Monday, June 24, 2024

వంద కోట్ల మందికి టీకాలు

కరోనా వైరస్ ను అరికట్టే మహాయజ్ఞంలో భాగంగా ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా ముందుకు దూసుకు వెళ్తోంది. 100 కోట్ల డోసులు పూర్తయ్యాయి. ఈ ఘట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అపురూపంగా భావిస్తోంది. సరికొత్త చరిత్రను సృష్టించాం అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గీతాన్ని విడుదల చేసింది. ఈ ఘన ఘడియలలో వేడుకలు చేసుకుందాం అంటోంది. భారత దేశం స్వావలంబన దిశగా వేసిన గొప్ప అడుగుగా అభివర్ణిస్తోంది. వ్యాక్సిన్  తయారీలోనూ, పంపిణీలోనూ నవచరిత్ర నమోదైందని  భారత ప్రభుత్వం ఆనందాన్ని వ్యక్తపరుస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి మన్ సుఖ్ మాండవీయ ట్విట్టర్ వేదికగా ఆడియో విజువల్ రూపంలో ఉన్న పాటను పంచుకున్నారు. `టీకా సే బచా హై దేశ్..` అనే పల్లవితో ఉండే ఈ పాటను కైలాశ్ ఖేర్ ఆలపించాడు. దేశాన్ని కాపాడుతున్న టీకాలు… అని దీని అర్థం.

100 వారసత్వ కట్టాడాలను జాతీయ పతాక వర్ణాల వెలుగుల్లో నింపేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మనదేశంలో జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. తొమ్మిది నెలలు పూర్తయ్యాయి. నేటికి 100 కోట్ల మైలురాయి పూర్తయిన సందర్భంగా పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిస్సందేహంగా ఇది మంచి సందర్భమే. కాదని ఎవ్వరమూ అనలేము. కానీ ఇంత ప్రచారం, అంత హడావిడి అవసరమా అంటూ మేధావులు ముక్కున వేలేసుకుంటున్నారు. దేశంలో జరిగే ప్రతి సందర్భాన్ని బిజెపి ప్రభుత్వం తమ పార్టీ ప్రచారానికి వాడుకుంటోందని ప్రతిపక్షాలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి.

కరోనా కట్టడిలో ముందంజ

 వ్యాక్సినేషన్, నిబంధనల అమలువల్ల కరోనా కట్టడిలో భారత్ ముందడుగు వేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ప్రశంసించింది. కేసుల నమోదు, మరణాలు తగ్గుముఖం పట్టడం కొంతవరకూ వాస్తవమేనని భావించాలి. కానీ, గడచిన 24 గంటల్లో ఒక్కసారిగా నాలుగువేల కేసులు పెరిగినట్లు తెలుస్తోంది. కొత్త కేసులు నమోదవ్వడాన్ని తేలికగా తీసుకోరాదని వైద్యులు అంటున్నారు. మన దేశ జనాభా సుమారు 140కోట్లు. అందరికీ రెండు డోసులు పూర్తవ్వాలంటే 280 కోట్ల డోసుల పంపిణీ జరగాలి. ప్రస్తుతం 100కోట్లు  పూర్తయినప్పటికీ, 30 శాతం లోపు జనాభాకే అందినట్లు లెక్క. 70 శాతానికి పైగా ప్రజలు కేవలం ఒక్కడోస్ మాత్రమే తీసుకున్నారు. సెకండ్ వేవ్ ముగింపు దశలో మనదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమైంది. తొలిదశలో ఆశించినట్లు జరగకపోవడంవల్ల చాలా నష్టపోయాము. మొదటి డోసు – రెండవ డోసుకు మధ్య ఉండే వ్యవధి విషయంలో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క పద్ధతిని అవలంబిస్తున్నాయి. సింగిల్ డోస్ ప్రక్రియ ఇంకా వేగాన్ని అందుకోలేదు. చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా మొదలవ్వలేదు.

దేశ జనాభాలో సుమారు 40 శాతం మంది 18 ఏళ్ళ కంటే తక్కువ వయస్సువారు కావడం గమనార్హం. వీరికి కూడా వ్యాక్సిన్లు సత్వరమే అందించడం చాలా అవసరం. రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్నవారికి కూడా కరోనా సోకుతోంది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడం, గొంతునొప్పి మొదలైనవాటితో వీరు సతమతమవుతున్నారు. కొందరికి మరణం కూడా సంభవించింది. కరోనాతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలే దీనికి కారణమని చెబుతున్నారు. రెండు డోసులు పూర్తి చేసుకున్నవారు కొందరు యాంటీబాడీస్ పరీక్షలు చేయించుకుంటున్నారు. యాంటీ బాడీస్ ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని కొందరు అంటున్నారు. వ్యాక్సిన్ల సమర్ధత, యాంటీబాడీస్ అభివృద్ధిపై సమగ్రమైన పర్యవేక్షణ, సమీక్షలు, పరీక్షలు జరగాలి. వ్యాక్సిన్ల వల్ల ప్రాణాపాయం తప్పుతుందని అంటున్నారు అది మంచివిషయమే. కానీ, క్షేత్రస్థాయి వాస్తవాలు సంపూర్ణంగా తెలియరావడం లేదు.

దేశ జనాభాలో 60శాతం మందికి రెండు డోసులు పూర్తయితే కానీ, సామూహిక రోగ నిరోధకశక్తి (హెర్డ్ ఇమ్మ్యూనిటీ) పెరగదంటున్నారు. బూస్టర్ డోసులు కూడా అవసరమంటున్నారు. మనదేశంలో ఇంకా ఇది మొదలవ్వలేదు. ప్రస్తుతం అందుబాటులో వున్న వ్యాక్సిన్ల ప్రభావం కొన్ని నెలలు మాత్రమే ఉంటుంది. పూర్తి స్థాయి జీవితకాలం (లైఫ్ టైమ్) వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తే కానీ ఈ ప్రక్రియ సంపూర్ణంగా విజయవంతమయినట్లు లెక్క. అప్పటి వరకూ తరచూ వ్యాక్సిన్లు వేయించుకోవాల్సిందే.  జాగ్రత్తలు పాటించాల్సిందే. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు -సమాంతరంగా నిర్లక్ష్యవైఖరి కూడా ప్రజల్లో పెరుగుతోంది. జనాభాలో ఎక్కువశాతం నిబంధనలను పాటించడం లేదు. విద్యాలయాలు తెరుచుకున్నాయి. సినిమా ధియేటర్స్ లో 100% శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చేశాయి. పండగల సీజన్ ప్రారంభమైంది.

కరోనా తిరగ పెడుతుందా?

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, కరోనా వైరస్ వ్యాప్తి మళ్ళీ పెరిగేలా ఉంది. వ్యాక్సినేషన్ లో అనుకున్న లక్ష్యాలను సాధించడం, కొత్త లక్ష్యాలను సంకల్పం చేసుకోవడం ప్రభుత్వాల బాధ్యత. క్రమశిక్షణగా మెలగడం ప్రజల వంతు.100 కోట్ల మైలురాయిని చేరుకోవడంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుదాం.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles