Sunday, October 13, 2024

అనర్థం, అరిష్టం మనిషి జీవితం!

My Confession

                          ————————-

                                                By Leo Tolstoy

                                                ————————

                            నా సంజాయిషీ

                            ———————-

                                                లియో టాల్స్టాయ్

                                                ————————–

తెలుగు అనువాదం:

డా. సి. బి. చంద్ర మోహన్

డా. బి. సత్యవతీ దేవి

                                  చాప్టర్ – 11

                                  ————–

వారి విశ్వాసాలతో ఘర్షణ పడుతూ జీవించే వారిని చూస్తే, ఆ విశ్వాసాల్లో నాకు నమ్మకం కుదరక తిప్పి కొట్టాయో, అవే విశ్వాసాలు పాటిస్తూ జీవితం గడిపే వారిని చూస్తే అవి నాకు చాలా హేతుబద్ధంగా, ఆకర్షణీయంగా అనిపించాయి. అవే విశ్వాసాలను అప్పుడు ఎందుకు తిరస్కరించానో, ఇప్పుడు ఎందుకు అంగీకరిస్తున్నానో నాకు అర్థమైంది. నేను ఎక్కడ పొరబడ్డానో అర్థమైంది. నేను అంత ఎక్కువగా పొరబడలేదు. నేను చెడ్డగా బ్రతికాను కాబట్టి తప్పుగా ఆలోచించాను అంతే. నిజాన్ని నా నుండి దాచింది నా ఆలోచనలోని తప్పు కాదు. అది కేవలం నా ఎపిక్యూరియన్ (భోగలాలసత్వం) కోరికల సంతృప్తి కోసం నేను గడిపిన జీవితం అని అర్థమైంది. నా జీవితం ఏమిటి? అని ప్రశ్న వేసుకుంటే —   సమాధానం ‘చెడుగా బ్రతికాను’  అని వస్తే, అది సరైనదే అని అర్థమైంది. ఒకే ఒక తప్పు ఏమిటంటే – ఆ సమాధానం నా జీవితానికే పరిమితమైంది. నేను దాన్ని అందరి జీవితాలకు అన్వయించాను. నా జీవితం ఏమిటి అని నన్ను నేను ప్రశ్నించుకుంటే నాకు వచ్చిన సమాధానం : ‘చెడు మరియు నిరర్థకం.’ నిజంగానే నా జీవితం (కోరికలు తీర్చుకునే భోగ జీవితం) అర్థం లేనిదీ, చెడుదీను. అది నా జీవితానికే వర్తిస్తుంది. మానవాళి  అందరి జీవితాలకు కాదు. నాకో సత్యం అర్థమైంది ( అదే నేను తర్వాత గోస్పెల్స్ లో కనుగొన్నాను). అదేమిటంటే — “మనుషులు వెలుగు కన్నా చీకటిని ఎక్కువగా ప్రేమిస్తారు. ఎందుకంటే — వారు చేసేవి చెడు పనులు. చెడు పనులు చేసే వారందరూ వెలుగుని ద్వేషిస్తారు. వారు వెలుగులోకి రారు. వారి చెడు పనులు బయటపడతాయనే భయం.” జీవితం యొక్క అర్థం తెలుసుకోవాలనుకుంటే — మొదటగా జీవితం అర్థం లేనిదీ, చెడుదీ  కాకూడదని నాకు తోచింది. అప్పుడు మనం దానిని హేతువుతో వివరించగలం. ఇప్పటివరకు నేను స్పష్టంగా కనపడే సత్యం చుట్టూ ఎందుకు తిరిగానో అర్థమైంది. ఎవరైనా, మానవాళి యొక్క జీవితం గురించి ఆలోచించాలి, మాట్లాడాలి కానీ — ఇంకొకరి జీవితంపై పరాన్న జీవులుగా బ్రతికే వారి జీవితం గురించి కాదు. ఆ సత్యం ‘రెండు రెళ్లు నాలుగు’ అన్నంత నిజం. కానీ నేను దాన్ని అంగీకరించలేదు . రెండు రెళ్ళు నాలుగు అని అంగీకరిస్తే — నేను చెడ్డవాడినే అని అంగీకరించాలి. నేను నాకు మంచిగా అనిపించడం — ‘రెండు రెళ్లు నాలుగు’ అనే సత్యాన్ని అంగీకరించడం కన్నా — నాకు ముఖ్యమూ, అవసరమూ కూడా. నేను మంచి మనుషులని ప్రేమించడం మొదలుపెట్టాను. నన్ను నేను ద్వేషించుకున్నాను. సత్యాన్ని అంగీకరించాను. ఇప్పుడు నాకంతా  స్పష్టంగా ఉంది.

Also read: శ్రమజీవుల జీవితాలే సార్థకం

ఒక తలారి జీవితమంతా ప్రజలను హింసిస్తూ, వారి తలలు నరుకుతూ ఉంటే  (లేక)  ఒక పనికిరాని తాగుబోతు లేక ఒక పిచ్చివాడు జీవితమంతా ఒక చీకటి గదిలో నివసిస్తూ, ఆ గదిని మలినంగా ఉంచుతూ, ఆ గదిని వదిలిపోతే తాను నాశనం అయిపోతానని ఊహించుకుంటుంటే   –         —   జీవితం అంటే ఏమిటి? అని అతను, తనను తాను ప్రశ్నించుకుంటే,

— “జీవితం ఒక గొప్ప అనర్ధం” అని జవాబిచ్చుకుంటే,

 — ఆ పిచ్చివాడి జవాబు నూరు శాతం కరెక్ట్ అవుతుంది (అది అతనికి ఆపాదించుకుంటేనే).

నేనే ఆ పిచ్చివాడిని అయితే? ధనికులూ, తీరుబాటుగా జీవితం గడిపే మనలాంటి వారు పిచ్చివాళ్లయితే ఏమిటి? మనం నిజంగానే పిచ్చివాళ్ళమని అర్థమైంది. నాకు నేను ఏ రకంగా చూసినా, ఖచ్చితంగా అటువంటి పిచ్చి వాడినే.

నిజానికి ఒక పక్షి — ఎగరటానికి ,ఆహారం పోగు చేసుకోవడానికి, గూడు కట్టుకోవడానికి తయారు చేయబడింది. ఆ పక్షి ఈ పనులన్నీ చేస్తుంటే దానితోపాటు నేనూ ఆనందిస్తాను. ఒక మేక, ఒక కుందేలు, ఒక తోడేలు అవన్నీ కూడా వాటి ఆహారాన్ని సంపాదించుకునేటట్లు చేయబడ్డాయి.

Also read: అందరం జ్ఞానం కలిగిన అవివేకులం

అలాగే కుటుంబాన్ని పెంచుకుంటానికి, వాటి ఆహార అవసరాలు తీర్చుకోడానికి కూడా. అవి అలా చేసినప్పుడు, అవి చాలా ఆనందంగా ఉన్నాయని నేననుకుంటాను. వాటి జీవితానికి ఒక అర్థం ఉందనుకుంటాను. అలాంటప్పుడు  ఓ మనిషి ఏం చేయాలి? పశుపక్ష్యాదులు లాగానే అతను కూడా జీవనాన్ని తయారు చేసుకోవాలి. తేడా ఏమిటంటే అతను ఒక్కడే చేస్తే, అతను నశించిపోతాడు. అతను అతనికేగాక అందరి కోసం చేయాలి. మనిషి ఆ పని చేస్తే అతను సంతోషంగా ఉన్నాడని అతని జీవితం సహేతుకమైనదని నా పూర్తి నమ్మకం. కానీ 30 ఏళ్లు బాధ్యతాయుతమైన జీవితంలో నేనేం చేశాను? అందరూ బతకడానికి వీలుగా ఏమీ ఉత్పత్తి చేయలేకపోగా, కనీసం నాకోసం కూడా ఏమీ ఉత్పత్తి చేసుకోలేదు. నేనొక పరాన్నజీవి లాగా బ్రతికాను. నా జీవితం యొక్క ఉపయోగం ఏమిటి? అని నన్ను నేను ప్రశ్నించుకుంటే: “ఏమీ లేదు” అని జవాబు వచ్చింది. మానవ జీవితానికి అర్థం తనను తాను నిలబెట్టుకోవడం అయితే, 30 ఏళ్లు నేను నా జీవితాన్ని నిలబెట్టుకుంటానికి ప్రయత్నించకపోగా, నన్నూ, ఇతరులనూ నాశనం చేసుకోవడంలో నిమగ్నమై ఉంటే — నా జీవితం అర్థరహితము అరిష్టము అని జవాబు రాకుండా, అంతకన్నా మంచి సమాధానం ఏమొస్తుంది? అది ఖచ్చితంగా అర్ధ రహితమూ, అరిష్టమూను.

ప్రపంచం యొక్క జీవితం ‘ఎవరో ఒకరి’ సంకల్పం మీద నిలబడుతుంది. ప్రపంచం యొక్క జీవితంతోను, మన జీవితాలతోనూ ఆ ఒకరు  తన లక్ష్యాన్ని పూర్తి చేసుకుంటాడు. ఆ సంకల్పం అర్థం కావాలంటే, అతను తనకు నిర్దేశింపబడిన పని పూర్తి చేయాలి. నాకు నిర్దేశించింది నేను చేయలేకపోతే, నా నుండి కోరుకున్నదేమిటో నాకు ఎప్పటికీ అర్థం కాదు. మనందరి నుండి, ప్రపంచం మొత్తం నుండి ఏమి కోరుకోబడుతుందో అది పైదానికన్నా అగమ్యగోచరం.

Also read: అహేతుక జ్ఞానమే విశ్వాసం

బట్టలు కట్టుకోని, ఆకలితో ఉన్న ఒక బిచ్చగాడు నాలుగు రోడ్ల కూడలి నుండి, ఒక సుందరమైన సంస్థలోని, ఒక భవనం లోనికి తీసుకురాబడతాడు. అతనికి ఆహార పానీయాలు ఇచ్చిన తరువాత, ఒక హ్యాండిల్ అతని చేతికి ఇచ్చి, క్రిందికి పైకి కదిలించమని చెబితే — ఆ బిచ్చగాడు తాను ఎందుకు తీసుకొని రాబడ్డాడు, ఎందుకు హ్యాండిల్ కదిలించాలి — అనే ప్రశ్నలు వేయకుండా ఆ  హ్యాండిల్ కదిలిస్తే — అతనికి ఆ హ్యాండ్ లో ఒక పంపును కదిలిస్తుందని అర్థమవుతుంది. ఆ పంపు

నీటిని తోటకు సరఫరా చేస్తుంది. అక్కడినుండి ఇంకా పైకి పోతే, అక్కడ అతనికి ఫలాలు దొరుకుతాయి. అతను కూడా మాస్టర్ తో పాటు ఆనందిస్తాడు. అప్పుడతను సంస్థ చేసిన ఏర్పాట్లు అన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటాడు. ఖచ్చితంగా ఆ మాస్టర్ ని దూషించడు. ఆ మాస్టర్ సంకల్పం నెరవేర్చే సామాన్య, చదువుకోని శ్రామికులు మాస్టర్ను నిందించరు. కానీ తెలివిగల వాళ్ళమైన మనం మాస్టర్ చెప్పింది చేయంగానీ, అతనిచ్చిన ఆహారం తింటాం. ఆయన చెప్పింది చేయకపోగా — “ఆ హ్యాండిల్ ని మనం ఎందుకు కదిలించాలి? అది మూర్ఖత్వం కాదా?” అని చర్చిస్తాం. ” మాస్టర్ మూర్ఖుడు, (లేదా) మాస్టర్ అనేవాడు ఉనికిలో లేడు. మనం జ్ఞానులం. మనం పనికిరాని వాళ్ళమని మనం అనుకుంటున్నాం. ఆ భావం మనలో నుంచి తీసి పారేయాలి ” అని మనలో మనం నిర్ణయించుకుంటాం.

Also read: ఎంతకీ అర్థం కాని జీవితం!

                ——–   ——

Dr. C. B. Chandra Mohan
Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles