Friday, April 26, 2024

బెంగాల్ బరిలో నందిగ్రామ్ పై గురి

మోదీ వెర్సెస్ దీదీగా అభివర్ణిస్తున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు యాక్షన్ మూవీని తలపింపచేస్తున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నందిగ్రామ్ లో దాడి జరగడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. చాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లుగా ఆమె చెబుతున్నారు. ఎడమ కాలు చీలమండ, పాదంలో తీవ్రమైన ఎముక గాయాలను వైద్యులు గుర్తించారు. కుడి భుజం, మెడకు కూడా గాయమైనట్లు తెలుస్తోంది.

వీల్ చైర్ లో ప్రచారానికి మమత సిద్ధం

చికిత్స అనంతరం, అవసరమైతే వీల్ చైర్ నుంచే ప్రచారం చేస్తానని ఆమె ప్రకటించారు. తనను కొందరు బలవంతంగా తోయడం వల్లే ఈ గాయాలయ్యాయని ఆమె అంటున్నారు. మమతపై బిజెపి పెద్ద కుట్రపన్నిందని తృణమూల్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆమెపై ఎలాంటి దాడి జరగలేదని, ఓడిపోతామనే భయంతో చేస్తున్న నాటకమని బిజెపి నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. దేశమంతా బెంగాల్ వైపు చూస్తుంటే, బెంగాల్ రాజకీయమంతా నందిగ్రామ్ చుట్టూ తిరుగుతోంది. అక్కడ ఓటర్లు పాలముంచుతారా, నీట ముంచుతారా అనే సందిగ్ధంలో అన్ని రాజకీయ వర్గాలు వున్నాయి.

Also Read : గాంధీల ఒంటరి పోరాటం సఫలమా? విఫలమా?

నందిగ్రామ్ లో సంధి కుదరదు

బెంగాల్ లో నందిగ్రామ్ చాలా కీలకమైన ప్రాంతం. మూడున్నర దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన వామపక్ష ప్రభుత్వం నందిగ్రామ్ అంశంతోనే అధికారాన్ని కోల్పోయి, వైభవాన్ని పోగొట్టుకొని, నేడు బిక్కు బిక్కు మంటోంది. ఆ దెబ్బకు ఆ పార్టీ ఇప్పుడప్పుడే కోలుకునే పరిస్థితిలో కూడా లేదు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ తో జతకట్టి, ఉనికిని కాపాడుకొనే ప్రయత్నం చేస్తోంది. నందిగ్రామ్ ప్రాంతంలో భూసేకరణ, సెజ్ స్థాపన అంశంలో ప్రభుత్వంపై వచ్చిన ప్రజావ్యతిరేకతను అనుకూలంగా మలచుకున్న తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

అక్కడే చావోరేవో

పదేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన మమతా బెనర్జీని ముఖ్యమంత్రిని చేసింది. పదేళ్లపాటు సింహాసనంపైన కూర్చోపెట్టింది. తిరుగులేని నేతగా నిలబెట్టింది. నేటి ఎన్నికల్లోనూ లబ్ధి పొందడానికి, చావో రేవో తేల్చుకోడానికి మళ్ళీ నందిగ్రామ్ నే ఆమె ఎన్నుకున్నారు. కాకపోతే, అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. ఏ వ్యక్తులైతే తన విజయ ప్రస్థానానికి సోపానాలయ్యారో, వారే నేడు ఆమెకు బద్ధ శత్రువులయ్యారు. వారిలో కీలకమైన నేత సువేందు అధికారి బిజెపి తరపున మమతా బెనర్జీని ఢీ కొడుతున్నారు.

Also Read : రాజకీయాల్లోనూ అసమానతలు

మూడో కూటమితో కుదరని చెలిమి

కాంగ్రెస్ -వామపక్ష కూటమి విడిగా బరిలోకి దిగింది. వారితో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుందామని మమత కోరుకున్నారు. కానీ, వారు విముఖత చూపించారు. బిజెపిని నిలువరించాలానే ఆశ కాంగ్రెస్ కూటమికి ఉన్నా, ఈ తరుణంలో తమ సత్తా ఏమిటో చూపించుకోవాలానే ఆలోచనలోనే ఆ రెండు పార్టీల నేతలు ఉన్నారు. దీనికి తోడు మమత మొట్టమొదటగా నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నారు. సువేందు అధికారికి చెక్ పెట్టాలని భవానిపూర్ నుంచి ఆమె నందిగ్రామ్ కు మారారు.

సువేందు అధికారికి పట్టున్న ప్రాంతం

సువేందు అధికారికి మంచి పట్టున్న ఈ ప్రాంతంలో మమతా ఏ మేరకు విజయం సాధిస్తారనే చర్చ సర్వత్రా జరుగుతోంది. దాన్ని తృణమూల్ పార్టీ గెలుపేకానీ, సువేందు వ్యక్తిగత బలం కాదని తృణమూల్ సేనలు వాదిస్తున్నాయి. ఇక్కడ గెలుపుపై రెండు పార్టీలు చాలా ధీమాగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో 20శాతం ముస్లిం ఓట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో వీరు తృణమూల్ కాంగ్రెస్ కే మద్దతు పలికారు. మమతా బెనర్జీ బరిలో ఉండడంతో నందిగ్రామ్ లో హిందూ కార్డు వాడే అవకాశాన్ని  బిజెపి కోల్పోయింది. ఈ అంశం కూడా తనకు లాభిస్తుందని తృణమూల్ భావిస్తోంది.

Also Read : బీజేపీ ఉత్సాహంపై సర్వేక్షణం నీళ్ళు

స్థానికేతర పార్టీ బీజేపీ

బిజెపిని స్థానికేతర పార్టీగా తృణమూల్ ప్రచారం చేస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ ను గెలిపించి బెంగాల్ ఆత్మగౌరవాన్ని కాపాడుకోండి…అంటూ మమతా బెనర్జీ సెంటిమెంట్ అస్త్రాన్ని నమ్ముకుని ముందుకు సాగుతున్నారు. అవినీతిమయమైన, అభివృద్ధిరహిత తృణమూల్ ప్రభుత్వాన్ని గద్దె దించి, ప్రగతివైపు పయనిద్దామని బిజెపి తన వాణిని బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ లోని కీలకమైన, బలమైన నాయకులను తన పార్టీలోకి తెచ్చుకుంది.

మిథున్ బాటలోనే సౌరవ్?

వీరికి తోడు మిథున్ చక్రవర్తి వంటి సినిమా స్టార్ లను తోడు కలుపుకుంటోంది. క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలిని కూడా పార్టీలో చేర్చుకొనే పనిలో ఉంది. నేడో రేపో గంగూలీ చేరే అవకాశం ఉంది. ఒకవేళ,ఆరోగ్య కారణాలతో ప్రస్తుతం పార్టీలో చేరి ప్రత్యక్ష ప్రచారం చేయకపోయినా, గంగూలీ మద్దతు బిజెపికే అనే సంకేతాలు ఇప్పటికే వెళ్లిపోయాయి. ‘‘బెంగాల్ ను దీదీ మోసగించారు. రాష్ట్రాన్ని దోచేశారు,’’ అంటూ ఇటీవల కోల్ కతా లో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కత్తులు నూరారు.

Also Read : మిథున్ చక్రవర్తి వల్ల బీజేపీకి ఏమి ప్రయోజనం?

మోదీ హామీల మోత

బిజెపి అధికారంలోకి వస్తే, రాష్ట్రాన్ని తిరుగులేని ప్రగతి పథంలో నడిపిస్తామంటూ మోదీ హామీల వర్షం కురిపించారు.పశ్చిమ బెంగాల్ లో మొత్తం 294స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో తృణమూల్ కు 200సీట్ల భారీ మెజారిటీ వచ్చింది. 36సీట్లు దక్కించుకొని బిజెపి రెండవ స్థానంలో ఉంది. కాంగ్రెస్ -23, సిపిఐ -19 తెచ్చుకున్నాయి. ఈ రెండు పార్టీల బలం -42. మిగిలినవి చిన్నాచితకా పార్టీలకు వచ్చాయి.

ప్రధానమైన పోరు తృణమూల్, బీజేపీ మధ్యనే

ప్రస్తుతం ప్రధానమైన పోరు బిజెపి – తృణమూల్ మధ్యనే ఉంది. అదే సమయంలో, కాంగ్రెస్ -వామపక్షాల కూటమిని  విస్మరించ కూడదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో పాలనలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాలపై ఉండే వ్యతిరేకత ఎంతో కొంత కాంగ్రెస్-కమ్యూనిస్ట్ కూటమికి లాభం తెచ్చే అవకాశాలను కొట్టి పారేయలేం. వామపక్షం పాలనకు దూరమై కూడా పదేళ్లు దాటింది. ఈ అంశాల వల్ల వీరికి స్వల్పంగా సీట్లు పెరిగే అవకాశం ఉంది. లేదా పెద్దగా నష్టం జరుగకపోవచ్చు.

Also Read : మిథున్ చక్రవర్తి జనాకర్షణ బీజేపీకి లాభిస్తుందా?

చాపకింద నీరులా బీజేపీ

పశ్చిమ బెంగాల్ లో బిజెపి చాప కింద నీరులా పెరుగుతూ వచ్చింది.ముఖ్యంగా, 2019 లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 42సీట్లకు గాను,19 స్థానాలను కైవసం చేసుకొని అందరినీ అబ్బురపరచింది. ఇప్పుడు రాష్ట్రాధికారాన్ని చేపట్టాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ కు కావాల్సినంత నష్టం జరిగింది. మమతను ఏకాకిని చేయడానికి ఇంకా ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి.

Also Read : నందిగ్రామ్ నుంచి మమత పోటీ

వందసీట్లకు మించి బీజేపీకి రావా?

ప్రస్తుతం వెలువడిన సర్వేలు, క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిశీలిస్తే, బిజెపికి 100సీట్లకు పైగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ కు 150 స్థానాలకు పైగా దక్కే వాతావరణం కనిపిస్తోంది. కాంగ్రెస్ – కమ్యూనిస్ట్ కూటమి 30-40మధ్య సీట్లు సాధించవచ్చు. రేపటి ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా సాగనుంది. స్వల్ప ఆధిక్యత తోనైనా తృణమూల్ కాంగ్రెస్ గెలిచి, మళ్ళీ మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. ఫలితాల తర్వాత,అవసరమైతే, కాంగ్రెస్ కూటమి మమతకు స్నేహహస్తాన్ని అందిస్తుందని అంచనా వేయవచ్చు. ఓటరు నాడిని పూర్తిగా పసికట్టడం ఎవరి వల్ల కాదు. మొత్తంమీద, మోదీ – దీదీ యుద్ధం  ఎటువంటి మలుపులు తిరుగుతుందో భావికాలంలో చూద్దాం.

Also Read : తృణమూల్ కాంగ్రెస్ లో ఆగని వలసలు

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles