Thursday, June 13, 2024

సోషల్ మీడియాలో బల్దియా రచ్చ

  • సామాజిక మాధ్యమాలపై అభ్యర్థుల ఆశలు
  • ప్రచారానికి తీవ్ర అడ్డంకిగా మారిన కరోనా
  • ప్రచారానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకున్న అభ్యర్థులు

జీహెచ్ఎంసీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక అభ్యర్థులు ప్రచారంలో మునిగిపోయారు. తమ తమ డివిజన్లలో ప్రచారం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే కరోనా నేపథ్యంలో ప్రచార ఆర్భాటం అంతా ఎక్కువగా సామాజిక మాధ్యమాల్లోనే కనిపిస్తోంది. ప్రత్యర్థుల పంచ్ లు, కార్టూన్లు, సెటైర్ లు, స్ఫూప్ వీడియోలు సర్వేలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అంతేకాదు వాట్పప్, ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి వేదికలపై విమర్శలతో తమ ప్రత్యర్థులను చీల్చి చెండాడుతున్నారు.

సోషల్ మీడియాలో ప్రచారం కోసం కన్సల్టెన్సీలు

అభ్యర్థులు ప్రత్యేకంగా వాట్సప్ గ్రూప్ లను క్రియేట్ చేసి ప్రచారం కల్పిస్తున్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ప్రతిపక్ష అభ్యర్థులు ఎండగడుతున్నారు. ప్రతిపక్ష అభ్యర్థులు తాము అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో హామీలను గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో అభ్యర్థుల తరపున పనిచేసేందుకు పలు కన్సల్టెన్సీలు ముందుకు వస్తున్నాయి. వారి అవసరాలకు తగ్గట్లుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. చిన్న కన్సల్టెన్సీలు ఒకరిద్దరు అభ్యర్థులకు  సేవలందిస్తున్నాయి. పెద్ద సంస్థలు అయితే పలు పార్టీలకు చెందిన అభ్యర్థులకు ఒకే సారి సేవలను అందిస్తున్నాయి. ఒకే కన్సల్టెన్సీ సంస్థ అధికార, ప్రతిపక్ష సభ్యులకు సేవలను అందిస్తుండటం విశేషం.

పెరిగిన డేటా వినియోగం

గత కొద్ది సంవత్సరాలుగా మొబైల్ ఫోన్ల వాడకం బాగా పెరిగింది. దీనికి తోడు డేటా కూడా చౌకగా లభిస్తుండటంతో సోషల్ మీడియా అందరికి చేరువయింది. మొబైల్ ఇంటర్నెట్ వాడకం రాను రాను పెరగడంతో సోషల్ మీడియాలో గడిపే సమయం కూడా బాగా పెరుగుతోంది. దీంతో పార్టీలకు సామాజిక మాధ్యమాల గురించి ప్రత్యేక వింగ్ లను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. శర వేగంగా అభివృద్ధి చెందుతున్న సామాజిక మాధ్యమాలు ఎన్నికల సమయంలో యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తున్నాయి.

ఒక్కో పార్టీకి ఒక్కో సెల్

ప్రస్తుతం ఒక్కో పార్టీ ఒక్కో సోషల్ మీడియా సెల్ ను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ విభాగం తమ పార్టీ  మేనిఫెస్టోలోని అంశాలు, ఆ పార్టీ నేతలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, వారి వాగ్ధానాలు, సంక్షేమ కార్యక్రమాలు లాంటి పలు అంశాలపై పోస్టర్లు, అందరికీ అర్థమయ్యేలా ఆసక్తికరమైన పోస్టులను వండి వార్చి వారి వారి సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసి విపరీతమైన ప్రచారం కల్పిస్తాయి. పార్టీల సోషల్ మీడియా ఖాతాలను వ్యక్తులు కాకుండా హార్డ్ కోర్ ఫాన్స్ నిర్వహించే గ్రూప్ లు ఉంటాయి. సోషల్ మీడియా ప్రచార వ్యూహంలో ఆయా పార్టీల సానుభూతిపరులు, అభిమానులు తమకు ఇష్టమైన వారి సమాచారాన్న ఇతర గ్రూప్ లలో షేర్ చేస్తుంటారు.

కంటెంట్ పై పార్టీలదే తుది నిర్ణయం

సోషల్ మీడియా వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ లలో ఏది పోస్ట్ చేయాలి అనే అంశాలను నిశితంగా పరిశీలించి ఎంపిక చేస్తారు. సోషల్ మీడియా సెల్ అధికారికంగా పార్టీకి సంబంధించిన సమాచారాన్ని, ప్రచార వివరాలను తయారు చేస్తుంది. పార్టీ గురించి కార్యకర్తలతో మాట్లాడించి వారి వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. అలాగే ప్రతిపక్ష నేతల పాత ప్రసంగాలు వాటిలో దొర్లిన తప్పులను ఎత్తి చూపుతూ ప్రత్యర్థులను తక్కువ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తారు.  

కొవిడ్ నేపథ్యంలో ప్రచారం

ఎన్నికలంటే అభ్యర్థులు టికెట్ దక్కించుకోవడం ఒక ఎత్తు. అనంతరం గెలుపు కోసం ప్రచారాన్ని ఉరకలెత్తించడం మరో ఎత్తు. గతంలో ఇంటింటికి తిరిగి తనకు ఓటు వేయాలని అభ్యర్థులు కోరేవారు.  కార్యకర్తలు, అభిమానులు జయ జయ నినాదాలు చేస్తూ ప్రచారంలో పాల్గొనేవారు. దీని ద్వారా కొంత మందికి ఉపాధి కూడా లభించేది. కరోనా నేపథ్యంలో ఇపుడు ఆ అవకాశం లేకుండాపోయింది. బల్దియా ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. కొవిడ్ నిబంధనల ప్రకారం ఒకేసారి గుంపులు గుంపులుగా జనం గుమిగూడటానికి అవకాశం లేదు. కార్యకర్తలతో పరిమిత సంఖ్యలో ప్రచారం నిర్వహించాల్సిఉంది. అంతేకాకుండా కరోనా సోకే ప్రమాదం ఉండటంతో జాగ్రత్తలు తప్పనిసరి. మాస్క్ లు, శానిటైజర్లు వాడకం తప్పనిసరి చేస్తూ ఎన్నికల సంఘం నిబంధనలు విధించింది.

ప్రచారంలో కీలకంగా మారిన యువత

అభ్యర్థులు ప్రచారం కోసం సామాజిక మాధ్యమాల బాట పట్టారు. కాలనీలు, బస్తీలలోని యువతను చేరదీస్తున్నారు. ప్రతి 50 మందికి ఓ గ్రూప్ క్రియేట్ చేసి వాటి ద్వారా ప్రచారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. వీటికి తోడు ఆయా కుల సంఘాల గ్రూప్ లు ఉండనే ఉన్నాయి. మరోవైపు ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేసి  ప్రచారం నిర్వహిస్తున్నారు.  గ్రూపులలో ప్రచారం నిర్వహిస్తున్న యువత అభ్యర్థుల నుంచి భారీగా డేటా ఛార్జీలను వసూలు చేస్తున్నారు.

సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా యువత

పార్టీల వారీగా ఉన్న సోషల్ మీడియా సెల్ లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇవి కాకుండా అభ్యర్థులు జీహెచ్ఎంసీ ఎన్నికలకు గాను ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. దీని కోసం ఆయా అభ్యర్థులు ప్రత్యర్థుల లోపాలను ఎత్తి చూపుతూ వారి ప్రచారాన్ని తిప్పికొట్టే వ్యూహాలకు పదును పెడుతున్నారు. నాయకులు గతంలో మాట్లాడిన వీడియోలు వారి హావభావాలను సేకరించి వాటికి బాగా మసాలా దట్టించి సామాజిక మాధ్యమాలలో వదులుతున్నారు.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles