Thursday, March 28, 2024

భారత ప్రజాస్వామ్యానికి పట్టిన జాడ్యం, ఏంటిది?

(రెండో భాగం)

చాలా మంది పౌరులు రాజ్యాంగం గురించి అర్ధం చేసుకోకుండానే ప్రజాస్వామ్యం అంటే వ్యక్తిగత స్వేచ్ఛ అని, ప్రజలు లేదా వ్యక్తిగత మతపరమైన మార్గాలను, లేదా మతపరమైన భావనలను బహిరంగంగా ప్రదర్శించుకోవటం అని, రిజర్వేషన్లను ఎలా అంటే అలా పెంచేసుకోవచ్చని, ఇష్టమొచ్చినట్లు రాజకీయ పార్టీలను, సంస్థలను స్థాపించుకోవటం అని అనుకుంటున్నారు. ఈ పోకడలే ‘ప్రజాస్వామ్యం’  విలువను మెల్లగా దిగజారుకుంటూ, లౌకికతత్వాన్ని కోలుపోతోంది. ఈ పోకడలు ఎంత దూరం పోయాయంటే ఈ రాజ్యాంగం బాగాలేదు, ఇప్పటి పరిస్థితులకు అనుకూలంగా భారతదేశానికి కొత్త రాజ్యాంగం కావాలి అనే  ఆలోచనా బీజం పడేంతగా.

Also read: భారత ప్రజాస్వామ్యానికి పట్టిన జాడ్యం, ఏంటిది?               

సాయుధపోరాటంలో విశ్వాసం కలిగిన పార్టీలు

కొన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు,  సాయుధపోరాటానికి అనుకూలంగా కమ్యూనిస్ట్భ పార్టీలు భారత దేశంలో ఏర్పడ్డాయి. సాయుధపోరాటానికి అనుకూలంగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు : (1). కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మార్క్సిస్టు – లెనినిస్ట్) లిబరేషన్, (2). కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మార్క్సిస్టు – లెనినిస్ట్) క్లాస్ స్ట్రగుల్ ను స్థాపకుడు కాను సన్యాల్ 2010 వరకూ లీడ్ చేసారు. (3). మార్క్సిస్టు – లెనినిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (రెడ్ ఫ్లాగ్) ను పి.సి. ఉన్నిచెక్కం స్థాపించారు, ఇప్పుడు కూడా నడిపిస్తున్నారు. (4). కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మార్క్సిస్టు – లెనినిస్ట్) రెడ్ స్టార్ ను కే. ఎన్. రామచంద్రన్ నడిపిస్తున్నారు, (5). కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మార్క్సిస్టు – లెనినిస్ట్) న్యూ డెమాక్రసీని యతేంద్ర కుమార్ నడిపిస్తున్నారు. (6). స్టేట్ ఆర్గనైజింగ్ కమిటీ కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మార్క్సిస్టు – లెనినిస్ట్) ను లెబా చాంద్ తుడు నడిపిస్తున్నారు. (7). కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మార్క్సిస్టు – లెనినిస్ట్) సోంనాథ్ ను సోంనాథ్ ఛటర్జీ ఉఖ్రా, ప్రదీప్ బెనర్జీ నడిపిస్తున్నారు. (8). కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మార్క్సిస్టు – లెనినిస్ట్) శాంతిపల్, (9). ప్రొవిజనల్క సెంట్రల్ కమిటీ మ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మార్క్సిస్టు – లెనినిస్ట్) ను సంతోష్ రానా నడిపిస్తున్నారు, (10). యూనిటీ సెంటర్ అఫ్ కమ్యూనిస్ట్ రెవల్యూషనరీ అఫ్ ఇండియా (మార్క్సిస్టు – లెనినిస్ట్)- డి. వి. రావ్, (11). కమ్యూనిస్ట్ గదార్ పార్టీ అఫ్ ఇండియా, (12). కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ భారత్ ను రంజన్ చక్రబోర్తి నడిపిస్తున్నారు. (13). మార్క్సిస్టు – లెనినిస్ట్ కమిటీ ను కే. వెంకటేశ్వర్ రావ్, (14).కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మార్క్సిస్టు – లెనినిస్ట్) – ప్రజా పంథా, (15). కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మార్క్సిస్టు – లెనినిస్ట్) జన్ సంవాద్, (16). కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మార్క్సిస్టు – లెనినిస్ట్) నాయి పహల్, (17). కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మార్క్సిస్టు – లెనినిస్ట్) న్యూ ప్రోలేటేరియన్, (18). కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మార్క్సిస్టు – లెనినిస్ట్) మహారాష్ట్ర, (19). రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ అఫ్ ఇండియా (మార్క్సిస్టు – లెనినిస్ట్).

Also read: హిందీస్ ల్యాబ్ పేలుడు ప్రమాదంపైన అనుమానాలు

ఇవే కాకుండా ….

 తీవ్రవాద, నక్సల్/మావోయిస్ట్ కు అనుకూలంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు : 1. కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మావోయిస్టు) ను నడిపిస్తున్నవారు ముప్పాళ్ల లక్ష్మణ రావ్,(2). రెవల్యూషనరీ కమ్యూనిస్ట్ సెంటర్ అఫ్ ఇండియా (మార్క్సిస్టు – లెనినిస్ట్ – మావోయిస్టు), (3). కమ్యూనిస్ట్ రెవల్యూషనరీ సెంటర్, (4). కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ యునైటెడ్ స్టేట్ అఫ్ ఇండియా ను నడిపిస్తున్నవారు వీరన్న, (5). కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మార్క్సిస్టు – లెనినిస్ట్) జనశక్తి – నడిపిస్తున్న వారు కూర రాజన్న, (6). కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మార్క్సిస్టు – లెనినిస్ట్) జనశక్తి – రణధీర్ ను నడిపిస్తున్నవారు రణధీర్, (7). కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మార్క్సిస్టు – లెనినిస్ట్) జనశక్తి – చండ్ర పుల్లా రెడ్డి నీ నడిపిస్తున్న వారు చండ్ర పుల్లా రెడ్డి, (8). కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మార్క్సిస్టు – లెనినిస్ట్) మహాదేవ్ ముఖర్జీ ని నడుపుతున్నవారు మహాదేవ్ ముఖర్జీ, (9). కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మార్క్సిస్టు – లెనినిస్ట్) భాయిజి, (10). కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మార్క్సిస్టు – లెనినిస్ట్) ప్రజాశక్తి, (11). కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మార్క్సిస్టు – లెనినిస్ట్) ప్రతిఘటన, (12). కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మార్క్సిస్టు – లెనినిస్ట్) ప్రజా ప్రతిఘటన, (13). కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మార్క్సిస్టు – లెనినిస్ట్) సెకండ్ సెంట్రల్ కమిటీ, (14). కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మార్క్సిస్టు – లెనినిస్ట్) సెంట్రల్ టీమ్, (15). కమ్యూనిస్ట్ పార్టీ రిఆర్గనైజేషన్ సెంటర్ అఫ్ ఇండియా (మార్క్సిస్టు – లెనినిస్ట్), (16). కమ్యూనిస్ట్ లీగ్ అఫ్ ఇండియా (మార్క్సిస్టు – లెనినిస్ట్) రాంనాథ్, (17). కమ్యూనిస్ట్ లీగ్ అఫ్ ఇండియా (మార్క్సిస్టు – లెనినిస్ట్) పరికల్పన, (18). కమ్యూనిస్ట్ లీగ్ అఫ్ ఇండియా (మార్క్సిస్టు – లెనినిస్ట్) రివిజనిస్ట్, (19). రి – ఆర్గనైజింగ్ కమిటీ కమ్యూనిస్ట్ లీగ్ అఫ్ ఇండియా (మార్క్సిస్టు-లెనినిస్ట్)లు.  ఈ విప్లవ పార్టీలు / సంస్థలు మొత్తానికి మొత్తం భారత దేశ ప్రజల బ్రతుకులు ‘ విప్లవం’  తోనే బాగుపడతాయి అని భావించాయి.  గట్టి నమ్మకాలతో వచ్చినవే. కానీ,  ఈ విప్లవ పార్టీలలో ఐక్యత లేదు. వీరి మధ్య చీలికకు దారితీసిన విభేదాలు ఏంటో అనే వాటిపై ఓ స్పష్టత లేదు. సిద్ధాంత పరమైన విభేదాలు అనుకుంటే,  వారు నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం అయినా వీరు తమ మార్గంలో  ప్రయాణిస్తున్నారు అని చెప్పలేని పరిస్థితి. వీరు కూడా భారత దేశం  ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ వున్నారు, వుంటున్నారు. అయితే, భారత లిఖిత రాజ్యాంగములో చెప్పిన ప్రజాస్వామ్యం గురించిన అవగాహన తో మాట్లాడుతున్నారా? లేక వారు నమ్ముతున్న కార్మిక నియంతృత్వ ప్రజాస్వామ్యం పద్ధతిలో మాట్లాడుతున్నారా? అనేది తేల్చుకోవాలి. దీన్నీ తేల్చకుండా, ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యంకు రక్షణ లేదు అంటే … ప్రభుత్వాలకు ఏమంత కష్టం కాదు వీటిని “నిషేధపు”  జాబితాలో ఉంచటానికి. ప్రభుత్వాలు ఎందుకు ఈ రాజకీయ పార్టీలను, వాటి అనుబంధ సంస్థలను నిషేధపు జాబితాలో  పెడతాయి?  భారత రాజ్యాంగాన్ని, భారత దేశంలో జరిగే ఎన్నికల విధానాన్ని ఈ రాజకీయ పార్టీలు, అనుబంధ సంస్థలు ఒప్పుకోక పోవటం. “భారత్ యొక్క ప్రజాస్వామ్యాన్ని” బలోపేతం చేసేవి రాజ్యాంగం, ఎన్నికలు మాత్రమే.  వీటిని ఒప్పుకోక పోవటం,  భారత రాజ్యాంగాన్ని, ఎన్నికలను గౌరవించక పోవటం,  ప్రజలను రాజ్యాంగానికి వ్యతిరేకులుగా తయారు చేస్తున్నారని, ఎన్నికలలో ప్రజలు పాల్గొనకుండా అడ్డు తగులుతున్నరనే   కారణాలతో  ప్రభుత్వాలు  విప్లవ  పార్టీలను,  వారి రాజకీయాలను,  అనుబంధ సంస్థలను  నిషేదిస్తున్నాయి (కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత కారణాలతో ప్రభుత్వాలు ప్రవర్తించటం, ఎన్కౌంటర్స్ కు, హింసలకు పాలుపడటము జరుగుతూ ఉంటుంది. వీటి విషయం ఇక్కడ అప్రస్తుతం. ఈ విషయాన్ని మరో సందర్భంలో చెప్పుకుందాం).

Also read: పంద్ర + ఆగస్టు = పంద్రాగస్టు

రాజ్యాంగం పనికిరాదు కానీ హక్కులు కావాలి

ఈ పార్టీలలో పనిచేసే కార్యకర్తలను, సానుభూతిపరులను ప్రభుత్వాలు అరెస్టు చేస్తున్నాయి / చేస్తాయి. అప్పుడు మానవ హక్కులు,  పౌర హక్కులు, రాజ్యాంగం కలిపించిన “భావ ప్రకటనా స్వేచ్ఛ,  సంఘాల ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ” కింద, అరెస్టుకు గురైన కుటుంబ సభ్యులు, బంధువులు, మద్దతుదారులు, భావోధ్వేగానికి లోనైన వారు, ఈ రాజకీయాలకు ప్రభావితం అయిన వారు, వివిధ కారణాలతో ఈ రాజకీయాలకు దగ్గరైన తదితరులు కలిసి ఆందోళనలు చేస్తున్నారు / చేస్తారు. ఎక్కువ సందర్భాలలో చెప్పే కారణం  రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రభుత్వాలు ప్రజలను హింసిస్తున్నారనీ,అప్రజాస్వామ్యంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయనీ అనూహ్యంగా సమాజంలో ఒక అలజడి మొదలౌతుంది. అప్పటికే ప్రజలలో ప్రభుత్వాల పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నవారు ప్రజలతోనే ఉండేవారు  వుండటం, ఈ అసంతృప్తి, ఆ అలజడికి తోడు కావటంతో ఒక ప్రజా ఉద్యమానికి దారి తీస్తుంది. ఈ మధ్య కాలాలలో జరిగిన, జరుగుతున్న ఉద్యమాలు ఇవే. ప్రభుత్వాలేమో రాజ్యాంగం కలిపించిన ప్రజాస్వామ్య బద్ధంగానే ప్రజలను పరిపాలిస్తున్నామని పోలీస్ బలగాలతో, ప్రైవేట్ సైన్యంతో ప్రజలపై బల ప్రయోగంతో నియంత్రణ  చేయటం,   రాజ్యాంగం   కల్పించిన    ప్రజాస్వామ్య  హక్కులు మా వరకు  రావట్లేదని  విప్లవ  రాజకీయ పార్టీల, సంస్థల ప్రతినిధులు ప్రజలతో అడిగిస్తారు,  ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రంగం ఒకవైపు – ఉద్యమ ప్రజలు, ఉద్యమ కారులు మరొకవైపు, ఇది  ఒక యుద్ధ వాతావరణంగా నెలకొంటది. ఇలాంటి ఉద్యమాల పట్ల ప్రభుత్వాలు ఈ మధ్య పదే పదే అంటున్న మాట …   అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సంస్థలు ‘ప్రజా ఉద్యమాల’లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి అని. అయితే,  ఉద్యమాలు నడిపించే వ్యక్తులను, సంస్థలను పక్కకు పెట్టి సమస్యను – సమస్యకు గురవుతున్న బాధితులపట్ల సానుకూలంగా ప్రభుత్వాలు స్పందించ వచ్చు, కానీ ప్రభుత్వం స్పందించదు.   దీనికి    మూలకారణం  ప్రభుత్వాలను  నడుపుతున్న    మంత్రులు / ఎమ్మెల్యేలు/ ఎంపీలు    అందరూ రాజ్యంగ నిర్మాణంకు   నోచుకోని    సమాజం  నుంచి వచ్చిన వారు. వారి వద్ద ఉండే పద్దతులు అప్రజాస్వామిక మైనవే. కులతత్వంతో / మతతత్వం తో/ వర్గ తత్వంతో/ బంధుప్రీతి తో కూడినవి మాత్రమే. అందుకే  బి ఆర్ అంబేద్కర్  ప్రజల కోసం ఏర్పాటు చేసీన రాజ్యాంగం, రాజ్యాంగంలో పొందు పరిచిన ప్రజాస్వామ్యం గురించి ‘ ఈ ఇద్దరూ’ రాజ్యాంగాన్ని  ప్రజాస్వామ్యాన్ని వారికి అనుకూలంగా నిర్వచించుకుంటూ / వాడుకుంటూ ఉంటారు / ఉన్నారు. వీరిద్దరి వాడకంలో ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలకు  రాజ్యాంగఫలాలు 75 ఏళ్ల నుండీ అందలేక పోతున్నాయి. ఇక “భారత సమాజం” ప్రజాస్వామ్య పద్ధతితో నిర్మాణం ఎలా జరుగుతుంది? ఎగుడు దిగుడు గానే సమాజం వుంటది / ఉంది.

ఇకపోతె, పనిచేయకుండా వున్న కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకో 150 నుండి 200 వరకు ఉన్నాయి.

Also read: జుబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసును సీబీఐకి అప్పగించాలి: హక్కుల నేతలు

ప్రజాస్వామ్యాన్ని ఒప్పుకునే పార్టీలు ఇవి

ఇవే కాకుండా భారత రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య పద్ధతిలోనే నడుచుకుంటామని, ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ఫలాలు పౌరులందరికీ అందే విధంగా ఉంటామనే వాగ్దానాలతో 8 జాతీయ రాజకీయ పార్టీలు, 54 ప్రాంతీయ  (రాష్ట్ర రాజకీయ)  పార్టీలు ఏర్పడ్డాయి. ఇవే కాకుండా 2796 రాజకీయ పార్టీలు రిజిస్టరై,  ఎలక్షన్ కమిషన్ దగ్గర గుర్తింపు లేని రాజకీయ పార్టీలూ ఉన్నాయి. అనగా,  దేశం మొత్తంలో పార్లమెంటరీ వ్యవస్థలో పనిచేస్తామని చెప్పిన 2858 రాజకీయ పార్టీలు నేడు ప్రజల కోసం ఉన్నాయి. ఈ దేశంలో ఏ పార్టీ ఎందుకు పుట్టిందో, పుట్టుకు వస్తున్నదో వారికే తెలియని ఒక రహస్య అజెండాలతో ఉన్నట్లు ఒక గంభీరమైన సమస్య / భావన. ఎందుకంటే భారత పార్లమెంటరీ వ్యవస్థలోనె రాజ్యాంగం ప్రకారం, ప్రజాస్వామ్య పద్ధతిలోనే వుంటామని చెపుతున్న ఈ పార్టీలు ” కుల మత వర్గ” పునాదుల పైననే “సంక్షేమ పథకాలను” ప్రజలందరికీ కాకుండా కొందరికే పరిమితం చేస్తున్నాయి. ప్రజాస్వామ్య పరిధిలోనే ఉన్నట్లు ఒక భ్రమను సృష్టిస్తున్నాయి.  అందుకే, అప్పుడప్పుడు ఈ పార్టీ నాయకులను ఫలాన పార్టీ నేతలు చంపారని జగడం చేపిస్తారు / చేస్తారు. పోలోమని, ఇటువైపు పార్టీ కార్యకర్తలు, అటు వైపు పార్టీ కార్యకర్తలు విడి పోయి పొడుచుకొని చనిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇంకా ప్రత్యేకంగ చెప్పాలంటే… భారత రాజ్యాంగం కలిపిస్తున్న ప్రజాస్వామ్యం అంటే “రాజకీయ పార్టీలు” ఎన్నైనా ఎవరైనా పెట్టుకునేటందుకు అని మాత్రమే వీరికి తెలిసింది. అయితే, వీరు అర్థం చేసుకోవలసింది ప్రజాపక్షం వైపు నిలబడి ప్రజలకోసం మాట్లాడటం అనేది అనియు, భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ద్వారా ఓటు హక్కును ప్రతీ భారతీయ పౌరుడికి కలిపించే ఒక కీలకమైన ఘట్టం అనియు,  ఓటు వినియోగం  అనేదే  భారత్ ప్రజాస్వామ్యం కు ఒక ప్రామాణికం అనియు.

Also read: తెలంగాణ రాష్ట్రం – రాజకీయ సంక్షోభం?

ఓటు పట్ల నిరాసక్తత, మెట్టవేదాంతం

ఓటు హక్కును వినియోగించు కుంటున్న  వారు సర్వ సాధారణంగా సామాన్య ప్రజలే ఎక్కువగా ఉన్నారు. మిగిలిన వారు పాలుగొనట్లేదు. ప్రజాస్వామ్య ‘ ఓటు’ ను ఎందుకు వాడుకోలేక పోయారో, పోతున్నారో వారు వివిధ కారణాలతో సమర్థన చేసుకుంటున్నారు. అందులో ఎక్కువగా వారు చెప్పే కథ ” ఆ… ఏ ప్రభుత్వం వచ్చి ఏం చేసింది, వీళ్ళు మాత్రం ఏం చేస్తారు, మా ఒక్కరి  ఓటు తో దేశానికి ఒరిగేది ఏమీ లేదనీ….”. చాలా విచిత్రమైన వాదనలు వినిపించేస్తారు. ఇది మెట్టవేదాంతం. వారి వాదనలతో ఎన్నికల సమయంలో హోరెత్తిస్తారు. ఎన్నికలలో పాల్గొనే వారిలో నుండి కొందరిని నిరుత్సాహ పరుస్తారు. కానీ, వారు అప్రజాస్వామ్య పద్ధతిలోనే, దేశంలో ‘ అన్ని హక్కులతో, అన్ని సౌకర్యాలతో, వారికి అనువైన,అనుకూలమైన ప్రదేశంలో’  జీవిస్తున్నారు. ఇలాంటి వారు భారత ప్రజాస్వామ్య నిర్వచనాన్ని మార్చి వేస్తున్నారు. ‘ఓటు హక్కు’ అనేది భారత్ ప్రజాస్వామ్యానికి పటిష్టమైనది, బలోపేతం అయినది. కానీ,  ఓటింగులో పాలుగొనని వ్యక్తులు, గుంపులు, సమూహాలు, కొన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎక్కువగా ప్రజాస్వామ్యం గురించే మాట్లాడటం జరుగుతుంది. ఈ మాట్లాడే వారు రాజ్యాంగం లో రాసుకున్న ప్రజాస్వామ్యం గురించి కాకుండా వారి భావాలనూ, సిద్ధాంతాలను, మతాల సంస్కృతితో, కులాల సంస్కృతులతో, వ్యక్తిగత అనుభవాలతో మాట్లాడటం ఎక్కువ. అందుకే వారు చెప్పే ” ప్రజాస్వామ్యం” లో డొల్లతనం కనిపిస్తుంది. ప్రజాస్వామ్యం, ఇలాంటి వారితో, ఇక్కడనుండే బలహీనతకు గురి అయ్యింది, గురి కాబడ్డది, రూపం లేకుండా, ప్రజాస్వామ్యం తన స్వచ్ఛతను కోల్పోతోంది. ప్రభుత్వాలకూ కావలసింది ఇదే. ప్రభుత్వాలు భారత్ దేశంలో ‘ ప్రజలకోసం’ పనిచేయవు. కొందరి స్వాలాభాల కోసం మాత్రమే పని చేస్తాయి. ఈ విషయం వారు తీసుక వచ్చే సంక్షేమ పథకాల అమలు తీరు సూచిస్తుంది. ఇక్కడ ఒక మంచి ఉదాహరణ… కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఢిల్లీలో నివసించే పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ‘రాజీవ్ గాంధీ ఆవాస్  యోజన పథకం’ తెచ్చారు. ఇళ్లు లేని ప్రతీ పేదవాడు అప్లికేషన్ కు 100 రూపాయలు చెల్లించి ధరఖాస్తు చేసుకున్నారు. అప్పుడు ఢిల్లీ జనాభా మూడు కోట్ల చిల్లర. ఆ స్కీం ఏమయ్యిందో నేటికీ తెలియదు. ఇలాంటి అవినీతి పథకాలు ప్రజాస్వామ్యం – ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయి. ప్రజాస్వామ్యం తన సహజత్వాన్ని కోల్పోతాది.     

Also read: 124-ఏ ఐపీసీ పై సుప్రీం కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: పౌర హక్కుల ప్రజా సంఘం – తెలంగాణ రాష్ట్రం

విచ్చలవిడిగా రాజకీయపార్టీల నిర్మాణం            

  … సంఘాలను, రాజకీయ పార్టీలను ఇష్టమొచ్చినట్లు నిర్మాణం  చేసుకోవటం. సంఘాల కోసం, రాజకీయ పార్టీల కోసం  కొదువ లేకుండా చాలా స్థలాలను అక్రమించుకోవటం అనేది ప్రజాస్వామ్యం పేరుతో ఇంకొందరు చేసే పని. తీసుకున్న  / ఆక్రమించిన స్థలాలతో ఆయా నాయకులు ఎంతవరకు ప్రజాస్వామ్య లక్ష్యాలకోసం పనిచేస్తున్నారు? విదేశీ నిధులను ఎన్ని సంఘాలు, ఎన్ని రాజకీయ పార్టీలు తీసుకుంటున్నాయి? తీసుకుంటున్న నిధులను లక్ష్యసాధనకు వాడుతున్నారా? లేక మరో దానికి వాడుతున్నారా? రాజకీయ పార్టీలను,  సంస్థలను, సొసైటీలను స్థాపించు కొనేటందుకు రాజ్యాంగం,  ప్రజాస్వామ్యం భాగంలోనే అధికరణ 19 హక్కు కలిపించింది.

Also read: బేగరి నాగరాజు (24) హత్య దేని పైన దాడి? అంటరానితనమా? వివక్షా? అగౌరవమా? పరువు హత్యా? మత హత్యా? రాజ్యాంగంపైన దాడా?

34 ఏళ్ళలో పశ్చిమబెంగాల్ ను అభివృద్ధి చేయలేని  కమ్యూనిస్టులు

ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మేమే కమ్యూనిస్టులమూ అని చెప్పిన రాజకీయ పార్టీ  పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని 34 ఏళ్లు పరిపాలించింది. గ్రామాలకు రవాణా వ్యవస్థను నిర్మాణం చేయలేకపోయింది. దేశంలో ఏ పార్టీకి లేనన్ని ఆస్తులను కూడబెట్టుకున్న పార్టీ ఇదే. ఒకటా రెండా? 34 ఏళ్లు గద్దెపై కూర్చున్న ఈ పార్టీ వారి మ్యానిఫెస్టో ప్రకారమైన లేక భారత రాజ్యాంగం ప్రకారమైనా ప్రజల అవసరాలను తీర్చేందుకు కృషి చేయవచ్చు. కానీచేయలేదు. శూన్యం. భారత రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్యం ప్రకారం అన్ని అవకాశాలను 34 ఏళ్లు దక్కించుకుంటూనే ప్రజలను ఏలింది. కూడు – గూడు – గుడ్డ – విద్య – ఆరోగ్యం అనే ప్రాథమిక సౌకర్యాలు ప్రజలకు 34 ఏళ్ళల్లో అందివ్వలేదు. ఈ పార్టీ, ఈ పార్టీ ప్రతినిధులు సందు దొరికితే చాలు ‘ ప్రజాస్వామ్యం డెమోక్రసీ‘ గురించి మాటలే మాటలు. వీరు ఏ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు? రాజ్య పరిపాలనా విషయంలో మతానికి అతీతంగా, సామాజిక సత్యాల పట్ల అవగాహనతో ప్రభుత్వాలు నడపాలి. ముప్పయ్ నాలుగు ఏళ్ళల్లో దీనికోసం కృషిచేసినట్లు ఎక్కడా లేదు. కమ్యూనిజం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచారు. ప్రభుత్వ పరిపాలన “ప్రజాస్వామ్యం – అభ్యుదయం” (ఆదేశిక సూత్రాలలో చెప్పిన విధంగా)  వైపు రాజ్యం అడుగులు వేయకపోతే అధిక ధరలకు దారి పడుతున్నట్లు. ఎక్కడికక్కడ అన్ని ప్రభుత్వ విభాగాలు, పౌరులు అవినీతికి ఎగబడతారు. ఈ పరిస్థితికి నిదర్శనం ఈ రోజు భారతదేశం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ధరలు.

Also read: నాగచైతన్య, సమంతల విడాకులు సరే, అసలు పెళ్ళి నమోదు చేసుకున్నారా?        

రాజ్యాంగ పీఠిక

 భారత రాజ్యాంగానికి ప్రవేశికగా ‘పీఠిక’ను రూపొందించారు. దీనినే రాజ్యాంగ ప్రవేశిక, ప్రస్తావన, మూలతత్వం, ఉపోద్ఘాతం, పరిచయం, ముందుమాట అని కూడా అంటారు. భారత రాజ్యాంగం ఈ పీఠికతోనే మొదలవుతుంది. భారత రాజ్యాంగానికి ఆత్మగాను, హృదయంగాను పీఠికను పిలుస్తారు. మారుపేర్లలో ఒక పేరు మూలతత్వం, మరొకటి పరిచయం, ఇంకొకటి ఉపోద్ఘాతం ఈ పదాలు వివరించిన విధంగానే పీఠిక రాజ్యాంగంలోని సర్వస్వానికి ఒక సారాంశంగా చెప్పవచ్చు.

భారత రాజ్యాంగం ప్రకారం, ప్రభుత్వాలు,  పౌరులు బాధ్యతాయుతంగ మెలగాలనీ, ప్రజాస్వామ్య పద్ధతిలో ఆదేశిక సూత్రాల ప్రకారం నడుచుకోవాలనీ ప్రవేశికలోనే ఉంది.  భారత    రాజ్యాంగం    భారత    దేశానికి  సర్వోత్కృష్ఠ  చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26 న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. భారత దేశం నిర్మాణంలో కీలక మైనవి …  ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగం నిర్దేశించింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు, ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా నిర్దేశిస్తోంది. పౌరుల యొక్క బాధ్యత దేశంపట్ల ఎలా ఉండాలో కూడా వివరిస్తుంది. ఒకవైపు ప్రభుత్వం మరొక వైపు పౌరులు – ఇద్దరూ కలిసి  రాజ్యాంగం కలిపిస్తున్న “విలువలను – ప్రాథమిక హక్కులు, పౌరులకు తమ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి పరచుకొనుటకు, హుందాగా జీవించుటకు, చట్టరీత్యా ఇవ్వబడిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల”ను కులాలకు, మతాలకు, మత-కులాలకు అతీతంగా సమానంగా అనుభవించటం అనేదే ప్రజాస్వామ్యం మూల సూత్రం. ఈ మూలసూత్రాన్ని పక్కకు పెట్టి..   మతతత్వ  రాజకీయాలను  – కులతత్వ రాజకీయాలను రాజ్యాంగంపై రుద్దుతున్నారు. ఈ రుద్దే క్రమములో “ప్రజాస్వామ్యం” గురించి చేస్తున్న ఇంటర్ప్రెటేషన్ (వివరణ) ఎవరికి అనుకూలంగా వారు ఇచ్చు కుంటున్నారు.

Also read: న్యాయమూర్తులను ప్రశ్నించడమే కోర్టు ధిక్కారమా?

అసలు సమస్య హిజాబ్ కాదు

నిన్నమొన్న “హిజాబ్” పై జరిగిన చర్చ, ఆందోళనలు ఒక మంచి ఉదాహరణ. చివరికి ‘హిజాబ్’ ను వ్యతిరేకించిన వాళ్ళందరూ కరుడుకట్టిన హిందూ మతోన్మాదులనీ, సమర్థించినవారంతా లౌకికవాదులనీ ఒకభ్రమను సృష్టించారు. భారత రాజ్యంగంలో ప్రజాస్వామ్యానికి ఒక లెక్క, పత్రం ఉంది. హిజాబ్ లాంటివి సమస్యలు కావు, భారత రాజ్యాంగం చెపుతున్న ప్రజాస్వామ్యానికి కొలమానం అంతకంటే కాదు. కానీ, ఇలాంటి వాటినే కొలమానంగా చూపుతున్నారు. అభివృద్ధి సూచికకు “ప్రజాస్వామ్యం” ఒక ఆరోగ్యవంతమైన కొలబద్ద. హిజాబ్ అనేది ఒక కరుడుకట్టిన మతతత్వానికి ఒక చిహ్నం. మరియు భారత ప్రజాస్వామ్యాన్ని అణచివేతకు ఒక ఆయుధం. ఇలాంటి  వాటితోనే  భారతదేశంలోని  ప్రజలందరూ  “అసలు సిసలైన    ప్రజాస్వామ్యాన్ని  రాజ్యాంగ   బద్ధంగా” ఆస్వాదించలేకపోతున్నారు. ప్రజాస్వామ్యం అంటే భారత రాజ్యాంగం ప్రకారం  లౌకిక తత్వంతో (సెక్యులరిజం) అనగా ఒక స్వేచ్ఛాయుత ఆలోచనతో పౌరులందరూ జీవించాలి. దీని ప్రకారం, కొన్ని కార్యాచరణాలు లేదా సంస్థలు, మతము లేదా మతముల విశ్వాసాల నుండి వేరుగా ఉంచటం. అనగా ప్రజల లేదా వ్యక్తిగత మతపరమైన మార్గాలనుండి లేదా మతపరమైన భావనలకు ప్రత్యామ్నాయంగా అభ్యుదయ సెక్యులర్ భావాలను పెంపొందించటం. 1976లో జరిగిన భారత రాజ్యాంగం 42వ సవరణ ప్రకారం, భారత రాజ్యాంగ పీఠిక లో “భారత్ ఒక ప్రజాస్వామ్య – లౌకిక (సెక్యులర్) – సామ్యవాద రాజ్యము” అని ప్రకటింపబడినది. అంటే, 25 వ అధికరణ ప్రకారం ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, దీని అర్ధం అందరిమీద రుద్దటం అని కాదు. 18 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు పిల్లలకు మత ప్రభోధం చేయకూడదు. అంటే వయోజనులు అయ్యేంతవరకు అని అర్ధం. ‘ప్రజాస్వామ్యం-మతం’ అంటే మతపరమైన చట్టాల నుండి, ప్రబోధనలనుండి స్వేచ్ఛపొందడం. రాజ్యాంగం కలిపిస్తున్న చట్ట పరిధిలో “స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు” కలిగివుండటం అనేది ముఖ్యమైన, ప్రధానమైన పౌరుల హక్కు. మత స్వేచ్ఛ అంటే మతపరమైన హక్కులు అని కాదు. ఏ మతానికి చెందిన పౌరులైనా రాజ్యాంగం పరిధిలో ప్రజాస్వామ్య బద్ధంగా మత రహితంగా లౌకికత్వాన్ని ప్రదర్శించాలి.

Also read: ఆ ఆరుగురు …..

కరడు కట్టిన మతమౌఢ్యం ప్రబలుతోంది

భారత దేశం సమాజం రోజూ కరడు కట్టిన మత మౌఢ్యంతో   రాజ్యాంగం చెప్పే ప్రజాస్వామ్యం అర్థాన్నే  మార్చి వేసే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగం ఇచ్చిన ఒక బలమైన “ప్రజాస్వామ్యపు గొంతుకను / గొంతుకలను” ప్రజలు చూడ లేకపోతున్నారు. హిజాబ్, శబరిమల, నుపూర్శర్మ  ఉద్యమాలు,  విద్వేషపూరితమైన ఉపన్యాసాలు లాంటివి ప్రజల మధ్య  ఐక్యతను విడదీయుటకే ఉపయోగ పడతాయి. విభజించి పాలించడం ప్రభుత్వాలకు ఇంకా చాలా సులువు అయ్యింది. ఎందుకంటే ఆ ప్రభుత్వాలు కూడా రాజ్యాంగం పరిధిలో ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయవు, చెయ్యట్లేదు. కాబట్టి, చివరికి ప్రజలు ఒంటరి అయిపోతున్నారు. అందుకే ఓటును డబ్బుకు అమ్ముకుంటున్నారు. నిజమైన నాయకులు ప్రజలను చేరుకోలేక పోతున్నారు. వారు ఇచ్చే, చెప్పే కారణాలు.. ‘నాయకత్వం, ఎన్నికలు చాలా ఖర్చుతో కూడింది, భరించే శక్తి లేదు’ అని ఒక అర్థరహితమైన వివరణ, వాదనను ముందుకు తెస్తున్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఇలాంటి వివరణలతో, ప్రభుత్వాల పని తీరుతో చాలా లోపభూయిష్టంగా ఉన్నట్లు అనిపిస్తుంది.

సక్రమంగా అమలు కాని రాజ్యాంగం

ఇదే కాకుండా, ప్రభుత్వాలు 75 ఏళ్ళ నుండి భారత రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయక పోవటం, అటు దిశగా ప్రజలను నడిపించక పోవటం. ఇంకా మత – కుల తత్వాలతోనే ప్రజలను సమీకరిస్తున్నారు. ఎన్నికలలో ఇదే నినాదాన్ని వాడుతున్నారు. ప్రజలు వ్యక్తిగతంగా మతపరమైన విషయాలు పాటించినా మతపరమైన విషయాలనుండి దేశాన్ని దూరంగా ఉంచాలి. రాజ్యంలో వుండే అనేక మతస్థులు, దేశ, రాజ్య, పరిపాలనా విషయాల పట్ల రాజ్యాంగం అమలు కావాలి. అభివృద్ధితో కూడిన శాంతి సౌఖ్యాలను ఎన్నికైన రాజ్యం / ప్రభుత్వం స్థాపించాలి. ఇది జరగలేదు. అందుకే ప్రభుత్వం / రాజ్యం ప్రజలకు సంక్షేమాన్ని కుల – మత ప్రాతిపదిక మీదనే రిజర్వేషన్ల పేరుతో 75 ఏళ్ళ నుండి అందిస్తోంది. రాజ్యాంగం అమలు అంటే ప్రజాస్వామ్యం – రిజర్వేషన్ల ను అమలు చేసేది అని కాదు. ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి చెపుతున్న నిర్వచనం బలహీనులందరికీ ఆయా జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్ కలిపించటం అని. ప్రభుత్వాల ఏర్పాటు రాజ్యాంగబద్ధంగా జరగట్లేదు. ఎన్నికలు ఎలా నిర్వహిస్తున్నారు? ఎన్నికలలో ఎంత శాతం పౌరులు పాల్గున్నారు? బలమైన ప్రజాస్వామ్యానికి ఎంత శాతం ఓటింగ్ ఏమైనా అవసరమా? ఇవి ఏవీ చూడటంలేదు. ప్రజలను రిజర్వేషన్లవైపు, ఆర్థిక సహాయాల వైపు మళ్లించి, చూడండి ప్రభుత్వాలు ఎంత  గొప్ప ప్రజాస్వామికంగా పనిచేస్తున్నాయో అని చూపుకుంటున్నారు. ఈ విధమైన పనులు ప్రభుత్వాల వైఫల్యాలకు దారితీసి ప్రజాస్వామ్యం కుప్పకూలటం జరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ చాలా బలహీనం అవుతుంది. ప్రజలు అధిక ధరలతో బాధపడతారు. అవినీతి,  రాజకీయ అస్థిరతతో పౌరులు బాధించబడుతారు.

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. వివిధ మతాలకు చెందిన వారు ఉన్నారు. ఇటీవల కాలంలో భారత దేశంలోని పౌరులపై, ప్రార్థనా స్థలాలపై దాడులు పెరుగుతున్నాయి అని అంతర్జాతీయ మత స్వేచ్ఛ పై అమెరికా కమిషన్ (USCIRF) ఒక నివేదిక సమర్పించింది. ఈ నివేదికపై భారత ప్రభుత్వం, “భారతదేశం, దాని రాజ్యాంగ నిర్మాణం విషయంలో ‘విస్తృతమైన అవగాహనా లోపం’ ఉందని,  ‘పక్షపాతం’ గా ఉందని, ‘సరి కాదని’ వ్యాఖ్యానించింది. భారత ప్రజాస్వామ్యం రాజ్యాంగం చెపుతున్న విధానాలపైననే బలంగా, శక్తివంతంగా, అభివృద్ధికరంగా, అభ్యుదయకరంగా ఉండగలదు. రాజ్యాంగం మూలాలను వక్రీకరిస్తే “లోపభూయిష్టమైన ప్రజాస్వామ్యంగా”  కనిపిస్తుంది. భారత రాజ్యాంగాన్నే మార్చి కొత్త రాజ్యాంగాన్ని తేవాలి అనే డిమాండ్ ఎందుకు వచ్చినట్లు? సమతుల్యతా లోపం. 75 ఏళ్ళ సుదీర్ఘ కాలంగా రాజ్యాంగం అమలు కాకుండానే ప్రజస్వామ్య పాలన భారత దేశంలో కొనసాగించిన విధానం దురదృష్టవశాత్తు మత సామరస్యాన్ని కోల్పోయే విధంగా పరిస్థితులు రాబోతున్నాయా? అనే అనుమానం. ప్రజాస్వామ్యం లోప భూయిష్టంకు  గురౌతున్నదా? అని మరో అనుమానం.  

Also read: నడుస్తున్న కథ

(ఇంకా ఉంది)

జయ వింద్యాల, లాయర్, హై కోర్టు,

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పౌర హక్కుల ప్రజా సంఘం, తెలంగాణ రాష్ట్రం

మొబైల్: 9440430263

Jaya Vindhyala
Jaya Vindhyala
రచయిత్రి తెలంగాణ హైకోర్టులో న్యాయవాది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లో సభ్యురాలు. హైకోర్టు బార్ అసోసియేషన్ ప్యాట్రన్. మెహబూబ్ కా మెహందీ, బాండెడ్ లేబర్ వంటి అంశాలపైన కేసులు వాదిస్తారు. పోలీసుల వేధింపులకూ, పోలీసు కస్టడీలో మరణాలకు వ్యతిరేకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అధ్యక్షురాలిగా పని చేశారు. ప్రస్తుతం అదే సంస్థ తెలంగాణ విభాగానికి ప్రధానకార్యదర్శి. నక్సలైట్లకీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్య 2004లో జరిగిన చర్చలలో చురుకైన పాత్ర పోషించారు. అసంఘటిత కార్మికుల సమస్యలపై విదేశాలలో జరిగిన సమావేశాలకు హాజరైనారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఎల్ఎల్ బీ చదివారు. న్యాయవాదన వృత్తి అయితే కథలు రాయడం ఆమె ప్రవృత్తి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles