Friday, December 9, 2022

సమఉజ్జీ ప్రతిపక్షం అవసరతలో… ఏ.పి. ప్రభుత్వం!

దేమైతేనేమి, తలో చెయ్యివేసి ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే ప్రక్రియను 2021 సెప్టెంబర్ రెండవ వారం వరకు పొడిగించి, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి గొప్ప మేలుచేసారు. పరీక్షల్లో విద్యార్ధులు ‘ఫైనల్స్’ కు వెళ్ళే ముందు, రాసే ‘హాఫ్ ఇయర్లీ’ ఫలితాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అవి- మనం ఎక్కడ వున్నాం… అనేది తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం. తమ పరిపాలనా కాలం సగం గడిచాక, ఏ రాజకీయ పార్టీకి అయినా ఇతరులవల్ల అయాచితంగా అటువంటి సదుపాయం కలిగితే, వాళ్లకు మాత్రం అంతకంటే ఆనందం ఏముంటుంది? పైగా, ‘అడుగడుగునా వాళ్ళు మా కాళ్ళకు ఎలా అడ్డం పడుతున్నారో చూస్తున్నారు కదా…’ అని చెప్పుకోవడం ద్వారా- ‘న్యూట్రల్ వోటర్’ ఆ పార్టీకి దగ్గర కావడానికి అది అదనంగా కలిసివచ్చింది. అందుకే, ప్రపంచ ప్రసిద్ద ‘ఆపిల్’, ‘పెప్సీ’ కంపెనీల మాజీ సి.ఇ.ఒ. అమెరికన్ బిజినెస్ గురు జాన్ స్కాల్లీ – ‘టైమింగ్ ఇన్ లైఫ్ ఈజ్ ఎవ్విరీథింగ్’ అంటాడు.

Also read: కనుమరుగై … రెండైన వై.ఎస్.ఆర్!

అయినా- ‘మనం ఒకందుకు చేస్తే, అది మరొక రీతిలో అవతలవాడికి మేలు అయింది’, అనేది మనమేమీ కొత్తగా వింటున్నది కాదు. మనం చాటుగా నష్టం చేయాలి అనుకుంటే, అవతలవారికి అది మరొక రీతిగా ఉపకరించడం, మన ఇతిహాసాల కాలం నుంచి ఉన్నదే! ఇందులో చివరికి మిగిలే సందేశం కూడా పాతదే- ‘మంచి చేసిన మంచి జరుగును’! నిజానికి ఇటువంటివన్నీ రక్తంతో కలిసివుండే నీళ్ళ మాదిరిగా, తరతరాలుగా మన ‘సైక్’ లో ఇంకిపోయిన విషయాలు. కనుక, ఎవరు వాటిని తక్కువగా అంచనా వేసి అందులో భాగస్వాములు అయినా చివరికి జరిగేది నష్టమే. కొన్నిసార్లు అది ‘కెరియర్’ అంతా కాపాడుకున్న మంచి పేరును సున్నా చేస్తుంది!

కరువు కాలం తర్వాత 2004 నాటికి ముఖ్యమంత్రిగా వచ్చిన వై.ఎస్.రాజశేఖర రెడ్డి ‘సంక్షేమ పాలన’ అప్పట్లో ప్రజలకు వొక సాంత్వన అయింది. అదే కాలంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ‘ఉపాధి హామీ పధకం’ ప్రకటించి  రాష్ట్రాలను ఆదుకున్నారు. నాయకుడు ఎప్పుడూ తన కాలాన్ని సరిగ్గా మదింపు చేయగలిగి ఉండాలి. ఆర్ధిక సంస్కరణల వల్ల విస్తరిస్తున్న మధ్యతరగతి ఆలోచనాపరుల కోసం, సమాచార హక్కు చట్టం తెచ్చింది ఆ కాలంలోనే. అంతకు ముందు చెంద్రబాబు కాలంలో ఉదారంగా మంజూరు అయిన ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఇచ్చిన ‘ఫీజ్ రీఎంబర్స్ మెంట్’ పధకం తర్వాతే బహుజన వర్గాలకు అవి అందుబాటులోకి వచ్చాయి. దాంతో ఒక దశలో మన దగ్గర చదువు అంటే అందరికీ ‘ఇంజనీరింగ్’ అయింది! నిజానికి సంప్రదాయ సామాజిక దృష్టి వున్న ఏ ‘లీడర్’ అయినా రాజకీయాల్లో ఇక్కడ ఆగిపోతాడు. ఎందుకంటే, ఈ వర్గాలతో ఓటు వేయించుకోవడానికి ఈ చొరవ చాలు.

Also read:  సైరా… ఉయ్యాలవాడనూ యాది చేసినోడా!

కానీ, విభజనతో రాష్ట్రం రెండు అయింది. ఇక ఇప్పుడు ‘డెవలప్మెంట్ ప్లానింగ్’ మునుపటిలా కుదరదు. ‘రాజకీయం’ మునుపటి పొరలు దాటి మరింత లోపలికి వెళ్ళాలి. ప్రాంతాలవారీగా- ‘డెమోగ్రఫీ’ (సామాజిక వర్గాల జనాభా) ప్రాతిపదికన అది జరగాలి. అక్కడ లభ్యత వున్న పకృతి వనరులు, స్థానిక మానవనరులు ఈ రెండింటి మధ్య వొక అనుసంధానం జరగాలి. సరిగ్గా ఆ అవసరాన్ని గుర్తించిన ప్రస్తుత సి.ఎం. జగన్ మోహన రెడ్డి ‘ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు మెరుగైన నైపుణ్యాలను పెంచి, అప్పుడు వారిని అర్హులైన ఉద్యోగులుగా పరిశ్రమలకు అప్పగిస్తాను’, అంటున్నాడు. అందుకోసం 25పార్లమెంట్ నియోజకవర్గాల కేంద్రాల్లో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, విశాఖపట్టణం, తిరుపతిలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు పెడుతున్నారు. ఇది- వొక ‘లీడర్’ పరిధికి మించిన దృష్టి.

Also read: ఆసియా దేశాల్లో క్రీ.పూ. 600 నాటికే భూమి స్థిరాస్తి లావాదేవీలు!

వొకానొక రంగంలో 1991-2001 మధ్య కాలంనాటి పరిణామాలు ఇవి. రాజకీయ పార్టీలను వాటి నాయకులను కొంతసేపు పక్కన పెట్టి, ఈ కాలంలో మన పరిసరాల్లో జరిగిన సామాజిక, ఆర్ధిక, బదిలీలను (షిఫ్ట్) లను పరిశీలించినప్పుడు, ఈ మొత్తం పరిణామాల్లో ఒక వరస లేదా ఒక ప్రవాహ వేగం (‘కంటిన్యుటి’) కనిపిస్తున్నది. అయితే, మన స్వీయ ప్రయోజనాలకు అది నష్టం అనో, మరి ఏ కారణంచేత అయినా, మధ్యలో ఆ ప్రవాహవేగాన్ని ఆపాలి అనుకుంటే, అవదు. అది మనల్ని తోసుకుంటూ తన దారులు తాను వెతుక్కుంటుంది. ప్రజాజీవితంలో ఉంటూ ‘ప్రాసెస్’ ను శాస్వితంగా ఆపడం ఎవరికీ కుదరదు. ఏదో ఒక మార్గంలో ఇప్పటి ఎన్నికల ఫలితాల్లా అవి వెలుగు చూస్తాయి.

కుప్పం ఎంపీటీసీగా ఎన్నికైన 23 ఏళ్ళ వైఎస్ఆర్ సిీీసీ అభ్యర్థి అశ్వని

స్థూలంగా ఇదీ ఇప్పుడు ఏ.పి. రాజకీయాల్లో కనిపిస్తున్న తేడా! వొకప్పటి కాంగ్రెస్ సి.ఎం. రాజశేఖర రెడ్డి ‘సంక్షేమ దృష్టి’కి ఇది తదుపరి ‘ఎడ్వాన్స్డ్ వెర్షన్.’ పాతికేళ్ళ ఆర్ధిక సంస్కరణల తర్వాత, ఉత్తర-దక్షణ రాష్ట్రాల్లో ఇప్పటివరకు జరిగిన అన్ని ‘సోషల్ ఇంజనీరింగ్’ ప్రయోగాలు నుంచి వచ్చిన అనుభవాన్ని, కొత్త ప్రాంతీయ పార్టీ ద్వారా కొత్త రాష్ట్రంలో కొత్త ‘ఫార్మేట్’లో అమలుచేసే ‘లగ్జరీ’ జగన్ కు కుదిరింది. బలమైన ‘వోట్ బ్యాంక్’ ను వొడిసిపట్టుకుని మరికొన్ని దశాబ్దాలు రాజకీయాల్లో ఉండాలి అనుకున్నప్పుడు, ఏ యువ నాయకుడు అయినా, విధిగా సమాజపు లోపలి పొరల్లోకి ప్రవేశిస్తాడు. జగన్ తన స్వీయ సామాజిక వర్గంలో కూడా సీనియర్లను కాకుండా, ‘యంగ్ టీం’ను ఎంచుకుంటున్న కారణం కూడా ఇదే!

Also read: ఆ నాలుగు పత్రికల నిష్క్రమణ మిగిల్చిన ప్రశ్నలు!

రాజకీయాల్లో సామాజిక అధ్యయనం అవసరత అనేది వొకటి వుంటుంది, అనే స్పృహ కూడా లేకుండా, కేవలం ‘మేనేజ్మెంట్’ తో నెట్టుకొస్తే, కాలక్రమంలో ఎదుర్కోవలసిన పరీక్ష కఠినం అయినప్పుడు, మన పార్టీ ‘మ్యానిఫెస్టో’ రాసుకోవడం కూడా మనకు చేతకాదు. అది నిజంగానే చేతకాదా? అంటే, మళ్ళీ అదొక సాంద్రమైన సాంస్కృతిక సంబంధిత సందేహం! అందుకు సమాధానం కోసం ఆర్ధిక సంస్కరణలకు ఒక దశాబ్దం ముందు దేశంలో వెలుగులోకి వచ్చిన ‘మండల్ కమీషన్’ స్పూర్తిని వొక ‘పొలిటికల్ ఫిలాసఫీ’గా మనం అంగీకరించమా? అనే ప్రశ్నకు ముందుగా జవాబు చెప్పాలి. ఎందుకు మారుతున్న కాలాన్ని నిజాయితీతో మనం అంగీకరించ లేకపోయాము? గుప్పెట్లో నుంచి జారిపోయిన ఇసుక మాదిరిగా కాలం కరిగిపోయాక, ఏ కొలతలు, లోతులు, అంచనాకు కూడా ఇప్పుడు ఎందుకు మనకు దొరకడం లేదు? ఇవన్నీ జవాబులు లేని వరస ప్రశ్నలు.

బాహుబలి చిత్రం పోస్టర్

అందరూ ఇప్పుడు ‘టార్గెట్’ చేస్తున్న ‘మీడియా’ గురించి వద్దు. మరి కొంచెం లోపలికి వెళదాం. సినిమా మనకు ఒక ప్రభావవంతమైన ‘మీడియం’. ఒకప్పుడు ప్రబోధాత్మక చిత్రాలు నిర్మించిన చిత్ర పరిశ్రమ వర్గాలు, ఇప్పటి ‘పోస్ట్ మండల్ రిఫార్మ్స్’ కాలాన్ని ఎందుకు తెలుగు సినిమాల్లో వెండి తెర మీద చూపించలేక పోతున్నది? సమకాలీన కధల కోసం 2010 నాటికి ‘బాలీవుడ్’ యూ.పి., బీహార్, పంజాబ్, రాజస్థాన్, హర్యానాల్లోకి ప్రవేశించి, ‘స్మాల్ టవున్’ సినిమాకు మళ్ళింది. అది 2011 నాటికి ‘రిజర్వేషన్లు’ మీద చర్చ కధగా- అమితాబ్ బచ్చన్, సైఫ్ ఆలీఖాన్, దీపికా పదుకొనే వంటి నటులతో ‘అరక్షణ్’ పేరుతో సినిమా తీస్తే, అది బాక్స్ ఆఫీస్ లో 41 కోట్ల బిజినెస్ చేసింది! ఐదేళ్ళ తర్వాత 2015 లో మనం ‘బిగ్ మనీ’ లక్ష్యంగా ‘బాహుబలి’ తీసాం. కాలప్రవాహాన్ని అపగలమనే భ్రమతో మళ్ళీ జానపదాల వైపు మనం తిరుగుముఖం పట్టడం ఎందుకు జరిగింది? ఇందులో ‘పొలిటికల్ ఫిలాసఫీ’ ఎక్కడ ఉందని ఇప్పుడు బుకాయించడం కుదురుతుందా? పైగా ఆ సినిమాకు పనిచేసిన వ్యక్తిని ‘రాజధాని’ నిర్మాణానికి సలహాలు అడిగారు. ఇలా జనం కళ్ళకు గంతలు కట్టడం ఎంత కాలం కుదురుతుంది?

అక్షర పోస్టర్

‘ఉచితాలుతో’ జగన్ అధికారంలోకి వచ్చాడు, వాటికి రెట్టింపు ప్రకటిస్తే, 2024 లో చెంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రావొచ్చు అంటూ, ఇప్పటినుంచే అరకొర జ్ఞానపు రాతలు చూస్తున్నాం. ఇది పౌరసమాజం మీద మనకున్న చులకన చూపు. వీళ్ళు ఇటువంటివి రాసి, ఇంకా ప్రజల కళ్ళకు గంతలు కట్టడం మానడం మంచిది. ఇప్పుడు మనకు కావలిసింది, అప్రతిహతంగా ముందుకు వెళుతున్న జగన్ ప్రభుత్వాన్ని సమీక్షించగలిగిన స్థాయిలో నిలబడే ప్రతిపక్షం. రేపది, అధికారంలోకి వచ్చినా ఆనందమే! ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు గమనిస్తే, ‘అందరికీ అన్నీ’ తరహాలో ఇచ్చిన ఇటువంటి నిశబ్ద సందేశాలు ఇలా చాలా ఉన్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు దృశ్యం

  Also read: ‘షర్మిల ఫ్యాక్టర్’: కొన్ని మౌలిక భావనలు! 

Also read: ఈ హ్రస్వ దృష్టి రాజకీయానికి అంతం ఎప్పుడు?

Also read: జగన్ కేలండర్ @ 2021

Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles