Tuesday, November 12, 2024

న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ఇంటికి, పాక్ పర్యటనకు స్వస్తి

  • కుప్పకూలిన పాకిస్తాన్ క్రెకెట్ బోర్డు
  • న్యూజిలాండ్ ప్రధానితో మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్
  • న్యూజిలాండ్ ది ఏకపక్ష నిర్ణయం
  • పాకిస్తాన్ లో అంతర్జాతీయ క్రికెట్ పునరుద్ధరణకు  ఎదురు దెబ్బ

పాకిస్తాన్ పర్యటనను అర్ధంతరంగా విరమించుకొని వెనక్కి వెళ్ళాలని న్యూజీలాండ్ జట్టు నిర్ణయించుకోవడంతో గందరగోళం నెలకొన్నది. న్యూజిలాండ్ జట్టు సెప్టెంబర్ 11న పాకిస్తాన్ లో దిగింది. పద్దెనిమిది సంవత్సరాల విరామం తర్వాత పాకిస్తాన్ లో న్యూజిలాండ్ పర్యటించడం ఇదే ప్రథమం. మూడు ఒన్ డే మ్యాచ్ లు (ఓడీఐలు), అయిదు ఇరవై ఓవర్ల పరిమిత ఓవర్ల మ్యాచ్ (టీ-20)లూ ఆడవలసి ఉంది. కోవిడ్ కారణంగా స్టేడియం లో ఉన్న సీట్లలో పాతిక శాతం మాత్రమే అనుమతించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది.

శుక్రవారంనాడు మొదటి ఓడిఐ మ్యాచ్ ప్రారంభం కావలసి ఉంది. రెండుజట్టులూ హోటల్ బయటకి రాలేదు. న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ డేవిడ్ వైట్ చేతులెత్తేశారు. తమ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని సంకేతాలు రావడంతో తాము ఫీల్డ్ లో దిగలేకపోతున్నామని వైట్ చెప్పేశారు. దీనివల్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు చాలా నష్టమనీ, వారు తమను చాలా గౌరవంగా, మర్యాదగా చూసుకున్నారనీ, కానీ తమ ప్రభుత్వం నుంచి హెచ్చరికలు రావడంతో పర్యటన విరమించుకోక తప్పడం లేదనీ వైట్ వ్యాఖ్యానించారు. భద్రతకు వచ్చిన ముప్పు ఏమీ లేదనీ, న్యూజిలాండ్ జట్టు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నదని పాకిస్తాన్  క్రికెట్  బోర్డు అభ్యంతరం చెప్పింది.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడుగా క్రికెటర్ రమీజ్ రజా కొన్ని వారాల కిందటే పదవీ బాద్యతలు చేపట్టారు. ఆయన హయాం ప్రారంభంలోనే ఇటువటి ఇబ్బంది ఏర్పడటం ఆయనను బాగా నిరుత్సాహపరిచింది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యక్తిగతంగా న్యూజిలాండ్ ప్రధాని జసిండా అర్డెర్న్ తో ఫోన్ లో మాట్లాడారని, తమ దగ్గర అత్యుత్తమమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నదనీ, క్రీడాకారుల భద్రతకు వచ్చిన ముప్పు ఏమీ లేదని వివరించారనీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతినిధి చెప్పారు. ఐపీఎల్ లో ఆడనున్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ కానీ, ట్రింట్ బౌల్ట్ కానీ, కైల్ జమీసన్ కానీ, లాకీ ఫర్గ్యూసన్ కానీ పాకిస్తాన్ కు రాలేదు. క్రీడాకారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పర్యటనను రద్దు చేసుకోవలసి వచ్చిందని న్యూజిలాండ్ క్రికెట్ ఆటగాళ్ల సంఘం ప్రధాన నిర్వహణాదికారి హీత్ మిల్స్ చెప్పారు.

శ్రీలంక జట్టుపైన 2009లో ఉగ్రవాదుల దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ లో పర్యటించేందుకు విదేశీ జట్లు సిద్ధంగా లేవు. లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో మ్యాచ్ లో పాల్గొనడానికి  వెడుతున్న సమయంలో శ్రీలంక జట్టుపైన దాడి జరిగింది. జట్టు సభ్యులలో ఆరుగురికి గాయాలు తగిలాయి. పాకిస్తాన్ కు చెందిన ఆరుగురు పోలీసు ఉద్యోగులూ, ఇద్దరు పౌరులూ మరణించారు. ఈ సంత్సరం ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు పాకిస్తాన్ పర్యటించాల్సి ఉంది. ఆస్ట్రేలియా జట్టు పర్యటన వచ్చే ఏడాది ఆరంభంలో జరగవలసి ఉంది.

పాకిస్తాన్ లో అంతర్జాతీయ క్రికెట్ ను పునరుద్ధరించేందకు చేస్తున్న ప్రయత్నాలకు చావు దెబ్బ తగిలిందని పాకిస్తాన్ పేస్ బౌలర్ షోయెట్ అఖ్తర్ వ్యాఖ్యానించాడు. ‘‘పాకిస్తాన్ క్రికెట్ ను న్యూజిలాండ్ చంపివేసింది. రావల్పిండి నుంచి విచారకరమైన వార్తలు వినవలసి వస్తోంది, విషాదకరమైన దృశ్యాలు చూడవలసి వస్తోంది,’’ అంటూ ట్వీట్ చేశాడు. చివరి నిమిషంలో పర్యటన విరమించుకోవాలన్న న్యూజిలాండ్ నిర్ణయంతో దిగ్భ్రాంతి చెందిన అనేకమంది పాకిస్తానీ క్రికెట్ ప్రేమికులలో అఖ్తర్ ఒకడు. పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా తన ఆశాభంగాన్ని వెలిబుచ్చారు. ‘‘మా భద్రతా సిబ్బంది సామర్థ్యం పైన నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. వారు మనకు గర్వకారణం. ఎప్పటికీ వారిని చూసి గర్వపడతాం. పాకిస్తాన్ జిందాబాద్!’’ అంటూ ఆజమ్ ట్వీట్ చేశారు.

‘‘పాకిస్తాన్ క్రికెట్ ఫాన్స్ కు ఆశాభంగం కలిగింది. వారిని తలచుకుంటే బాధవేస్తోంది. భద్రత పేరు మీద న్యూజిలాండ్ జట్టు ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం బాధాకరం. న్యూజిలాండ్ ఏ ప్రపంచంలో నివసిస్తోంది? మేము మా అభిప్రాయాలు ఇంటర్నేషనల్ క్రికెట్ సంస్థ సమావేశంలో చెబుతాం,’’ అంటూ ఆగ్రహోదగ్రుడైన రమీజ్ రజా ట్వీట్ చేశాడు.  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles