Monday, March 20, 2023

ఆంధ్రపత్రిక రాజేశ్వరరావుకు ఆరో ప్రాణం

సోమవారం రాత్రి శాశ్వతంగా కన్నుమూసిన చెన్నమనేని రాజేశ్వరరావుకు ‘ఆంధ్రపత్రిక’తో ఉన్న అనుబంధం వెలకట్టలేనిది. ఆంధ్రపత్రిక యాజమాన్యం ఆయనను గౌరవించింది. ‘ఆంధ్రపత్రిక’ను రాజేశ్వరరావు గుండెల్లో పెట్టుకున్నారు. ఆంధ్రపత్రిక ఆయనకు ఆరో ప్రాణం. దిల్లీలో ఏ తెలుగు పత్రికకీ విలేఖరి లేని రోజుల్లో ఆంధ్రపత్రిక రాజేశ్వరరావును దిల్లీ విలేఖరిగా నియమించింది. 1965 నుంచి 1982 వరకూ ఆయన దిల్లీలో పని చేశారు. ఆయన తర్వాతనే ‘ఆంధ్రజ్యోతి’ విలేఖరిగా రామకృష్ణ, ‘ఉదయం’ ప్రతినిధిగా ఆదిరాజు వెంకటేశ్వరరరావు పని చేశారు. నేను దిల్లీలో పని చేసే నాటికి (1992-94) దిల్లీలో తెలుగు పత్రికల విలేఖరులతో బ్యూరోలు వెలిశాయి. నేను ‘ఆంధ్రజ్యోతి’ బ్యూరీ చీఫ్ గా పని చేసే రోజుల్లో నాతో పాటు నలుగురు విలేఖరులు ఉండేవారు. ఒకరకంగా చెప్పాలంటే చెన్నమనేని రాజేశ్వరరావు దిల్లీలో తెలుగు విలేఖరులకు ఆద్యులు.

ఆంధ్రపత్రికలో పని చేస్తున్న రోజులలోనే ఒక ఘటన జరిగింది. హైదరాబాద్ బ్యూరోలో రాజేశ్వరరావు పని చేస్తున్నారు. కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం స్వీకరించి ఏడాది అయిన సందర్భంగా పత్రికలలో ప్రత్యేక వ్యాసాలు ప్రచురించారు. ముఖ్యమంత్రిని ఆకాశానికి ఎత్తుతూ మిగతా పత్రికలన్నీ రాశాయి. ఆంధ్రపత్రికలో వ్యాసం చెన్నమనేని రాజేశ్వరరావు రాశారు. ఆయన ముఖ్యమంత్రిని పొగడలేదు. ఆయన తీసుకున్న నిర్ణయాల మంచిచెడులనూ, నిర్ణయాలు తీసుకున్నతీరునూ విమర్శిస్తూ, సమీక్షిస్తూ  రాశారు. కాసువారు తనను పొగిడిన పత్రికలను పక్కన పెట్టి తనను విమర్శిస్తూ రాసిన రాజేశ్వరరావు వ్యాసాన్ని ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చదువుకున్నారు. ‘ఆంధ్రపత్రిక’ యజమాని శివలెంక శంభుప్రసాద్ సంపాదకుడు. ఆయన కాసు బ్రహ్మానందరెడ్డికి సన్నిహితుడు. శంభుప్రసాద్ రాజ్యసభ సభ్యుడుగా చేశారు. వారిద్దరిదీ ప్రగాఢమైన మైత్రి. ఈ విషయం రాజేశ్వరరావుకు తెలుసు. అయినా సరే రాజీపడడం తెలియదు. ముక్కుకు సూటిగా, ఉన్నది ఉన్నట్టుగా రాయడం ఆయన పద్ధతి. అదే తన విధ్యుక్తధర్మం అనుకునేవారు. సత్యనిష్ఠ పాటిస్తూ, సమాజ హితం ఆకాంక్షిస్తూ ప్రజలకు నిజాలు మాత్రమే చెప్పాలనే పట్టింపు కలిగిన పాత్రికేయుడు. రాయడమైతే రాశారు. అది పత్రికలో ప్రచురించారు. కానీ తన ఉద్యోగం ఉంటుందా, ఊడుతుందా అనే సంశయంతో రాజేశ్వరరావు ఊగిసలాడుతున్న సమయంలోనే సంపాదకుడి దగ్గరి నుంచి కబురు వచ్చింది. ‘అంతే సంగతులు’ అని మనసులో అనుకొని రాజీనామా లేఖను టైపు చేసుకొని, జేబులో పెట్టుకొని సంపాదక మహాశయుడి గదికి వెళ్ళారు. ముఖ్యమంత్రితో సంపాకులకు ఉన్న మైత్రి విషయం తెలుసుననీ, తన వ్యాసం కారణంగా ఆ మైత్రికి భంగం కలిగే అవకాశం ఉన్నట్టు కూడా ఎరుకేననీ, అయినా వాస్తవాలు రాయవలసి వచ్చిందనీ చెప్పారు. రాజీనామాలేఖ సంపాదకుడికి అందిస్తూ ఆమోదించవలసిందిగా అభ్యర్థించారు. రాజీనామా లేఖను చదువుకొని శంభుప్రసాద్ నవ్వుతూ ‘నాకూ, ముఖ్యమంత్రిగారికీ సన్నిహిత సంబంధాలు ఉన్నమాట నిజమే. కానీ నీ వ్యాసం చాలా బాగుంది. అందులో దోషం ఏమీ లేదు. నువ్వు రాసిన విషయం నిజం. అందుకు అభినందిస్తున్నాను. పాత్రికేయంలో ప్రజలే ప్రధానమనీ, యజమాని, సంపాదకుడు,ముఖ్యమంత్రి కాదనీ నిరూపించావు నువ్వు కుర్రాడివైనా. శభాష్’’ అంటూ ప్రశంసించారు. ఆశ్చర్యంతో, ఆనందంతో రాజేశ్వరరావు సంపాదకుడి వద్ద సెలవు తీసుకున్నారు. ఆ తర్వాతనే ఆయనను దిల్లీకి పంపించాలని శంభుప్రసాద్  నిర్ణయించారు.

దిల్లీలో ఇందిరాగాంధీని తరచుగా ప్రశ్నించడంతో రాజేశ్వరరావు పేరు ఆమెకు గుర్తుండిపోయింది. ‘మిస్టర్ రాజేశ్వరరావు’ అని సంబోధించేవారు. రాష్ట్రపతులతో కూడా పరిచయాలు ఉండేవి. అధికార, ప్రతిపక్ష నాయకులతో సంబంధం ఉండేది. ఆయన పని చేసినంతకాలం దిల్లీలో బ్యూరో చీఫ్ గా ఎవ్వరూ పని చేయలేదు. ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’ కృష్ణారావు రాజేశ్వరరావు రికార్డును అధిగమించారు. దిల్లీలో సత్యనారాయణరావు పార్లమెంటు సభ్యుడిగా ఉండేవారు. వీరిద్దరిదీ ఒకే ప్రాంతం. మొదట్లో రాజేశ్వరరావు సత్యనారాయణరావు క్వార్టర్ లోనే ఉండేవారు. తర్వాత కుటుంబం వచ్చిన తర్వాత ఆయన, మాజీ ఎంఎల్ సి కమలాకరరావు ఒకే భవనంలో వేర్వేరు అంతస్తులలో ఉండేవారు. జవ్వాది చొక్కారావు కూడా రాజేశ్వరరావుకి సన్నిహితులు.

రాజేశ్వరరావు భౌతికవాది. గుడికి వెళ్ళకూడదనే పట్టింపులేదు కానీ గుడులూ గోపురాలు సందర్శించడం పెద్దగా ఇష్టం ఉండేది కాదు. మేనమామ కుమార్తె అంజలిని ప్రేమించిన రాజేశ్వరరావు హైదరాబాద్ లోనే గుడిలో గుట్టుచప్పుడు కాకుండా వివాహం చేసుకున్నారు. అదే సంవత్సరం 1963లోనే ఆయన డిగ్రీ పూర్తి చేసి, బీవీ రాజు నడిపే ‘డెయిలీన్యూస్’లో విలేఖరిగా చేరి జర్నలిజంలో ప్రవేశించారు. 1939లో కరీంనగర్, జగిత్యాల రోడ్డులో కరీంనగర్ కు పదిహేను కిలోమీటర్ల దూరంలో  వెదిరి గ్రామంలో మాధవరావు, చిలకమ్మ దంపతులకు రెండో కుమారుడిగా జన్మించిన రాజేశ్వరరావు కరీంనగర్ లో విద్యాభ్యాసం కొనసాగించారు. శ్రీరాజరాజేశ్వరీ కళాశాలలో రాజేశ్వరరావు బీఏ చదువుతున్న రోజుల్లో ప్రఖ్యాత కవి విశ్వనాథ సత్యనారాయణ ఆ కాలేజీ ప్రిన్సిపాల్ గా పని చేసేవారు. తెలుగు భాషావేత్త వెల్చేరు కొండలరావు వైస్ ప్రిన్సిపాల్ గా పని చేసేవారు. రాజేశ్వరరావు విద్యార్థి సంఘం అద్యక్షుడుగా ఎన్నికైనారు. రాజేశ్వరరావు, అంజలి దంపతులకు మొదట ఒక కుమార్తె. ఆమె పేరు హరిత. తర్వాత ఇద్దరు కుమారులు – సతీష్, సంజయ్. రెండేళ్ళు ‘డెయిలీ న్యూస్’ లో చేసిన తర్వాత ఆంధ్రపత్రికలో ముక్కుశర్మగారి నాయకత్వంలోని బ్యూరోలో చేరారు. దిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఉదయంలో ప్రత్యేక ప్రతినిధిగా పని చేశారు. అనంతరం రాష్ట్ర విద్యున్మండలిలో అధికారిగా పని చేశారు. ఎన్ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పబ్లిక్ రిలేషన్స్ అధికారిగా ప్రభుత్వంలో పని చేశారు. కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలోనూ కొనసాగారు. తర్వాత వార్తలో ప్రత్యేక ప్రతినిధిగా పని చేశారు. ఆ తర్వాత మనతెలంగాణ, హెచ్ఎంటీవీకి సలహాదారుగా పని చేశారు.

విశాలంధ్ర సంపాదకుడు చక్రవర్తుల రాఘవాచారి, చెన్నమనేని రాజేశ్వరరావు మంచిమిత్రులు. పంజాగుట్టలోని జర్నలిస్టులకాలనీలో ఇద్దరి ఇళ్ళూ పక్కపక్కనే ఉండేవి. కాలక్రమంలో ఇద్దరూ ఇళ్ళు అమ్మేశారు కానీ ఆ రెండు కుటుంబాల మధ్య స్నేహం శాశ్వతంగా నిలిచింది. రాఘవాచారికి ఇద్దరు కుమార్తెలు ఉండేవారు. చిన్నకుమార్తె గుంటూరు లో స్కూటర్ ప్రమాదంలో చనిపోయింది. పెద్ద  కూతురు అనుపమ (డాలీ) వైద్యురాలు. ఆమెను రాజేశ్వరరావు రెండో కొడుకు సంజయ్ ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. బోయినపల్లిలో రాజేశ్వరరావు కుటుంబం నివసిస్తున్నది. అక్కడే అనుపమ ఆస్పత్రి నిర్వహిస్తున్నది.

దిల్లీ వెళ్ళక ముందు ఎదురైన అనుభవమే దిల్లీ నుంచి వచ్చిన తర్వాత కూడా చవిచూడవలసి వచ్చింది. ఎన్ టి రామారావు ముఖ్యమంత్రి. ఆయన వివేకానందుడిలాగా వేషం వేయడం, సన్యాసిలాగా కాషాయవస్త్రాలు ధరించడంతో పాటు తాను మనస్సన్యాసినంటూ ప్రకటించుకున్నారు. అది నిజం కాదనీ, ఎన్ టి రామారావు పేరు మీద చాలా ఆస్తులు ఉన్నాయనీ వెల్లడిస్తూ ఆస్తుల వివరాలు రాస్తూ ఒక పరిశోథనాత్మక కథనం రాశారు రాజేశ్వరరావు. ఆంధ్రపత్రిక యాజమాన్యానికి ఉన్నటువంటి విశాల హృదయం, నిజాయితీ  ఈ పత్రిక యాజమాన్యానికి లేకపోయింది. ఎన్ టి ఆర్ ను విమర్శించినందుకు విజయవాడకు బదిలీ చేశారు. బదిలీ వేటును నిరసించి ఉద్యోగానికి రాజీనామా సమర్పించారు. సత్యాభినివేశమే కాకుండా అధ్యయనశీలం కూడా రాజేశ్వరరావు దగ్గర ఇతర జర్నలిస్టులు నేర్చుకోవలసిన మంచి లక్షణం. నిరంతర పఠనం ఆయన ప్రత్యేకత. మార్కెట్లోకి కొత్త పుస్తకం వచ్చిన వెంటనే దాన్నికొని చదివేవారు. దాని గురించి మిత్రులకు ఫోన్లు చేసి మాట్లాడేవారు. చదవమంటూ ప్రోత్సహించేవారు. పుస్తకాల గురించి చర్చిస్తూ నాతో గంటలకొద్దీ మాట్లాడేవారు. నాలాగేనే చాలామంది మిత్రులు ఆయనకు ఉన్నారు. వెల్చేరు కొండలరావు నడిపే ‘జయంతి’ పత్రిక సంపాదకమండలిలో సభ్యుడిగా కూడా రాజేశ్వరరావు ఉన్నారు. పీవీ నరసింహారావు గురించీ, విశ్వనాథ గురించి ప్రత్యేక సంచికలు తెచ్చారు.

హెచ్ ఎంటీవీలో ఉండగా ఆయన తన తోటి ఉద్యోగులతో మాట్లాడుతూ ఉండేవారు. తన అపారమైన అనుభవ సారాన్ని వారికి అందించే ప్రయత్నం చేసేవారు. వర్తమాన జర్నలిస్టుల భాషా పటిమపైనా, విషయ పరిజ్ఞానం పైనా మాట్లాడుతూ ఆవేదన వెలిబుచ్చేవారు. ఈ తరం జర్నలిస్టులు అసలు పుస్తకాలే చదవడం లేదని వాపోయేవారు. బ్రిటిష్, అమెరికా పత్రికల సంపాదకుల జీవితకథల నుంచీ, వారి సంపాదకీయాల నుంచీ ఉటంకిస్తూ మాట్లాడేవారు. రాజకీయాలు, చరిత్ర, జర్నలిజం అంటే ఇష్టం. ఎప్పుడు ఆయన ఫోన్ చేసినా తాను ఏయే పుస్తకాలు చదువుతున్నారో చెప్పేవారు. మనం ఏమి చదువుతున్నామో కనుక్కునేవారు. చాలామంది ముఖ్యమంత్రులూ, మంత్రులూ ఆయనకు  పరిచయం. వారితో సన్నిహిత సంబంధాలు ఉండేవి. వ్యక్తిగతంగా వాటిని ఉపయోగించుకునే ప్రయత్నం లవలేశమైనా ఉండేది కాదు. దేశం ఎటువైపు ప్రయాణం చేస్తోందో, అంతర్జాతీయ పరిణామాలు ఎట్లా సంభవిస్తున్నాయో, అమెరికా అధ్యక్షుడు ఏమి మాట్లాడాడో, బ్రిటిష్ ప్రధాని ఏమన్నాడో చెబుతూ ఉండేవారు. ఎంతసేపు మాట్లాడినా పత్రికలూ, పుస్తకాలు, ప్రపంచ పరిణామాలే కానీ కుటుంబ విషయాలు కానీ వ్యక్తిగత అంశాలు కానీ ప్రస్తావనకు వచ్చేవి కాదు.

రాజేశ్వరరావు ఒక అరుదైన మేధావి. రాఘవాచారిని బాగా ప్రేమించిన వ్యక్తి. రాఘవాచారి ఈ లోకం వీడి పోయిన తర్వాత నాలుగేళ్ళలోనే ఆయనా సెలవు తీసుకున్నారు. ఇద్దరూ సామాజిక స్పృహ, రాజకీయ చైతన్యం సంపూర్ణంగా ఉన్న మేధావులే. వారి నిష్క్రమణ తెలుగు సమాజానికి తీరని లోటు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles