Friday, March 29, 2024

పోలవరం కుంటినడక ఎవరి శాపం?

  • కేంద్రం నిధులు ఇవ్వదు, రాష్ట్రం దగ్గర లేవు
  • కేంద్ర-రాష్ట్ర సంబంధాల బాగానే ఉన్నా నిధులు గుండు సున్నా
  • నిందలు మాని ప్రాజెక్టును పూర్తి చేసే చొరవ చూపండి

గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ బహుళార్ధ సాధక నీటి పారుదల పథకం. ఇది ఆంధ్రప్రదేశ్ లోని కోట్లాది ప్రజల జీవనాడి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర పునర్విభజనలో భాగంగా చట్టం చేసింది. ఇప్పుడు డబ్బులు లేవంటూ యూ టర్న్ తీసుకుంది. ఇది ఏ మాత్రం న్యాయం కాదు. ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు తెలంగాణ ప్రాంతానికి హైదరాబాద్ వంటి సర్వ వసతులు, ఆదాయ వనరులు కలిగివున్న రాజధాని దక్కింది. ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేదు. ఆదాయం పెద్దగా లేదు. ఇవ్వన్నీ గుర్తెరిగి పార్లమెంట్ లో అప్పుడు చట్టం చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర పెద్దలు  మాట ఇచ్చారు. తదనంతర పరిణామాల్లో,  ప్రత్యేక ప్యాకేజి పేరుతో ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకుంది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజికి తలవగ్గడం వల్లనే కేంద్రం మాట మార్చిందనే విమర్శలు వై సి పి చేస్తోంది. కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని 20వేల కోట్ల రూపాయలకే కుదిస్తూ, ఆర్ధిక సాయం చేయలేమని చేతులెత్తేసింది. ఇది చాలా అన్యాయం. ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. చిన్న రాష్ట్రం.  ఆదాయ వనరులు అంతంత మాత్రమే ఉన్న రాష్ట్రం. పార్టీల రాజకీయాలు, నేతల అవినీతి ఆరోపణలు అలా ఉంచగా, సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి?  రాష్ట్రంలో డబ్బులు లేనేలేవు. ఈ ప్రాజెక్టును భరించే శక్తి అస్సలు లేదు. పోలవరం ప్రాజెక్టులో ఖర్చు స్థూలంగా రెండు రకాలు. (1) ప్రాజెక్టు నిర్మాణ వ్యయం (2) భూసేకరణ, పునరావాస ప్యాకేజిలు మొదలైనవి. ఈ రెండూ కలిపి మొత్తంప్రాజెక్టు ఖర్చుగా  అంచనా వెయ్యాలి. ఎప్పుడో 1930-40లోనే  సర్ ఆర్ధర్ కాటన్ నదుల అనుసంధానం చెయ్యమని సూచించారు. 1941లో అప్పటి ప్రభుత్వ ప్రధాన ఇంజనీర్ దివాన్ బహుద్దర్ ఎల్. వెంకటకృష్ణయ్య అయ్యర్ గోదావరిపై పోలవరం వద్ద జలాశయాన్ని నిర్మించాలని ప్రతిపాదించాడు. 1946-47లో ప్రఖ్యాత ఇంజనీర్ కె ఎల్ రావు రామ పాద సాగరం పేరుతో ప్రాజెక్టు నివేదిక ఇచ్చారు. తర్వాత చాలా ఏళ్ళ తర్వాత,  అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శంకుస్థాపన చేశారు. 2004లో,  వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఈ ప్రాజెక్టు పురోగతి ప్రారంభమైంది. 2015లో జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం గుర్తించింది. మెల్లగా ప్రాజెక్టు ప్రారంభమై ప్రస్తుతానికి కొంత పని జరిగింది. డబ్బులు సంపూర్ణంగా అందుబాటులో వుంటే  ఒక సంవత్సర కాలంలో ప్రాజెక్టు సంపూర్ణమవుతుందని ఇంజనీరింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also read: మహామహోపాధ్యాయుడు సర్వేపల్లి

అంచనాల సవరణ షరా మామూలే

ప్రాజెక్టు అంచనాలు వివిధ దశల్లో మార్పులకు గురయ్యాయి. ప్రారంభంలో 16,716 కోట్లగా ఉంది. 2017-2018 సమయానికి ప్రాజెక్టు వ్యయం 55వేల కోట్లకు పైగా చేరింది. ఇది సవరించిన అంచనా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర జలసంఘం, టారిఫ్ నిర్ణయించే ఇంజనీరింగ్ కమిటీ, పోలవరం ప్రాజెక్టు అధారిటీ అందరూ ఈ వ్యయాన్ని అంగీకరించారు. తదనుగుణంగా అనుమతులు కూడా వచ్చాయి. ప్రాజెక్టు ప్రారంభంలో అంచనా ఒక రకంగా ఉన్నా, నిర్మాణ క్రమంలో ఖర్చులు మారుతుంటాయి. ఇది చాలా సాధారణమైన అంశం. దీన్ని కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది కాబట్టి, సంపూర్ణంగా కేంద్రం  బాధ్యత తీసుకోవాల్సిందే. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమయంలో అంచనాలు భారీగా పెంచారని, అనునూయులకే ప్రాజెక్టులు  కట్టబెట్టారని, కోట్లాది రూపాయలు చేతులు మారాయని, పెద్ద స్థాయిలో అవినీతి జరిగిందని వై సి పి ఆరోపణలు చేస్తోంది. ఎత్తిపోతల పేరుతోనూ ఇదే తంతు నడిచిందనే విమర్శలు చంద్రబాబు ప్రభుత్వంపైన  ఉన్నాయి. అనవసరంగా ఎత్తిపోతల పేరుతో కోట్లాది రూపాయలు వృధా చేశారని, అసలు ఆ డబ్బుతోనే ప్రాజెక్టు పూర్తి చేయవచ్చనే విమర్శలూ  ఉన్నాయి. వై సి పి ప్రభుత్వం వచ్చిన తర్వాత, వాళ్ళ అనునూయులకే ప్రాజెక్టులు కేటాయించారని తెలుగుదేశం విమర్శిస్తోంది. ఈ విమర్శలు, రాజకీయాలు పక్కనే పెడితే, పోలవరం ప్రాజెక్టు సత్వరమే పూర్తి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతం ప్రభుత్వం తప్పులు, ఇప్పటి ప్రభుత్వం తప్పులు, కేంద్ర ప్రభుత్వం తప్పులు అంటూ… ఒకరినొకరు తిట్టిపోసుకోవడం వల్ల కాలయాపన తప్ప ప్రజలకు ఎటువంటి ప్రయోజనం వనకూరదు. అవినీతి జరిగివుంటే, విచారణ నిజాయితీగా  జరిగితే, దోషులకు తగిన సమయంలో పడాల్సిన శిక్షలు పడతాయి. పడాలి కూడా. అందులో సందేహమే లేదు. ప్రస్తుత అంశం, ప్రాజెక్టు పూర్తి చెయ్యడమే.

Also read: జనని సంస్కృతంబు

అప్పోసొప్పో చేసి కేంద్రమే నిధులు సమకూర్చాలి

కేంద్ర ప్రభుత్వం డబ్బులు లేవంటోంది.  రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అస్సలు డబ్బులే లేవు. అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని,  ప్రపంచ బ్యాంకు  నుంచో, ఆసియన్ డెవలెప్ మెంట్  బ్యాంకు నుంచో, ఏవో బ్యాంకుల నుంచి కేంద్ర ప్రభుత్వం హామీగా ఉండి ప్రాజెక్టుకు నిధులు సమకూర్చడమే ముందున్న ప్రధాన కర్తవ్యం. ఇంతవరకూ ఎంత శాతం పని పూర్తయింది, ఎంత ఖర్చు అయింది, కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది, ఆ డబ్బు ఏ విధంగా ఇప్పటి వరకూ ఖర్చు పెట్టారు,  ఇంకా జరగాల్సిన పని ఎంత, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత సమయం పడుతుంది అనే అంశాలపై కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమీక్ష నిర్వహించాలి. ముందుగా కేంద్ర, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రులు, అధికారులు సమావేశం అవ్వాలి. తర్వాత ప్రధాన మంత్రితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భేటీ అవ్వాలి. ప్రస్తుతానికి కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, బిజెపి-వైసీపీ మధ్య, ప్రధానమంత్రి నరేంద్రమోదీ-    ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య పెద్దగా వివాదాలు ఏమీలేవు. సంబంధ బాంధవ్యాలు బాగానే ఉన్నాయని భావించాలి. ఈ తరుణంలో ఇద్దరూ కలిసి సాగాలి. పోలవరం ప్రాజెక్టు నేడు ఈ పరిస్థితికి రావడానికి కారణం గత చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేసుకున్న ఒప్పందాలే ప్రధాన కారణమని, ఈ ప్రాజెక్ట్  విషయంలో మేము కేవలం సమన్వయ కర్తలుగానే ఉంటామని రాష్ట్ర నీటి పారుదల శాఖా అప్పటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒక మీడియా సమావేశంలో అన్న వ్యాఖ్యలు కొందరు ఇప్పటికీ గుర్తుచేస్తూ వుంటారు.

Also read: ఇక జార్ఖండ్ పై ఖడ్గప్రహారం?

కేంద్రానికి అప్పజెప్పడమే వివేకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిగా కేంద్రానికి అప్పచెప్పడమే సరియైన పద్ధతి. వారు ఏ కాంట్రాక్టర్ కు ఈ ప్రాజెక్టును  కేటాయించినా, బడ్జెట్ విషయం ఎంతైనా, పూర్తిగా కేంద్ర నిర్ణయానికి వదిలివెయ్యడమే వివేకమైన చర్య. ఇది తప్ప ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇంకొక మార్గం లేదని నిపుణుల అభిప్రాయం. తెలుగు రాష్ట్రాల్లో బిజెపి తన బలాన్ని పెంచుకోవాలనే ఆలోచనలో ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వలేదనే కోపం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది. 2019ఎన్నికల్లో బిజెపికి ఘోరమైన ఫలితాలు రావడానికి ప్రత్యేక హోదా కూడా ఒక ప్రధానమైన కారణమే. ఇప్పుడు, రాష్ట్రంలో  ఏ పార్టీ కూడా  ప్రత్యేక హోదా కోసం బిజెపి ప్రభుత్వంపై  బలంగా  యుద్ధం చేసే పరిస్థితిలో  లేదనే చెప్పాలి. బిజెపి ఆంధ్రప్రదేశ్ లో బలపడటానికి పోలవరం ప్రాజెక్టును ఒక బలమైన ఆయుధంగా ఉపయోగించుకోవచ్చని కొందరు రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ అంశంలో అధికారంలో ఉన్న వై సి పి, బిజెపి రాష్ట్ర నాయకులు వ్యూహాత్మకంగా ముందుకు సాగి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పోలవరం  ప్రాజెక్టు పూర్తి చేసుకోవడమే శరణ్యం. ఇది అనుకున్నట్లుగా పూర్తయితే కోట్లాది మంది ప్రజలతో పాటు, వై సి పి కి, బిజెపికి కూడా ఆయా స్థాయిలలో రాజకీయమైన ప్రయోజనం (పొలిటికల్ మైలేజ్ ) నెరవేరుతుంది. అటు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ -ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతారు. విభజన చట్టం ప్రకారం పోలవరం నిర్మించే పూర్తి బాధ్యత కేంద్రానిదే.

Also read: ‘హరికథా పితామహుడు’ ఆదిభట్ల

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles