Friday, March 29, 2024

కరోనా కట్టడికి ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ అవసరం

భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోమారు సమీక్ష నిర్వహించారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ సాధ్యమైనంత త్వరలో వ్యాక్సిన్ అందజేయడానికి కృషి చేస్తున్నామని, ఆయన చెప్పిన మాటలు బోలెడు ధైర్యాన్ని నింపుతున్నాయి, పెద్ద ఆశలను చిగురింపజేస్తున్నాయి.వ్యాక్సిన్ అభివృద్ధి, సేకరణ, నియంత్రణ, నిల్వ, పంపిణీ మొదలైన అంశాలపై కూలంకషంగా చర్చించినట్లు ప్రధాని చేసిన ట్వీట్ ద్వారా తెలుస్తోంది.

ఏప్రిల్ నాటికి అందుబాటులోకి టీకామందు

వచ్చే ఏప్రిల్ కల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, ఆరోగ్య సిబ్బందికి, వృద్ధులకు ఫిబ్రవరి నాటికే ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా సి ఈ ఓ అదార్ పూనావాలా తాజాగా తెలియజేశారు. రెండు డోసుల ధర వెయ్యిరూపాయల వరకూ ఉంటుందనీ వివరించారు. 2021 ఏప్రిల్ కల్లా 30నుంచి 40కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తామని ఆయన చెబుతున్నారు.భారత్ లోని 130కోట్ల జనాభా మొత్తానికి అందించాలంటే మూడు, నాలుగేళ్ళ సమయం పడుతుందనీ చెప్పారు.

‘ఆస్ట్రా జెనికా’

వీరు తయారు చేస్తున్న వ్యాక్సిన్ పేరు “ఆస్ట్రా జెనికా”. వీరు ఇప్పటి వరకూ చేపట్టిన ప్రయోగాలు  వృద్ధుల్లో కూడా మంచి ఫలితాలు ఇచ్చాయనీ, దీనితో ఈ వ్యాక్సిన్ పనితీరుపై అంచనాలు పెరిగిపోయాయనీ చెప్పుకుంటూ వచ్చారు. భారతదేశంలో జరిగే ప్రయోగాల ఫలితాలు మరో రెండున్నర నెలల్లో తెలుస్తాయని సీరమ్ ఇన్స్టిట్యూట్ సి ఈ ఓ వివరించారు. తమ టీకా 95శాతం సామర్ధ్యం కలిగి ఉందని, వృద్ధుల్లో కూడా మంచి పనితీరు కనిపిస్తోందని మరో ప్రఖ్యాత ఔషధ సంస్థ ఫైజర్ ఇప్పటికే ప్రకటించింది.

చవరి దశ ప్రయోగస్థాయిలో భారత్ బయోటెక్

భారత్ బయోటిక్ రూపొందిస్తున్న కొవాగ్జిన్ వ్యాక్సిన్ చివరి దశ ప్రయోగాల్లోకి అడుగుపెట్టింది.  మరో మూడు నాలుగు నెలల్లో కచ్చితంగా కోవిడ్ -19 వ్యాక్సిన్ సిద్ధమవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కూడా తాజాగా జరిగిన వెబినార్ లో ప్రకటించారు. కరోనా వైరస్ నివారణ కోసం అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ల విషయంలో పురోగతి సాధించినట్లుగా ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నిజంగా వీరు చెప్పినవన్నీ జరిగితే, అంతకంటే కావాల్సింది ఏముంది? అందరూ ఎదురు చూస్తోంది ఆ రోజు కోసమే. వీటిల్లో,  ఫైజర్, ఆక్సఫర్డ్ చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థలు. వీటికి ప్రపంచ మార్కెట్ లో ఎంతో పేరుంది. కానీ, ఇవి మొట్టమొదటగా వ్యాక్సిన్ తయారీ చేపట్టినట్లు సమాచారం. తమ సంస్థలపై ఇప్పటి వరకూ ఉన్న పేరు, ప్రతిష్ఠలను, ఈ వ్యాక్సిన్ సామర్ధ్యంలోనూ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.

శాంతాబయోటెక్స్ సైతం

భారతదేశానికి చెందిన మరో సుప్రసిధ్ధ సంస్థ శాంతా బయోటెక్నిక్స్ కూడా వ్యాక్సిన్ రూపకల్పనలో ఉంది. గ్లోబల్ లీడర్ గా ఉన్న ఫ్రెంచ్ మల్టీ నేషనల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ సనోఫి, మరో ప్రఖ్యాత బ్రిటిష్ మల్టీ నేషనల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ జి ఎస్ కె (గ్లాక్సో స్మిత్ క్లిన్ ) సహకారంతో వ్యాక్సిన్ తయారీలో మునిగివున్నారు. ఈ సంస్థ కూడా 2021సంవత్సరంలో వ్యాక్సిన్ అందుబాటులోకి తేనుందని సమాచారం. ఇవన్నీ ఆశాకిరణాలు, మనోధైర్యాన్ని నింపే గొప్ప వార్తలు.

టీకామందు నిజంగా అవసరమా?

కరోనా నుండి మనల్ని మనం రక్షించుకోడానికి నిజంగా వ్యాక్సిన్ అవసరమా? అంటే, అవసరమేనని చెప్పాలి. మరి, ఈ వ్యాక్సిన్లు అందరికీ అందుబాటులోకి రావాలంటే ఇంకా మూడునాలుగేళ్లు పడుతుందన్న నేపథ్యంలో మనల్ని రక్షించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా అన్నది మనం ఆలోచించుకోవాల్సిన అంశం. మామూలుగా ఏ వ్యాధి నివారణకైనా కొన్ని మార్గాలు ఉంటాయి. ముందుగా ఆ వ్యాధికి మందు కనిపెడతారు, ఆ  తర్వాత వ్యాక్సిన్ ను  రూపొందిస్తారు.

మందు కనిపెట్టలేదు

కరోనా విషయంలో ఇంతవరకూ సరియైన మందు ఎవ్వరూ కనిపెట్టలేదు. నేరుగా వ్యాక్సిన్ తయారీకే గురిపెట్టారు. బహుశా ఈ వైరస్ చేస్తున్న ఒత్తిడి కావచ్చు. వ్యాక్సిన్ల గత చరిత్రను పరిశీలిస్తే, ఇంత వేగంగా అందుబాటులోకి వచ్చిన (వస్తున్న) వ్యాక్సిన్ ఇంకొకటి లేదనే చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు వ్యాక్సిన్ ను సంజీవినిగా భావిస్తున్నాయి. త్వరిత గతిన కోవిడ్ వైరస్ ను నిరోధించే బ్రహ్మాస్త్రంగా విశ్వాసం పెంచుకున్నాయి. ఈ ప్రభావంతో వ్యాక్సిన్ తయారీకి యుద్ధ ప్రాతిపదికన శ్రీకారం చుట్టాయి. దీని వ్యాప్తి, దుష్ఫలితాల తీవ్రత దృష్ట్యా అన్ని ప్రభుత్వాలు, పర్యవేక్షణా సంస్థలు వేగగతిన అనుమతులు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో, వ్యాక్సిన్లు చారిత్రాత్మకంగా తొందరగా అందుబాటులోకి రావడానికి సిద్ధమవుతున్నాయి. ఇది మంచి, స్వాగతించాల్సిన పరిణామమే.

జవాబు చెప్పుకోవలసిన ప్రశ్నలు

ఈ తరుణంలో కొన్ని సవాళ్లు, అనుమానాలు, ప్రశ్నలు  కూడా  పరిశీలకుల మెదళ్లను తొలుస్తున్నాయి. (1) వ్యాక్సిన్ల తయారీలో, సమర్ధవంతంగా అందించే ప్రక్రియలో, దీని చుట్టూ ఉన్న సమాచార ప్రచారంలో పారదర్శకత ఉందా (2) ఎన్ని డోసులు అవసరం వస్తుంది అనే విషయంలో స్పష్టత ఉందా? (3) నాణ్యత,అనుమతి, పర్యవేక్షణల సడలింపులు ఆరోగ్యదాయకమా (4) డబ్ల్యూ హెచ్ ఓ కూడా నాణ్యత విషయంలో రాజీపడడం ఆహ్వానించదగిన పరిణామమా (5) ఈ వ్యాక్సిన్లను  నిల్వ చేసే  విధానం క్షేమదాయకమా (6) వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తికి వైరస్ నుండి ఎంతకాలం రక్షణ ఉంటుంది (7) తయారీకి కావాల్సిన ముడిసరుకులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయా (8) పంపిణీకి కావాల్సిన యంత్రాంగం ఏ స్థాయిలో సంసిద్ధంగా ఉంది (9) అన్ని దశల్లో చేసిన/చేస్తున్న ప్రయోగాలు, వస్తున్న ఫలితాలు, తయారీలో దశలు మొదలైన కీలకమైన అంశాలపై ఎప్పటికప్పుడు,  నిష్ణాతుల సమీక్షలు జరుగుతున్నాయా, ఆ వ్యాసాలు ప్రసిద్ధ జర్నల్స్ లో ప్రచురిస్తున్నారా? ఇలాంటి  అనేక అంశాలపై సమగ్రమైన, సంపూర్ణమైన సమాధానాలు ఇంకా తెలియాల్సివుంది.

కప్పదాటు చర్యలు అనర్థదాయకం

రాజకీయ, ఆర్ధిక, వ్యాపార ప్రయోజనాల కోసం,  కప్పదాటు చర్యలు చేపట్టకుండా, పారదర్శకతతో ముందుకు సాగడమే సర్వ ప్రజాప్రయోజనమని విజ్ఞులు భావిస్తున్నారు. వ్యాక్సిన్లు  అందుబాటులోకి ఎప్పుడు వచ్చినా, వాటి సామర్ధ్యతలు  ఎట్లా ఉన్నా, కరోనా నుండి మనల్ని మనం  కాపాడుకొనే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించుకోవడం ఉత్తమమైన మార్గం. మొదటిది: కరోనా గురించి విపరీతంగా భయోత్పాతానికి గురికానక్కర్లేదని తాజా నివేదికలు చెబుతున్నాయి. మరణాల రేటు స్వల్పంగానే ఉంది. రికవరీ రేటు అధికంగానే  ఉంది. తీవ్రమైన వ్యాధులు ఉన్న వారు తప్ప, చాలామంది తొందరగానే కోలుకుంటున్నారు. ఇవన్నీ ఆశావాహమైన అంశాలు. జాగ్రత్తలు పాటించడం, మానసిక, శారీరక దారుఢ్యం పెంచుకోవడం  మన చేతిలో ఉన్న ఆయుధాలు. వీటిని సరిగ్గా పాటిస్తే, కరోనా నుండి ఆశించిన స్థాయిలో మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. ఏది ఏమైనా, ఉందిలే మంచికాలం ముందు ముందునా అని నమ్ముదాం. 2021వ సంవత్సరం ఆరంభం నుండి శుభ పరిణామాలు ప్రారంభం అవుతాయని విశ్వసిద్దాం.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles