Friday, April 26, 2024

ట్రంప్ గెలిచినా ఓడినట్టే

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై అధికార డెమోక్రాటిక్ పార్టీ పెట్టిన అభిశంసన వీగిపోయింది. తీర్మానాన్ని ఆమోదించడానికి సరిపడా సంఖ్యాబలం లేకపోవడం వల్ల డెమొక్రాట్స్ వైఫల్యం చెందారు. దీన్ని తన గొప్ప గెలుపుగా, ప్రజాస్వామ్య విజయంగా, తనపై రిపబ్లికన్లు పెంచుకున్న విశ్వాసంగా, గౌరవంగా ట్రంప్ భావిస్తున్నారు. ఈ పరిణామం చారిత్రాత్మక, దేశభక్తిపూరిత ఉద్యమ ప్రస్థానానికి తొలి అడుగులుగా ఆయన అభివర్ణిస్తున్నారు.  క్రియాశీలక పాత్రను పోషించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెబుతున్నారు. అమెరికాను మళ్ళీ గొప్ప దేశంగా తీర్చి దిద్దడానికి, “అమెరికా ది గ్రేట్ ” అని నిరూపించడానికి కలిసి సాగుదాం అంటున్నారు. మళ్ళీ ఎన్నికలు 2024లో జరుగనున్నాయి. అంటే నాలుగేళ్ళ సమయం ఉంది. ఇప్పటికే 75ఏళ్ళ వయస్సులో ఉన్నారు. మళ్ళీ ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చేసరికి 80ఏళ్ళవాడవుతారు. తను నిలబడతాడా, కుటుంబ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తారా అన్న అంశంపై స్పష్టత లేకపోయినా, అధికారంపై యావ చావలేదు. 

అది విజయం అనుకుంటే పొరబాటే

నేటి అభిశంసనలో కాసిన్ని ఓట్ల తేడాతో బయటపడినంత మాత్రాన అది విజయం అనుకుంటే పొరపాటే. తన మద్దతుదారులు ఎట్టాగొట్టా గట్టెక్కిద్దామని మద్దతు పోగు చేసి ఆయన్ని కాపాడారు. ఈ అభిశంసన అంశానికి ఏదోవిధంగా ముగింపు పలికి, మిగిలిన ముఖ్యమైన అంశాలపై దృష్టి సారిద్దామని భావించడంతో ఈ తీర్మానం వీగిపోయినట్లుగా పలువురు భావిస్తున్నారు. ఇది సాంకేతికమైన గెలుపే కానీ, నైతిక విజయం కానే కాదు. జాత్యహంకారం, అతిమితవాదం, అధికారదాహంతో కొట్టుమిట్టాడే డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష స్థానానికి ఉన్న గౌరవాన్ని ఎప్పుడో తీసేశాడు. అతి గొప్ప ప్రజాస్వామ్యంగా చెప్పుకునే అగ్రరాజ్యం పరువు నడి సంద్రంలో ముంచేశాడు. ఆ దేశ చరిత్రలో, ఇట్టా రెండు సార్లు అభిశంసనను ఎదుర్కొన్న అధ్యక్షుడు ఈయన తప్ప ఎవ్వరూ లేరు.

Also Read : అభిశంసన ప్రమాదం తప్పించుకున్న ట్రంప్

క్యాపిటల్ హిల్ పై దాడి హేయం

అత్యున్నతమైన క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి, జరిపిన విధానం అమెరికా చరిత్రలోనే అత్యంత చీకటి రోజు. ఆ రోజు ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కిపడ్డాయి. అటువంటి దుర్ఘటనలు, దుశ్చర్యల వెనుక నిలుచొని నడిపిన వాడు ట్రంప్ అని, అమెరికాతో పాటు మొత్తం లోకానికి తెలుసు. స్వదేశానికి ఇంత మచ్చ మిగిల్చి, అంత రచ్చ చేసి, మళ్ళీ రాజ్యాన్ని పాలించడానికి ట్రంప్ సిద్ధమవుతున్నారంటే, అది సిగ్గు సిగ్గు. ఆయన ఆధిపత్యం చెక్కు చెదరలేదని ప్రచారం చేసుకుంటున్నారు. తనపై జరిగిన అభిశంసనలను రాజకీయ వేధింపు చర్యలుగానూ, ఈ పరిణామాలు అత్యంత విషాదమని ఆయన భావిస్తున్నారు.

ఆత్మపరిశీలన చేసుకోవాలి

ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకొని, తనలోకి తాను చూసుకుంటే, న్యాయాన్యాయాలు అర్ధమవుతాయి.పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా అభిశంసన ఎదుర్కొన్న తొలి అధ్యక్షుడు కూడా ఈయనే.కాంగ్రెస్ లో ప్రస్తుతం డెమోక్రట్ల బలం తక్కువగా, రిపబ్లికన్ల బలం ఎక్కువగా ఉంది. సెనెట్ లో కీలకమైన బిల్లులకు ఆమోదం లభించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా,1.9లక్షల కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజికి సెనెట్ లో ఆమోదం లభించాలి. కాంగ్రెస్ లో మెజారిటీ సాధించేంత వరకూ రిపబ్లికన్స్ తో జో బైడెన్ ప్రభుత్వానికి తిప్పలు తప్పేట్లు లేదు. కాంగ్రెస్ ఎన్నికలు వచ్చే 2022లో జరుగనున్నాయి. అప్పటి దాకా ఆగల్సిందే.

Also Read : బైడెన్ స్నేహ గీతిక

వచ్చే ఎన్నికల తర్వాత ఉభయసభలలో ఆదిక్యం

గత ప్రభుత్వం హయాంలో జరిగిన నష్టాన్ని పూరించి, సుపరిపాలన ద్వారా ప్రజా విశ్వాసాన్ని చూరగొంటే, రాబోయే ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీకి, తద్వారా జో బైడెన్ ప్రభుత్వానికి ఉభయ సభల్లోనూ ఆధిక్యం సొంతమవుతుంది. దాని వల్ల ప్రభుత్వాన్ని మరింత ఆత్మవిశ్వాసంతో, శక్తివంతంగా నడుప వచ్చు. డోనాల్డ్ ట్రంప్ తో పోల్చుకుంటే జో బైడెన్ సాత్వికుడు, రాజకీయ, పరిపాలనా రంగాల్లో అనుభవశాలి. ట్రంప్ రాజకీయాల్లోకి కొత్తగా వచ్చారు. అది కూడా సేవారంగాల నుంచో, ప్రజా ఉద్యమాల నుంచో కాదు. వ్యాపార రంగం నుంచి వచ్చారు. తన లాభనష్టాలు బేరీజు వేసుకొని ముందుకు సాగాడు కానీ  సర్వ ప్రజాహితం కాన రాలేదు.  వ్యూహాత్మకంగా కొత్త శ్వేత జాతీయ వాదాన్ని తీసుకొచ్చారు.

శ్వేతజాతీయతావాదం

ఓటు బ్యాంక్ పాలిటిక్స్ లో భాగంగా, మెజారిటీ ఓటర్లు తెల్లవారే కాబట్టి, ఆ జాతి నేతగా అమెరికాను నడిపించాలని పధక రచన చేశారు. ఇంకా అదే పథంలో సాగుతున్నారు. ఇది ట్రంప్ కు కొంత మేరకు లాభించింది. జో బైడెన్ గెలుపును, ట్రంప్ ఓటమిని అంగీకరించకుండా ఆందోళనలు జరుగడానికి ఈ శ్వేత జాతీయవాదం బాగానే ఉపయోగపడింది. కానీ, జాతి ద్వేషాలు రగిల్చి, చెడ్డపేరు తెచ్చింది. ఈ దూకుడు స్వభావం వల్లనే నిన్నటి ఎన్నికల్లో అమెరికా ప్రజలు ట్రంప్ ను చిత్తుగా ఓడించారు. ఐనా ఈ ఓటమి నుంచి ఆయన గుణపాఠాలు నేర్చుకున్న జాడలు కనిపించడం లేదు. “ట్రంప్ ను శిక్షించడానికి తుది ఓట్లు చాలక పోవచ్చునేమో కానీ, ఆయనపై ఉన్న అభియోగాల్లో ఉన్న తీవ్రతపై ఎలాంటి వివాదం లేదు,” అని అభిశంసన వీగిపోయిన సందర్భంగా జో బైడెన్ ప్రతిస్పందించారు. 

Also Read : ఊపిరి పీల్చుకున్న అమెరికా

గతాన్ని మరువని బైడెన్

బరాక్ ఒబామా అధ్యక్షుడుగా ఉన్న సమయంలో బైడెన్ రెండు పర్యాయాలు ఉపాధ్యక్షుడుగా పనిచేసి అనుభవం గడించారు. మధ్య తరగతి కుటుంబం నుంచి జీవితం ప్రారంభించి, రాజకీయాల్లో ఎదిగి, ఈరోజు అగ్రరాజ్యమైన అమెరికాకు అధ్యక్షుడు అయ్యారు. అయినా, గతాన్ని మరువలేదు. నిన్నటి మొన్నటి చేదు అనుభవాలు, తీపి గురుతులు, మానవ సంబంధాలు ఇంకా హృదయంలో పదిలంగా మిగుల్చుకున్నట్లే కనిపిస్తున్నారు. కళ్ళల్లో తడి ఇంకా నింపుకొనే ఉన్నారు. హింసకు, అతివాదానికి, జాత్యహంకారానికి, ఆభిజాత్యానికి తావివ్వక, పరిపాలనా జీవితం సాగిస్తే, మంచి అధ్యక్షుడుగా చరిత్ర పుటల్లో బైడెన్ నిలుస్తారు. అభిశంసనలో గట్టెక్కడంతో మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల క్షేత్రంలో నిలుచొనే అవకాశం ట్రంప్ కు మిగిలింది. మంచి పాలకుడిగా ప్రజల గుండెల్లో మిగలక పోతే గెలిచినా ఓడినట్లే. ఇది అందరికీ వర్తిస్తుంది.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles