Thursday, December 8, 2022

జాతీయ యవనికపై తాజా నక్షత్రం కేజ్రీవాల్

రాహుల్, మమతా, నితీశ్ కంటే మెరుగైన అభ్యర్థి

అన్ని ప్రతిపక్షాలూ అంతిమంగా ఆమోదించగల నేత

ప్రతిపక్ష నాయకుడు ఎవరా అన్నదే ఇప్పుడు దేశం ఎదుట ఉన్న ప్రశ్న. రాహుల్ గాంధీనా, నితీశ్ కుమారా? మమతాబెనర్జీనా? అర్వింద్ కేజ్రీవాలా? వీరు నలుగురూ కాకుండా వేరొకరు ఎవరైనా 2024 ఎన్నికల నాటికి రంగంలో దిగుతారా?

రాహుల్ గాంధీ మొదటి నుంచీ బరిలో ఉన్నాడు. కానీ మోదీకి సమఉజ్జీ అనిపించుకోలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ కూడా అంతఃకలహాలతో క్షీణదశలో ఉన్నది. దేశం మొత్తంమీద కేవలం రెండు రాష్ట్రాలలోనే అధికారంలో ఉన్నది. రెండు సార్వత్రిక ఎన్నికలలోనూ దారుణంగా ఓడిపోయింది. కాకపోతే, ఇప్పటికీ ప్రధానినరేంద్రమోదీని సూటిగా ప్రశ్నిస్తున్న రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీ అనడంలో సందేహం లేదు. అన్ని రాష్ట్రాలలో కొద్దో గొప్పో ఓట్లు కలిగిన జాతీయ పార్టీ బీజేపీ తర్వాత కాంగ్రెసే అనడంలో అతిశయోక్తి లేదు. కానీ రాహుల్ కి పదవిపైన ప్రేమలేదేమోననే సందేహాలు ఉన్నాయి. యూపీఏ టూ మంత్రిమండలిలో చేరవలసిందిగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ చిలకకు చెప్పినట్టు  చెప్పినా పెద్దాయన మాట వినలేదు. తరచుగా రాజకీయం ముక్కపట్టులో ఉన్నసందర్భాలలో దేశం విడిచి విదేశీయానాలు చేయడంతో రాజకీయాలపైన అంత మక్కువ లేదనే అభిప్రాయం జనబాహుళ్యంలో ఉంది. 2024నాటికి కాంగ్రెస్ పరిస్థితి మెరుగవుతుందో, మరింత కుదేలవుతుందో ఎవ్వరూ జోస్యం చెప్పలేని పరిస్థితి.

మొన్న బిహార్ లో కూటమి రాజకీయంలో మహాపరిణామం సంభవించి, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బీజేపీతో బంధం తెంపేసుకొని ఆర్జేడీతో తిరిగి అనుబంధం పెట్టుకోవడంతో కొందరు రాజకీయ పరిశీలకులు నేటి బిహార్ నేతే రేపటి దేశ్ కీ నేతా అనే విధంగా విశ్లేషణలు గుప్పించారు. కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీతో స్నేహపూర్వకమైన సంబంధాలు కలిగిన నితీశ్ కుమార్ ను ప్రతిపక్షాల తరఫున ప్రధాని అభ్యర్థిగా ఆమోదించేందుకు ఆమెకు అభ్యంతరం ఉండకపోవచ్చునంటూ ఊహాగానాలు మొదలైనాయి.  పైగా ప్రధాని పదవిని అందుకోవాలని ఉవ్విళ్ళూరుతున్న నాయకులలో అందరికంటే ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం నితీశ్ కుమార్ ది. 2005 నుంచీ ఆయన బిహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. దాదాపుగా రెండు దశాబ్దాల సారథ్యం. ఆయన అవినీతిపరుడనే అప్రతిష్ఠను మూటకట్టుకోలేదు. మొదటి టరమ్ లో శాంతిభద్రతలు కాపాడుతాడనే పేరు తెచ్చుకున్నారు. సుశాశన్ బాబు అని బిహార్ ప్రజలు పిలుచుకుంటారు.  ఆయన సుదీర్ఘ పాలనలో బిహార్ అద్భుతంగా ప్రగతి సాధించలేదు కానీ గుడ్డిలో మెల్లలాగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ వచ్చారు. ఎత్తులకు పైఎత్తులు వేయడంలో మోదీ, అమిత్ షాల కంటే రెండు ఆకులు ఎక్కువే చదివినట్టు తాజా రాజకీయ విన్యాసాలతో నిరూపించారు. మహారాష్ట్రలో శివసేనను చీల్చి, ఉద్ధవ్ ఠాక్రేను పదవి నుంచి తొలగించి షిండేకు పట్టంకట్టినట్టే బిహార్ లో ఒక షిండేను తయారు చేసి, తన నాయకత్వంలోని జేడీ(యూ)ని చీల్చి తనకు పదవీ భ్రష్టత్వం కలిగించక ముందే సకాలంలో మేల్కొని పదవిని కాపాడుకున్నాడు. ఈ రంధిలో విలువలకు తిలోదకాలు ఇచ్చాడనే అపవాదు తప్పలేదు.

నితీశ్ కుమార్ కంటే ముందు మమతా బెనర్జీ హడావిడి చేశారు. పశ్చిమ బెంగాల్ పై బీజేపీ హంగామా చేసి, సర్వశక్తులూ ఒడ్డినా తృణమూల్ కాంగ్రెస్ మూడో సారి ఢంకా బజాయించి గెలవడంతో మమతా బెనర్జీ ప్రతిష్ట ఆకాశాన్నంటింది. దిల్లీ వచ్చి ప్రతిపక్షాల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ను దాటి పోతున్నారనే అభిప్రాయం కలిగించారు. కానీ అంతలోనే పశ్చిమబెంగాల్ మంత్రి పార్థా చటర్జీ ఆమె కొంపముంచారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టొరేట్ దాడులలో యాభై కోట్ల విలువైన నోట్ల కట్టలు ఇబ్బడిదిబ్బడిగా దొరికిన దరిమిలా ఆయననూ, ఆయన స్నేహితురాలినీ అవినీతి ఆరోపణలపైన అరెస్టు చేయడంతో మమత దిక్కుతోచక మౌనాన్ని ఆశ్రయించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఇప్పటికీ కేంద్రాన్నీ, మోదీనీ నిశితంగా విమర్శిస్తున్నారు.  కానీ నితీశ్ కూ, మమతకూ ఉన్న సంఖ్యాబలం లేకపోవడం వల్ల ప్రతిపక్ష ప్రధాని అభ్యర్థుల జాబితాలో రాజకీయ పరిశీలకులు  కేసీఆర్ ను చేర్చడం లేదు.

తాజాగా దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కొత్త నినాదంతో సంచలనం సృష్టించారు. ప్రధానికి ప్రధాన ప్రత్యర్థిగా తనను తాను తీర్చిదిద్దుకుంటూ ఎదిగే ప్రయత్నంలో భాగంగా ‘మేక్ ఇండియా నంబర్ ఒన్’ (ఇండియాను ప్రప్రథమ దేశంగా నిలుపుదాం) అంటూ ఒక నినాదాన్ని తయారు చేసుకున్నారు. కేజ్రీవాల్ ఇటీవలి ప్రసంగం తనకు జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలన్న ఆకాంక్ష ఉన్నట్టు స్పష్టం చేసింది.

తన పార్టీ విస్తృతిని పెంచేందుకూ, తన వ్యక్తిగత ప్రతిష్ఠను పెంపొందించేందుకు మేక్ ఇండియా నం. 1 అనే నినాదంతో జాతీయ ఉద్యమం ప్రారంభించాలని కేజ్రీవాల్ తలపోస్తున్నారు. ఇటీవల ఎన్నికలు జరిగిన పంజాబ్ లో అత్యధిక మెజారిటీ సాధించి ఆప్ అధికారాన్ని కైవసం చేసుకున్నది. గోవాలో సైతం రెండు స్థానాలు గెలుచుకున్నది. హిమాచల్ ప్రదేశ్ లోనూ, హరియాణాలోనూ జరగబోయే ఎన్నికలలో మంచి బలప్రదర్శన చేయగలనన్న విశ్వాసం ఉన్నది. క్రమంగా బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ ను తోసిరాజని తాను నిలబడాలన్నది ఆప్ పార్టీ వ్యూహం. ప్రజాహిత కార్యక్రమాలు అమలు చేయడం, వాటి గురించి ఆకట్టుకునే రీతిలో ప్రచారం చేసుకోవడం, జాతీయ స్థాయి నాయకుడిగా, పార్టీని సమర్థంగా నడిపించే సారథిగా గుర్తింపు తెచ్చుకోవడం  కేజ్రీవాల్ అనుసరిస్తున్న ప్రణాళిక.

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తరచుగా చెప్పేదేమిటంటే ప్రధాని నరేంద్రమోదీ ఆటకట్టించే ప్రయత్నం చేసేవారికి ముఖ్యంగా మూడు ఆయుధాలు ఉండాలి. ఒకటి, మెసెంజర్. తాను చెప్పదలచిన సందేశాన్ని జాతికి సమర్థవంతంగా వినిపించగల వాగ్ధాటి, చమత్కార సంభాషణా చాతుర్యం కలిగిన నాయకుడు అవసరం. రెండవది, సూటిగా, హృదయాలకు హత్తుకునే విధంగా ఉండే సందేశం. మూడవది, ఇచ్చిన హామీలను అమలు పరిచేందుకు అనుసరించే పక్కా విధానం. ఈ మూడు విషయాలూ కేజ్రీవాల్ కు పుష్కలంగా ఉన్నాయని ఆప్ అధినేత, ఆయన అనుయాయులు కూడా నమ్ముతున్నారు.

ఇతర ప్రతిపక్ష ప్రధాని అభ్యర్థులకంటే కేజ్రీవాల్ దగ్గర అదనంగా ఉన్న నాయకత్వ లక్షణాలు ఏమిటి? విశిష్టమైన వ్యక్తిత్వం అరవింద్ కేజ్రీవాల్ సొంతం. ఆ మాటకొస్తే తక్కిన ప్రతిపక్ష ప్రధాని అభ్యర్థులైన రాహుల్, మమతా, నితీశ్ కు కూడా అవినీతి మరకలు లేవు.  ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఇంతవరకూ కేజ్రీవాల్ ప్రదర్శించిన సామర్థ్యం, కచ్చితత్వం, సమగ్రత ఆయనను ప్రత్యేకంగా నిలుపుతాయి. విద్య, ఆరోగ్య రంగాలలో ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి దిల్లీలో కొన్ని విద్యాలయాలు సందర్శించారు. మొహిల్లా దవాఖానలకు చాలా మంచి పేరు వచ్చింది. ఉచితంగా విద్యుత్తు, తాగు నీరు సరఫరా చేస్తూ ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. తమ పార్టీ ఎక్కడ ఎన్నికైనా ఈ పద్దతిలోనే పరిపాలన సాగిస్తానని హామీ ఇస్తున్నారు. పంజాబ్ లో అటువంటి ప్రయత్నమే మొదలు పెట్టారు.  ఏ ప్రతిపక్షమైనా నరేంద్రమోదీనీ, బీజేపీని ఒంటరిగా ఓడించడం అసాధ్యమని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రతిపక్షాలన్నీ ఏకమైతే ఒక ప్రయత్నం చేయవచ్చు. ప్రతిపక్ష కూటమికి నాయకత్వం ఎవరు వహించాలనే విషయంలో పేచీలు వస్తాయి. వివాదాలు చెలరేగుతాయి. కాంగ్రెస్ మమత నాయకత్వాన్ని అంగీకరించదు. కాంగ్రెస్ ను మమతా బెనర్జీ ఒప్పుకోరు. భాగస్వాములను తరచుగా మార్చే నితీశ్ కుమార్ విశ్వసనీయత ప్రశ్నార్థకమై కూర్చున్నది. ఈ నేపథ్యంలో  హిందీ, ఇంగ్లీషు భాషలను ధాటిగా మాట్లాడే ప్రతిభ, ఎటువంటి ఒత్తిళ్ళనైనా తట్టుకొని చిరునవ్వు చెదరకుండా ఉండగలిగే శాంతగంభీర స్వభావం, ఎత్తుకుపైఎత్తువేసే చాణక్యం, కొత్తపోకడలు పోగల నేర్పు, అవినీతి ప్రసక్తిలేని వ్యక్తిత్వం అరవింద్ కేజ్రీవాల్ కు భూషణాలై తన అభ్యర్థిత్వాన్ని అన్ని ప్రతిపక్షాలకూ అంతిమంగా ఆమోదయోగ్యం చేస్తాయని ఆప్ నాయకుల విశ్వాసం. ఇంకా రెండేళ్ళ వ్యవధి ఉంది. రాబోయే సార్వత్రిక ఎన్నికలలోగా  మరెన్ని పరిణామాలు సంభవిస్తాయో, మరెందరు కొత్త దేవుళ్ళు అవతరిస్తారో వేచి చూడవలసిందే. ప్రస్తుతానికి కనిపిస్తున్న జాతీయ యవనిక చిత్రం ఇది. అంతవరకే.  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles