Wednesday, April 24, 2024

కరోనా నేపథ్యంలో ఆరోగ్య వ్యవస్థ పటిష్టం: కేసీఆర్ ఆదేశం

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ట పరచాలని, ప్రస్తుతం ఉన్న బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, మందులు, పరీక్షా కిట్లను అవసరం మేరకు సమకూర్చుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావును, వైద్యాధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా నగరపాలికల్లో సామాన్యులకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు హైదరాబాద్ తరహాలో మరిన్ని బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని సిఎం నిర్ణయించారు.

కేసీఆర్ సమీక్ష

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న సందర్భంలో వైద్య ఆరోగ్య శాఖపై సిఎం కెసిఆర్ సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు టి.హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, వెంకట్రాం రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఎ. జీవన్ రెడ్డి, హన్మంత్ షిండే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్యశాఖ కార్యదర్శి ఎస్.ఎ.ఎం.రిజ్వి, అధికారులు  శ్రీనివాస రావు, రమేశ్ రెడ్డి,  గంగాధర్, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

సిఎం కెసిఆర్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న వైద్యాధికారులు రాష్ట్రంలోని కరోనా పరిస్థితులను సిఎం కు వివరించారు. ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించాలని, ఎట్టి పరిస్థితుల్లో గుంపులు గుంపులుగా ఉండరాదని, ప్రభుత్వ కోవిడ్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించడం ద్వారా కరోనా నియంత్రించవచ్చని వైద్యాధికారులు తెలిపారు. లాక్ డౌన్ అవసరం ప్రస్తుతం లేదని వారు సిఎం కు నివేదిక ఇచ్చారు.

భయాందోళన అవసరం లేదు

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ఒమిక్రాన్ పట్ల ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, అదే సందర్భంలో అజాగ్రత్త పనికిరాదన్నారు. నిరంతరం  ప్రజలు అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలన్నారు. పని చేసే దగ్గర అప్రమత్తంగా ఉంటూ మాస్క్ లు ధరించాలని, ప్రభుత్వం జారీ చేసే కోవిడ్ నిబంధనలను పాటించాలని సిఎం కెసిఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

ప్రభుత్వం అన్నిరకాల ఏర్పాట్లతో కరోనాను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందని సిఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వైద్యారోగ్యశాఖను సన్నద్ధం చేయడం కోసం నిర్వహించిన సమీక్షా సమావేశంలో సిఎం కెసిఆర్ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

అన్ని పడకలకూ ఆక్సిజన్ సౌకర్యం

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ…రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానాల్లో ఉన్న మొత్తం బెడ్లల్లో దాదాపు 99 శాతం బెడ్లను ఇప్పటికే ఆక్సిజన్ బెడ్లుగా మార్చారని, మిగిలిన మరో శాతాన్ని కూడా తక్షణమే ఆక్సిజన్ బెడ్లుగా మార్చాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. గతంలో రాష్ట్రంలో కేవలం 140 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం మాత్రమే ఉన్న ఆక్సిజన్ ఉత్పత్తిని ఇప్పుడు 324 మెట్రిక్ టన్నులకు పెంచుకోగలిగామని, ఆక్సిజన్ ఉత్పత్తిని 500 మెట్రిక్ టన్నుల వరకు పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలని సిఎం కెసిఆర్ వైద్యశాఖాధికారులను ఆదేశించారు. హోం ఐసోలేషన్ చికిత్స కిట్లను 20 లక్షల నుంచి ఒక కోటి లభ్యతకు చర్యలు చేపట్టాలని,  ప్రస్తుతం 35 లక్షలున్న టెస్టింగ్ కిట్లను రెండు కోట్లకు పెంచాలని సిఎం ఆదేశించారు. అన్ని దవాఖానాల్లో డాక్టర్లు తక్షణం అందుబాటులో ఉండేలా చూడాలని, ఖాళీలను సత్వరమే భర్తీ చేయాలని సిఎం వైద్యాధికారులను ఆదేశించారు. ఏ కారణం చేతనైనా ఖాళీలు ఏర్పడితే 15 రోజుల్లో భర్తీ చేసుకునే విధంగా విధివిధానాలను రూపొందించాలని ఆదేశించారు. పెరుగుతున్న జనాభా అవసరాలరీత్యా జనాభా ప్రాతిపదికన, రాష్ట్రంలో డాక్టర్లు, బెడ్లు మౌలిక వసతులను పెంచుకొని వైద్యసేవలను మెరుగుపరచాలని సిఎం అన్నారు. నూతనంగా నిర్మించుకున్న సమీకృత కలెక్టర్ కార్యాలయాల్లోకి పలు శాఖల కార్యాలయాలు మారుతున్న దృష్ట్యా ఖాళీ అయిన పాత కలెక్టరేట్ కార్యాలయాలను, ఆయా శాఖల భవనాలను, స్థలాలను విద్యా, వైద్య శాఖ అవసరాల కోసం ప్రత్యేకించి కేటాయించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు.

డయాలిసిస్ సేవలు విస్తరించాలి

ప్రస్తుతం ఉన్న డయాలిసిస్ సేవలను మరింత విస్తరించాలని, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పది వేల మంది కిడ్నీ రోగులకు డయాలిసిస్ సేవలు అందుతున్న నేపథ్యంలో డయాలిసిస్ మిషన్లను మరిన్ని పెంచాలని సిఎం ఆదేశించారు.

 మరిన్ని బస్తీ దవాఖానాల ఏర్పాటుకు సిఎం కెసిఆర్ ఆదేశం :

ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా హైదరాబాద్ లో విజయవంతంగా అమలవుతూ సామాన్యులకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్న బస్తీ దవాఖానాలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నగరపాలికల్లో అవసరం మేరకు విస్తరించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కూడా బస్తీ దవాఖానాల సంఖ్యను మరింతగా పెంచాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు.

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ… హెచ్ఎండిఎ పరిధిలోని కంటోన్మెంట్ జోన్ పరిధిలో ప్రజలకు సరైన వైద్య సేవలు మెరుగుపరిచేందుకు వార్డుకొకటి చొప్పున 6 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. అదేవిధంగా రసూల్ పుర -2, ఎల్.బి.నగర్-1, శేర్ లింగంపల్లి-1, కుత్బుల్లాపూర్-1, కూకట్ పల్లి-1, ఉప్పల్-1, మల్కాజిగిరి-1, జల్ పల్లి-1, మీర్ పేట-1, పిర్జాదీగూడ-1, బోడుప్పల్-1, జవహర్ నగర్-1, నిజాంపేట్ -1 చొప్పున బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని  వైద్యాధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా బస్తీ దవాఖానాలు

అదే సందర్భంగా హైదరాబాద్ బస్తీ దవాఖానాల స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా నగరపాలికల్లో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని, అందులో భాగంగా వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 4 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా  జగిత్యాల – 1, సూర్యాపేట – 1, సిద్ధిపేట – 1, మహబూబ్ నగర్-2, నల్గొండ-2, మిర్యాలగూడ-1, రామగుండం-2, ఖమ్మం-2, నిజామాబాద్-3, కరీంనగర్-2, కొత్తగూడెం-1, పాల్వంచ-1, నిర్మల్-1, మంచిర్యాల-1, తాండూర్-1, వికారాబాద్-1, బోధన్-1, ఆర్మూర్-1, కామారెడ్డి-1, సంగారెడ్డి-1, జహీరాబాద్-1, గద్వాల్-1, వనపర్తి-1, సిరిసిల్ల-1, తెల్లాపూర్-1, బొల్లారం-1, అమీన్ పూర్-1, గజ్వేల్-1, మెదక్-1 చొప్పున బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలన్నారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles