Monday, October 7, 2024

అవమానభారంతో గద్దె దిగిన అమరీందర్ సింగ్

పంజాబ్ లో గుజరాత్ జరిగింది. అదేమిటనుకుంటున్నారా? గుజరాత్ లో కొన్ని రోజుల కిందట జరిగిన పరిణామాలే శనివారంనాడు పంజాబ్ లో సంభవించాయి. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీని బీజేపీ అధిష్ఠానం తప్పించి భూపేంద్ర పటేల్ కు పగ్గాలు ఇచ్చింది. అదే విధంగా పంజాబ్ లో కెప్టెన్ అమరీందర్ సింగ్ ను తప్పించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించుకున్నది. కెప్టెన్ కి తెలియకుండానే పంజాబ్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశాన్ని అధిష్ఠానవర్గం ప్రతినిధి, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఏర్పాటు చేశారు. తర్వాత కెప్టెన్ కు కూడా రావత్ ఆహ్వానం పంపారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఫోన్ చేసి తనకు జరిగిన అవమానాలు ఇక చాలుననీ, ఇది వరుసగా మూడో సారి జరుగుతున్న అవమానమనీ, ఇక సహించజాలననీ, పార్టీ నుంచి తప్పుకుంటాననీ చెప్పారు. ముందుగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామాను గవర్నర్ కు సమర్పించారు. తర్వాత ఏమి చేయాలో గత 52 సంవత్సరాలుగా తన రాజకీయాలను సమర్థిస్తున్న ప్రజలను అడిగి తెలుసుకుంటానని విలేఖరులతో అన్నారు.

గుజరాత్ లో ప్రశాంతంగా ముఖ్యమంత్రి మార్పిడి జరిగింది.  కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్ఠానం నిర్ణయించిన భూపేంద్ర పటేల్ పేరునే విజయ రూపాణీ ప్రతిపాదించారు. ఇది వరకు అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధిష్ఠానం దూతలుగా ఎన్ డి తివారీ, ఉమాశంకర్ దీక్షిత్, కరుపయ్య మూపనార్ వంటివారు వచ్చి సీల్డ్ కవర్ రాజకీయం చేసేవారు. గద్దె దిగుతున్న ముఖ్యమంత్రి చేత కొత్త ముఖ్యమంత్రి పేరును ప్రతిపాదింపజేసేవారు. కాంగ్రెస్ కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నప్పుడూ, గద్దె దిగుతున్న ముఖ్యమంత్రికి వేరే ప్రత్యామ్నాయం లేనప్పుడు ఆ విధంగా కథ నడిచింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో లేదు. బలంగా కూడా లేదు. వచ్చే ఎన్నికలనాటికైనా పుంజుకుంటుందనే విశ్వాసం లేదు. కెప్టెన్ అమరీందర్ సింగ్ కు దాదాపుగా 80 ఏళ్ళు. గుజరాత్ లో రూపాణీ నాయకత్వంలో బీజేపీ ఎన్నికల రంగంలో దిగితే ఓడిపోవడం ఎంత ఖాయమో, పంజాబ్ లో కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలో ఎన్నికల బరిలో దిగితే పరాజయం అంతే ఖాయం. ఈ సంగతి కాంగ్రెస్ నాయకులకు అందుకు కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న చర్యను తప్పుపట్టడం కష్టం. కెప్టెన్ కు ఇదివరకు ప్రజలలో బలం ఉండేది. మంచి నాయకుడుగా గుర్తింపు ఉండేది. పటియాలా రాజవంశానికి చెందిన సంపన్నుడు కనుక డబ్బుకు కక్కుర్తిపడే అవసరం కానీ, అటువంటి మనస్తత్వం కానీ లేదు. అందుకని మంచి పేరు ఉండేది. గత నాలుగు సంవత్సరాలుగా కొంత జోరు తగ్గినట్టూ, మెతకపడినట్టూ కనిపిస్తున్నది. అకాలీదళ్ పైన ఉండవలసినంత కరుకుగా ఉండడం లేదనే అసంతృప్తి కాంగ్రెస్ నాయకశ్రేణిలో ఉంది. కెప్టెన్ భవిష్యత్ ప్రణాళిక ఏమైనా అది పెద్ద ప్రభావశాలి కాజాలదు.

కెప్టెన్ అమరీందర్ స్థానంలో కొత్తమంత్రిగా ఎవరిని కూర్చోబెట్టాలో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయించాలని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ శనివారం సాయంత్రం చండీగఢలో సమావేశమై నిర్ణయించింది. కెప్టెన్ ఇప్పటికే రాజీనామా చేశారు కనుక వెంటనే ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు  ఉన్నాయి. ఎవరిని నియమించినా ఇది తాత్కాలికమే. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి హోదాలో క్రికెట్ వీరుడు నవజోత్  సింగ్ సిద్ధూ 2022 ఎన్నికలలో కాంగ్రెస్ ను గెలిపిస్తే అతడే ముఖ్యమంత్రి అవుతాడు. అంతవరకూ ఎవరు గద్దె మీద కూర్చున్నా కొన్ని మాసాలకే పరిమితం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles