Saturday, April 27, 2024

పరమాత్ముడితో పరమాన్నమే పరమానందం

  • గోదా గోవింద గీతం -27

నేపథ్యం

శ్రీ కృష్ణునితో సామీప్యం, స్నేహం, సాహచర్యం మాత్రమే గోపికలు కోరుకుంటున్నారు. నీరాట్టము లేదా మార్గళి స్నానం అంటే శ్రీకృష్ణసంశ్లేషమే తప్ప మరొకటి కాదు. శంఖం అంటే జ్ఞానం, పర అంటే పారతంత్ర్యము, పల్లాణ్డు పాడేవారు, భాగవత సహవాసం, విళక్కకు అంటే లక్ష్మీదేవి పురుషకారభూతురాలిని ఆశ్రయించడం, కొడియే అంటే గరుడుడు లేదా భగవత్సేవ, వితానమే అంటే అనంతుడు అంటే అన్నీ భగవంతుడికోసమే అనే భావన.గోపికలు నిన్నటి పాశురంలో అడిగిన వస్తువులు భౌతికమైనవి కావు. సామాన్యమైనవి కావు. సాక్షాత్తూ వాసుదేవుడు ధరించే శంఖం అంటే శంఖ చక్రధరుడైన వాసుదేవునే వారు కోరుతున్నారని అర్థమైంది. లేదా శంఖంతో పాటు, గరుడ ధ్వజం,పారతంత్ర్యమనే పఱై కోరుతూ మంగళాశాసనాలు చేసేవారు, మహాలక్ష్మి వంటి మంగళదీపాన్ని కావాలంటున్నారు. చాందినీ, ఆసనం, పడక అని రకరకాలుగా అమరే ఆదిశేషుని కోరుకుంటున్నారు. ఇవి సామాన్యులకు అమరేవికావు. అమరులకు కూడా దొరకవు. అంటే అవన్నీ నిరంతరం కలిగి ఉండే వాసుదేవుడే వారికి కావాలని అర్థం. వాసుదేవుడే దుర్లభుడు. వారి అంతరంగం తననే కోరుకుంటున్నదని వాసుదేవుడు గమనించాడు. నా ఆయుధాలు, భాగవతోత్తములు, లక్ష్మీదేవి, అనంత గరుడాది నిత్యసూరులు నా సర్వస్వము తీసుకుని నన్ను జయించాలనుకుంటున్నరా అని విష్ణువు అడిగారట. మిమ్మల్ని జయించడం మా ఉద్దేశ్యం కాదు, అది మాకు సాధ్యం కాదు, అందరినీ జయించే స్వభావం నీదే అని విన్నవించుకున్నారట.  సరే మీ వ్రతఫలమేమని మీరు అనుకుంటున్నారు అని ఈ పాశురంలో వాసుదేవుడు సూచించడం, వారు వివరించడం తరువాతి పాశురాలలో జరుగుతుంది.

కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా, ఉన్ఱనై

ప్పాడి పఱైకొండు యామ్ పెరుసమ్మానమ్

నాడు పుగళుం పరిశినాళ్ నన్ఱాక

శూడగమే తోళ్ వళైయే తోడే శెవి పువ్వే

పాడగమే యెన్ఱనైయ పల్కలనుమ్ యామణివోమ్

ఆడైయుడుప్పోం అదన్ పిన్నే పాల్ శోఱు

మూడనెయ్ పెయ్దు ముళగైవళివార

కూడి ఇరుందు కుళిరుంద్-ఏలోర్ ఎంబావాయ్

కూడారై = తనను కూడని వారిని సైతం, వెల్లుమ్= జయించే: శీర్= కళ్యాణగుణసమన్వితుడైన: గోవిందా = గోవింద నామధేయుడా, ఉన్ఱనై= నిన్ను, ప్పాడి = కీర్తించి, పఱైకొండు =పర అనే వాయిద్యాన్ని కోరి, యామ్= మేము,  పెరు=  పెద్ద లేదా పొందెడి, శమ్మానమ్=సన్మానమును, నాడు=లోకమంతయు, పుగళం పరిశినాళ్ = మెచ్చుకునే రీతిలో, నన్ఱాక శూడగమే= చేతికి ఆభరణాలు, తోళ్ వళైయే= భుజకీర్తులు, తోడే= కర్ణాభరణాలైన దుద్దులు, శెవి ప్పూవే= చెవికి ధరించే పూవులు, పాడకమే = పాదాభారణాలు, యెన్ఱనైయ = అని పిలువ బడే, పల్కలనుమ్=అనేక రకాల ఆభరణాలను, యామ్ = మేము, అణివోమ్= ధరింతుముగాక, ఆడై= వస్త్రములను, ఉడుప్పోం = ధరింతుముగాక, అదన్ పిన్నే= దాని తరువాత, పాల్ శోఱు= పాలతోచేసిన అన్నము, పరమాన్నము, మూడ =నెయ్ పెయ్దు = నేయి పోసి, ముళంగై = మోచేతినుండి, వళివార=కారునట్లుగా, కూడి ఇరుందు= నీతో కలిసియుండి, కుళిరుంద= ఆరగించడమే-ఏలోర్ ఎంబావాయ్= మావ్రతము.

Also Read : జ్ఞానమనే ఆరని దీపం అమ్మనే వ్రతఫలంగా ఇచ్చిన శ్రీకృష్ణుడు

బొమ్మకంటి శ్రీనివాసాచార్యుల వారి తెలుగు సిరినోము పద్యం

ఒల్లని వారల ఉల్లమైన జయించు

        గుణనిధీ: గోవింద: కొనుచు ‘డక్కి’

నీ నుండి, నీ కీర్తి గానము చేసి మే

        మాసించు సమ్మాన మవధరింపు:

వాడ వాడలు కొనియాడ కంకణములు:

        దండ కడియములు, కుండలములు,

చెవిపూలు, అందెలు – వివిధ భూషల మేన

        కై సైసి కొందుము: కట్టుకొందు

మమలిన వస్త్రాల: ఆ పైన నేయి కా

        ల్వలు గట్టు తీయని పాయసమ్ము

కార మోచేతి దాకను ఆరగింతుము

        నినుగూడి సుఖియుంత మనవరతము.

కలిసి రాని శత్రువులను జయించడమనే కళ్యాణగుణ సంపద గల గోవిందుడా నిను కీర్తించి, ఈ తిరుప్పావై వ్రత సాధనమైన పఱై అనే వాయిద్యమును పొందిన, పొందదలిచిన, ఘనసన్మానము లోకులంతా మెచ్చుకునేట్టు ఉంటుంది. చేతులకు గాజులు, భుజాలకు కడియాలు, చెవికింద దుద్దులు, పైన చెవిపూలు, కాలికి అందెలు, వంటి అనేకాభరణాలు ధరించాలి. పిదప మంచి చీరలు కట్టుకోవాలి. తరువాత పాలు అన్నము మునిగేట్టు నేయి పోయాలి. ఆ తీపి పరమాన్నాన్ని మోచేతి వెంట కారునట్టుగా దోసిట్లో పోసుకుని జుర్రుకోవాలి అదీ నీతో కూచుని హాయిగా భుజించాలి, ఇదే మా వ్రతఫలం గోవిందా అంటున్నది గోదమ్మ.

భగవంతుని అందడం, ఆయన కళ్యాణ గుణాలను అనుభవించడమే వ్రత ఫలం. పరమాన్నాన్ని పరమాత్ముడితో కలిసి అనుభవించడమే పరమానందం. పరమానందమే మోక్షం. అదే కూడారై.

Also Read : దేవకి, యశోద ‌- దివ్యమైన నారాయణ మంత్రాలు

కూడని వారు మూడురకాలు. అభిముఖులు, విముఖులు, ఉదాసీనులు. స్వామి వారిని చేరే అర్హత నాకు లేదు అనుకుని చేరని వారు అభిముఖులు. ‘నావంటి అధముడు, తప్పులు చేసిన వాడు, అపవిత్రుడు నీ పరిజనంలో ఉండాలని కోరుకోవడం అందుకు నేను తగిన వాడనా’ అని యామునాచార్యులు ప్రార్థించారట. తమ తక్కువతనము చూపి భగవంతుని స్పర్శలేనిదే బతకలేమని చెప్పి దివ్యమంగళ విగ్రహ సౌందర్యారాధన చేయాలి. తనపై అలిగిన ప్రేయసులను, గోపికలను, తాత్కాలికంగా విముఖులైన వారిని కూడా దారికి తెచ్చుకుంటాడు కృష్ణుడు. విముఖులు అంటే స్వామి పట్ల ద్వేషము కల వారు. వారిని పరాక్రమంతో జయిస్తాడు. ఇక మూడో రకం వారు ఉదాసీనులు. ఆసక్తి ఉండని వారు. ఉదాసీనంగా విముఖులైన వారిని కూడా అనుసరించి తన సౌందర్యముచేత ఆకర్షిస్తాడు. నీతో ఉండతగమని విముఖులయ్యే వారు, ప్రణయకోపంచేత విముఖులయ్యే వారు అలిగే వారు, స్నేహమూలేక ద్వేషమూ లేక విముఖులయ్యేవారు, ద్వేషము చేత విముఖులయ్యే వారు అందరినీ ఏదో మార్గం ద్వారా జయిస్తాడు. ఇది కూడని వారి సంగతి. కూడిన వారిచేత ఆయనే జయింపబడుతాడట. కూడిన వారి చేతిలో ఓడిపోవడానికి సిద్ధంగా ఉండడం విష్ణువు గొప్పతనం.విజితాత్మ అంటే భక్తులచేత జయింపబడిన మనస్సు కలవాడు. విధేయాత్మ అంటే భక్తులకు విధేయంగా ఉండేవాడు. ఈ రెండు విష్ణుసహస్రనామాల్లోనివి.  గుణములచేత భక్తులను జయించి ఆ తరువాత వారికి విధేయుడవుతాడు. కూడిన వారిని సౌశీల్యముతో, కూడని వారిని శౌర్యముతో జయిస్తాడు. ఇవన్నీగోదా గోవింద గీతలే అయినా మొదటిసారి గోవింద నామం 27వ పాశురంలో ప్రయోగించారు. సహస్రంలో 189, 543 నామం గోవిందుడు.  గోవు అంటే భూమి అని కూడా అర్థం. గోవును అపహరించిన హిరణ్యాక్షుడిని వరాహావతారంతో సంహరించి భూమిని కాచిన వాడు. గోవులనుఆనందింపచేసిన వాడు. గో అంటే ఆవులు భూమి, విందుడు అంటే కనిపెట్టిన వాడు. ఇంద్రుడు విసిరిన రాళ్లవర్షాన్ని పెద్ద రాయి వంటి గోవర్ధన గిరినెత్తి సారూప్య చికిత్స చేసినాడు. యుద్ధం చేయలేదు. కనుక ఇంద్రుడు శ్రీ కృష్ణునికి గోవింద పట్టాభిషేకం చేశాడట.

గోపికలను ఏంకావాలని ఆయన అడుగుతాడు. అప్పడికే వారు శ్రీకృష్ణుని పరివారానికి చెందిన మహాలక్ష్మిని కోరారు, అనంత గరుడులను, ఆళ్వార్లను, శంఖమును తమవైపు తిప్పుకున్నారట. ‘‘మావారిని మీవారిగా చేసుకుని మమ్ములను ఓడించారు. మిమ్ము నేనొడిస్తాను’’. అన్నాడట గోవిందుడు. ‘‘మీతో కూడము అన్నవారిని మీరు ఓడించాలి గాని కూడేందుకు వస్తున్న మాకు వశులు కావాలి కదా గోవిందా’’ అన్నారు వారు. ‘‘మా స్త్రీత్వాభిమానాన్ని భంగం చేసి రప్పించుకుని నీవారిగా చేసుకున్న గోవిందా’’ అని సంబోధిస్తున్నారట గోపికలు.

Also Read : జ్ఞానదశనుంచి ప్రేమాతిశయంతో భక్తి దశలోకి….

‘నిను కీర్తించి పఱై అనే వాయిద్యాన్ని పొందారు. భగవంతుడితో కలిసి భగవన్నామాన్ని కీర్తించడమే వారి లక్ష్యం. నారాయణనే నమక్కే = నారాయణుడే మనకే ఫలము ఇస్తాడని మేం నమ్ముతున్నాము. మాకు సన్మానము కావాలి. దశరథుడు సుమంత్రుడి ద్వారా రమ్మని ఆదేశిస్తే సీత ద్వారందాకా వచ్చి మంగళాశాసనం పాడితే, రాముడు తనమెడలో మాల తీసి ఆమె పాదాలను పట్టి ఆపి ఇక ఆగు అని ఆపినాడట. అదే సన్మానము తమకూ కావాలని గోపికలు అడుగుతున్నారు. ప్రేయసి అయిన ప్రణయిని పాదములను పట్టడం ప్రియునికి తప్పు కాదు. అది ప్రేమకు చిహ్నం. అటువంటి ప్రేమ కావాలంటున్నారు.

లోకులు మెచ్చే సన్మానం కావాలట. శ్రీకృష్ణ సహవాసాన్ని సమాగమాన్ని మించిన సన్మానమేముంటుంది. కలిసి ఉండడానికే మంచి బట్టలు కట్టుకోవడం, మంచి నగలు పెట్టుకోవడం, కలిసి భోజనం చేయడం కావాలని గోపికలు కోరుకుంటున్నారు. కూచుని ఒకరినొకరుతాకుతూ భోజనం చేయడం ఎంత ఆనందంగా ఉంటుంది?

గోపికలు నిజంగాకోరుకున్నవేమిటి? అంతరార్థాలు పరిశీలిస్తే, చేతి ఆభరణమంటే సమాశ్రయణానికి ముందు ఆచార్యులు కట్టుకున్నముంజేతి కంకణం. భుజాభరణాలంటే భుజాలపైన శంఖ చక్రముద్రలు. చెవిదుద్దులంటే ఎనిమిది రాళ్ల మండలాకార స్వర్ణాభరణము అంటే అష్టాక్షరీ మంత్రము. రెండు చెవిపూలంటే ద్వయమంత్రము, పాదాభరణము అంటే నాలుగు చరణాల ద్వయమంత్రము. అంటే తిరుమంత్రము (ఆత్మజ్ఞానము), ద్వయం (భక్తి), చరమశ్లోకము (వైరాగ్యము) లను ఈ పాశురంలో అనుసంధానం చేస్తున్నారు. శరీరాలంకారానికి వస్త్రం ఎంత ముఖ్యమో ఆత్మాలంకారముగా శేషత్వము అంతే. పాలన్నము అంటే భోగ్యము కైంకర్యము. నేయి పారతంత్ర్యము. కైంకర్యము మునిగేంత పారతంత్ర్యము ఉండాలి. పాలు అంటే భగవంతుని కల్యాణగుణాలు, అన్నము అంటే ఆ భగవత్ తత్త్వము. నేయి అంటే భగవంతుని ఎడబాటు క్షణమైనా సహించలేని స్నేహము. ఆ ప్రీతి పొంగి చేతులనుంచి కారిపోవడం అంటే చేయు కర్మ. అంటే కర్మలుచేయడం ద్వారా భగవంతుని పట్ల మనకున్న ప్రేమను చూపడం. కలిసి భుజించడమే భాగవత గోష్టి.

దీనికి మరొక అర్థం. హస్తాభరణం= అంజలి, భుజకీర్తులు=ఫలాన్ని విడవడం, కర్మనేనే చేశాననే బుద్ధి మరవడం, కర్ణాభరణం= భాగవత ప్రసంగాలు వినడం, చెవిపూలు= ద్వయమంత్రము, పాదాభరణము= భగవత్ భాగవత ఆచార్యసన్నిధికి నడిచి వెళ్లడమే. జిహ్వకు కీర్తన, మనసుకు ధ్యానం, చేతులకు= అర్చన, నేత్రములకు చూచుట, ముక్కునకుతులసీధామాన్ని ఆఘ్రాణించడం. గోపికలకు భోజనం అంటే బ్రహ్మానుభవమే అని ఈ పాశురం ద్వారా గోదాదేవి తెలియజేస్తున్నారు. ఇది గోదా గోవింద కీర్తన.

పెద్దలు చెప్పిన మరొక అంతరార్థం ఇది

పరమాన్నం అంటే? ఈ బియ్యపు కణాలే జీవుడు, దానికి ఉండే పొట్టే శరీరం. జీవుల్ని పండించాలి అని ప్రకృతి అనే క్షేత్రంలో నాటితే మనకీ శరీరం లభించింది. ధాన్యానికి పైన ఎరుపు రంగులో ఉండే పొర మన అనురాగానికి గుర్తు. ధాన్యాన్ని దంపి పైన ఉండే పొట్టుని తీసివేసినట్లే ఈ జీవుడు శరీరంతో సాగించే యాత్రలో సుఖాలు దుఃఖాలు, కామాలు, క్రోధాలు, లాభాలు, అలాభాలు, జయాలు, అపజయాలు, ఐశ్వర్యాలు, అనైశ్వర్యాలు, జ్ఞానం, అజ్ఞానం ఇవన్నీ దంపి మనల్ని పొట్టు వీడేట్టు చేస్తాయి. ఇక అక్కడి నుండి వీడి యాత్ర సాగుతుంది. ఇక ధాన్యాన్ని కడిగి వేయించి ఉడికించినట్లే, జీవుడు ఆచరించిన శరణాగతి ఫలితంగా ముక్తి ఇలా లభిస్తుందని ఉపనిషత్తులు తెలుపుతాయి.

Also Read : వేదగుహలలో ప్రకాశించే పరమాత్ముడే శ్రీకృష్ణ సింహము

బియ్యాన్ని నేతిలో వేయించినట్లే అక్కడ స్నేహంతో వేయిస్తారు. భగవంతుడి కళ్యాణగుణాలు పాలవంటివి, స్వచ్చమైనవి. పాలు పశువుల నుండి వస్తాయి, ఉపనిషత్తులని పశువులని అనుకుంటే ఈ కళ్యాణగుణాలనే పాలలో జీవుడు ఉడకాలి. భగవంతుని సేవచేయాలనే రుచి వీడికుండాలి, తన కళ్యాణగుణాలను ఇవ్వాలనే రుచి ఆయనకుండాలి. ఈ రుచి అనేది అంతటా కల్సి ఉండాలి, పరమాన్నంలో వ్యాపించిన తియ్యదనం వలె. ఇందులో జీవుడూ భగవంతుడూ కలిసి ఉన్నారా లేదా అన్నట్లుగా కలిసి ఉంటారు. పరమపదాన్ని పోలిన ఈ పాయసమే పరమాన్నం. పరమాన్నం దీనికి ప్రతీక. ఆ పరమాన్నాన్ని ఆండాళ్ గోపికలు ఈ పాశురంలో కోరుతున్నట్టు వర్ణించారు.

జీవుడు భగవంతుణ్ణి చేరటానికి లభించిన వస్త్రమే శరీరం, ఇది పాంచభౌతిక శరీరం, పరమపదానికి వెళ్ళే ముందు, విరజానదిలో సూక్ష్మ శరీరం తొలగి పంచ ఉపషణ్మయ దివ్య విగ్రహం లభిస్తుంది. “అదన్ పిన్నే” వేరే శరీరం లభించిన తరువాత ఇక మాకు కావల్సింది “పాల్ శోఱు మూడనెయ్ పెయ్దు మురంగైవరివార” పరమాన్నం, అదే పరమ పదం. “కూడి ఇరుందు” అందరు కలిసి గోష్టిగా తినడానికి, “కుళిరుంద్” ఈ కలయికతో మన ఈ సంసార తాపం అంతా తొలగాలన్నది ఈ పాశుర పరమార్థం.

Also Read : చల్లని తమ్మిరేకుల సారసపు కన్నులు మెల్లమెల్లనే విచ్చి మేలుకోనవేలయ్యా?

ఈ పాశురాన్ని రామానుజ పరంగా అన్వయించారు. కూడారై వెల్లుమ్ అంటే విరోధులను ఓడించడం, రామానుజుడు వైష్ణవేతర వాదనలను ఖండించి తిరుమల వైష్ణవ క్షేత్రం అని నిరూపించి శ్రీనివాసునికి తోళ్ వళియే శంఖ చక్రాలను ప్రదానం చేసారు. కూడని వారిని జయించడం అంటే కూడని యాదవ ప్రకాశులను జయించడం. ఈ పాశురంలో ప్రస్తావించిన పాయసం, ఆండాళ్ సుందరబాహుస్వామికి నూరుగంగాళాల పాయసాన్ని ఇస్తానని మొక్కుకుని, శ్రీరంగనిలో కలిసి పోవడం వల్ల మొక్కు తీర్చుకోలేకపోయారు. అది తెలిసిన రామానుజుడు  మొక్కు తీర్చి గోదమ్మకు అన్న గా సన్మానం పొందారు. ఆండాళ్ పొందిన ఫలితం భాగవతోత్తములు పొందాలని అర్చకులు పాయసం ఆరగింపు చేస్తారు.

జ్ఞాన వైరాగ్యాలను తిరుమంత్రము, ద్వయమంత్రము చరమ మంత్రము అనే మూడు మార్గాల ద్వారా బోధిస్తారు. తిరుమంత్రము ఆత్మస్వరూపాన్ని తెలియజేస్తే, ద్వయము కైంకర్యమునకు ముందు వాడే భక్తి ప్రధానమైంది. చరమం ద్వారా వైరాగ్యాన్ని బోధిస్తున్నారు గోదమ్మ ఈ పాశురాలద్వారా.

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles