Monday, November 28, 2022

గోదమ్మ పాదాలకు బాపు పారాణి

బాపురే బాపు రేఖావ్యాఖ్య

ఆయన అసలు పేరు సత్తిరాజు వేంకట లక్ష్మీనారాయణ. కాని కొద్ది మందికి మాత్రమే తెలుసు. అదే బాపు అని పిలవండి, మొత్తం తెలుగురాష్ట్రాల్లో తెలియని వాడు ఉండడు. ఆయన ఒక అరుదైన అద్భుతం. ఆయన కుంచె కదిలితే చాలు, దేవతలు దిగివస్తారు. బ్రహ్మ సృష్టించిన జీవుల్లో మానవులు ఇంత అందంగా ఉంటారా అన్నట్టు బాపు బొమ్మలు కనిపిస్తాయి. అందమైన అమ్మాయిలను వర్ణించడానికి బ్రహ్మ కూడా ‘బాపు బొమ్మ’ లను సృష్టించాడంటారు.

తిరుప్పావై పాశురాల పారాయణం నీళాతుంగ స్తనగిరి… శ్లోకాలతో మొదలవుతుంది.

నీళా తుంగ స్తనగిరి తటీ సుప్తముద్భోధ్య కృష్ణం

పారార్థ్యం స్వం శృతిశతశిర స్సిద్ధ మధ్యాపయంతీ

స్వోచ్చిష్టాయాం స్రజినిగళితం యాబలాత్ కృత్య భుంక్తే

గోదా తస్త్యె నమ యిదమిదం భూయ ఏవాస్తు భూయః

తన ప్రేయసి నీళాదేవి స్తన ద్వయ శిఖరోన్నతముల తీరాన శయనించిన శ్రీకృష్ణుడిని మేల్కొలిపి, వేదాల వివరించిన సూత్రమైన పారతంత్రమును విన్నవించి, తాను ధరించి వదిలిన మాలలచేత బంధించి, ఆ పరంధాముని బలవంతంగా అనుభవించిన గోదాదేవికి నమస్కరిస్తున్నాను ఈ శ్లోకం అర్థం.  పక్కన బాపు ఈ సందర్భాన్ని చిత్రించిన మనోహర దృశ్యం చూస్తే ఈ కఠినమైన శ్లోకం సులువుగా అర్థమైపోతుంది. ఇక్కడ నీళాదేవి తన వాలుజడతో శ్రీ కృష్ణమూర్తిని ఏ విధంగా బంధించిందో చూడండి. చిత్రం అప్పటి విషయమే కాక అంతకుముందు జరిగిన ఉదంతాన్ని కూడా వివరిస్తుందనడానికి ఉదాహరణ కాలిదగ్గరపడిపోయిన విసన కర్ర. అందాకా విసురుకుని అలసిపోయి ఇద్దరూ నిద్రలోకి ఒరిగారని కళాకారుడు చెబుతున్నాడు. నీళాకృష్ణులిరువురి ముఖాల్లో ఆనందాన్ని ప్రశాంతతను చూడవచ్చు. బాపు కుంచె పాటలు పాడుతుంది. బొమ్మ చూసే వారితో మాట్లాడుతుంది. బాపు చెప్పదలచుకున్న మాటలను చిలక పలుకుల వలె పలుకుతుంది ఈ బొమ్మ. దీనికి ప్రాణం లేదనగలమా?

తిరుప్పావైలో వివరించిన కొన్ని అంశాలు బాపు బొమ్మల్లో నాకు విపులంగా అర్థమైనాయి. మరే ఇతర వ్యాఖ్యానాలు సొబగులు అవసరం లేకుండా 30 బాపు బొమ్మలు చాలు తిరుప్పావై మీద విశిష్టమైన వివరణగా మిగిలిపోతాయి. బాపు కళారేఖావ్యాఖ్యానం లేకుండా తిరుప్పావై అసంపూర్ణం. తిరుప్పావై మాత్రమే కాదు, రామాయణ మహాభారత భాగవతాలుకూడా అసంపూర్ణం అని నా ప్రగాఢ నమ్మకం.

వాల్ట్ డిస్నీ వలె బాపు యూనివర్సిటీని ఎవరైన స్థాపించి, బాపుశైలి కార్టూన్ లతో రకరకాల కథలు శృంఖలాలు చిత్రిస్తే ఎంత బాగుండును అనిపిస్తుంది. బాపు ఒక సకల కళా విశ్వవిద్యాలయం. తన చిత్రాన్ని తానే చిత్రించిన ఈ బాపు చిత్రంలో బాపు తన ఆలోచనాలోచనాలు ఎంత నిశితంగా  దీపింపజేసారో చూడండి. కేవలం నాలుగైదు గీతల్లో తన ముఖ చిత్రాన్ని తానే వేసుకోవడం ఒక అద్భుతం. బాపు చిత్ర వైభవ తిరుప్పావై కథా కథనానికి మూలపురుషులు యశోదాకృష్ణులు. అది కూడా ఎంత బాగా మనకు సాక్షాత్కరింపజేశారో తిలకించండి.

ముఫ్పయి పద్యాలు రచించి, ఏదీ తప్పకుండా పాడి, అందులో వ్యక్తం చేసిన భావాలను సంభావించి అనుభవించి, అనుసరించి, మార్గశీర్షస్నానవ్రతం ఆచరించి, రంగనాథుని రూపాన ఉన్న కృష్ణునే ధ్యానించి, పూమాలలు పా(శురాల)మాలలు ఇచ్చి ఫలితంగా శ్రీరంగనాథుడే తనకు పల్లకీ పంపే భాగ్యాన్ని పొంది, ఆయనలోనేలీనమైన గోదాదేవి భోగించిన రోజు చివరి రోజు. అదే భోగి. కలియుగంలో విల్లిపుత్తూరును వ్రేపల్లెగా మలచి, పక్కన వాగే యమున అనుకున్న గోద సాధించింది. ఆమె సఖులే గోపికలై వ్రతం పాటించి సంసారపాపకూపాలనుంచి బయటపడి కొండంత బలం ఉన్న నాలుగు భుజాల వాడు హరి అండదండలే అందుకున్నారు. ఆతనే హరి, ఆతనే రంగడు, పైనున్న ఆదిశేషుడు గుర్తు. ఆమెనే విష్ణుపత్ని ఆమెనే గోద. చిలుక గుర్తు. చేత వరమాల. అగ్నిహోత్రం, పూలూ పండ్లూ. పసుపు పట్టు వస్త్రాలు. గోద వధువు. చిన్న చిత్రంలో బాపు మనకు గోదారంగనాథుల కల్యాణ దృశ్యాన్ని ఆవిష్కరించారు.

ఉపనిషద్ వేద సారాంశమై అత్యంతగహనమైన తిరుప్పావై అంతరార్థాన్ని అర్థం చేసుకోవడమే కష్టం. దానికి తగిన దృశ్యాన్ని ఎంచుకోవడం మరొక కష్టం. ఆ ఎంచుకున్న కథావస్తువును తెలియజేసే కథను, కథనాన్ని కదలని బొమ్మలో కనిపించి మనను కదిలింపజేయడం ఇంకా కష్టం. కాని బాపుగారికి ఏ కష్టమూ లేదు. ఆయన భావనా బలాన్ని తెలిపే రంగులను రేఖలను మనకు ఇచ్చిన మహాకళాకారుడు బాపు. పారాణి అద్దిన పాదాలతో వివాహ వైభవాన్ని చూపగలదు బాపు కుంచె. తిరుప్పావై కథానాయకుడు శ్రీకృష్ణుడు బాపు బొమ్మల ద్వారా గోదాగీత గోవిందాన్ని మనకు అందించారు. బాపు ధన్యుడు. బాపు బొమ్మలద్వారా తిరుప్పావైని అనుసంధానించే భాగ్యం కలిగిన మనం ధన్యులం. కింద ఇచ్చిన చిత్రం రామకృష్ణులిద్దరినీ కలిపి చూపే బాపు అద్భుత చిత్రం. ఫలశృతి: బాపు బొమ్మల తిరుప్పావై చూచిన గోపబాలుడు మన పాపాలు బాపు.

Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles