Tuesday, May 14, 2024

రజాకార్లతో పోరాడిన యం యస్ ఆచార్య, డివి శిష్యుడు

ఫొటో రైటప్: స్వాతంత్ర్యసమరయోధుడు ఆచార్య, ధర్మపత్ని రంగనాయకమ్మ

మాడభూషి శ్రీధర్

కుటుంబం సూర్యాపేటలో నివాసం ఏర్పడే నాటికి శ్రీ యం.యస్‌.ఆచార్యకు ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు కీ.శే. దేవులపల్లి వెంకటేశ్వరరావు (డి.వి.) గారితో పరిచయం ఏర్పడింది. శ్రీ రావు తరచు వీరి నాన్నగారి వద్దకు వైద్యం కోసం వస్తూ ఉండేవారు. ఆ సమయంలో ఆచారి గారు మెల్లగా వారి వెంటబడి జారుకునేవారు.

శ్రీ వెంకటేశ్వరరావుకు ఆ రోజుల్లో యువకులలో పెద్ద ఆకర్షణ. ఆయన ఎక్కడకు వెళ్లినా యువకులు మూకలుగా వస్తూండేవారు. ఈ ఆకర్షణ పిన్న వయస్కులైన  ఆచార్యగారిలో చిత్రమైన భావాన్ని కలిగించేది. అనాలోచితంగా ఆయన వెళ్లేవారు. ఈ విధంగా నల్లగొండ జిల్లాలోని, చందుపట్ల, రేపాల, టేకుమట్ల, వల్లభాపురం, నకిరేకల్‌ మొదలైన పలుగ్రామాలలో వీరు పర్యటించారు. తన 15వ ఏట వరకు అంటే దాదాపు 6 సంవత్సరాలు ఈ ప్రాంతంలోనే గడపడమైంది. శ్రీ వెంకటేశ్వరరావు బోధనలు, సైద్ధాంతిక వివరణలు క్రమంగా మెదడులో చోటుచేసుకో సాగాయి. పెట్టుబడిదారులు అంటే ఉన్న వారి వద్ద డబ్బు దండుకోవాలనే ఆలోచన, ఉద్రేకం కలిగేవి, తెలిసితెలియని అపరిపక్వ మానసిక స్థితిలో చేసినపనికి చోరీ నేరంలో ఇరుక్కుపోవలసివచ్చింది, ఆ తర్వాత కేసులు కొట్టివేసినారు. ఆ రోజుల్లో కమ్యూనిస్టు పార్టీ అఖిలభారత కార్యదర్శిగా శ్రీ పి.సి. రాష్ట్ర కార్యదర్శిగా శ్రీ దేవులపల్లి వెంకటేశ్వరరావు ఉండేవారు. ఆ సిద్ధాంతాలు, ఆలోచనలు పేదరికం. నాస్తిక కేంద్రాలతో పరిచయం, మానసిక సంచలనావస్థ గల సమయంలో కాన్సర్‌ వ్యాధివల్ల ఆచార్యగారి తల్లిగారు మరణించినారు. అనేక బాధలతోపాటు పేదరిక బాధను తట్టుకోలేని దశలో ప్రసన్న రాఘవాచార్యగారు సకుటుంబంగా మకాం నెల్లికుదురుకు మార్చినారు. అక్కడి నుండి ఉదరపోషణార్థం అందరూ వరంగల్‌ చేరుకున్నారు. ఆ సమయంలోనే భాష్యాంతం అధ్యయనం చేసి, స్వయంకృషితో సంగీతాన్ని కూడా నేర్చుకున్న ఆచార్యగారి అన్నగారు శ్రీ వెంకటనరసింహాచార్యులు సంగీత పాఠాలు నేర్పి ఆర్జించడం ప్రారంభించారు. కొన్నా వీరి తండ్రిగారు కూడా సంస్కృతం సంగీతం నేర్పుతూ, నాటకాలు వ్రాసి ప్రదర్శిస్తూ గడించారు. చివరకు ఇంత పెద్దకుటుంబాన్ని ఈదలేని స్థితిలో శ్రీ ఆచార్యగారికి కూడా చదువుకు స్వస్తి చెప్పి ఉద్యోగయత్నం చేసుకోకతప్పలేదు.

హిందూ సేవా సంఘం లో ఆచార్య

వారి మొదటి ఉద్యోగం లక్ష్మణ్‌ సాపవార్‌ వద్ద కాంపౌండర్‌గా 12 రూపాయల జీతానికి పనిచేశారు. మందులు నూరడం, కషాయాలు కరుగబెట్టడం ప్రధాన ఉద్యోగ విధులుగా ఉండేవి. అదే సందర్భంలో బచ్చెవాల శ్రీ రాజన్నాగారితో పరిచయమేర్పడి సికింద్రాబాద్‌ వెళ్లడమైంది, అక్కడి బచ్చెవాలా హిరేన్‌ ముడి సిల్కు జరీషాపులో నెలకు 15 రూపాయల వేతనానికి పనికుదిరింది. ఈ వ్యాపార నిమిత్తం, సూరత్‌, ధర్మవరం, గఢక్‌, బెంగుళూరు, మద్రాసు, కంచీపురం, సేలం మొదలైన పట్టణాలు తిరిగిరావలసి వచ్చేది. బ్రతుకు తెరువు కోసం ఉద్యోగాలు చేస్తున్న శ్రీ ఆచార్య గారి అంతరాంతరాళాల్లో, ఉన్నత విద్యాసముపార్జనపట్ల కాంక్ష తట్టి లేపుతుండేది. అందువల్లే సికింద్రాబాద్‌లో తమ షాపునకు ఎదురుగా ఉన్న మడూరి లైబ్రరీ వారిని సునాయాసంగా ఆకర్షించింది. అక్కడికి తరుచూ వెళ్తుండేవారు. ఆ గ్రంథాలయం మేడపైన ‘ఉమర్జీకర్‌’ అనేవ్యక్తి ‘‘హిందూ సేవా సంఘం’’ అనే సంస్థను నడిపేవారు. దేశం కోసం, ప్రజల కోసం ఏదో చేయాలి, ఏదో సాధించాలనే తపన ఆచార్యగారి మనస్సును ఆ సంఘం వైపులాగింది. ఉమర్జీకర్‌ గారితో పరిచయం…. ఈ సంస్థ పట్ల ఉత్సుకత పెరగసాగింది. ఆ రోజుల్లో నాగపూర్‌ సైనిక్‌ స్కూలుకు చెందిన డా॥ మూరాజీ సికింద్రాబాద్‌ వచ్చినారు. ఆయన దేశ ఆర్థిక స్థితిగతులపై చేసిన ఉపన్యాసం ఆచార్యగారిని దీర్ఘంగా ఆలోచింపజేసింది, పర్యవసానంగా ఆర్గనైజేషన్‌లో చేరడానికి నిర్ణయించుకున్నారు. ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి తిరిగి వరంగలు చేరుకున్నారు. ఈ సంస్థ ఆర్ ఎస్ ఎస్ వంటిదే ఐనప్పటికి అప్పట్లో RSS అంటే ఏమిటో వీరికి తెలిసేది కాదు.

యువకులకు ‘ప్రతాప రుద్రదళం’

ఆచార్యగారి నివాసం వరంగల్‌కు మారింది. యువకులకు సంబంధించిన ఆర్గనైజేషన్సును వ్యవస్థీకరించే కార్యక్రమంలో నిమగ్నమైనారు. వ్యాయామశాలలు, క్రీడలు, ఆటలపోటీలు నిర్వహించేవారు. ఉన్నత స్థాయిలో ఈ పోటీల నిర్వాహణ జరిగేది. వీటిని నిర్వహించే సమయంలో ఆర్గనైజర్స్‌ లేదా వలంటీర్స్‌ అవసరమయ్యే వారు. వారిని సమీకరించేవారు శ్రీ ఆచార్య. ఇటువంటి సమీకరణ నుండి ఆవిర్భవించిందే ‘‘ప్రతాప రుద్రదళం’’

తన మిత్రుడు కీ.శే.ముస్త్యాల శంకర్రాపు ‘జన్మభూమి’ పత్రిక ఏజెంట్‌. వీరికి బాలల ఆర్గనైజేషన్‌తో సంబంధముండేది. ఆ సంస్థతో ఆచార్యగారికి కూడా సంబంధాలేర్పడినాయి. క్రమంగా ముస్త్యాలశంకరరావుతో సహవాసం పెరిగింది. ప్రతాపరుద్ర దళం, వలంటీర్‌ దళాలు మాత్రమేగాక, ఇతర ఆర్గనైజేషన్స్‌, రజాకర్ల వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనే సంస్థలతోనూ, వాటిలో పనిచేసే సభ్యులు కొందరితోనూ ఆచార్యగారికి పరిచయమేర్పడిరది. వీరిలో శ్రీయుతులు యం. వీరస్వామి, భట్టి, కిషన్సింగ్‌, కూసం వైకుంఠం, సైకిల్‌ షాపు రాజన్న, నరసింహారెడ్డి, భూపతిరత్నం, దక్షిణామూర్తి, రాజగోవింద్‌, డా॥ అమరం రామారావు వగైరా ప్రభృతులతో సన్నిహిత సంబంధం ఏర్పడింది.

ముస్త్మాల శంకరరావు ఆంధ్రపత్రిక ఏజన్సీ కోసందరఖాస్తు పెట్టుకోగా వారికి అప్పటికే ‘జన్మభూమి’ ఏజన్సీ ఉండటం వల్ల వీలుకాదన్నారు. అందువల్లపత్రిక ఏజన్సీ తీసుకోమని శంకర్రావు సూచించారు. కొడిమేల రాజయ్యగారి వద్ద డబ్బులు తీసుకొని రాజేశ్వరశాస్త్రి పేరుతో ఏజన్సీ పొందారు ఆచార్యగారు. మిత్రుడి డబ్బులు తిరిగి ఇవ్వకుండానేకాలం గడిచింది.

రజాకార్ల పై పోరాటం

స్వాతంత్య్ర పోరాటం, రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం పుంజుకోవడంతో ‘ఆంధ్రపత్రిక’ కాపీల అమ్మకాలు పెరిగాయి. హన్మకొండలో పెన్నా సీతారామరావు ‘ఆంధ్రప్రభ’  ఏజంట్‌. అప్పట్లో 200 కాపీలు ‘ఆంధ్రప్రభ’ అమ్ముడు అవగా, ‘జన్మభూమి’ 500 కాపీలు అమ్మేది. ఆంధ్రప్రతిక మాత్రం కొద్ది కాపీలే అమ్మేవి. ఇటువంటి స్థితి నుండి క్రమంగా కృషి చేసి పత్రిక, సర్క్యూలేషన్ను 1450 కాపీలకు తేగలిగారు. పత్రికా రంగం పట్ల వ్యామోహం, ఏకాగ్రత, దీక్ష, సాధించాలనే పట్టుదల క్రమంగా ఆచార్యగారిలో పెరగసాగాయి, ఆకాలంలోనే వావిలాల గోపాలకృష్ణయ్యగారు తెలుగు జర్నలిజం పై మూడు నెలల శిక్షణ శిబిరాన్ని తెనాలిలో నిర్వహించారు.  ఆచార్య తెనాలి వెళ్లి ఈ శిక్షణ పొందారు.

తరలిపోయిన వలస

రజాకర్లఆగడాలుపెచ్చుపెరిగివారువిచ్చలవిడిగాస్వైరవిహారంచేస్తున్నరోజులవి, చాలాకుటుంబాలు, పట్టణాలు, పల్లెలు విడిచి సరిహద్దు ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఆచార్యగారి కుటుంబం కూడా గుంటూరు జిల్లాకు తరలి వెళ్లింది. కాని ఆచార్యగారు మాత్రం వరంగల్‌లోనే ఉండిపోయారు. ముస్తాలశంకరరావుతో కలిసి పల్లెర్ల చంద్రమౌళిగారింట్లో ఆయన అద్దెకుండేవారు. వార్తాపత్రికలపంపిణీ, వార్తలసేకరణ వారి దైనందిన కార్యక్రమంగా ఉండేది.

స్వాతంత్ర్య పోరాటం

ఆరోజుల్లో ‘ఆంధ్రపత్రిక’ కట్టలు మద్రాసు నుండి విజయవాడ మీదుగా వరంగల్‌కు వచ్చేవి, ఆ కట్టల మధ్యలో స్వాతంత్య్ర పోరాట సాహిత్యం తత్సంబంధమైన కరపత్రాలు, నిజాం ప్రభుత్వం నిషేధించిన పత్రికలు, పుస్తకాలు భద్రపరచి పంపేవారు. ఏరోజు ఏకట్టలో ఏముంటుందో తెలిసేది కాదు. వాటినివిప్పుతున్నప్పుడుఅప్పుడప్పుడుకష్టమ్సుపోలీసులనిఘాఉండేది. ప్రతిరోజువీరినితప్పించుకుంటూకట్టలువిప్పివాటివెంటవచ్చినసాహిత్యాన్నిగమ్యానికిచేర్చేవారు. ఈ సాహిత్యాన్నినిషేధ పత్రికలను ఎవరు ఎక్కడి నుంచి పంపించేవారో వీరికి అప్పట్లో అర్థమయ్యేది కాదు. సాధారణంగా ఈ పత్రికల కట్టలలో అడ్లూరి అయోధ్యరామ కవి గేయాలు, ఉద్యమ ప్రచార సాహిత్యం, తాళ్లూరి రామానుజస్వామిగారి ‘సారథి’ పత్రిక, డా॥మర్రిచెన్నారెడ్డి ‘హైదరాబాద్‌’ పత్రిక బండి బుచ్చయ్యచౌదరి గారి ‘ములుగోలు’ పత్రికలుండేవి. వీటన్నింటిపై ప్రభుత్వ నిషేధాలే అయినా వీటిని చాకచక్యంతో సరిగా పంపిణీ చేసేవారు. ఆ తర్వాత కాలంలో      బుచ్చయ్య చౌదరిగారు పత్రికా నిర్వహణలో చక్కని సూచనలు ఇచ్చేవారు. అంతేకాదు ఆయన చనిపోయే ముందు ‘ములుగోలు’ పత్రికా సంపుటాలను, లైబ్రరీని ఆచార్యగారికి బహూకరించారు. వారు ఇచ్చిన పుస్తకాలలో టెక్నాలజీకి సంబంధించినవి స్థానిక ఆంధ్రవిద్యాభివర్థని ఉన్నత పాఠశాలకు, ‘ములుగోలు’ పత్రికా సంపుటాలు, నవలలను వాసవి గ్రంథాలయానికే  ఆచార్య బహూకరించారు.

రజాకార్లతో తగవులు

పత్రిక పంపిణీ సమయంలో తరచు రజాకార్లతో తగవు వచ్చేది. సంచీ తెరుస్తే చాలు ఏదో ఒకటి వారికి సరిపడనది బయటపడేది. ఇట్లా కాగితాలు బయటపడటం వల్ల ఒక రోజు పాతబీటు బజారులో ఆచార్య గారిని చావబాదడానికి రజాకర్లు సిద్ధమైనారు. ఏదో పేపర్లు అమ్ముకునేవాడు పోనీండని అక్కడి వర్తకులంతా రజాకర్లను బ్రతిమిలాడి గండం తప్పించారు. మరోసారి వర్ధన్నపేట వెళ్లే బస్సు వరంగల్‌ ఇంతెజార్‌ గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందు ఆగింది. అందులో కరపత్రాలు పెట్టిన ఆంధ్రపత్రికల బండిల్ను తెరిచి వారి ద్వారా పంపాలని ఆచార్యగారు వెళ్లారు. ఒక మిలటరీ వాడు మోటర్‌ సైకిల్‌పై రివ్వున వచ్చి ఆచార్య గారికి తగిలించి పడిపోయాడు. లేచి ఆచార్యగారిని పట్టుకొని డొక్కలో మోకాలుతో తన్నడం ప్రారంభించినాడు. ఇది బస్సులో నుండి గమనించిన ఇరుకుళ్ల శ్రీ శైలంగారు పరుగున దిగి వచ్చి ఆచార్య గారిని కౌగలించుకునే భంగిములో చేతులు అడ్డంపెట్టి దెబ్బల నుంచి రక్షించాడు. అతనే చివరకు మిలటరీ వాడిని బ్రతిమిలాడి విడిపించారు. ఇంత జరిగినా ఆచార్యగారు పట్టు వదలకుండా కరపత్రాలు చేరవలసిన చోటికి చేర్చారు.

ముస్తాల శంకర్రావు ఒకరోజు కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట నుంచి వస్తూ రైల్లో ఒక ముస్లింతో చిన్న తగువుపడ్డారు. అసలే ఆయన స్వతంత్ర సమర యోధుడుగా పత్రికా ఏజంటుగా రజాకర్ల దృష్టిలో ప్రముఖంగా ఉన్నవ్యక్తి. ఇంకేముంది శంకర్రావును, పల్లె చంద్రమౌళిని రజాకర్లు నిర్బంధించినారు. నాలుగు తగిలించి సాయంత్రానికల్లా పల్లె చంద్రమౌళిగారిని విడిచిపెట్టారు. శంకర్రావును మాత్రం అబ్దుల్‌ అజీజ్‌ ఇంట నిర్భందించారు. ఇత్తెహాదుల్ ముసల్మీన్‌ నాయకుడైన అబ్దుల్‌ అజీజు చెప్పగల ఇతని స్నేహితుడు మెహతాబ్‌ ఖాన్‌. ఈ ఖానుకు భట్టి మల్లయ్య స్నేహితుడు. అతడు ఎంత చెపితే అంత. తనకు పరిచితుడు భట్టి కిషన్‌సింగ్‌ తండ్రి అయిన భట్టి మల్లయ్యగారిని ఆచార్యగారు ఆశ్రయించారు. శంకర్‌రావును రజాకార్ల చేతుల నుండి విడిపించి పోలీసుల కప్పగించేట్లు కార్యం సాధించారు. మల్లయ్య పటేల్‌ సిఫార్సుతో 500 రూపాయల లంచం ముట్టజెప్పి, తిరుమల రాజశేఖర్‌తో జమానత్‌ ఇప్పించి ఎట్టకేలకు శంకరరావును విడిపించుకున్నారు. రజాకార్ల నిర్బంధంలో ముస్త్యాల మూల్గులు వినిపించనంత ఘోరంగా దెబ్బలు తిన్నారు. ముస్త్యాలను విడిపించటానికి ప్రయత్నించేరన్న కసికొద్దీ రజాకార్లు వీరిపై దాడికి సన్నద్ధమైనారు. కాని ఇల్లు మారినందున వీరి జాడ తెలియలేదు. 1948 జూన్‌ నెలలో వడ్ల కిష్టయ్యగారి ఇంట్లోకి మకాం మారిన ఆచార్యగారు రజాకార్లవారి సన్నాహం తెలిసి తమ కుటుంబాన్ని కలుసుకోవడానికి రేపల్లె వెళ్లారు. ఆ గ్రామంలోనే సెప్టెంబర్‌ 14వ తేదీన ఆచార్యగారికి ప్రథమ వివాహమైంది. ఈ వివాహం విఫలమై 1950వ సంవత్సరంలో ద్వితీయ వివాహం జరిగింది.

భారత సైన్యం హైదరాబాద్‌లో ప్రవేశించి నిజాం పాలనకు భరత వాక్యం పలికించే ఘట్టంలో సైన్యాలు అన్ని పట్టణాలు, ముఖ్య కేంద్రాలను హస్తగతం చేసుకున్నాయి. ప్రజలు స్వేచ్ఛా శ్వాసలు తీసుకుంటున్న తరుణంలో 1948 సెప్టెంబర్‌ 22న ఆచార్యగారు వరంగల్‌ తిరిగివచ్చారు.

అజ్ఞాత పోరాటం

ఆ తరువాత కాలంలో ఆచార్యగారు వ్రాసిన ఒక వార్త ఆయన భవిష్యత్తులో ఉత్తమ జర్నలిస్టు కావడానికి అవసరమయ్యే యోచనకు పునాదులు వేసింది. పోలీస్‌ యాక్షనుకు పూర్వం నుండి జరుపుతున్న కమ్యూనిస్టుల రహస్యోద్యమాన్ని అణచివేయటానికి ఆనందప్పను కమీషనర్‌ గా ప్రభుత్వం నియమించింది. సాయుధ దళాలు నర్సంపేట తాలూకా మహేశ్వరం అడవుల్లో 12 మంది చెట్లుకొట్టేవారిని కమ్యూనిస్టులుగా భావించి కాల్చి చంపించారని తెలిసిన ఆచార్య వార్త పంపించారు. ఈ వార్తకు బహుళ ప్రచారం లభించింది. అప్పుడు శ్రీ పళనియప్ప వరంగల్‌ కలెక్టర్‌. సివిల్‌ అడ్మినిస్ట్రేటర్‌ శ్రీ ఓబుల్‌రెడ్డి ఆచార్యగారిని అరెస్టు అరెస్టు చేశారు. నిరంతర వేధింపులలో భాగంగా అదేపనిగా ప్రశ్నించడం, ఫలానా వార్త ఎవరు చెప్పారు? దానికి భూమిక, ఆధారం ఏమిటని తీవ్ర శోధనకు గురిచేశారు.  పోలీసు నిర్బంధంలో మూడు రోజులు ఆచార్యగారు ఉన్నారు. నిరంతరవేదనను అనుభవించారు. కానీ ఎవరి పేరు ఆయన బయట పెట్టలేదు. ఏమయితేనేం ఇదేది నేటి స్వాతంత్య్ర పోరాట వీరుల జాబితాకు అవసరమైనట్టులేదు. ఆయనకు సన్నిహితులైన నాయకులెవరు ఆ తర్వాత కాలంలో అందరికీ లభింపజేసే స్వాతంత్ర్య సమర యోధుల పింఛన్‌కు యోగ్యులుగా గుర్తింపజేయలేదు. పర్యవసానంగా పింఛన్  రావడానికి ప్రస్తుత పరిస్థితులలో అవకాశాలులేని అనేక మంది ఉత్తమ స్వాతంత్య్ర యోధుల కోవలో ఆయన చేరిపోయారు.

(స్వయంగా అనేకమంది ప్రముఖులతో ఇంటర్య్యూ లు,  పాత్రికేయుడు, రచయిత ఇందుర్తి ప్రభాకర్ రావు గారితో కలిసి ఈ రచయిత మాడభూషి శ్రీధర్ సేకరించిన సమాచారం ఆధారంగా రచించిన వ్యాసం.)

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles