Saturday, July 13, 2024

అదృష్టవంతుడు

ఈ రోజు (జులై 15) నరసరాజుగారి పుట్టినరోజు అని తెలిసింది. వారితో నాకు కాస్త పరిచయం వుంది. ఎక్కువగా ఫోన్ లోనే మాట్లాడుకొనేవాళ్ళం. ‘అదృష్టవంతుని ఆత్మకథ’ పేరుతో ఆయన తన జీవితచరిత్ర రాసుకున్నారు. పుస్తకానికి ఈ టైటిల్ పెట్టాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఇలా ఎందుకు పెట్టానంటే?… అంటూ ఆయన సమన్వయం చేసిన విధానం అద్భుతం! ఆదర్శప్రాయం! అది నూటికి నూరుపాళ్ళు నిజం కూడా. 80ఏళ్ళకు పైబడిన వయస్సు వరకూ చక్కటి శారీరక ఆరోగ్యంతో జీవించడం, పరోక్షంలో కూడా రాజుగారు.. అంటూ అందరితో గౌరవించబడిన సామాజిక ఆరోగ్యం పొంది వుండడం, జీవితాంతం ఎటువంటి ఇబ్బందులు, కష్టాలు పడకుండా సొమ్ముదన్ను కలిగిన ఆర్ధిక ఆరోగ్యం కలిగివుండడం ఆయన సంపదలు. శారీరకంగా, సామాజికంగా, మానసికంగా, ఆర్ధికంగా ఐశ్వర్యాన్ని పొందిన అదృష్టవంతుడు. న్యాయ మార్గంలో, ధర్మమార్గంలో, వృత్తిధర్మమార్గంలో సుకీర్తిని సొంతం చేసుకున్న ‘సుధనాభిరాముడు’ నరసరాజుగారు. నేను విజయవాడలో ఉన్నప్పుడు ముత్యాలంపాడులో నరసరాజుగారి ఇల్లు చాలాసార్లు చూశాను. హీరో సుమన్ కు వారి మనుమరాలినే ఇచ్చి పెళ్లిచేశారు. ముత్యాలంపాడులో ఎక్కువ రాజుల కుటుంబాలే ఉండేవి. ఐతే నరసరాజుగారిది పలనాడు. సత్తెనపల్లి దగ్గర ఊరు. పిత్రార్జితంగా భూములు వచ్చాయి. వాటి ద్వారా కొంత ఆదాయం వస్తూ వుండేది. దానికి తోడు ఏ ఆదాయం వచ్చినా ఆయన పోస్టల్ లోనూ,పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లోనే  ఎక్కువగా దాచుకొనేవారు. “అసలు కంటే వడ్డీ ముద్దు అంటారు” కదా! ఆయనకు అసలే ముద్దు!

Also read: కొమర్రాజుకు కోటి దండాలు

పలనాడు అంటే వల్లమాలిన ఇష్టం

రోషనార, తారా శశాంకం, చేసినపాపం వంటి నాటకాలు రాసిన కొప్పరపు సుబ్బారావుగారంటే నరసరాజుగారికి గురుభావం. ‘చేసినపాపం’ ఎన్టీఆర్ జీవితంలో చాలా కీలకమైంది. ఈ విశేషాలు ఇంకో సందర్భంలో రాస్తాను. విజయవాడ, మద్రాస్ లో రాజుగారి జీవితంలోని ఎక్కువ భాగం సాగినా, తన పురిటిగడ్డ పలనాడు అంటే వల్లమాలిన ఇష్టం. నేను పుట్టిపెరిగింది నరసరావుపేట అని తెలిసిన తర్వాత, రాజుగారు నాపై ప్రత్యేక వాత్సల్యంతో ఉండేవారు. కొప్పరపు కవుల మనుమడునని తెలిసాక, మరింత ఆప్యాయంగా మాట్లాడేవారు. వారి ఆత్మకథ గురించి ఇద్దరం ఎక్కువగా మాట్లాడుకునేవాళ్ళం. ఆ పుస్తకం చదివిన తర్వాత వారి గురించి అవగాహన, వారిపై గౌరవం ఎన్నోరెట్లు పెరిగాయి. ఆ పుస్తకం చదివితే ఎవరికైనా అదే జరుగుతుంది. ఈ పుస్తకం ప్రస్తుతం అందుబాటులో ఉందో లేదో? లేకపోతే,ఈ పుస్తకం మళ్ళీ ప్రచురించడం ఎంతో అవసరం. ఎన్నో విషయాలు,విశేషాల కలబోత ఆ పుస్తకం. రాజుగారు గర్వంతో కాక, జీవితాంతం ఆత్మగౌరవంతో జీవించారు. రాజుగారికి పట్టిన అదృష్టం కొందరికే పడుతుంది. అలా ఉండాలంటే పెట్టి పుట్టాలి.

1920లో జన్మించిన వీరు 2006లో మరణించారు. 86 ఏళ్ళు జీవించి జీవితాన్ని పండించుకున్నారు. వేయి పున్నములను చూసిన పుణ్యాత్ముడు.

Also read: ‘పలుభాషల పలుకుతోడు – పాటల సైజోడు’ ఎస్పీ బాలసుబ్రమణ్యం….

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles