Saturday, February 24, 2024

మా ఇంటికొచ్చింది మన కుంతి!

 (మానవత్వం పరిమళించిన వేళ)

ఒక ఆర్ట్ ఫార్మ్ గా మాదాల రంగారావు, నారాయణమూర్తిల  “ విప్లవ” సినిమాలను “సినిమా” గా ఒప్పుకోలేను. కాని కొన్ని పాటలు నాకు నచ్చుతాయి. అందులో వందేమాతరం శ్రీనివాస్ పాడిన “ మాయమై పోతున్నడన్నా .. మనిషన్నవాడు” అనే పాట ( వాచ్య గీతంగా) నచ్చుతుంది. ఆ పాటలోని, “నూటికో కోటికో ఒక్కడే ఒక్కరు…..” నాకు గత రెండు రోజులుగా తారసపడ్డారు. ‘మనిషి’ మీద నమ్మకాన్ని నింపుతున్న ఈ అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. కొందరి పేర్లును  కావాలనె  ప్రస్తావించటం లేదు. ముందుగా, ఇప్పుడే ఈ స్టోరీ చదివే వారికోసం సంక్షిప్త నేపద్యం.

కొండదొరల ఆదివాసి కుంతికుమారి  కధ

ఇదే పేరుతొ నేను రాసిన కధనాన్ని “ సకలం” మీ ముందు ఉంచింది(https://www.sakalam.in/demudu-jailed-wife-kunti-kumari-helpless/) అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని, పాడేరు మండలం, అయినాడ పంచాయితిలోని ఒక మారు మూల కుగ్రామం, ఆ మారుమూల కుగ్రామoలో ఇంకా మారుమూల అడవి మధ్యలో వుంటున్నారు మన కుంతికుమారి, ఆమె భర్త. గర్బిణి అయనా ఆమెను  భర్త ఆషా వర్కర్ సహాయంతో ఆసుపత్రికి తీసుకు వెళ్ళేడు. పేషంట్ కు వైద్యం చేయాలoటే ఇప్పుడు ఆధార్ తప్పని సరి. శ్మశానంలోనే ఇంకా ఆధార్ అడగటం లేదు(?). సదరు ఆధార్ కార్డు ప్రకారం అమ్మాయి మైనర్ అని ఆసుపత్రి అధికారులు గుర్తించారు (ఆదివాసీ  ప్రాంతాలలో జనన మరణాల నమోదు వ్యవస్థ సరిగ్గా వుండదు. ఆధార్ నమోదు కేంద్ర వారే మొహం చూసి పుట్టిన తేదీలు వేస్తూ వుంటారు). అది భర్త అరెస్టుకు దారితీసింది.  POSCO (The Protection of Children from Sexual Offences Act  – లైంగిక అత్యాచాల నుండి బాలల రక్షణ చట్టం) కింద తనను విశాఖపట్నం సెంట్రల్ జైలుకు జ్యుడిషయల్ రిమాండ్ కు పంపారు.

Also read: కొండదొర ఆదివాసీ ‘కుంతికుమారి’  కధ

కుంతికుమారి  భర్త, మానసిక అనారోగ్యం సరిగాలేని బావమరిదిని, లెప్రసి రోగులైన అన్నయ్య, పెద్దమ్మలను, తన మొదటి వివాహం వలన కలిగిన కుమార్తెను  సాకుతున్నాడు. ఇప్పుడు ఈ భారం అంతా ఐదునెలల  గర్బవతిపై పడింది. ఇంటికి కరెంటు లేదు. ధరల డిపోలో కిరోసిన్ ఇవ్వటం లేదు. కనుక ఆ అడవిలో రాత్రయితే చంద్రుని వెన్నెలే “విద్యుత్తు” దీపం. పూర్తి వివరాలకు ఇదే మకుటంతో “ సకలం”లోని స్టోరీ చూడగలరు.

వెళ్లి చూశాను – ఏం చెయ్యాలి?

నాకు సమాచారం ఇచ్చిన వారిని తోడూ తీసుకొని తేది: 03-02-2024న అక్కడికి వెళ్లాను. తనతో, కొందరి గ్రామస్తులతో మాట్లడాను. ఏం చేయాలి?

ఇంతమందిని తాను చూసుకురావడం  అసాద్యం. భర్త అరెస్టయిన తరువాత నుండి వారి ఆదాయ మార్గం పూర్తిగా మూసుకు పోయిందని అర్ధమవుతున్నది. రోజులు గడుస్తున్న కొద్దీ తనకు, కడుపులోని బిడ్డకు  మంచి ఆహరం కావాలి. లేకపోతె అది బిడ్డ ఎదుగుదలపై  ప్రభావం చూపిస్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ తనకే సహాయం కావాలి. కనుక తనపై ఆధారపడే వారిని చూడటం సాద్యం కాదు.

భర్తను చూసేందుకు సెంట్రల్ జైలుకు వెడుతున్న కుంతీి

జైలులో వున్న తన భర్త (బెయిల్ పై) బయటకు   రావడం ఒకటే ఒక  పరిష్కారం. కాని POSCO కేసులో బెయిల్ అంత సులువుగా రాదు. మరి! న్యాయవాది ఫీజులు, ఇతర ఖర్చులు??

బెయిల్ రావడానికి నెలలు పట్టవచ్చు, ఆలోగా ఆమె పరిస్తితి? తనపై ఆధారపడివున్న వారి పరిస్తితి??

జైలుకు పోదాం చలో చలో!

కుంతీకుమారి భర్తను పోలీసు వారు అరెస్ట్ చేసిన నాటి నుండి తాను అతనిని చూడలేదు. భర్త జైలులో, ఆమె అడవిలో. ఇద్దరికి  ఒకరికోకరిని చూపించాలి. దాని వలన వారికి  ఒక ఊరట లభిస్తుంది. బెంగలు తగ్గుతాయి. నమ్మకం చిక్కుతుంది. “మీ ఆయనను చూస్తావా! తీసుకువెళ్ళి చూపిస్తాను” అని నేను అడిగిన వెంటనే తన మొహంలో ఒక దరహాసం.

Also read: ఇప్పుడు వారికి  ఒక “అడ్రెస్” వచ్చింది

నేను అక్కడికి వెళ్ళినప్పుడే, మా సంఘ సభ్యుల సభ్యత్వాల నగదు నుండి ఒక వెయ్య రుపాయలు ఇచ్చి వచ్చాను. మా సహాకార్యకర్త S. గణేష్, గ్రామం నుండి ఒక మహిళ, తానూ కలసి 8వ తేదిన సెంట్రల్ జైలుకు వెళ్లి దేముడ్నికలిశారు. ఆ రోజు సాయింత్రానికి మా గ్రామంలోని S.R శంకరన్ శ్రామిక విద్యా & శిక్షణ కేంద్రానికి కుంతికుమారి   చేరుకుంది.

బెయిల్ కోసం మొదటి అడుగు

రిమాండ్ లో వున్న “ ముద్దాయి” కి బెయిల్ పెట్టాలనoటే వకాల్తాపై అతని సంతకం కావాలి. సంతకం కావాలంటే దానిపై న్యాయవాది సంతకం వుండాలి. కాని ఎవరు బెయిల్ పెడతారు? న్యాయవాది ఫీజు కాదుకదా కనీసం కోర్టు ఖర్చులు కూడా ఇచ్చి పరిస్తితి లేదు.

ఎదురు ఫీజుఇచ్చిన  న్యాయవాది గారు

POSCO కోర్టు వున్నది విశాఖపట్టణంలో. కనుక న్యాయవాది అక్కడే కుదిరితే మేలు. ఆలోచిస్తూ ఉండగా నజహర గారు  గుర్తుకు వచ్చారు. వారు నాకు పరిచయమే. K. బాలగోపాల్ సంస్మరణ సభలో నా పుస్తకం ఆవిష్కరణ జరిగినప్పుడు అరుంధతి రాయ్ తో బాటు ఆమె కూడా వున్నారు. సకలంలో వచ్చిన కుంతికుమారి  కధ ఆమెకు లింక్ పంపాను. ఆమె ఆ కధనం చదివారు, మాట్లడాను. తాను ఎలాంటి ఫీజు లేకుండా బెయిల్ పెట్టడానికి ముందుకు రావడంతో బాటు, కుంతికుమారికి  ఏమైనా కొని పెట్టండని రెండు వేలు ( Rs 2000) పంపారు. ఈ రోజు ( 9వ తేది)న గణేష్ గారు వకాల్తా పట్టుకొని వెళ్లి సంతకం సేకరించుకొని వచ్చారు. సోమవారం బెయిల్ అప్లికేషన్ వేసే అవకాశం వుంది.

ఆరోగ్య పరీక్షలు

కుంతికుమారి  కధ చదివిన వైద్యులు స్పందిచారు. ఆమెకు రక్త పరీక్షలు, ఇతర పరీక్షలు చేయించాము. వైద్యులు స్కెన్ చేసి, బేబి ఆరోగ్యవంతగా వుందని, రక్తంలో  హిమోగ్లోబిన్ శాతం తక్కువగ వుందని చెప్పారు. పరీక్షలు ఉచితంగా చేయడంతో బాటు,  రెండు నెలలకు సరిపోయే 3,230 రూపాయల విలువైన మందులను అందజేశారు. బెల్లంతో చేసిన వేరుసేనగ చక్కిలు, కర్జురం కొని ఇవ్వమని 1500 రూపాయలు నగదు ఇచ్చారు.

Also read: గొంతెలమ్మ తల్లి సంబరం

EAS శర్మ గారు రాణి శర్మగారు

నాలాంటి వాళ్ళందరికి విశాఖపట్టణంలో యెరాడ కొండ లాంటి పెద్దదిక్కు, భారత ప్రభుత్వం మాజీ ఇంధన శాఖ కార్యదర్శి , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో,  S.R శంకరన్ గారి నేతృత్వంలో గిరిజన సక్షేమ శాఖ కమీషనర్ గా పని చేసిన EAS శర్మగారు, వారి సహచరి రాణి శర్మ గారు కధనానికి స్పందిoచారు. చీకటిలో వుంటున్న కుంతికుమారి  కుటుంబానికి మరో మూడు కుటుంబాలకు సోలార్ విద్యత్ బల్బులు, ఆ నాలుగు ఇళ్ళ మధ్యలో ఒక సోలార్ వీధి లైట్ ఏర్పాటుకు  రంగoలోకి దిగారు. ఏ అవసరం వున్నా తనకు తెలియజేయమన్నారు రాణి శర్మగారు.

సుబ్బారావు గారు అరుణ కుమారి

సుబ్బారావు గారు మా అనకాపల్లి వాస్తవ్యులు. ఫోన్ చేసి అడగటమే ఆలస్యం, రెండు వేలు నగదు పంపారు. అరుణ నా రెండవ కూతురు. తన వద్ద వున్న కొన్ని దుస్తులు, చీరలతో బాటు తన ‘ పాకెట్ మని’ నుండి 500 రూపాయలు ఇచ్చింది.

మేము ఏమైనా చేయాలా?

పూణే నుండి సాప్ట్ వేర్ నిపుణులు శ్రావణి, ఆంగ్ల వెబ్ పోర్టల్ విలేఖరి భాను గారు,  సామాజిక కార్యకర్త, రచయిత సజయ గార్లు మా వంతుగా ఏమి చేయాలని అడిగారు.

తన ఊరికి తిరిగి వెడుతున్న కుంతీకుమారి

కొండత అండ మా కోటమ్మ

నిన్న ( ఫిబ్రవరి 8) కుంతికుమారి   మా ఇంటికి వచ్చిన దగ్గిర నుండి ఈ రోజు, అనకాపల్లి నుండి  20 km దూరంలో వున్న చోడవరంకు తనను తీసుకువెల్లి తన గ్రామస్తులకు, మా కార్యకర్తలకు  అప్పగించెంత వరకూ తనను సొంత కూతురులా చూసుకుంది మా ఆవిడ కోటమ్మ.  మార్కట్ కు తీసుకువెళ్లి 2,500 రూపాయల కిరణా, వంటి సబ్బులు, బట్టలు సబ్బులు కొని ఇచ్చింది.  మా సంఘoలోని ఆదివాసీ మహిళలతో తన గ్రామం వస్తానని దైర్యం చెప్పి పంపింది.

దేముడు వచ్చే వరకూ

ఒకవైపు దేముడు బెయిల్ పై వచ్చే వరకూ కుంతికుమారి  పరివారానికి కావలసిన కిరాణ, ఇతర అవసరాలు చూడాలి. లెప్రసి (కుష్టు) రోగులకు వైద్యం అందేలా చూడాలనే కర్తవ్యాలు పెట్టుకున్నాం. ఇవి చేయగలం అనే నమ్మకం ఈ రోజు పూర్తగా కలిగింది. మనుషులు ఇంకా మిగిలే వున్నారు. ‘మరింక భయం నేదు’ ( రాచకొండ విశ్వనాద శాస్త్రి)

Also read: మూడు పార్టీలు, వాటి జెండాలు వున్నాయి,  కాని కొండకు  దారే లేదు …

P.S. అజయ్ కుమార్

Dt : 09-02-2023

అజయ్ కుమార్ పీ ఎస్
అజయ్ కుమార్ పీ ఎస్
పీఎస్ అజయ్ కుమార్ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో సోషల్ వర్కులో మాస్టర్స్ డిగ్రి (MSW) చేశారు. గత 30 ఏళ్లుగా ఆదివాసీల భూమి సమస్య, నిర్వాసిత, గ్రామీణ కార్మికుల హక్కుల కోసం పని చేస్తున్నారు. ‘ప్రభుత్వ భూమి పేదలదే’, ‘భూమి సమస్య – వ్యాసాలు 1, 2’, ‘కళ్యాణలోవ కధలు’ ప్రచురితమైన పుస్తకాలు. భూమి సమస్య వ్యాసాలు – 1కి, DNF Rural Journalist award foundation –Hyderabad వారి Rural journalist award for year 2008 లభించింది. ప్రస్తుతం అఖల భారత వ్యవసాయ & గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శిగా పని చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles