Wednesday, May 1, 2024

పాత ‘ వెర్షన్ ‘ సరుకును వదిలించుకుంటున్న జగన్

జాన్ సన్  చోరగుడి

దేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్.ఆర్. ప్రభుత్వంలో జరుగుతున్న- ‘హైబ్రిడ్ గవర్నెన్స్’ ప్రయోగం గతంలో మనకు తెలిసిన ‘గుడ్ గవర్నెన్స్’కు కొనసాగింపు. ఇందులో రెండు అంశాలు ఉన్నాయి. మొదటిది- ‘ఆన్ లైన్’ టెక్నాలజీ కారణంగా లబ్ధిదారుకు చేరే- ‘లాస్ట్ మైల్ డెలివరీ’ వరకు ‘ట్రాకింగ్’ సౌలభ్యం. రెండు- ‘డెలివరీ’ వేర్వేరు దశలు దాటి క్రిందికి వచ్చే క్రమంలో ‘బటన్’ నొక్కిన చేతిని – ప్రయోజనం పొందుతున్న చేతులు ప్రతిసారీ గుర్తు చేసుకోవడం.

ఇక్కడ అన్నిదశల్లో పనిచేస్తున్నవి మెషిన్లు అయినప్పటికీ, ఇటువంటి సంక్షేమ పథకాల రూపకల్పనలోని- ‘హ్యూమన్ టచ్’ కారణంగా, ఇప్పటికే ‘పాజిటివ్ వైబ్రేషన్స్’ వ్యాప్తి ఇక్కడ వాతావరణంలోకి వచ్చేసింది. అయితే, ఐదేళ్లు పూర్తి కావడంతో మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా లేదా? అనే సందేహం సహజమైనది.

అందుకు ఆ పార్టీ శ్రేణుల సంసిద్ధత ఎటువంటిది? అనే సమీక్ష అనివార్యంగా వస్తుంది.  అయితే, విధాన రూపకల్పనలో ఇందుకోసం పనిచేస్తున్న ‘బ్యూరోక్రసీ’కి పలుదశల్లో అవసరమైన శిక్షణ అందుతూనే ఉంటుంది. మరి ప్రజాప్రతినిధుల మాట ఏమిటి?

ఖంగాళీ తెలిసిందే!  

అస్సలు ఎటువంటి విద్యార్హతలతో ఏ వయస్సులో మన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు? వారిని ఆధునిక పరిపాలనా విధానంలో భాగస్వామ్యుల్ని చేయడానికి జరిగిన ప్రయత్నం ఏమిటి? ఎన్నికల కాలంలో మనకు అవసరమైన వివరాలు ఇవి.

కొన్ని అరకొర ప్రయత్నాలు గతంలో జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో 2011 తర్వాత నాదెండ్ల మనోహర్ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నప్పుడు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఒక ఎంబీఏ చేసిన మేనేజర్ ఉండాలనే ఆలోచన ప్రభుత్వం చేసింది. అప్పట్లో కొద్దిపాటి శిక్షణ తర్వాత, ఎమ్మెల్యేలకు ‘ల్యాప్ ట్యాప్’లు ఇచ్చారు. అయితే, వెనక ఢిల్లీ నుంచి ‘రాష్ట్ర విభజన’ నిర్ణయం ముందుకు నెట్టుకొస్తుంటే, శాసన సభల్లో ఇటువంటి సంస్కరణల ఆలోచనలు అటకెక్కాయి. విభజన తర్వాత జరిగిన ఖంగాళీ తెలిసిందే!

Also read: ‘న్యూట్రల్’ ఓటరు కీలకం కానున్న 2024 ఎన్నికలు  

మన మట్టుకు

మనం తెలంగాణ విడిచి ఇవతలికి వచ్చాము కనుక, ఇప్పుడిక మన మట్టుకు పరిమితమై మాట్లాడుకుందాం. ఇది 200 ఏళ్లపాటు బ్రిటిష్ పరిపాలనలో ఉన్న ప్రాంతం. ఆంగ్ల విద్య పరంపర ప్రభావం ఇక్కడి ప్రజల ఆలోచనల్లో కనిపించడం కొత్తేమీ కాదు.

‘కన్యాశుల్కం’లో 1892 లో గిరీశం వద్ద శిష్యుడు వెంకటేశం ఆంగ్లం నేర్చుకోవడానికి పడరాని పాట్లు పడితే, 1924 నాటికి ‘బారీష్టర్ పార్వతీశం’ తన ఆంగ్లభాష ధాటితో నర్సాపురం నుంచి నిదవోలు మీదుగా చెన్నై చేరి, ఓడ ఎక్కి ఏకంగా ఇంగ్లాండ్ వెళ్లినట్టుగా వెలువడిన కాల్పనికి సాహిత్యం చదువుతూ ఎదిగిన ప్రాంతమిది.

అక్కణ్ణించి మొదలు ఈ రోజున అయితే పార్వతీశమో లేదా పార్వతో మధ్యతరగతి కుటుంబాల్లో ఇంటికొకరు విదేశాల్లో ఉంటున్న రోజుల్లోకి ఈ ప్రాంతం వచ్చేసింది. గడచిన ముప్పై ఏళ్లలో ఆ వేగం మరింత పెరిగింది.

అయితే, రాజకీయాలు అంటే, అది- ‘అప్లైడ్ పొలిటికల్ సైన్స్’ అనే ‘సివిక్ సెన్స్’ స్పృహ లేకుండానే 75 ఏళ్ళు మనం అవలీలగా గడిపేసాం. ఈ మధ్యలో మన రాష్ట్రంలో సామాజిక శాస్త్రాల చదువులు అక్కరలేదని, సమాజం నుంచి కొత్త తరాలకు మధ్య ఉండే బొడ్డుతాడు కోసేసి కూడా ముప్పై ఏళ్ళు అయింది.

పట్టుకోవాలి అంటే

ఫలితం- 2024 జనవరి 26న ‘యూట్యూబ్’ విలేకరి ఒకామె కాకినాడ వీధుల్లో తిరుగుతూ ‘రిపబ్లిక్ డే అంటే ఏమిటి?’ అనే ఒకే ప్రశ్నతో సుమారు 15-30 ఏళ్ళ వయస్సున్న ముప్పై మందిని అడిగితే, కొందరు మౌనం, కొందరు- ‘స్వాతంత్య్ర దినోత్సవం’ అని జవాబు ఇస్తే, ఇద్దరు ముగ్గురు సరైన జవాబు అనుమానంగా ఇచ్చారు. ఒక్కరే ‘కరెక్ట్’గా చెప్పారు. పౌరశాస్త్రం పట్ల మన యువతకు ఉన్న అవగాహన స్థాయి అది. 

పిజి స్థాయి విద్యార్హతలు ఉన్న పిల్లల్లో- ‘ప్రభుత్వంతో పనేంటి?’ అంటే, ఆధార్ కార్డు లేదా పాస్ పోర్టు – వీసా కోసం వెళ్లే ఆఫీసు అనుకునే తరం ఈ రోజున మన మధ్యనే ఉంది. అదే సమయంలో జీవిక కోసం ప్రభుత్వంపై ఆధారపడే సమూహాల సంఖ్య పెరగడం కూడా కనిపిస్తున్నదే. ఈ రెండు భిన్నధోరణుల వైవిధ్యాన్ని ప్రభుత్వాలు పట్టుకోవాలి అంటే, అక్కడ ప్రజాప్రతినిధిగా ‘ఎమ్మెల్యే’ పాత్ర కీలకం అవుతున్నది.

Also read: కొన్నాళ్ళు ‘చిత్రం’ ఇలా అస్పష్టంగానే ఉంటుంది…  

అలాగని నియోజకవర్గం ప్రజలు పబ్లిక్ లో తమ ‘గ్రీవెన్సెస్’ కోసం ‘ఎమ్మెల్యే’ని ‘స్మార్ట్’గా ప్రశ్నించకుండా ఆపడం కూడా ఇప్పుడు ఎవరి చేతుల్లోనూ లేదు. ‘ఎమ్మెల్యే’ ఎలాగోలా వాళ్ళ నుంచి బయటపడి, ఏదో ఒక పద్దతిలో తనకు ‘ప్రయోజనం’ ఉండే పని చేయించు కోవడానికి నాలుగు గోడల మధ్య అధికారుల్ని గదమాయిద్దామంటే, వాళ్ళు తమ ముందున్న కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపించే ‘రూల్స్’ చూపిస్తున్నారు. 

వాడకంలో లేని పదం!

దీనికి పరిష్కారం కోసం జగన్ మోహన్ రెడ్డి- ‘సెంట్రలైజడ్ డీ సెంట్రలైజేషన్’ (నిజానికి ఇది వాడకంలో లేని పదం) పద్దతిని అమలులోకి తెచ్చాడు. ఏమిటది- రోజువారీ అవసరాలకు కావలసిన ‘సర్టిఫికెట్లు’ గ్రామ సచివాలయాల్లో తీసుకోవచ్చు. అవి మండల, జిల్లాస్థాయి వరకు సంబంధిత ఆఫీసులతో ‘లింక్’ అయి ఉంటున్నాయి.

ఇక జిల్లా స్థాయిలో తీసుకునే నిర్ణయాలకు కలెక్టర్లకు అధికారాలు దఖలు పర్చబడ్డాయి. ఏ ఎమ్మెల్యే లేదా మంత్రి జోక్యంతోనో ఏ కలెక్టర్ అయినా తప్పనిసరి పరిస్థితుల్లో జరగాల్సిన ‘ప్రాసెస్’ను కనుక ఆపితే, కేస్ అయితే కోర్టులు- ‘ఐఏఎస్’లను బోను ఎక్కించడం చూస్తున్నదే!

‘సెన్స్’ ఉండే ఏ ‘సీఎం’ అయినా రెండు మూడు ‘టర్మ్స్’ తన ‘పొలిటికల్ కెరియర్’ లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు, వీలైనంత ‘స్మార్ట్’ ఎమ్మెల్యేలు తన ప్రభుత్వంలో ఉంటే బాగుణ్ణు అనుకోవడం సహజం. అయితే, ఇదేమీ ఒక ‘ఇన్స్టిట్యూట్’ పెట్టి అభ్యర్ధుల్ని ముందుగా ‘ట్రెయిన్’ చేసాక, అప్పుడు ఎలక్షన్స్ ఎదుర్కోవడం ద్వారా జరిగేపని కాదు.

హెచ్చరిస్తూ…  

రాజకీయ పార్టీలో సంస్కరణలు అనేవి, నీళ్ళల్లో ఉంటూనే మునగకుండా చాకచక్యంగా మెసళ్ళను తప్పించుకుంటూ ఈత నేర్చుకుంటూ గమ్యం చేరాల్సిన ప్రక్రియ. అందుకే జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఏడాది నుంచి తన ఎమ్మెల్యేలను పనితీరు మార్చుకోమని హెచ్చరిస్తూ వచ్చింది.

Also read: ‘వైఎస్’ పిల్లల రాజకీయాలతో మనకేంటి మేలు?

‘క్వాలిటీ’లో రాజీపడని ‘ప్రొఫెసర్’ తన విద్యార్థి ‘థీసిస్’ విషయంలో తీసుకునే శ్రద్ద వంటిదే, తన పార్టీ విషయంలో జగన్ తీసుకుంటున్న జాగ్రత్త కూడా. అధికారంలో ఉన్నప్పుడు, ‘బ్యూరోక్రసీ’తో గరిష్ట స్థాయిలో పనిచేయించుకుని- ‘పొలిటికల్ మైలేజి’ తీసుకోవాలనే ఏ నాయకుడు అయినా ఆశిస్తారు. అందుకే జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు గెలుపు గుర్రాల కోసం జల్లెడ పడుతున్నాడు. 

దాంతో- ఇంటిపేరు, కుటుంబ నేపధ్యం, స్థానిక పరపతి, సీనియారిటీ, కొలమానాలు అనే పాత లెక్కలు వేసుకుంటున్నవారు కొత్త కొలతల్లో ఇమడక ఎంపిక జాబితాల్లో- ‘డిలీట్’ అవుతున్నారు. జగన్ ‘హై బ్రీడ్’ రాజకీయాలు అర్ధం కానివారు, ఇది కాకపోతే మరో పార్టీ అనుకుంటున్నారు. స్థానిక కారణాలతో రేపు వాళ్ళు అక్కడ గెలిచినా గెలవొచ్చు.

ఆమె చెప్పింది…

నా పార్టీలో పాత ‘వెర్షన్’ సరుకు వద్దనుకుని వాళ్ళను ‘సీఎం’ వదిలించు కుంటున్నాడు. అవసరమైన చోట విభిన్న సామాజిక శ్రేణులకు మౌన సందేశం పంపడం కోసం ‘పెద్ద తలకాయలు’ అనుకున్నవారిని కూడా మార్చి, వర్ధమాన వర్గాల నుంచి కొత్తవారిని పంపుతున్నాడు.

కలెక్టర్ గా ‘పోస్ట్’ చేయడానికి, ‘ఐఏఎస్’ చాలు ఏ జిల్లా అయితే ఏమిటి? అనే తరహాలో నా ‘లీడర్’ కనుక ‘స్మార్ట్’ అయితే, గెలవడానికి ఏ నియోజకవర్గం అయితే ఏమి? అనే తరహాలో ఇప్పుడు ఆయన ధోరణి ఉంది. ఆ విషయంలో జగన్ మోహన్ రెడ్డి ఎక్కడా రాజీపడడం లేదు.

సంగివలస సందేశం

‘నెక్స్ట్ జెనరేషన్’ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయో తెలియక, వెళ్లగ్రక్కిన ఆక్రోశాన్ని ఇటీవల ‘సోషల్ మీడియా’ ద్వారా రేణుకా చౌదరి గొంతు నుంచి ఇప్పటికే విన్నాం-“ఎవుడన్నా రానీ, ఈడు మాత్రం పోవాలి అనే ఫీలింగ్ వచ్చింది…” అంటూ ఏకవాక్య వ్యాఖ్యతో ఆమె జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అతి గొప్ప కితాబు ఇచ్చారు.

రిపబ్లిక్ డే మర్నాడు సాయంత్రం భీమునిపట్నం వద్ద జరిగిన ఎన్నికల సభలో జగన్- “రాబోయేవి ఎమ్మెల్యేలను, ఎంపిలను ఎన్నుకునే ఎలక్షన్స్ కాదు… ఇవి- ఇప్పుడు జరుగుతున్న సంక్షేమ పాలన కొనసాగాలా వద్దా? అని నిర్ణయించుకోవలసిన ఎన్నికలు” అంటూ ఎవరు రావాలో మీదే నిర్ణయం అంటూ ఆయన మనకే వదిలేశారు.

‘సీటు ఇవ్వలేను అన్నా…’ అని జగన్ అంటే, వలస ఎటు? అని సందిగ్ధంలో ఉన్నవారికి, సంగివలస సభ కర్తవ్యం చెప్పింది.

Also read: ఢిల్లీకి ఇక్కడ ఐదేళ్ళలో అమిరిన ‘సెట్టింగ్’ ఇది…

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles