Friday, April 26, 2024

ఏ విలువలకీ ప్రస్థానం?

  • ధనప్రవాహంలో మునిగితేలిన మునుగోడు
  • టీఆర్ఎస్, బీజేపీ ‘డర్టీగేమ్’

మునుగోడు ఎన్నిక ముగిసింది. ఫలితాలు వచ్చాయి. ఎవరో ఒకరు గెలవడం పరిపాటి. టీ ఆర్ ఎస్ అభ్యర్థి గెలిచాడు. బిజెపి రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది. బి ఎస్ పీ ఎన్నోకొన్ని ఓట్లు దక్కించుకుంది. కోదండరాం ఊసే లేకుండా పోయింది. ఇంత పెద్ద సీరియస్ ఎన్నికల వాతావరణం నడుమ ఆంధ్ర ప్రాంతానికి చెందిన కె ఏ పాల్ వచ్చి బోలెడు కామెడీని పండించి వెళ్లిపోయాడు. మొత్తంగా తంతు ముగిసింది. ఏతావాతా తేలిందేంటి? అత్యంత ఖరీదైన ఎన్నికల నడుమ ఓటు విలువ తద్వారా ప్రజాస్వామ్యం భారీ మూల్యం చెల్లించింది. బ్రిటన్ వంటి దేశపు మొత్తం ఎన్నికల ఖర్చు కంటే తెలంగాణలోని ఒక చిన్న అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక ఖర్చు ఎన్నోరెట్లు దాటిపోయింది. ఈ ఎన్నికల తీరు గురించి దేశమంతా పెద్ద చర్చ జరగగా, ఎన్నికల ఖర్చు గురించి లోకమంతా విస్తుపోయింది. అమ్ముడుబోయేతనం ఏ స్థాయిలో పెరిగిందో ఈ ఎన్నికల వైనానికి మించిన ఉదాహరణ ఈ మధ్య కాలంలోనే కాదు, ఇన్నేళ్ల స్వాతంత్ర్య భారత చరిత్రలోనే లేదు. ఇది దేశ చరిత్రలోనే అత్యంత దురదృష్టకరమైన సందర్భం.

Also read: దిల్లీకి జబ్బు చేసింది!

అది కమ్యూనిస్టుల కంచుకోట

ఓటర్లు, నాయకులు ఒకరేమిటి ఒకటేమిటి అందరూ, అన్ని వ్యవస్థలు అమ్ముడుపోయిన అతి పెద్దనేర చరిత్రకు సంకేతం. ఇక ఫిరాయింపులకు కొదవే లేదు. ఓట్ల డబ్బుల గురించి ఓటర్లు ధర్మా చేశారని వినవచ్చిన మాటలు నిరుడెన్నడూ జరిగిన దాఖలాలు లేవు. ఇక ఫాం హౌస్ డ్రామా గురించి చెప్పనక్కర్లేదు. ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు? ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయన్నది అటుంచితే… ఎల్ల లోకములు విస్తుపోయేట్టు జరిగిన ఎన్నిక ఇది అన్నది నిర్వివాదాంశం. తమకు అనుకూలంగా ఎవరి లెక్కలు వారివి. డబ్బుల కోసం ఓటర్లే ధర్నాలు చేసే పాడు కాలమొచ్చిన ఈ తరుణంలో భవిష్యత్తులో ఎన్నికలు ఎలా ఉండబోతాయో ఊహించుకోలేం. కేవలం ఒక సంవత్సరం కాల వ్యవధిలోనే అసెంబ్లీ ఎన్నికలు రానున్న వేళ ఉన్నపళంగా ఉపఎన్నికలు రావడమే అసందర్భం, అక్రమం, అన్యాయం. ఒకప్పుడు చైతన్యానికి మారుపేరయిన నల్గొండ జిల్లాలో మునుగోడు నియోజకవర్గం ఉంది. ఆ జిల్లాలోని అనేక నియోజకవర్గాలలో ఇదొకటి. ఒకప్పుడు కమ్యూనిస్తులకు కంచుకోటగానూ పేరుపొందింది. 1967 నుంచి పరిశీలిస్తే 1985 నుంచి 2009 వరకూ  సీపీఐ అభ్యర్థులు 5 సార్లు గెలిచి చరిత్ర సృష్టించారు. కాంగ్రెస్ 6 సార్లు గెలిచి ఆధిక్యత సాధించింది. ఈ ఉపఎన్నికతో కలుపుకొంటే టీ ఆర్ ఎస్ రెండు సార్లు గెలిచినట్లు. మొత్తంగా చూస్తే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, సీపీఐలు ఈ 55 ఏళ్ళల్లో ఎక్కువసార్లు గెలుపును పంచుకున్నాయి.  ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ తెలుగుదేశం పార్టీకి బోణీ జరగలేదు. టిడిపి ఒక్కసారి గెలుచుకున్న సందర్భం కూడా ఇంతవరకూ లేదు. బిజెపిది కూడా అదే పరిస్థితి. ఈ ఎన్నికల ఫలితాలు మొత్తం దృశ్యాన్ని మార్చేశాయి. నిన్నటి వరకూ కాంగ్రెస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ, ఉన్నపళంగా బిజెపిలోకి దూరిన ఆర్ధికంగా బలమైన రాజగోపాల్ రెడ్డి ద్వారా బిజెపికి గణనీయంగా ఓట్లు వచ్చాయి. గెలిచిన టీ ఆర్ ఎస్ అభ్యర్థి కంటే 11వేల ఓట్లు తక్కువ పోలయినా జెపికి మేలుజరిగినట్లే.గెలుపు సాధించడంతో రాష్ట్రంలోని అధికార టీ ఆర్ ఎస్ పార్టీకి కాలర్ ఎగరేసే అవకాశం వచ్చింది. ఇటీవలే ముఖ్యమంత్రి కెసీఆర్ పార్టీని ‘బీఆర్ ఎస్’ పేరుతో జాతీయ పార్టీగా మలిచారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ స్థాయిలో తడాఖా చూపిస్తానని ఆయన అంటున్నారు. దానికి ఇంకా కాస్త సమయం ఉంది. ఈలోపు వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సివుంది. మునుగోడు గెలుపును ఆయుధంగా మలుచుకొని కెసీఆర్ ముందుకు సాగుతారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మునుగోడులో వచ్చిన ఓట్ల సంఖ్య చూపించి బిజెపి కూడా బాణాలను వేస్తుంది.

Also read: ఆయుర్వేదంలో అధ్యయనం అవసరం

కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ

ఎటొచ్చీ ఘోరంగా దెబ్బతిన్నది కాంగ్రెస్ పార్టీ. ఈ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతున్న వేళ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ తెలంగాణలో నిర్వహించారు. ఆ ప్రభావం కూడా ఎన్నికలపై ఏమీ పడలేదని అర్థమవుతోంది. గతంలో కంటే బిజెపి బలం తెలంగాణలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో పెరిగిందనే విశ్లేషణలు చాలామంది చేశారు. పట్టణ ప్రాంతమైన చౌటుప్పల్ లో బిజెపికి ఈ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. కాబట్టి పట్టణ ప్రాంతాల్లో తమ ప్రగతి వార్తల పట్ల బిజెపి పునఃసమీక్ష చేసుకోవాల్సివుంది. నేటి ఎన్నికల ఫలితాల తీరుతెన్నులను గమనిస్తే ప్రతి పార్టీ గుణపాఠాలు నేర్చుకోవాల్సివుంది. చివర్లో రెండుమూడు రౌండ్లు తప్ప, దాదాపు ప్రతి రౌండ్ లోనూ బిజెపి- టీఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్లుగా ఓట్లను సాధించాయి. ఈ ఫలితాలు చాలా ఉత్కంఠను రేపాయి. బిజెపి కేంద్ర స్థాయి నుంచి స్థానికం వరకూ అన్ని శక్తులను వడ్డించినా చివరకు ఓడిపోయింది. టీఆర్ ఎస్ లో వినూత్నంగా ముఖ్యమంత్రి, మంత్రుల స్థాయి నుంచి అగ్రనేతలంతా ఒక్కొక్క గ్రామాన్ని బాధ్యతగా తీసుకొని బరిలోకి దిగారు. టీఆర్ ఎస్ మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంతరెడ్డి బాధ్యతలు తీసుకున్న ప్రాంతాలలో బిజెపికి ఆధిక్యం రావడం గమనార్హం. మంత్రుల మాటలు ఆశించిన స్థాయిలో అక్కడ చెల్లలేదు. టీఆర్ ఎస్ పెద్ద నాయకుడు పల్లా రాజేశ్వరరెడ్డి ఇంచార్జిగా ఉన్న ప్రాంతంలోనూ బిజెపికే ఎక్కువ ఓట్లు వచ్చాయి.

Also read: ఉడికిపోతున్న ఉక్రెయిన్

అడుగంటిన ఆదర్శం

గెలిచిన టీఆర్ ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి సొంత గ్రామంలోనూ బిజెపికి ఆధిక్యం వచ్చిందన్నది చిత్రమైన అంశం. మంత్రి హరీష్ రావు బాధ్యత తీసుకున్న మరిగూడ మండలంలో టీఆర్ ఎస్ కు మంచి ఫలితాలు వచ్చాయి. ఇప్పటి వరకూ నల్లగొండ జిల్లా జరిగిన మూడు ఉపఎన్నికలలోనూ టీఆర్ఎస్ గెలుచుకోవడం ఆ పార్టీకి కలిసొచ్చిన అంశంగా చెప్పుకోవాలి. ఇది ఇలా ఉండగా, మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ ఎస్ గెలుపులో కమ్యూనిస్టుల పాత్ర ప్రధానంగా చెప్పుకోవాలి. కాంగ్రెస్ వల్ల ఓట్ల చీలిక జరిగి అది అధికార పార్టీకి లాభం చేకూర్చింది. కాంగ్రెస్ ను పతనం చేయాలని టీ ఆర్ ఎస్ కంకణం కట్టుకున్న నేపథ్యంలో బిజెపి పెరిగి నేడు ఏకుమేకై కూర్చుంది. సరే రాష్ట్రంలో టీఆర్ ఎస్ అధికారంలో ఉంది కనుక అన్ని అధికారాలను సద్వినియోగం చేసుకుంది. దుర్వినియోగం చేసిందని ప్రతిపక్షాలు అంటున్నాయి. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజెపి చూస్తోంది. ఉన్న అధికారాన్ని కలకాలం కాపాడుకోవాలని టీఆర్ ఎస్ చూస్తోంది. బలహీనమైన నాయకత్వం, పార్టీలోని పెద్ద నాయకుల మధ్య తీవ్ర అంతర్గత విభేదాలు కాంగ్రెస్ కొంపముంచాయి. ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా గత ఎనిమిదేళ్లుగా వరుస ఓటములతో కాంగ్రెస్ మట్టి కరుస్తోంది. ఒక ఉప ఎన్నికలో గెలుపు కోసం అధికార టీ ఆర్ ఎస్ పార్టీ ఇంత హయిరానా పడిందంటే రాబోయే ఎన్నికల పట్ల మరింత పోరాటం చేయాల్సివుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై అంతఃసమీక్ష చేసుకొని పార్టీలో ప్రక్షాళన చేపట్టాల్సివుంది. ప్రభుత్వ వ్యతిరేకత పెరగకుండా చూసుకోవడం ఇంకా ముఖ్యం. బీఆర్ ఎస్ పార్టీని కూడా నిర్మాణం చేస్తున్నారు. అధినేత కెసీఆర్,అగ్రనేతలు కెటీఆర్ వంటివారు మరింత ఆదర్శవంతంగా నడవాల్సి వుంది. ప్రజలకు,శ్రేణులకు, నాయకులకు, మీడియాకు అందుబాటులో ఉండడం అత్యంత ముఖ్యం. రాష్ట్రంలో బిజెపిలోని పెద్ద నాయకుల మధ్య కూడా బోలెడు విభేదాలు ఉన్నాయి. గ్రామసీమల్లో పార్టీ బాగా వెనుకబడి వుంది. ఈ లోపాలన్నింటినీ పార్టీ సరిచేసుకోకపోతే అనుకున్న లక్ష్యాలను చేరుకోలేదు. ఇక కాంగ్రెస్ తీరు పూర్తిగా మారాలి. డబ్బుల కోసం, అధికారం కోసం నాయకులు పార్టీలను అదే పనిగా మారడం, ఓటర్లు డబ్బులకు అమ్ముడుపోవడం, అధికారగణం అధికార పార్టీలకు అణిగిమణిగి ఉంటూ తొత్తులుగా ఉన్నంత కాలం దేశం చీకట్లోనే ఉన్నట్లు లెక్క. అందరికంటే అన్నింటికంటే ముందుగా మారాల్సింది ఓటర్లు.

Also read: నవ్యాంధ్ర నిండుగా వెలగాలి

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles