Thursday, May 2, 2024

మణిపూర్ సంక్షోభాన్ని హిందూత్వ-క్రైస్తవ ఘర్షణగా చూడొద్దు, అది దేశీప్రాచ్యదృష్టి అవుతుంది

మణిపూర్ సంక్షోభాన్నిమనకుఅలవాటైన హిందీ రాష్ట్రాల రాజకీయాల ప్రాతిపదికగా ఊహిస్తాం. కానీ అది తప్పుదారి పట్టిస్తుంది. గత అయిదు దశాబ్దాలలో వెలువడిన గొప్ప ప్రభావవంతమైన పుస్తకాలలో ఎడ్వర్డ్ సయీద్ ఓరియంటలిజం (ప్రాచ్య సంస్కృతి)పైన రాసిన పుస్తకం అత్యంత ముఖ్యమైనది. మధ్యప్రాచ్యంపైన పాశ్చాత్య మేధావుల అభిప్రాయాలను ఆయన అధ్యయనం చేశారు. వలస పాలనను సమర్థించడానికి, హేతుబద్ధంగా వాదించడానికి ప్రాచ్య దేశాల మేధావులు చేసిన రచనలు వారి అవగాహన, విజ్ఞాన పరిధిని చూపిస్తాయి. వలస సమాజాల పట్ల వైరిభావంతో, జుగుప్సతో రాసిన రాతలు మాత్రమే గాక అవగాహనతో, సానుకూలతతో రాసిన రచనలు కూడా అదే పరిధిలోకి వస్తాయి.

Also read: స్వామి వివేకానంద సంఘపరివార్ హితైషి కాదు, ఆయనను కాజేయడానికి పరివార్ కు ఉదారవాదులు తోడ్పడ్డారు

మణిపూర్ విషయంలో గత పది రోజులుగా ఎడ్వర్డ్ సయీద్ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. చిట్టచివరకు మహిళలను నగ్నంగా ఊరేగించిన విడియోను విడుదల చేసిన తర్వాత మణిపూర్ అంటూ ఒక రాష్ట్రం ఈ దేశంలో ఉన్నదని గుర్తించాం. ప్రధాని 36 సెకన్లకోసమైనా తన మౌనాన్ని వీడవలసి వచ్చింది. సుప్రీంకోర్టు రంగప్రవేశం చేసింది – అప్పటికీ అతి జాగ్రత్తగానే. కొద్దిసేపైనా జాతీయ మీడియా మణిపూర్ లో జరిగిన దారుణాలను ప్రస్తావించవలసి వచ్చింది. పార్లమెంటు లోపలా, బయటా కూడా ఈశాన్య రాష్ట్రాలలో ఒకటైన మణిపూర్ పైన జాతి దృష్టి  కేంద్రీకరించింది. దశాబ్దాలుగా పేరుకుపోయిన జాతీయ విస్మృతికి వారం రోజులపాటు భంగం కలిగింది.

ప్రాచ్య దృష్టి, రాజకీయ పరిణామాలు

అధికారంలో ఉన్న శక్తిమంతుల నిర్లక్ష్యం కన్నా అధ్వానమైనది అధికారంకోసం ఆరాటం. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ ఈశాన్య రాష్ట్రాలు, ముఖ్యంగా మణిపూర్, మహిళలకు క్షేమదాయకమైన ప్రాంతమని దేశంలో విస్తృతంగా పర్యటించినవారికి తెలుసు. కానీ ఇప్పుడు మణిపూర్ ను మహిళలపైన దుర్మార్గమైన హింసాకాండ జరిగిన రాష్ట్రంగా గుర్తుపెట్టుకోవాలి. మణిపూర్  ను అత్యంత ఎక్కువ కాలం పరిపాలించిన ముఖ్యమంత్రి స్వర్గీయ రీషాంగ్ కీషింగ్ అల్పసంఖ్యాకమైన క్రైస్తవ నాగా తెగకు చెందిన వ్యక్తి. అటువంటి మణిపూర్ ఇప్పుడు మెజారిటీ రాజకీయాలకు నమూనాగా కనిపిస్తున్నది. అందరికీ ఓటు హక్కు నినాదంపైన ప్రపథమంగా ఎన్నికలు నిర్వహించిన రాష్ట్రం మణిపూర్. చైతన్యవంతమైన పౌరసమాజానికి, మేధోపరమైన జీవితాచరణకీ ఈశాన్యంలోని గుట్టలూ, కొండలూ ఉన్న రాష్ట్రాలలో మణిపూర్ కు పెట్టింది పేరు. Also read: రాబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎటైనా కావచ్చు

ప్రస్తుత సంక్షోభం కొంతకాలం తర్వాత సమసిపోవచ్చు. కానీ ఈ భయంకరమైన దృశ్యాలు మనుషుల మనసులలో కొనసాగుతాయి – ప్రాచ్య ప్రాతినిధ్యాల మాదిరిగానే. ఈశాన్యభారతం గురించి ఇంతవరకూ మనసులో పాతుకుపోయిన మూస భావాలకూ, పట్టింపులకూ ఈ జ్ఞాపకాలు మరింత బలాన్ని చేకూర్చవచ్చు. రాజకీయ ఆధిపత్యాన్నీ, పరాయీకరణనూ పెంపొందించే భారత్ ప్రధాన స్రవంతి ఈశాన్య రాష్ట్రాల గురించి వక్రీకరించిన అభిప్రాయం, దేశీప్రాచ్య దృక్పథం మరింత లోతుగా మనసులలో దట్టించవచ్చు.

ఇదేదో దీర్ఘకాలిక మేధోపరమైన ఆందోళన కాదు. ఈ ప్రాచ్యదృక్పథం వల్ల తీవ్రమైన, సత్వరమైన రాజకీయ పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. ఇప్పటికి మూడు మాసాలుగా కొనసాగుతున్న మణిపూర్ సంక్షోభాన్ని అర్థం చేసుకోవడానికి ఆ దృక్పథం ఆటంకంగా పరిణమించవచ్చు. డొల్ల భాగస్వామ్యానికి దారితీసే విధంగా మీ శక్తినంతటినీ తప్పుడు మార్గంలో వినియోగించేట్టు చేయగలదు. ఆ ప్రయత్నం బెడిసికొట్టడం తథ్యం.

అస్సాం సమస్య పట్ల మన ఉదారవాద పురోగామివాదులు ఎట్లా స్పందించారో, దాని రాజకీయ పర్యవసానాలు ఏమిటో, వాటి ధోరణి ఏమిటో పరిశీలించిన తర్వాత ఒక తీరు స్పష్టంగా కనిపించింది. అస్సాంలోకి సరిహద్దు దాటి అక్రమంగా సాగుతున్న వలసల వల్ల బంగ్లాదేశ్ కు ఆనుకొని ఉన్న సరిహద్దు అస్సాం జిల్లాలలో జనాభా స్వభావం మారిపోతున్నదనే అసలు సమస్యను ఉదారవాదులు గుర్తించడానికి నిరాకరించారు. అహోమియా సామాజికవర్గం న్యాయమైన ఆందోళనలను గమనించకుండా కళ్ళు మూసుకున్నారు. అస్సాం ఉద్యమాన్ని ఇరుకైన, విదేశాలకు చెందిన వలసవాదుల పట్ల వ్యతిరేకతగా భావించి ఆ ఉద్యమాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సినంత బాగా తీసుకోలేదు. ఉదారవాదులు అస్సాం ఉద్యమాన్ని పట్టించుకోకపోవడం, లౌకికశక్తులు ఈ అంశంపైన అంటీఅంటనట్టు ఉండటంతో జాతిపరమైన, భాషాపరమైన సమస్యను మతపరమైన విభాజనగా మార్చడానికి బీజేపీ చొరవతీసుకున్నది. ఉన్నత విలువలను సుదూర ప్రాంతంలో సత్వరంగా అమలు చేయడానికి జరిగిన ప్రయత్నం లౌకికపక్షాలుగా ఒంటరి శక్తులుగా మారడానికి కాకపోయినా రాజకీయ పక్షవాతానికి దారితీసింది.

Also read: వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఎక్కడ దృష్టి పెట్టాలో కర్ణాటక ఎన్నికలు చెప్పాయి

బాధితులు ఒకరు కాకుండా అనేకులు ఉన్నప్పుడు మన రాజకీయాలు ఎట్లా విఫలమౌతాయో చెప్పడానికి అస్సాం సజీవమైన సాక్ష్యం.  బెంగాలీ, ఝాఖండీ వలసదారులు, మైదానాల నుంచి వలసవచ్చినవారూ, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చినవారూ ఎంతగా బాధలు, నష్టాలు అనుభవించారో అహోమియాలు సైతం అంతే నష్టాలూ, కష్టాలూ అనుభవించారు. అటువంటి పరిస్థితులలో మనం బద్ధకంగా తేలికైన పరిష్కారమార్గాన్ని ఎంచుకుంటాం – ఒక బాధిత వర్గం కంటే మరో బాధితవర్గం నయమని అనుకుంటాం. వాటి చుట్టూ పక్షపాత రాజకీయాలు అల్లుతాం. అది రాజకీయ విధ్వంసానికి దారితీస్తుంది. దాదాపు అటువంటిదే మణిపూర్ లో ఇప్పుడు జరుగుతోంది.

మణిపూర్: అస్సాం పునరావృత్తం

మణపూర్ సంక్షోభంపైన జాతీయ దృష్టి సారించడంలో జాప్యం జరగడంలో ఉన్న సమస్య ఏమంటే కేవలం విషం చిమ్మడం, విషయాన్ని దాటవేయడం, ప్రభుత్వానికి అనుకూల శక్తులు మతపూరితమైన, కుట్రపూరితమైన కోణాన్ని ఆపాదించడం మాత్రమే కాదు. మణిపూర్ లో జరుగుతున్న ఘటనలను సాధారణ ఫక్కీలో పరిణామాలుగా పరిగణించే ప్రభుత్వ వ్యతిరేకవాదులు, ప్రజలకు అనుకూలురు తెలియకుండా తప్పు చేస్తున్నారు. ఇది రాజకీయంగా బెడిసి కొట్టకపోయినా, వాదనను తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందనీ, అసమర్థతతో పాటు ఒక తెగవైపు మొగ్గు చూపుతూ పక్షపాతం ప్రదర్శిస్తున్నారని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ను నిందించడంలో ప్రభుత్వ వ్యతిరేక శక్తులు సవ్యంగానే వ్యవహరించాయి. ప్రధాని మోదీ నియంతలాగా మౌనం వహించడాన్నీ, రాజ్యాంగ విధులను నిర్వర్తించకుండా  ఉల్లంఘించడాన్నీ తప్పుపట్టడంలో కూడా తప్పులేదు. నేరాన్ని నీరుగార్చుతూ బాధితులను నిందించే ప్రధాన స్రవంతి మీడియా పాశవిక ధోరణిని ఖండించడం కూడా సమంజసమే.

కానీ మణిపూర్ లో సంభవిస్తున్న జటిలమైన పరిణామాలను హిందీ రాష్ట్రాల రాజకీయాలతో పోల్చి చూడటం ఉదారవాదులు, లౌకికవాదులు చేస్తున్న తప్పు. దీనిని అల్పసంఖ్యాకులపైన అధికసంఖ్యాకుల దౌర్జన్యంగానూ, మూలకు నెట్టబడిన ఆదివాసీలను శక్తిమంతులైన హిందువులు అణచివేయడంగానూ అనుకోవడం పొరబాటు. బాధితులను గుర్తించి వారి అభిప్రాయాల ఆధారంగా కథను అల్లుకోవడం తేలికే. ఈ ఉత్తర భారతానికి చెందిన నమూనా ఈశాన్య భారతానికి సరిపోతుందో, లేదో ఆలోచించడం అవసరం. బీజేపీ ప్రభుత్వాన్ని దోషిగా నిర్ణయించడానికి బదులు బాధితులు ఎవరనే విషయంపైన దృష్టి సారిస్తాం. మణిపూర్ సంక్షోభం అత్యంత జటిలమైనదని ఆ రాష్ట్రానికి చెందిన మేధావులు ప్రొఫెసర్ బిమోల్  అకాయిజామ్, ప్రొఫెసర్ ఖామ్ ఖాన్ హావ్ సింగ్, ప్రతాప్ ఫాంజోబామ్, తదితరుల అభిప్రాయం.

Also read: బీజేపీ సామాజిక న్యాయం రాజకీయాన్ని రాహుల్ మండల్ -3 తో ఎదుర్కోవచ్చు

ఈ లోపభూయిష్టమైన అద్దాల నుంచి చూడటం ద్వారా ఈ సంఘర్షణలోని మౌలికమైన ధోరణిని గుర్తించలేకపోతున్నాం. ఇది హిందూత్వ ఆధిక్యానికీ, క్రైస్తవులకూ, ఇతర అల్పసంఖ్యాకవర్గాలవారికీ మధ్య జరుగుతున్న ఘర్షణ అని నమ్మించడానికి ఆర్ ఎస్ఎస్ ప్రయత్నిస్తుంది. నిజానికి ఇది ప్రాథమికంగా హిందువులు మెజారిటీగా ఉన్న మెయితీలకూ, క్రైస్తవులైన కూకీలకూ మధ్య జరుగుతున్న ఘర్షణే. అనుమానం లేదు. చర్చిల విధ్వంసాన్నీ కాదనడం లేదు. కానీ ఈ ధోరణిని మతపరమైన ఆధిపత్య ధోరణి నడిపిస్తున్నదే కానీ తెగల మధ్య వైరుధ్యం కాదని గుర్తించాలి. మణిపూర్ లో అత్యధికులుగా ఉన్న  క్రైస్తవ నాగాలూ, పంగాల్స్, చిన్న ముస్లిం వర్గాలూ ఈ వివాదంలో ఇంతవరకూ భాగస్వాములు కాలేదు. తక్కువ జనాభా కలిగిన క్రైస్తవ మెయితీ వర్గంపైన దాడులు జరిగినట్టు మొదట్లో వార్తలు వచ్చాయి. అటువంటి వార్తలు ఇప్పుడు లేవు.

పైగా, మెయితీలు ఉత్తరాది హిందువుల లాంటి వారు కాదు. మెయితీల తరఫున పని చేస్తున్న తీవ్రవాద సంస్థలు బజరంగ్ దళ్  వంటివి కాదు. మెయితీలు మూడు శతాబ్దాలకు పైగా గౌడీయ వైష్ణవిజం అనే తరహా వైష్ణవ మతారాధకులే. స్థానిక సనమాహీ మతస్థులు జరుపుకునే పండుగలూపబ్బాలతో వారికి విభేదం లేదు. కలసిమెలసి ఉంటారు. ఆర్ఎస్ ఎస్ చాలాకాలంగా అక్కడ పని చేస్తున్నప్పటికీ మణిపూర్ లో దూకుడు స్వభావం కలిగిన హిందూయిజం వేళ్ళూనుకోలేదు. లీపన్, అరంబై టెంగోల్ వంటి మెయితీ తీవ్రవాద ముఠాలు కుకీలపైన దాడులలో పాల్గొన్నారని వార్తలు వచ్చాయి కానీ వారు కూడా సంఘ్ పరివార్ కోరుకుంటున్నట్టు అంతటా హిందూమత ఆధిక్యమే ఉండాలని వాదించే రకం కాదు. స్థానిక సనామహి మతాన్ని పునరుద్ధరించాలని ఈ మలిటెంట్ వర్గాల నాయకుల ఆలోచన. భారత దేశ ప్రధాన స్రవంతిలో ఉన్న మతధోరణులను కానీ భారత ప్రభుత్వ ఆధిక్యాన్ని కానీ వారు ఆమోదించరు. వారిది కూడా భారత ప్రధాన స్రవంతిలో పెరుగుతున్నహిందూత్వ మతధోరణి వంటిదే అని ఆర్ఎస్ఎస్ చేసిన ప్రచారం జయప్రదం కాలేదు.

ఒక బాధితవర్గం, ఒక దాడిచేసినవర్గం కాదు

మెయితీలకూ, కుకీ-జో ప్రజలకూ మధ్య సంబంధాలు ఉన్నత కులాలకు చెందిన హిందువులకూ, ఆదివాసీలకూ మధ్య ఉన్న సంబంధాల మాదిరి ఉండవు. రెండు తెగలు భిన్నమైన నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ, వారి మధ్య అనుమానాలు కూడా ఉన్నప్పటికీ  రెండు వర్గాలవారూ పర్వత శ్రేణులలో నివసించేవారే, ఒకే రకమైన జాతి, భాషాపరమైన సంబంధాలు కలిగినవారే. సాంకేతికంగా మెయితీలను ఓబీసీ అనే వర్గీకరణం చేసినప్పటికీ తమ సామాజిక, ఆర్థిక పరిస్థితులలో మెయితీలకూ, ఆదివాసీలుగా పరిగణించే కుకీలకూ మౌలికంగా తేడా లేదు. రిజర్వేషన్ల ఫలితంగా రాష్ట్రప్రభుత్వంలోనూ,ఇతర అధికారిక వ్యవస్థలలోనూ కుకీల సంఖ్య గణనీయంగా ఉంటుంది. భారత ప్రధాన స్రవంతిలో అటువంటి సమాంతర సంబంధాలతో పోల్చాలనుకుంటే  మెయిటీలకూ, కుకీలకూ మధ్య తేడా రాజస్థాన్ లో మీనాలకూ, గుజ్జర్లకూ, జార్ఖండ్ లో ఆదివాసీలకూ, సవర్ణజాతులకూ మధ్య ఉన్న వ్యత్యాసం లాగా ఉంటుంది.

తమను హింసిస్తున్నారనీ, తమకు అన్యాయం జరుగుతోందనే భావన కుకీలలో చాలా కాలంగా ఉంది. ఇటీవలికాలంలో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ బహిరంగంగానే శత్రువైఖరి అవలంబించడంతో ఈ భావన మరింతగా ప్రబలింది. తమనే లక్ష్యంగా చేసుకొని సాగుతున్న హింసాకాండను వారు ఇంతకాలం భరించారు. మాదక ద్రవ్యాలు పండిస్తున్నారంటూ తమపైన నిందారోపణలు చేసి వేధించడాన్ని వారు గర్హిస్తున్నారు. తమ ప్రాంతంలోనే తమను పరాయివారుగా పరిగణించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. భయాందోళనలూ, రాజ్యాంగం కల్పించిన రక్షణలు తమకు వర్తించడం లేదనే బాధా, తమ భూములలోకి ఇతరులు చొచ్చుకొని రావడం వారికి ఆగ్రహం కలిగిస్తున్నది.

తమను ముందుకాళ్ళకు బంధం  వేసి వేధిస్తున్నారనే భావన, చిన్న విస్తీర్ణం కలిగిన భూమిలో పెద్ద సంఖ్యలో ఉన్న జనాభాను కుక్కారనే బాధ మెయితీలకు చాలాకాలంగా ఉన్నది. ఒకే రకమైన సామాజికవర్గాలను భిన్నమైన రీతులలో పరిగణించడంపైన అభ్యంతరం ఉంది. మణిపూర్ సరిహద్దులను అతిక్రమిస్తారనే భయం కూడా వారికి ఉంది. అందుకని మనం ఒక బాధిత వర్గాన్నీ, ఒక దాడి చేసే వర్గాన్నీ మాత్రమే చూడటం లేదు. మనం రెండు వర్గాల బాధితుల్ని చూస్తున్నాం. రెండు వర్గాల ఫిర్యాదులూ న్యాయమైనవే. వారి భయాలూ వాస్తవమైనవే.

తాము బాధపడిపోతున్నామనే ధోరణి రెండు వర్గాల విషయంలోనూ వాస్తవికమైనది. ఈ రెండు రకాల ధోరణులకూ మధ్య చర్చల ద్వారా సమాధానం వెతకడానికి ప్రయత్నించాలి.  చిన్న విభేదాలను పెద్దగా చూడకుండా సంయమనం పాటించాలని వారికి నచ్చజెప్పాలి. ఎటువంటి భయాల గురించైనా చర్చించుకునే వాతావరణం నెలకొల్పాలి. హింసాకాండకు గురైనవారికి న్యాయం చేసే విధంగా దర్యాప్తు జరిగే పద్ధతిని పాటించాలి. దీనికి చాలా కాలం పడుతుంది. ఈ మరమ్మతు ప్రక్రియ ముఖ్యమంత్రి వైదొలగడంతో ఆరంభం కావాలి. ఈలోగా మనం ప్రాచ్యమేధావుల కళ్ళజోళ్ళను పరిశుభ్రం చేసుకొని ఆ రాష్ట్రంలో పరిస్థితులను ఉన్నవి ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి.

Also read: లౌకికవాదులు నా వెంట పడటం- భారత దేశంలో దాడికి గురి అవుతున్నామనే మనస్తత్వానికి నిదర్శనం

Yogendra Yadav
Yogendra Yadav
యోగేంద్ర యాదవ్ స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు. స్వరాజ్ అభియాన్, జైకిసాన్ ఆందోళన్ సంస్థల సభ్యుడు. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకై శ్రమిస్తున్న బుద్ధిజీవులలో ఒకరు. దిల్లీ నివాసి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles