Friday, April 26, 2024

ఆత్మీయత, గౌరవం, ప్రేమాభిమానాల సంగమమే అలయ్-బలయ్ – ఉపరాష్ట్రపతి

  • ముందు తరాలకు మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించాలి
  • సాంస్కృతిక పునరుజ్జీవనం మనందరి బాధ్యత.
  • కులం, ప్రాంతం, వర్గాలకు అతీతంగా సమాజాన్ని ఏకం చేయగల శక్తి సంస్కృతికి ఉంది
  • ఎందరో మహనీయుల త్యాగాల ద్వారా అందిన వారసత్వాన్ని ముందుకు తీసుకువెళుతూ, అస్తిత్వాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది
  • హైదరాబాద్ లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి
  • సోదరభావానికి ప్రతీక అయిన అలయ్ – బలయ్ ని నిరాటంకంగా కొనసాగిస్తున్న శ్రీ బండారు దత్తాత్రేయ గారిని అభినందించిన ఉపరాష్ట్రపతి

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతదేశం వివిధ సంస్కృతులు, సంప్రదాయాలు, అచార వ్యవహారాలకు ప్రతీక అని… అందులో ఆత్మీయత, గౌరవం, ప్రేమాభిమానాల సంగమమే అలయ్-బలయ్ కార్యక్రమం అని గౌరవ ఉపరాష్ట్రపతి ముప్నవరపు వెంకయ్య నాయుడు గారు తెలిపారు. హర్యానా గవర్నర్ బంగారు దత్తాత్రేయ హైదరాబాద్ నక్లెస్ రోడ్ లోని జల్ విహార్ లో నిర్వహించిన అలయ్ – బలయ్ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు – ఆచార వ్యవహారాలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం తనకు ఎంతో ఉత్సాహాన్ని అందిస్తుందని తెలిపారు.
వేలకొలదీ విదేశీ దండయాత్రలు, మరెన్నో కుట్రలు జరిగినప్పటికీ, ఎన్నో నాగరికతలు కాలగర్భంలో కలసిపోయినా, భారతదేశానికే ప్రత్యేకమైన అస్తిత్వం ఇంకా నిలబడి ఉండడానికి కారణం మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణేనన్న ఉపరాష్ట్రపతి, అలయ్ – బలయ్ కూడా అలాంటి కార్యక్రమమేనని తెలిపారు. స్వరాజ్య ఉద్యమ సమయంలో ప్రజలందరినీ ఏకం చేసేందుకు వినాయక చవితి ఉత్సవాలకు పిలుపునిచ్చిన బాలగంగాధర్ తిలక్ ని గుర్తు చేసుకున్న ఉపరాష్ట్రపతి, అదే స్ఫూర్తితో ప్రజలందరిలో ఏకతా భావాన్ని నింపేందుకు కోవిడ్ సమయాన్ని మినహాయిస్తే 13 ఏళ్ళుగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హర్యాణా బండారు దత్తాత్రేయకి అభినందనలు తెలిపారు.

సమాజం, కుల, ప్రాంత, వర్గాలకు అతీతంగా అందరినీ ఒకచోట చేర్చగలిగే శక్తి సంస్కృతికి ఉందన్న ఉపరాష్ట్రపతి, గతమే గాక వర్తమాన, భవిష్యత్తుల్లోనూ సమాజాన్ని ఏకం చేసేది సంస్కృతే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ప్రజలంతా ఒకే చోటకు చేరి మంచి ఆలోచనలు పంచుకున్నప్పుడు ఏదైనా సాధించేందుకు వీలు పడుతుందని, తోటి వారిని ఎలా గౌరవించుకోవాలో అలయ్ – బలయ్ లాంటి కార్యక్రమాలు తెలియజేస్తాయన్నారు. స్వరాజ్య ఉద్యమ సమయంలో సంస్కృతిని విచ్చిన్నం చేసే ప్రయత్నాలు జరిగినా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నాటి మహనీయులు ఆచార వ్యవహారాలను కాపాడుకుని, మనకు అందజేశారని, వారి త్యాగాల ద్వారా మనకు అందిన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ.. మన అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు. సాంస్కృతిక పునరుజ్జీవనం మనందరి బాధ్యతని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖామాత్యులు జి. కిషన్ రెడ్డి, తెలంగాణ హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రముఖ వైద్యులు నాగేశ్వర రెడ్డి, రెడ్డి ల్యాబ్స్ అధినేత సతీష్ రెడ్డి, భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు కృష్ణ యెల్లా, బయోలాజికల్-ఈ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్ల, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles