Thursday, April 25, 2024

గాంధీల ఒంటరి పోరాటం సఫలమా? విఫలమా?

రెండేళ్ల క్రితం లోక్ సభ ఎన్నికల తరువాత భారతదేశంలో పురాతన పార్టీ అయిన కాంగ్రెస్ తీరును చూసి మళ్లీ పునర్ వైభవం సంతరించుకుంటుందా, శిథిలావస్థకు చేరిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ లేచి నిలబడగలదా అనే సందేహాలు పార్టీ సీనియర్ నేతలకు కలిగాయి. 2014 నుంచి ఒక్కొక్క రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోతూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ 2020  మార్చిలో పార్టీ అంతర్గత విభేదాలతో మధ్యప్రదేశ్ లో అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. యువ రాజకీయవేత్త అయిన జ్యోతిరాధిత్య సింధియా ప్రజాదరణను  అంచనావేయడంలో విఫలమైన కాంగ్రెస్ అధిష్ఠానం పట్టుదలకు పోయి మధ్యప్రదేశ్ ను బీజేపీ చేతుల్లో పెట్టింది. ఇటీవలే దక్షిణ భారతదేశంలో అధికారంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో  కూడా అధికారాన్ని కోల్పోయింది. ఇక దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలలో పంజాబ్, ఛత్తీస్ గఢ్,  రాజస్తాన్ లలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దాదాపు 7 దశాబ్దాలలో తక్కువ రాష్ట్రాలలో అధికారంలో ఉన్నది ఇదే తొలిసారి కావడం విశేషం.

నాయకత్వ లోపం కాంగ్రెస్ శాపం:

కాంగ్రెస్ అపజయాలకు నాయకత్వ లోపం పెనుశాపంగా పరిణమించింది. ముఖ్యంగా పార్టీలో ఉన్న సీనియర్ నేతలు గాంధీ కుటుంబానికి విధేయులుగా ముద్రవేయించుకునేందుకే అధిక ప్రాధాన్యమిచ్చారు. దీంతో అధిష్ఠానానికి ఎదురుచెప్పే ధైర్యం చేయకపోవడంతో పార్టీ అపజయాలను మూటగట్టుకుంటోంది. జాతీయ స్థాయిలోగాని రాష్ట్ర స్థాయిలోగాని పార్టీ శ్రేణులకు సూచనలు చేసే వారు లేకపోవడంతో కార్యకర్తలు చెల్లాచెదురవుతున్నారు. సోనియా సన్నిహితుడు రాజకీయ సలహాదారు అయిన అహ్మద్ పటేల్ మరణం తరువాత ఆయన స్థానంలో ఇప్పటివరకు ఎవరినీ నియమించలేకపోవడం పార్టీలో నెలకొన్న నైరాశ్యానికి ఉదాహరణ. జ్యోతిరాదిత్య సింధియా వంటి నాయకులు పార్టీ నుంచి నిష్క్రమించడంవల్ల ఎదురయ్యే సవాళ్లను చాలా తక్కువగా అంచనావేయడంవల్ల కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సివచ్చింది.

Also Read: కాంతి తగ్గుతున్న కాంగ్రెస్

కేరళ కాంగ్రెస్ లో విభేదాలు:

తాజాగా ఎన్నికల ముంగిట కేరళ కాంగ్రెస్ లో ముసలం పుట్టింది. పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ పీసీ చాకో పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ లో వర్గపోరుతో విసిగిపోయానని అధిష్ఠానం ఉదాసీన వైఖరి కూడా రాజీనామాకు కారణమని చాకో వెల్లడించారు. కేరళ నుంచి ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ పార్టీలో విభేదాలను పరిష్కరించలేకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

మోదీ వ్యతిరేకతను సొమ్ము చేసుకోలేని కాంగ్రెస్:

దేశ వ్యాప్తంగా రైతుల నిరసనలను సొమ్ము చేసుకోలేకపోవడం కాంగ్రెస్ దుస్థితికి అద్దంపడుతోంది. ఇటీవల గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేపీ అనూహ్య విజయాలను సొంతం చేసుకుంది. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తన సత్తా చూపించింది. కాని కాంగ్రెస్ మాత్రం నామమాత్ర విజయాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పార్టీ ఘోర ఓటమిపాలవడంతో పీసీసీ అధ్యక్షుడు అమిత్ చావ్ దా తన పదవికి రాజీనామా చేశారు. వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. అయితే ప్రభుత్వ వ్యతిరేకతనుండి ప్రయోజనం పొందేందుకు కాంగ్రెస్ ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం విడ్డూరంగా ఉంది. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు సీపీఎంతో జట్టుకట్టింది. కేరళలో మాత్రం పినరయి విజయన్ నేతృత్వంలోని అదే పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతోంది. అస్సాంలో 15 సంవత్సరాలపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునేందుకు ఇంకా వ్యూహరచనలో కాలం గడుపుతోంది. జాతీయ స్థాయి పార్టీ తమిళనాడులో డీఎంకే కు మిత్రపక్షంగా మారింది. డీఎంకేను బతిమాలి సీట్లు ఇచ్చినవరకు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

అధిష్ఠానంపై సీనియర్ల ఆగ్రహం:

పార్టీ సీనియర్ నేతలు పలు పదవులు అలంకరించి విశేష అనుభవం సంపాదించిన గులాం నబీ ఆజాద్, భూపేందర్ సింగ్ హుడా, రాజ్ బబ్బర్, మనీష్ తివారీ ,ఆనంద్ శర్మలతో సహా ఏడుగురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇటీవల జమ్ములో ర్యాలీ నిర్వహించారు. పార్టీ నానాటికీ బలహీనపడుతోందని దానిని అత్యంత ఆవశ్యకంగా బలోపేతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి నొక్కి చెప్పారు. గత ఏడాది ఆగస్టు 15న సోనియాగాంధీకి లేఖ పంపిన జి23 గా పిలువబడే 23 మంది కాంగ్రెస్ సీనియర్ నేతల బృందంలో ఈ నాయకులు కూడా ఉన్నారు. జమ్ములో గుప్కర్ అలయన్స్ తో పొత్తుపెట్టుకోవడాన్ని ఆనంద్ శర్మ తీవ్రంగా తప్పుబట్టారు. పార్టీ తీసుకునే అవివేక నిర్ణయాలతో పార్టీ పరువు  బజారున పడుతోందని ఆనంద శర్మ విమర్శించారు.

Also Read: భారత్ బచావో కాదు… కాంగ్రెస్ బచావో అనాలి

చౌకబారు విమర్శలు చేస్తున్న రాహుల్:

కాంగ్రెస్ పార్టీ మోదీ ప్రభుత్వంతో వ్యవహరించే తీరు విచిత్రంగా కనిపిస్తోంది. కేంద్రంలో దూకుడుగా వ్యవహరిస్తున్న మోదీ అమిత్ షా ద్వయాన్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సరైన వ్యూహాన్ని అమలు చేయలేకపోతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని మోదీ తనను తాను ప్రపంచ నాయకుడిగా గొప్ప సంస్కర్తగా నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రజల్లో అభిమానాన్ని సంపాదించుకుంటున్నారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలు చేవలేనివిగాను, పసలేనివిగాను ప్రజలు భావిస్తున్నారు. రాహుల్ గాంధీ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి పదవులు అనుభవించలేదు. ప్రధాని మోదీని ఇరుకున పెట్టేందుకు రాహుల్ చేస్తున్న విమర్శలు ఆయనకు తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. మోడీ చోర్ హై, రాఫెల్ జెట్ ఫైటర్స్ లో అవినీతి, సరిహద్దుల్లో చైనా చొరబాట్ల నేపథ్యంలో ఆయన చేసిన విమర్శలను బీజేపీ కొట్టిపారేసింది. సోనియాగాంధీ దాదాపు రెండేళ్లుగా తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. గతంతో పోలిస్తే ఆమెకు ఆరోగ్యం సహకరించడంలేదు. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తరప్రదేశ్ లో కంటే ఢిల్లీలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు.

నాయకత్వ సమస్యను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకీ దిగజారిపోతోంది. ఈ పరిస్థితులును గాంధీ కుటుంబసభ్యులు చక్కదిద్దలేకపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానికులతో మమేకమయ్యందుకు రాహుల్ గాంధీ తంటాలు పడుతున్నారు. ఇటీవల కేరళలో సముద్రంలో మత్స్యకారులతో కలిసి ఈత కొట్టడం, విద్యార్థులతో బస్కీలు తీయడంద్వారా తనకున్న మాస్ ఇమేజ్ తో ప్రజలతో చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అసోంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక గాంధీ టీ తోటల్లో తేయాకు తెంపుతూ స్థానిక గిరిజనులతో ముచ్చటించారు. గతంలో గాంధీల కుటుంబం అంటే పార్టీలో ఎనలేని గౌరవం ఉండేది. నేతలెవరూ గొంతెత్తి మాట్లాడేవారు కారు. గాంధీ కుటుంబ సభ్యులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపేందుకు ప్రయత్నిస్తున్నారు.

Also Read: కాంగ్రెస్ లోపం దేశానికి శాపం

వారసత్వ పోరుతో నలిగిపోతున్న కాంగ్రెస్:

దశాబ్దాల చరిత్రగల కాంగ్రెస్ పార్టీ ఇపుడు మోదీకున్న ప్రాభవం ముందు మసకబారిపోతుండటంతో గాంధీల కుటుంబం ఒంటరి పోరాటం చేస్తోంది. పార్టీలో ఇప్పటికీ చాలామంది ప్రతిభావంతులు, అనుభవజ్ఞులైన మేటి నేతలు ఉన్నారు. వీరికి అవకాశం ఇస్తే పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురాగలరు. క్షేత్ర స్థాయినుంచి పార్టీని నిర్మించగల సామర్ధ్యం వీరికి ఉంది.ఏ ఎన్నికల్లో అయినా అప్రతిహత విజయాలను నమోదు చేస్తున్న బీజేపీ దేశ వ్యాప్తంగా 37.6 శాతం ఓట్లను మాట్రమే పొందగలుగుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలో ఆరోగ్యకర ప్రజాస్వామ్యం ఉండాలంటే శక్తివంతమైన ప్రతిపక్షం అవసరం ఎంతైనా ఉంది. గత కొన్నేళ్లుగా పలు కారణాలతో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చి ప్రాంతీయ పార్టీలు స్థాపించడంతో కాంగ్రెస్ ప్రాభవం తగ్గుతూ వస్తోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు నిలబడి వారి అద్భుత వారసత్వాన్ని తిరిగే పొందాలంటే కాంగ్రెస్ నుంచి గాంధీ కుటుంబం బయటకు రావాలి.

చీలికలవుతున్న కాంగ్రెస్:

రాజీవ్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ ఐక్యతను కోల్పోతూ వస్తోంది. తమిళనాడులో మూపనార్ కాంగ్రెస్, బెంగాల్ లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, మహారాష్ట్రలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలు ఏర్పడ్డాయి. రాష్ట్ర విభజన అనంతరం తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర నష్టాన్ని చవిచూసింది. రెండు రాష్ట్రాలలో పార్టీ పతనావస్థకు చేరుకుంది. తెలంగాణలో కొద్దిగా బలంగా ఉందనుకుంటే అక్కడ పార్టీ తీవ్రమైన నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles