ చెప్పారు. మిథునం కథ ఆధారంగా టి. వాసుదేవన్ నాయర్ మళయాలంలో సినిమా తీశారు. తెలుగులో భరణి సినిమా తీశారు. మిథునంలోని అంశాలను ఉపయోగించుకొని కన్నడ రంగస్థలంలో అనేక ప్రయోగాలు చేశారు. రంగులరాట్నం, శ్రీచానెల్, శ్రీకాలమ్, పూలు-పగడలు, వెంకటసత్యస్టాలిన్, శ్రీరమణీయం పేర్లతో పలు శీర్షికలు వివిధ పత్రికలలో జయప్రదంగా నడిపించారు. గుత్తొంకాయికూర-మానవసంబంధాలు, బొమ్మ-బొరుసు (రూరల్ ఎకానమీ కథా కమామీషు) అనే వ్యంగ్య రచనలు చేశారు. ప్రేమపల్లకి అనే పేరుతో నవల రాశారు. సింహాచలం-సంపెంగ అనే కథా సంపుటి ప్రచురించారు. సరసమ్.కామ్ అనే శీర్షికలో అనేక వ్యాసాలు వెబ్ సైట్ కోసం రాశారు. వాటిని అయిదు సంపుటాలుగా ప్రచురించారు. నవ్యసంపాదకుడుగా సంపాదకీయాన్ని మొదటి పేజీ పేరుతో రాసేవారు. శ్రీరామాయణం, మహాభారతం తనదైన శైలిలో రచించారు.  శ్రీరమణ మానవసంబంధాలు, నవ్వులో శివుడున్నాడురా..పేరుతో బాపురమణశ్రీరమణ సశేషాలు, విశేషాలు కూడా ప్రచురితమైనాయి. ఉషశ్రీ ప్రోత్సాహంతో శ్రీరమణ ఆకాశవాణిలో చిలకలపందిరిఅనే హాస్యకదంబం నిర్వహించేవారు. తెలుగు సాహితీవేత్తలందరి లక్షణాలూ బాగా తెలిసిన రచయిత. జలసూత్రం రుక్మీణినాధశాస్త్రి, జాషువా, విశ్వనాథసత్యనారాయణ, శ్రీశ్రీ, దేవులపల్లి కృష్ణశాస్త్రీ, తదితర కవులూ, రచయితలూ ఒక రైలు పెట్టెలో కూర్చొని ప్రయాణం చేస్తూ తమదైన శైలిలో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఎట్లా ఉంటుందనే పదచిత్రం రాసి రసజ్ఞులను మెప్పించారు. ‘ఒక్కడు విశ్వనాథ’ అనే శీర్షికతో ‘సాక్షి’లో అద్భుతమైన వ్యాసం రాశారు.

కుడి వైపు ప్రముఖ రచయితలు వేలుపిళ్లై రామచంద్ర రావు, జగన్నాథ శర్మ, నక్కా విజయ రామరాజు, శ్రీరమణ, ఆర్టిస్ట్ మోహన్.

శ్రీరమణ సమీపబంధువు  కొప్పర్తి రాంబాబు ఆయన కథలతో పాటు చాలామంది రచయితల కథలను చదివి వినిపించే పని పెట్టుకున్నారు. ఆయనకు శ్రీరమణగారంటే చాలా ప్రేమ. శ్రీరమణను ప్రేమించనివారు లేరు. ఆయన మాటలు ఇష్టపడనివారు లేరు. మాటలమాంత్రికుడు శ్రీరమణ నిష్క్రమణ చాలామంది జీవితాలపైన ప్రభావం వేస్తుంది. పరలోకంపైన నమ్మకం ఉన్నవారికి ఆయన రమణ, బాపు, నండూరి రాంమోహనరావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ,  శ్రీకాంతశర్మ, మోహన్, చంద్ర వంటి అనేకమంతి మిత్రులతో కబుర్లు చెప్పుకోవడానికి 71 ఏళ్ళు దాటకుండానే పైకి వెళ్ళిపోయారని అనుకోవాలి. ఆయన లేని లోటు తీరనిది. అటువంటి వ్యక్తి లోగడ లేరు. భవిష్యత్తులో ఉండరు. ఒకే ఒక్క శ్రీరమణ.

(శ్రీరమణ అంత్యక్రియలు హైదరాబాద్ మహాప్రస్థానంలో గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు)

Related Articles

1 COMMENT

  1. శ్రీరమణ గారి అనేక విషయాలు తెలిసినవి.ఆంధ్ర జ్యోతి లో
    వారి కాలమ్ బాగా చదివేవాడిని.వారి గూర్చిన చాలావిషయాలు తెలిసినవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles