Saturday, February 24, 2024

కొండదొర ఆదివాసీ ‘కుంతికుమారి’  కధ

 (రండి! ఆమెకు అండగా వుందాం!!)

 (POSCO చట్టం కింది నమోదైన కేసులో తాను బాధితురాలుగా (victim)  చూపబడినందున పేర్లు మార్చడమైనది)

‘భార్య’ అంటే ఏమిటో తనకు తెలియకుండానే తాను ఒకరికి ‘సతి’ అయ్యింది. ‘తల్లి’ కావడం అంటే ఏమిటో అర్ధంగాకాముందే ‘అమ్మ’ అయ్యింది. తనను తాను రక్షించుకోడానికంటూ వచ్చి ‘చట్టం’ చేతిలో ‘అనాధ’  అయ్యింది. తన అమ్మ నాన్న, చేరదీసిన మేనమామ వదిలి వెళ్ళిన  బాధ్యతల బరువును మోస్తున్నది. ఇంతచేస్తే ఆ యువతి వయస్సు 15 సంవత్సరాలు. 5 నెలల గర్బవతి.

గత వారం రోజులుగా నన్ను   తన కధ  వెంటాడుతున్నది. తన మేనమామపై పోలీసు వారు పెట్టిన  కేసు రికార్డులు  నాకు వాట్స్ అప్ ద్వారా అందాయి. తనను వెతుక్కుoటూ  నా ‘కాంటాక్ట్’ సహాయoతో  ( 2024) ఫిబ్రవరి 3, 4 – 5 గంటల మధ్య వెళ్లాను.

కుంతికుామరి పుట్టిపెరిగిన ఇల్లు

కుంతికుమారి   కోసం ..

గత ఏడాది వరకు ఉమ్మడి జిల్లాగా వున్న విశాఖపట్నం నేడు మూడు ముక్కలుగా,  రెండు జిల్లాలయ్యింది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని  పాడేరు (రెవిన్యు డివిజన్) ఆదివాసీ ఏజెన్సి ప్రాంతం నేడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో భాగం. అల్లూరి జిల్లా, పాడేరు మండలానికి, అనకాపల్లి జిల్లాలో వున్న చీడికాడ మండలానికి ఉమ్మడి సరిహద్దు వుంది.

పాడేరు మండలం, ‘అయినాడ’, అనకాపల్లి జిల్లా, చీడికాడ మండలం, కోనాం రెండు  సరిహద్దు  పంచాయితీలు. నేను కోనాం పంచాయితీ పరిధిలోని ఆదివాసీ గ్రామాలలో పని చెస్తుoటాను. అక్కడ మా సంఘం వుంది. అయినాడ పంచాయితిలోని ఒక శివారు గ్రామం ఆమెది. కోనాం నుండి 9 km తరువాత రోడ్డు పాయింట్ లో మా వాహనాలు వుంచి,  కొండ గొప్పులు ఎక్కిదిగి, గెడ్డ దాటి,  మల్లి గొప్పు ఎక్కితే అక్కడ మాకు,  నాలుగు ( 4)  ‘ఇల్లు’ అనబడేవి కనిపించాయి. 21 శతాబ్దoలో, ప్రపంచానికి అపర కుబేరులను అందిస్తూ, చంద్రుని మీదకు ఒక  ఉప గ్రహాన్ని పంపిన ‘జగత్ గురు’ , ‘ ప్రజాస్వామ్యాన్నికి పుట్టినిల్లు’  అయిన దేశంలో,  ఈ దేశపు మూలవాసుల  ఉంటున్న ఇళ్ళు అవి. ఆ కొంపలకు విద్యుత్తు అనే వస్తువు ఇంకా రావలసి వుంది.

Also read: ఇప్పుడు వారికి  ఒక “అడ్రెస్” వచ్చింది

భర్త జైలులో తాను అడవిలో …

తన భర్త పేరు “దేముడు.” దేముడైన రాముడు తన భార్యను వెతుక్కుoటూ లంకకు వెళ్లి ఆమె కోసం ‘అరివీర భయంకరంగా పోరాటం’ చేశాడని  చెప్పగా విన్నాం. ఇక్కడ అడవిలో బిక్కు బిక్కు మంటూ చూస్తున్న కుంతికుమారి   వద్దకు  దేముడు రాలేడు.  మీరు,  నేను, పౌర సమాజం అనే ‘వానర సేన’  తలపెట్టకపొతే, బహుశా ఎన్నటికి తాను  ఈ అడవికి రాలేడు. ఎందుకంటే, అతను  అత్యoత శక్తి వంతమైన POSCO (The Protection of Children from Sexual Offences Act  – లైంగిక అత్యాచాల నుండి బాలల రక్షణ చట్టం) కింద అరెస్టు కాబడి జైలులో రిమాండ్ ఖైదీగా వున్నాడు. ఏమిటేమిటి! బాలల  లైoగిక అత్యాచార రక్షణ చట్టం  కింది అరెస్టయిన ఒక నేరస్తుడ్ని/ముద్దాయిని బయటకు తీసుకురావడానికి సహకరించడమా? నో , నెవ్వర్ ( no, never)   అనకండి, ప్లీజ్!. కధ సాంతం వినండి ( అప్పటికి మీకు అదే అభిప్రాయం వుంటే OK, మీ ఇష్టం)

అమ్మ లేదు … నాన్న లేడు … అన్న వున్నా లేనట్లే

కుంతికుమారి   తల్లిదండ్రులకు  ఇద్దరు సంతానం. తాను చిన్నది. అమ్మ చిన్నప్పుడే చనిపోయిoది గనుక తాను  ఎలా వుంటుందో తెలీదు. అన్నయ్య పేరుకే పెద్దవాడు మానసిక ఎదుగుదల లేదు. ఇద్దరినీ నాన్నే అన్నితానే అయ్యి పెంచాడు. ఒక ఎడాది కిందట నాన్న చనిపోయాడు. అన్న బాధ్యత తన మీద పడింది.

బయట ప్రపంచం తెలీదు. చదువుకోలేదు. తనకే ఒకరి అండకావాలి అలాంటిది తానె  అన్నకు అండ కావలసి వచ్చింది. ఈ నాలుగు ఇల్లు  ప్రధాన గ్రామానికి దూరంగా అడవిలో వున్నాయి. ఆ గ్రామం కూడా పెద్దదేమి కాదు.  “దగ్గిరోల్లు దాయోల్లు’ పేరుకు వున్నా వారివి అంతంత బతుకులు. ఏమి చేయాలో, ఎటు పోవాలో తెలియదు. తండ్రి చనిపోయేనాటికి కుంతికుమారి  కధ ఇది.

దేవుడి అన్న, పెద్దమ్మ

ఇక ‘దేవుడి’ కధ  

మైనర్  అమ్మాయిపై లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడనే  నేరారోపణపై ప్రస్తుతం విశాఖపట్నం సెంట్రల్ జైలులో  రిమాండ్ ఖైదిగా వున్న దేముడిది మరో  కధ.

దేముడుకి తండ్రి వారసత్వ ఆస్తిగా భూమిపుట్ట ఏమి రాలేదు. కాని ఒక అన్నయ్య, పెద్దమ్మ మాత్రం వచ్చారు. వారిని చూసుకోవలసిన బాద్యత వచ్చింది.

Also read: గొంతెలమ్మ తల్లి సంబరం

వారిద్దరూ లెప్రసీ ( leprosy- కుష్టువ్యాది)  పేషెంట్స్. దేముడు ఇంటి పక్కనే వారికి ఒక చిన్న గుడిసె వుంది. గ్రామానికి దూరంగా దేముడు ఎందుకు వుంటున్నాడో అప్పుడు నాకర్దమైoది.  గ్రామoలో వుంటే అన్న, పెద్దమ్మలను తన వద్ద వుంచుకోలేడు. అందుకే తాను ఊరుకి చాలా దూరంగా అడవిలో , అన్న, పెద్దమ్మలకు పక్కనే ఒక గుడిసె వేసుకొని వుంటున్నడు. దేముడు వివాహితుడు. తనకు ఒక పాప. భార్య భార్తలు ఎలాంటి సశభిషలు లేకుండా ఈ ఇద్దరు లేప్పర్సి రోగులను చూసుకుoటు వచ్చారు. దేముడు. తన  భార్య తెచ్చె  అరకొర సంపాదన, రేషన్ బియ్యం ఐదుగురికి  ఆధారం. వరసగా వర్షాలు పడితే బయటకు వెళ్ళలేరు. ఆకలి, అర్దాకలితో ముడుచుకొని పడుకోవలసిందే. కుంతికుమారి    మేనకోడలు వరస.

3 తేది (ఫిబ్రవరి, 2024) శనివారం నేను వెళ్లి చూసేసరికి దేముడు అన్న తన గుడిసలో నుండి రావడానికి సహితం కష్టపడుతున్నాడు. ఆయనను లెప్రసీ  పూర్తిగా ఆక్రమించింది. గంగమ్మ ( ఇప్పటికి) కొంతవరుకు  ఫర్వాలేదు. నిజానికి లేప్పర్సి నివారించగలిగే  జబ్బుని , దానికి వైద్యం బాగా అభివృద్ధి చెందిందని విన్నాను. మరి వీరికి ఆ వైద్యం ఎందుకు అందుబాటులోకి రాలేదు? ఆదివాసీ ప్రాంతాలలో లెప్రసి వైద్యo పరిస్థితి ఏమిటి? ఇప్పటి వరకు నేను దృష్టి పెట్టని అంశం ఇది.

కుంతికుమారికి తండ్రి  చనిపోతే, దేవుడికి  భార్య,  ఆడ బిడ్డను వదిలి చనిపోయింది. తనకు సహాయంగా వున్న భార్య పోయింది. పాపను చుసుకోవాలి, ఈ రోగులను చూసుకోవాలి.

మేనమామ దేముడి వద్దకు కుంతికుమారి  

కుంతికుమారి  ఇంటిని చూశాను. దేవుడి ఇంటికి 10 నిముషాల నడక దూరంలో వుంది. కుంతికుమారి, ఆమె  అన్నలకు  దేముడే దిక్కయ్యాడు. దేముడికి  భారం పెరిగింది. ఇద్దరు లెప్రసీ  రోగులలో ఒకరికే పెన్షన్ వస్తుంది. దేముడు, ఇద్దరు రోగులు, ఒక పాప, మేన కోడలు, అల్లుడు ఇలా కష్టాలతో బాటు దేవుడి మీద భారం పెరిగింది.

Also read: మూడు పార్టీలు, వాటి జెండాలు వున్నాయి,  కాని కొండకు  దారే లేదు …

భార్య భర్తలు

తండ్రి లేని కుంతికుమారి, భార్య లేని దేముడు ఇరువురు భార్య , భర్తల్లాగా  జీవించడం  మొదలయ్యింది. వాళ్లకి POSCO అనే చట్టం ఒకటి వుందని తాము చేస్తున్న పని చట్ట విరుద్దమని తెలీదు.  లేత వయస్సులో పెళ్లి / కాపురం ఆదివాసీ ప్రాంతాలలో కొత్త సంగతేమీ కాదు. అలాంటి చర్య / కాపురం  ఒక నేరంగా మారి వుందని తెలియదు, తెలియజేప్పే  వ్యవస్థలు లేవు.

ఆధార్ చెప్పిన పుట్టిన తేది

ఆదివాసి ప్రాంతాలలో జనన – మరణాల నమోదు వ్యవస్థ లేదు. కనీసం నిన్న మొన్నటి వరకు లేదు. అందుచేత చాల సందర్బాలలో పుట్టిన రోజులు తెలీదు. కాని ఆధార్ పొందాలనoటే పుట్టిన తేది ఒకటి వుండడం తప్పని సరి. ఆధార్ లేకపోతె ఇప్పుడు ఏ ఆధారం వుండదు. కనుక ఆధార్ తప్పని సరి.  ఆధార్ నమోదు చేసే సెంటర్స్ వారు, మనిషిని చూసి, ఒక వయస్సు అనుకోని,  ఆధర్ లో ఒక తేదిని పుట్టిన రోజుగా వేసేస్తూ వుంటారు. ఆ విధంగా కుంతికుమారి    పుట్టిన తేది: 02-09-2010.

చట్టంతన పని తాను చేసింది హృదయం లేని ఒక యంత్రంలా

కుంతికుమారి  నెల తప్పి తల్లయ్యింది. దేముడు ఆశా వర్కర్ ద్వారా ఆమెకు   వైద్యo ఇప్పించాలనకున్నాడు. అది తన జీవితంలో పెను ప్రమాదానికి దారి చూపుతుందిని తనకు  ఉహకు కూడా అందని సంగతి. కుంతికుమారిని మొదట ప్రాధమిక ఆసుపత్రిలో చూపించిన దేముడు,  అక్కడ నుండి  ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. అక్కడ రోగిని చూడాలంటే,  ఆధార్ గుర్తింపు చూపాలి. దేముడు, కుమారి ఆధార్ గుర్తింపు చూపాడు. అందులో పుట్టిన తేది : 03-09-2010గా వుంది. దాంతో ఆసుపత్రి  వర్గాలు కంగారుపడి,  ITDA ( Integrated Tribal Development Agency)  ఉన్నతాధికారులకు తెలియజేసారు. వారు జిల్లా కలెక్టర్ కు కబురు చేరవేశారు. అక్కడ నుండి సంచారం పోలీసు వారికి చేరింది. అది కలెక్టర్ కార్యాలయం నుండి వచ్చింది  గనుక FIR ( First Information Report)  రిజిస్టరయ్యింది. ఆసుపత్రి నుండి దేముడు సరాసరి జైలుకు పంపబడ్డాడు.

ముద్దాయి దేముడు 

కుంతికుమారి నుండి పోలీసువారు ఒక పత్రంపై వేలి  ముద్ర తీసుకున్నారు. అదే ఫిర్యాదు. అందులో ఆ అమ్మాయి తన మేనమామకు వ్యతిరేకంగా చెప్పినట్లు వుంది. తన భార్య వద్ద వున్న దేముడ్ని పోలీవారు తీసుకుపోయారు. పోలీసు వారు కోర్టుకి ఇచ్చిన  రిమాండ రిపోర్టు ప్రకారం , దొరకకుండా పారిపోయిన “ ఎక్యుజుడు (accused)” ( ముద్దాయి / నేరస్తుడు) అనబడే ‘ దేముడు’  తేది: 14-12-2023న ఉదయం 9 గంటల సమయంలో తానే స్వయంగా వచ్చి చట్టం ముందు లొంగిపోయాడు(ట).

అరెస్టు చేసిన ముద్దాయిని 24 గంటలకు  ముందే న్యాయమూర్తి ముందు  వుంచాలన్నిది రూల్. రూల్స్ ఉల్లంఘిచవచ్చు,  కాని కాగితం మీద మాత్రం “అంతా సవ్యంగా” వుండాలి. ఆ ‘లాజిక్’ నుండి వచ్చిందే రిమాండ్ రిపోర్టులోని ఆ డేటు. 

FIR ప్రకారం,  దేవుడు మీద రెండు నేరారోపణ సేక్షన్ లు పెట్టారు. అవి IPC ( Indian Penal Code) 376 ( Punishment for sexual assault) 10 సంవత్సరాల జైలు శిక్ష, POSCO చట్టంలోని సేక్షన్ 5 (l) (n) 10 నుండి 20 సంవత్సరాల కటిన కారాగార శిక్ష. 

వాడని వంటపాత్రలు – వెలగని పొయ్యి

దేవుడు అరెస్టుతో అతని మొదటి భార్య కుమార్తెను తాత, అమ్మమ్మ  తీసుకువెళ్ళారు. ఇప్పుడు తానె అమ్మగా చూసుకోవలసిన ఒక అన్న, ఇద్దరు లెప్రసీ పేషెంట్స్ కుంతికుమారి  పరివరంగా మిగిలారు. ఐదు నెలల గర్బాన్ని మోస్తూ  ఈ బరువు బాద్యతని తాను  ఈదుకు రావాలి.

Also read: అజయ్ కుమార్ కూ, గదబ ఉద్యమకారులకూ ఈఏఎస్ శర్మ అభినందన

దేముడు, తానూ కలసి జీవిస్తున్న ఇంటిలోకి వెళ్లి చూశాను. ఒక రేకు డబ్బాలో  కోటా బియ్యం తప్ప ఒక్క ఉల్లిపాయ (ఉల్లి గెడ్డ)  లేదా ఒక్క పప్పుబద్ధ  కనిపించ లేదు. బియ్యం ఉడకబెట్టుకొని గెంజి నీళ్ళు తాగుతున్నారని అర్ధమయ్యింది. గ్రామంలో ఎవరైన దయదలచి ఇస్తే ఆ రోజు కూర, చారు దొరికినట్లు లేకపోతే లేదు.

కుంతికుమారి   రోదన

అడవిలో, వూరికి దూరంగా పుట్టి పెరిగిన తనకు బాహ్య ప్రపంచంతో పెద్ద పరిచయం లేదు. గొలుసుకట్టుగా జరిగిన ఘటనలు తనను భయబ్రాంతులకు గురి చేశాయి. ఆసుపత్రిలో తన పక్కన వున్న దేవుడ్ని తీసుకుపోవడం,  అప్పటి నుండి అతను  కనిపించకుండా పోవడo ఏమిటో,  అసలు తన చుట్టూ ఏo జరుగుతుందో పూర్తిగా తెలిసిరావటం లేదు. అలాంటి స్థితిలో తాను వుండగా,  ఆ గ్రామం నుండి వచ్చిన కాంటాక్ట్ పట్టుకొని నేను తనను వెతుక్కుoటు వెళ్లాను. నా రాక గూర్చి తెలియడంతో కొందరు అక్కడికి వచ్చారు. అందరి సమక్షంలో మాటలైనాక  , పురుషులను దూరంగా పంపి, మహిళల  సమక్షంలో,  పోలీస్ రిపోర్టులో (బాధితురాలి ఫిర్యాదు)  అంశాలను గూర్చి అడిగాను. అవి నిజం కాదని, అందులో ఏమిరాశారో తెలీదని చెప్పింది. తన పేదరికం, పోషణగూర్చి  అడిగిన ప్రశ్నలకు మౌనంగా రోదిస్తూ వుండిపోయింది.

అక్కడికక్కడే ఈ కింది ఏక్షన్ పాయింట్స్ అనుకున్నాను.

1.       విశాఖపట్టణం సెంట్రల్ జైలులో వున్న దేముడ్ని బెయిల్ పై తీసుకురావాలి.

2.       తాను బయటకు వచ్చి బాద్యతలు తీసుకునే వరకూ నెలకు సరిపోయే వంట సామాన్ల ( కిట్ )కు కావలసిన ఆర్దిక సహయాన్ని ప్రతినెల  సమీకరిoచాలి (తక్కువలో తక్కువ నెలకు 5 వేలని మా మహిళా కార్యకర్తలు అంచనా వేసారు)

3.       ఇందుకుగాను కుంతికుమారి   పేరున వెంటనే ఒక పోస్టల్ ఎకౌంట్ ను తెరవాలి

4.       అనకాపల్లి తీసుకువచ్చి, మానవత్వం (ఇంకా మిగిలిన వున్న) వైద్యుల సహకారంతో వైద్య పరీక్షలు చేయించాలి.

5.       లెప్రసీ జబ్బు విషయమై అవగాహన వున్న వారిని సంప్రదించి ఆ ఇద్దరు రోగులకు మందులు ఇవ్వగలమేమో చూడాలి. 

6.       కుంతికుమారికి తోడూ ఇచ్చి విశాఖపట్టణం సెంట్రల్ జైలుకు పంపి దేవుడిని చూపించాలి (ఇద్దరికీ ఒక దైర్యం ముందు ఇవ్వాలి).

అనకాపల్లి రావడానికి ప్రయాణ ఖర్చుకోసం,  నా దగ్గిర మా సంఘ సభ్యులు ఇచ్చిన సభ్యత్వ నగదు నుండి 1000 రూపాయలు తనకు  ఇచ్చాను. ఈ నేల 27, 28 తేదిలలో నన్ను రెండు వర్కుషాప్స్ లో పాల్గొని శిక్షణ ఇవ్వమని కోరారు. ఆ సందర్బంగా నిర్వాహకులు నాకు ఇచ్చే “ రిసోర్స్ పర్సన్ పీజ్” తన ఎకౌంటుకు, మొదటిదాతగ వేయాలని నిర్ణయించుకున్నాను.

(ఈ కధ  చదివినవారు ఎవరైనా మీ వంతు సహాయం చేయాలనుకుంటే,  కామెంట్ బాక్స్ లో మీ ఆశ్తకిని  తెలియజేయండి. మీకు వీలైతే ఈ లింక్ ను షేర్ చేయండి)

Also read: అవును! గదబ సాగు రైతులే   గెలిచారు

PS అజయ్ కుమార్

అడవిలో తనను వెతుక్కుంటూ ( షార్ట్ వీడియో క్లిప్)

అజయ్ కుమార్ పీ ఎస్
అజయ్ కుమార్ పీ ఎస్
పీఎస్ అజయ్ కుమార్ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో సోషల్ వర్కులో మాస్టర్స్ డిగ్రి (MSW) చేశారు. గత 30 ఏళ్లుగా ఆదివాసీల భూమి సమస్య, నిర్వాసిత, గ్రామీణ కార్మికుల హక్కుల కోసం పని చేస్తున్నారు. ‘ప్రభుత్వ భూమి పేదలదే’, ‘భూమి సమస్య – వ్యాసాలు 1, 2’, ‘కళ్యాణలోవ కధలు’ ప్రచురితమైన పుస్తకాలు. భూమి సమస్య వ్యాసాలు – 1కి, DNF Rural Journalist award foundation –Hyderabad వారి Rural journalist award for year 2008 లభించింది. ప్రస్తుతం అఖల భారత వ్యవసాయ & గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శిగా పని చేస్తున్నారు.

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles