Monday, April 29, 2024

జీహెచ్ ఎంసీ ఎన్నికలు : విజేతలూ, పరాజితులూ నేర్చుకోవలసిన గుణపాఠాలు

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలలో బీజేపీ ఘనవిజయం సాధించింది. అధికార టీఆర్ఎస్ పరాజయం చెందింది. కాంగ్రెస్ పార్టీ స్థితిలో మార్పు లేదు. ఎంఐఎం పరిస్థితీ 2016లో ఏ స్థాయిలో ఉన్నదో ఇప్పుడూ అంతే. టీఆర్ఎస్ అతి పెద్ద పార్టీగా 56 స్థానాలతో ముందు నిలబడగా దాని వెనువెంటనే బీజేపీ 48 స్థానాలతో నిలిచింది. ఎవరు ఊహించారు బీజేపీకి టీఆర్ఎస్ కంటే కేవలం ఏనిమిది స్థానాలే తక్కువ వస్తాయని? బహుశా బీజేపీ నేతలు సైతం ఊహించి ఉండరు.

దుబ్బాకకు కొనసాగింపు

దుబ్బాకలో బీజేపీ చేసిన పోరాటం, సాధించిన విజయం చూసిన తర్వాత జీహెచ్ఎంసీలో సైతం ఆ పార్టీ గట్టిపోటీ ఇస్తుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు (కేసీఆర్)తో సహా అందరూ ఊహించే ఉంటారు. బీజేపీ దూకుడు మీద ఉన్నది కనుకనే ఇంకా రెండు మాసాల వ్యవధి ఉన్నప్పటికీ అత్యవసరంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిపించాలని కేసీఆర్ అనుకున్నారు. చకచకా పావులు కదిపారు. ఆయన భయం నిజమై కూర్చుంది. నిజంగానే గడువు ప్రకారం ఎన్నికలు జరిపించాలని రెండు మాసాల వ్యవధి ఇచ్చి ఉంటే ఎట్లా ఉండేదో చెప్పడం కష్టం. బీజేపీ కచ్చితంగా ఎక్కువ సీట్లు దక్కేవని చెప్పవచ్చు. ఒక రకంగా కేసీఆర్ దుబ్బాక ఫలితం చూసిన వెంటనే మేల్కొని తన పార్టీకి అనుకూలమైన నిర్ణయం తీసుకున్నారు.

దుబ్బాక హెచ్చరికను గుర్తించిన కేసీఆర్

దుబ్బాకకు ముందే 2019 నాటి లోక్ సభ ఎన్నికలలోనే టీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తగిలింది. బీజేపీ నాలుగూ, కాంగ్రెసె మూడు స్థానాలూ గెలుచుకోవడం అంటే దాదాపు సగం లోక్ సభ స్థానాలను ప్రతిపక్షాలు గెలుచుకున్నట్టు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకూ, లోక్ సభ ఎన్నికల ఫలితాలకూ సంబంధం లేదు. ఎందు కట్లా జరిగిందో ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకొని ఉంటే కథ మరో రకంగా ఉండేది. 2018 అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ కి ఎన్నికల ప్రచారంలో ఇతివృత్తాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అందించారు. ఆయన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి నడుం కట్టి ఖమ్మంలో, హైదరాబాద్ లో టీడీపీ-కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా ప్రచారం ప్రారంభించడంతో కేసీఆర్ కి ఎన్నికల ప్రచారానికి అవసరమైన సామగ్రి దొరికింది. పరిపాలన పరోక్షంగా, రిమోట్ కంట్రోల్ ద్వారా అమరావతి నుంచి చంద్రబాబునాయుడు చేయాలో లేక హైదరాబాద్ నుంచి ప్రత్యక్షంగా కేసీఆర్ చేయాలో తేల్చుకోమని తెలంగాణ ప్రజలను ఆయన కోరారు. అంతవరకూ టీడీపీకో లేక కాంగ్రెస్ కో లేక బీజేపీకో ఓటు వేయాలని అనుకున్నవారంతా టీఆర్ఎస్ కి ఓటు వేశారు. అందుకే టీఆర్ఎస్ కి అన్ని సీట్లు వచ్చాయి. చంద్రబాబునాయుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోకుండా ఉంటే, ప్రచారం చేయడానికి తెలంగాణలో అడుగుపెట్టకుండా ఉంటే టీఆర్ఎస్ కి అంత ఎక్కువగా ఎంఎల్ ఏ స్థానాలు దక్కేవి కావు. కాంగ్రెస్ కీ, బీజేపీ అంత తక్కువ వచ్చేవి కావు. లోక్ సభ ఎన్నికలలో ఆ సంగతి స్పష్టంగా తెలిసి వచ్చింది. చంద్రబాబునాయుడు ప్రచారానికి రాలేదు. కేసీఆర్ కి అసెంబ్లీలో ఉన్న పరోక్ష సహకారం టీడీపీ అధినేత అందించలేదు. టీఆర్ఎస్ పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకత లోక్ సభ ఎన్నికలలో బయటపడింది. దుబ్బాకలో అదే వ్యతిరేకత కొనసాగింది. అదే ధోరణి జీహెచ్ఎంసీలో కూడా కనిపించింది.

ఒక రాజకీయ నాయకుడికి కానీ, ఒక రాజకీయ పార్టీకి కానీ పరాజయాన్ని అర్థం చేసుకోవడం ఎంత అవసరమో విజయాన్ని అర్థం చేసుకోవడం కూడా అంతే అవసరం. 2018 నాటి అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ విజయాన్ని కేసీఆర్ సవ్యంగా అర్థం చేసుకొని ఉంటే కథ మరో రకంగా ఉండేది. లోక్ సభ ఎన్నికల తర్వాత కూడా  కేసీఆర్ శైలి మారలేదు కనుక ఆయన సరైన గుణపాఠం నేర్చుకోలేదని తీర్మానించుకోవాలి.

ఓటమినైనా, గెలుపునైనా సవ్యంగా అర్థం చేసుకుంటేనే మనుగడ

జీహెచ్ఎంసీ ఎన్నికలలో 48 స్థానాలు గెలుచుకోవడాన్ని బీజేపీ నాయకులు  ఎట్లా అర్థం చేసుకుంటారనే అంశంపైన హైదరాబాద్ భవిష్యత్తూ, తెలంగాణ భవిష్యత్తూ, బీజేపీ భవిష్యత్తూ ఆధారపడి ఉంటాయి. విజయోత్సాహంతో టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ, ఇప్పుడు జరిగింది శాఫ్రన్ స్ట్రయిక్ అనీ, ఆ తర్వాత తాను ఎన్నికల ప్రచారంలో చెప్పిన సర్జికల్ స్ట్రయిక్ జరుగుతుందనీ వ్యాఖ్యానించారు. రోహింగ్యాలూ, పాకిస్తానీయులూ పాతబస్తీలో ఉన్నారనీ, వారిపైన సర్జికల్ స్ట్రయిక్ కు తమ పార్టీ మేయర్ ఎన్నిక కాగానే ఆదేశిస్తాడనీ సంజయ్ ప్రచారంలో చెప్పారు. దానికి బదులుగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ దమ్ములుంటే చైనా పైన సర్జికల్ స్ట్రయిక్స్ చేయాలని అన్నారు. అంతటితో ఆగలేదు. మతవిద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతున్నదనీ, పాతబస్తీలో ఇదివరకు మతకలహాలు జరిగిన ప్రస్తావన కూడా ఎన్నికల ప్రచారంలో  వచ్చిందనీ హైదరాబాదీయులు గమనించారు. ‘‘ఇద్దరూ (బీజేపీ, ఎంఐఎం) పిచ్చోళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు, ప్రశాంతమైన హైదరాబాద్ కావాలంటే టీఆర్ఎస్ కే ఓటు వేయాలి’’ అంటూ మునిసిపల్ వ్యవహారాల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిజంగానే ప్రజలు ఆయన విజ్ఞప్తిని మన్నించి టీఆర్ఎస్ అభ్యర్థులను ఎక్కువ సంఖ్యలో గెలిపిస్తారని చాలామంది అనుకున్నారు.  

తల్లకిందులైన అంచనాలు

కానీ అందరి అంచనాలనూ తల్లకిందులు చేస్తూ ప్రజలు బీజేపీకి 48స్థానాలు ప్రసాదించారు. మతోద్రేకాలు రెచ్చగొట్టడం వల్లనే ఇన్ని స్థానాలు లభించాయని బీజేపీ భావిస్తే అది దురదృష్టకరమైన విషయం అవుతుంది. ఇంతవరకూ బీజేపీ తరఫున దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, డాక్టర్ లక్మణ్,  తదితర ప్రముఖులు హైదరాబాద్ నుంచి గెలుపొందినా మతపరమైన నినాదాలకూ, వివాదాలకూ తావు ఇవ్వలేదు. వారి వ్యక్తిగత నాయకత్వ లక్షణాల కారణంగా గెలుస్తూ వచ్చారు. రాజాసింగ్ ఒక్కరే హద్దుమీరి మాట్లాడేవారు. సంజయ్ వచ్చిన తర్వాత ఈ రకమైన ధోరణి పెరిగింది. ఆ కారణంగా ఈ విజయాలు దక్కాయని భావిస్తే పొరపాటు. టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కారణంగానే బీజేపీ గెలించిందని భావించాలి. ప్రజలు మార్పు కోరుకున్నారని అనుకోవాలి. ఇందుకు భిన్నంగా ఆలోచిస్తే హైదరాబాద్ లో పరిఢవిల్లిన గంగా-జమునీ తెహ్జీబ్ క్షీణించి మతపరమైన ఆవేశకావేశాలు పెరుగుతాయి. అది వాంఛనీయం కాదు.

ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు

తెలంగాణ అసెంబ్లీకి 2023లో జరగబోయే ఎన్నికలలో అధికార టీఆర్ఎస్ కి బీజేపీ ప్రధాన ప్రత్యర్థి అనడంలో సందేహం లేదు. ఈ లోగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందో లేక మరింత క్షీణిస్తుందో కాలమే నిర్ణయిస్తుంది. రెండు స్థానాలు మాత్రమే గెలిచినందుకు నైతిక బాధ్యత స్వీకరిస్తూ టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమకుమార్ రెడ్డి రాజీనామా సమర్పించారు. ఆయన రాజీనామాను ఆమోదిస్తారో లేదో, ఆయన  స్థానంలో ఎవరిని నియమిస్తారో చూడాలి. టీపీసీసీ పగ్గాలను యువనేత రేవంత్ రెడ్డికి అప్పజెప్పుతారనీ, ఆయన సోనియగాంధీ జన్మదినమైన డిసెంబర్ తొమ్మిదో తేదీన బాధ్యతలు స్వీకరిస్తారనీ వదంతులు వినిపిస్తున్నాయి. జాతీయ స్థాయిలోనే కాంగ్రెస్ కు కాయకల్పచికిత్స కావాలని అనుకుంటున్న రోజుల్లో తెలంగాణలో సైతం పునరుజ్జీవనానికి ప్రయత్నం జరగాలి. ప్రతిపక్ష పాత్ర పోషించవలసిన కాంగ్రెస్ ఆ పని సమర్థంగా చేయలేకపోవడం, కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు కేసీఆర్ ప్రయత్నించడం బీజేపీకి కలసి వచ్చిన అంశాలు.

గమనించవలసిన పోకడలు

జీహెచ్ఎంసీ ఎన్నికలలో గమనించవలసిన కొన్ని పోకడలు ఉన్నాయి. దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్ నగర్, నల్లగొండలకు అనుకొని ఉన్న హైదరాబాద్ డివిజన్లలో బీజేపీ జయభేరి మోగించింది. సెంట్రల్ హైదరాబాద్ లో కూడా కాషాయ పతాకమే రెపరెపలాడింది.  ఉత్తర హైదరాబాద్ లోనూ, పశ్చిమంలోనూ టీఆర్ఎస్ నిలబడగలిగింది. ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్లు జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడినవారు టీఆర్ఎస్ కే ఓటు వేశారు. కోస్తాంధ్ర నుంచి వచ్చినవారు మాత్రం తమ చట్టుపక్కల ఉన్నవారి ప్రభావానికి లోనైనారు. దక్షిణ తెలంగాణ జిల్లాలవారితో కలసి జీవించేవారు వారితో పాటే బీజేపీ కి ఓటు వేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వచ్చినవారితో కలసి జీవించే కోస్తాంధ్ర ప్రాంతంవారు తమ ఇరుగుపొరుగులతో కలసి టీఆర్ఎస్ కు ఓటు వేశారు.

నేతలు టీఆర్ఎస్ లోకి వచ్చారు కానీ కార్యకర్తలు రాలేదు

తెలంగాణ ఆర్థిక మంత్రి టి. హరీష్ రావు ప్రచారం చేసిన పటాన్ చెరువు ప్రాంతంలో దాదాపు అన్ని డివిజన్ లలోనూ టీఆర్ఎస్ గెలిచింది  – ఒక్క మూసాపేట మినహాయిస్తే. కాంగ్రెస్ పార్టీ నుంచీ, టీడీపీ నుంచీ నేతలు టీఆర్ఎస్ లోకి వచ్చినప్పటికీ వారితో పాటు కార్యకర్తలు రాలేదు. ఇందుకు ఉదాహరణ విద్యామంత్రి సబితా ఇందిరారెడ్డి గెలిచిన ప్రాంతంలోని డివిజన్లూ, సుధీర్ రెడ్డి ఇలాకాలోని డివిజన్లూ, రాజేంద్రనగర్ ఎంఎల్ఏ ప్రకాశ్ గౌడ్ ప్రాంతంలోని డివిజన్లనూ బీజేపీ తుడిచిపెట్టింది. ఈ నాయకులతో పూర్వాశ్రమంలో పని చేసిన కార్యకర్తలు బీజేపీలో చేరిపోయారని భావించాలి.

బీజేపీవైపు మొగ్గిన రెడ్డి సామాజికవర్గం

అంతే కాదు, శుక్రవారం నాడు వెల్లడైన ఓటింగ్ ధోరణి గమనిస్తే రెడ్డి సామాజికవర్గం యావత్తూ బీజేపీవైపు మొగ్గు చూపిందని అనిపిస్తున్నది. ఆ సామాజికవర్గాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి కేసీఆర్ ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ వారు బీజేపీ పట్ల మోజు పెంచుకుంటున్నారనేది వాస్తవం. అంటే, ఇది టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ కు కూడా కలవరం కలిగించే పరిణామం. రెడ్డి సామాజికవర్గం లేకపోతే కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనపడి పోతుంది. రాబోయే రోజులలో ఆ సామాజికవర్గం ఎట్లాంటి వైఖరి అవలంబిస్తుందో చూడాలి. టీఆర్ఎస్ కి బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదిగింది కనుక టీఆర్ఎస్ ఆటకట్టించాలని కోరుకునేవారంతా బీజేపీలో చేరాలని అభిలషించడం సహజం. అప్పుడు కాంగ్రెస్ మరింత చిక్కిపోతుంది. అటువంటి దుస్థితి సంభవించకుండా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.

ఆత్మపరిశీలన అవసరం

టీఆర్ఎస్ ను అధికారంలో కొనసాగించాలంటే కేసీఆర్ వైఖరిలో మార్పు అవసరం. ఆత్మపరీక్ష చేసుకొని పొరపాట్లు ఏమి జరిగాయో గ్రహించి వాటిని సవరించుకునే చర్యలు చేపడితే భవిష్యత్తు ఉంటుంది. అతి పెద్ద పార్టీగా నిలిచిన టీఆర్ఎస్ కీ, రెండో స్థానంగా సగర్వంగా నిలిచిన బీజేపీకి, నాలుగో స్థానంలో బక్కచిక్కిపోయిన కాంగ్రెస్ పార్టీకీ, చివరికి ఎంఐఎంకీ ఈ ఎన్నికలలో నేర్చుకోవలసిన గుణపాఠాలు అనేకం ఉన్నాయి. ఎవరు ఏ పాఠాలు నేర్చుకుంటారో చూడాలి.

Related Articles

3 COMMENTS

  1. Today’s article on the results of GHMC elections is very analytical and thought provoking. it indicates that we can expect many changes in the political setup in the state. Senior Journalist Sri.K.Rama Chandra Murthy has advised the political parties to retrospect themselves in the light recent results to strengthen their stand.It is really a good analysis.

  2. TRS has to improve a lot in terms of ruling. So many times KCR played with voters emotions and now voters started playing with him.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles