Wednesday, May 8, 2024

దుబ్బాకలో రెండో స్థానం ఎవరికి?

దుబ్బాక ఉప ఎన్నికలలో హోరాహోరీగా జరిగిన ప్రచారం ఆదివారం సాయంత్రం ముగిసింది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రచారానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి తెన్నేరు హరీష్ రావు నాయకత్వం వహించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) కానీ, ఆయన కుమారుడు, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) కానీ ప్రచారం చేయలేదు. కేటీఆర్ వరద బాధితులను ఆదుకోవడంలో తలమునకలై ఉన్నారు. దుబ్బాకలో పార్టీని గెలిపించే బాధ్యత పూర్తిగా హరీష్ రావు భుజస్కంధాలపైనే ఉంచారు. హరీష్ రావు అహోరాత్రాలు ప్రచారంలో పాల్గొన్ని, పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతతో కలసి ప్రచారం చేశారు. విడిగానూ ఆయన విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. తన శక్తిసామర్థ్యాలను సంపూర్ణంగా వినియోగించారు.

కాంగ్రెస్ సమష్టి ప్రచారం

ఈ సారి రెండు జాతీయ పార్టీలూ పూర్తి బలగంతో రంగంలో దిగాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బాధ్యుడుగా మణిక్కం టాగూర్ పదవిని స్వీకరించినప్పటి నుంచీ దుబ్బాక ఉపఎన్నికపైన దృష్టి పెట్టారు. నిస్సారంగా, నిరుత్సాహంగా, నిస్తేతంగా ఉన్న పార్టీకి కొత్త ఊపు ఇచ్చారు. కొత్త లక్ష్యం నిర్దేశించారు.  ముఠాలవారీగా విడిపోయి, ఎవరిపాట వారు పాడుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండిన కాంగ్రెస్ నాయకులను ఒక తాటిపైకి తెచ్చారు. సమష్టిగా ఎన్నికల ప్రచారం చేసేందుకు అన్ని వర్గాల నాయకులనూ రంగంలోకి దించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మరో సీనియర్ నాయకుడు భట్టి విక్రమార్క, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు రోజుల తరబడి దుబ్బాక నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ఒక దశలో పార్టీ అభ్యర్థిని ఎంపిక చేయడం కష్టమనీ, ఎవరిని నిలబెట్టినా ధరావతు కాపాడుకోవడం కూడా ప్రశ్నార్థకమనీ భావించిన కాంగ్రెస్ నాయకత్వం మాజీ శాసనసభ్యుడు స్వర్గీయ ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ తీర్థం ఇచ్చి నామినేషన్ వేయించిన తర్వాత ధరావతు బెంగ తీరిపోయి విజయం కోసం పోరాటం ప్రారంభించారు.  వీలైతే గెలవాలనీ, లేకపోతే కనీసం రెండో స్థానంలోనైనా నిలవాలనీ శక్తివంచన లేకుండా పార్టీ ప్రయత్నాలు చేసింది.

బీజేపీ హంగామా

మూడు ప్రధాన పార్టీలలోనూ అత్యధికంగా పోరాటంలో ఉన్నట్టు కనిపించీ, బదనాం అయిందీ, అధికార పార్టీతో నువ్వా-నేనా అన్నట్టు తలబడిందీ బీజేపీ. రంగంలోకి దిగిన క్షణం నుంచీ ముఖ్యమంత్రిపైన వాగ్బాణాలు సంధించడం, అన్ని సంక్షేమ కార్యక్రమాలకూ కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుంటే కేసీఆర్ తన ప్రభుత్వం ఇస్తున్నట్టు అబద్ధాలు చెబుతున్నారంటూ విమర్శించడమూ, హరీష్ రావుపైన ఆరోపణలు చేయడం ద్వారా పోటీలో తాను ముందున్నట్టు ఒక అభిప్రాయాన్ని కలిగించడంలో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి చివరి రెండు రోజుల ప్రచారంలో పూర్తిగా పాల్గొన్నారు. ఉప ఎన్నిక ప్రచారం జరిగిన రోజులలో కేంద్రమంత్రి ఎక్కువగా హైదరాబాద్ లోనే పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు.

బండి సంజయ్ పోరాటం

ఇటీవలివరకూ దిల్లీలో ఉండిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ హడావుడి చేసి ప్రచారంలో వేడిపుట్టించడంలో తన లక్ష్యం సాధించారు. దుబ్బాకకు రావడానికి ప్రయత్నించిన సంజయ్ ని దారిలోనే అరెస్టు చేసి, కరీంనగర్ తీసుకొని వెళ్ళి దించిరావడం వంటి నాటకీయ ఘట్టాలు జరిగాయి. ఇంటివద్దనే నిరాహారదీక్ష చేపట్టడం, ఒక రోజులోనే పల్స్ పడిపోవడం వంటి ఆందోళనకరమైన అంశాలూ చోటు చేసుకున్నాయి. బీజేపీ అభ్యర్థి రఘనందనరావు ఈ స్థానం కోసం పోటీలోకి దిగడం ఇది మూడో సారి. విద్యాధికుడూ, మంచి వక్త అయిన రఘునందనరావుపైనే అధికార పార్టీ దృష్టి సారించినట్టు కనిపించింది. బీజేపీ అభ్యర్థి బంధువల ఇళ్లలో సోదా చేయడం లక్షల రూపాయల నోట్ల కట్టలు పట్టుకోవడం, దానికి ప్రచారం రావడంతో పార్టీ, అభ్యర్థి బదనాం కావడంతో పాటు పార్టీ టీఆర్ ఎస్ కు గట్టిపోటీ ఇస్తున్నదనే అభిప్రాయం కలిగించింది. విజయానికి చేరువలో పార్టీ లేకపోతే బీజేపీని అధికార పార్టీ అంత గట్టిగా ఎందుకు పట్టించుకుంటుంది? గెలిచే అవకాశాలు లేకపోతే బీజేపీ అంత విరివిగా డబ్బు సమీకరించి ఖర్చు చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తుంది?

ప్రచారంలో డబ్బు పాత్ర

మాజీ ఎంపి వివేక్ కార్యాలయం నుంచి తరలిస్తున్న కోటి రూపాయలను పోలీసులు పట్టుకున్నట్టు, ఆ డబ్బు ఓటర్లకు పంచడానికే తీసుకొని వెడుతున్నట్టు రఘునందన్ బావమరిది సురభి శ్రీనివాసరావు, ఆయన ఉపయోగించిన కారు డ్రైవర్ ఒప్పుకున్నట్టు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించడం విశేషం. బావమరిది వ్యాపారానికి సంబంధించిన సొమ్మును తన రాజకీయాలతో ముడిపెట్టడం అన్యాయమనీ, ఇదంతా హరీష్ రావు ప్రోద్బలంతోనే జరుగుతున్న దుర్మార్గమనీ రఘునందనరావు ఆరోపించారు.

ఎత్తులూ,  పైఎత్తులూ

కేవలం ఎన్నికల ప్రచారం కాకుండా ఎత్తులూ, పైఎత్తులతో, వీధపోరాటాలతో, దుబ్బాక ఆవల హైదరాబాద్ లో సైతం బలప్రదర్శనలతో దుబ్బాక ఉడికిపోయింది. ఒక కార్యకర్త (శ్రీనివాస్) పెట్రోలు పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేయడం, అతడిని ఆస్పత్రిలో చేర్పించడం, ఆస్పత్రికి వెళ్ళి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఇతర నేతలు శ్రీనివాస్ ను  పరామర్శించడం, ముఖ్యమంత్రి నివాసం ప్రగతి భవన్ ను ముట్టడించాలని అనుకోవడం, పోలీసులు బీజేపీ కార్యకర్తలను చెల్లాచెదురు చేయడానికి బలప్రదర్శన చేయడం, రక్తం చిందించి దుబ్బాకలో లబ్ధిపొందాలని బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారంటూ కేటీఆర్ ఆరోపించడం వాతావరణాన్ని వేడెక్కించింది. డీజీపీకీ, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంలో కూడా టీఆర్ ఎస్ ముందే ఉన్నది. హైదరాబాద్ లో అల్లర్లు జరిపేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు. ఓట్ల కోసం కార్యకర్తలను బలిచేయడం అన్యాయమని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

చావోరేవో తేల్చుకోవాలని బీజేపీ పట్టు

చావోరేవో తేల్చుకోవడానికి సిద్ధమైన బీజేపీ ప్రజలను మెప్పించేందుకు అన్ని రకాల ప్రయత్నాలూ చేసింది. 2018లో మూడో స్థానంలో నిలిచిన బీజేపీ అకస్మాత్తుగా గెలుపుకోసం సర్వస్వం వొడ్డి పోరాడటం ఎందుకు? సోలిపేట రామలింగారెడ్డి మృతి కారణంగా ఈ ఉప ఎన్నిక  అవసరం ఏర్పడింది. రామలింగారెడ్డి ప్రజలలో విశేషమైన పలుకుబడి కలిగిన నాయకుడు. ఆయనకు మొదటి నుంచి కొండంత అండగా పక్కనే ఉన్న సిద్దిపేట నియోజకవర్గం నుంచి గెలిచిన హరీష్ రావు ఉన్నారు. మరో పక్క ముఖ్యమంత్రిని గెలిపించిన గజ్వేలు నియోజకవర్గం ఉంది. పాత మెదక్ జిల్లా టీఆర్ఎస్ కి పెట్టని కోట. సహజంగానే భర్తను కోల్పోయిన టీఆర్ ఎస్ అభ్యర్థికి సానుభూతి ఉంటుంది. హరీష్ రావు సమర్థంగా నిర్వహించిన ప్రచారం తోడ్పాటూ ఉంది. టీఆర్ ఎస్ విజయం తథ్యమని ఎవరిని అడిగినా చెబుతారు.  అయినా సరే, బీజేపీ ఎందుకు ఇంత హంగామా చేసింది?

టీఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయం తేల్చేది దుబ్బాకే

తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం ఎవరో నిర్థారించేది దుబ్బాక ఉపఎన్నిక. ఇక్కడ రెండో స్థానంలో ఎవరు నిలిస్తే వారే టీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థిగా ప్రజల గుర్తింపు పొందుతారు. 2023లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు పునాది ఈ ఎన్నికలలో పడాలి. అప్పటికి టీఆర్ ఎస్ ప్రభుత్వం రెండు టరమ్ లు అధికారంలో ఉండి ప్రజాదరణ కోల్పోతుందనీ, ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం వినియోగించుకోవాలంటే ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ నిలబడాలనీ, అందుకోసం ఈ ఎన్నికలలో సంపాదించే ఓట్ల సంఖ్య ఆధారంగా ప్రజాభిప్రాయం ఏర్పడుతుందనీ అంచనా. ఇదే అంచనాతో కాంగ్రెస్ పార్టీ కూడా మొత్తం బలగాన్ని రంగంలో దింపింది. దుబ్బాకలో జరిగిన రణగుణ ధ్వని 2018 ఎన్నికలలో కూడా జరగలేదు. సార్వత్రిక ఎన్నికల కంటే రసవత్తరంగా ప్రచారం జరిగింది. స్థానిక, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సమస్యలు కూడా చర్చకు వచ్చాయి. ఎందుకంటే రెండో స్థానంలో ఎవరు ఉన్నారో, టీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థి ఎవరో తేల్చుకోవలసింది దుబ్బాక గడ్డమీదనే కనుక.

హరీష్ రావు ధ్వజం

బీజేపీది అహంకారమనీ, అసహనమనీ, వాళ్ళవి దొంగమాటలనీ, దొడ్డిదారులనీ, చేయని పనులు కూడా చేసినట్టు ప్రచారం చేసుకంటున్నారనీ బీజేపీ నాయకులపైన హరీష్ రావు ధ్వజమెత్తారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ తండ్రికి వృద్దాప్య పింఛన్ వస్తున్నదనీ, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డికి రైతుబంధు పథకం కింద సహాయం అందుతోందనీ, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమపథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారనీ హరీష్ రావు చెప్పారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో పెద్ద బహిరంగ సభతో టీఆర్ఎస్ ప్రచారానికి హరీష్ రావు తెరదించారు.

రెండు జాతీయ పార్టీల మధ్య హోరాహోరీ

ఎన్నికల ఫలితంపైన ఎవ్వరికీ అనుమానాలు ఉండే ఆస్కారం లేదు. టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికే అవకాశాలు అత్యధికమనేది స్పష్టం. మెజారిటీ ఎంత సాధిస్తారన్నదే ప్రశ్న. కేసీఆర్ ఆశించినట్టు లక్ష ఓట్ల మెజారిటీ రాకపోవచ్చు. పోటీ అనూహ్యంగా పెరిగింది కనుక మెజారిటీ ఎంత వస్తుందో చెప్పడం కష్టం. రెండో స్థానానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటే ఆ పార్టీ లక్ష్యం నెరవేరినట్టే. హైదరాబాద్ కు దగ్గర కావడంతో బీజేపీ కార్యకర్తలను సమీకరించగలిగింది. 2019 లోక్ సభ ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ నాలుగు స్థానాలూ, కాంగ్రెస్ మూడు స్థానాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం అంతటా కార్యకర్తలు ఉన్నారు. ఓటర్లు కూడా ఉన్నారు. బీజేపీకి హైదరాబాద్ లోనూ, ఎంపీలను గెలిపించిన హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ , ఆదిలాబాద్ జిల్లాలలోనూ, అదనంగా వరంగల్లు జిల్లాలోనూ కార్యకర్తల బలం పెరిగింది. కొన్ని జిల్లాలలో ఇంకా ఉనికి చాటుకోవలసిన పరిస్థితి. బీజేపీ బలం విస్తరించాలంటే దుబ్బాకలో విజయం సాధించాలి. విజయం సాధ్యం కాకపోతే కనీసం రెండో స్థానంలో నిలవాలి. కాంగ్రెస్ కంటే ఎంత ఎక్కువ ఓట్లు సాధిస్తే అంత నమ్మకంగా రెండో స్థానంలో నిలబడి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ ను సవాలు చేయవచ్చు. రెండో స్థానం ప్రశాంతంగా  ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ కు కట్టబెడతారో, హంగామా చేసిన బీజేపీకి అందిస్తారో మంగళవారంనాడు దుబ్బాక ఓటర్లు నిర్ణయిస్తారు. వారి నిర్ణయం పదో తేదీన ఓట్లు లెక్కించినప్పుడు వెల్లడి అవుతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles