Friday, September 29, 2023

బిజీ బిజీగా అమిత్ షా రోడ్ షో

  • టీఆర్ఎస్, ఎంఐఎంల మధ్య రహస్య ఒప్పందం
  • అధికారమిస్తే నిజాం సంస్కృతికి చరమగీతం పాడుతాం
  • ఓట్ల కోసం ప్రాణాలు తీసే నైజం మాది కాదన్న అమిత్ షా

గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా  హైదరాబాద్ లో అమిత్ షా రోడ్ షో బిజీ బిజీ గా ముగిసింది. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న అమిత్ షా నేరుగా  చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారాసి గూడకు చేరుకుని రోడ్ షోలో పాల్గొన్నారు. అమిత్ షా వెంట కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, భూపేందర్ యాదవ్, లక్ష్మణ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లు ఉన్నారు. రోడ్ షో కు శ్రేణులు భారీగా తరలి రావడంతో రహదారులన్నీ బీజేపీ శ్రేణులతో నిండిపోయాయి. వాహనంపై నుంచి అమిత్ షా చేతులు ఊపుతూ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. స్థానికులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. రహదారులన్నీ జన సంద్రం కావడంతో రోడ్ షో వేగంగా కదలలేదు. ఫలితంగా సమయాభావం వల్ల  సీతాఫల్ మండి చేరకుండానే అమిత్ షా రోడ్ షో ముగించారు. రోడ్ షా ముగిసిన అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో పలు అంశాలపై అమిత్ షా సమాధానాలిచ్చారు.

నాలాలపై అక్రమ కట్టడాలను కూల్చివేస్తాం

గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇస్తే సుపరిపాలన అందిస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఐటీ పరంగా విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఇటీవల కురిసిన వరదలకు నగర ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. ఒవైసీల కారణంగా నగరంలోని నాలాలు, చెరువులపై అక్రమకట్టడాలు ఉన్నాయని గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే వాటిని కూల్చివేస్తామని స్పష్టం చేశారు. తాము వాగ్ధానం చేశామంటే అమలు చేసి తీరతామన్నారు. ప్రధాని మోదికి పేరు వస్తుందనే నెపంతో స్వాస్థ్ యోజన పథకాన్ని సీఎం కేసీఆర్ అమలు చేయడంలేదని అమిత్ షా ఆరోపించారు.

టీఆర్ఎస్, మజ్లిస్ ల మధ్య లోపాయికారి ఒప్పందం

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎం లు లోపాయికారి ఒప్పందం ఉందన్నారు. రాజకీయాల్లో పొత్తులు సహజం ఎవరు ఎవరితోనైనా పొత్తులు పెట్టుకోవచ్చని అమిత్ షా అన్నారు. మజ్లిస్, టీఆర్ఎస్ ల తెరచాటు ఒప్పందాలపై బహిరంగంగా మాట్లాడే  ధైర్యం కేసీఆర్ కు లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులివ్వడం లేదన్న ప్రశ్నకు బదులిస్తూ సచివాలయానికి వెళితే కేంద్రం ఇచ్చే నిధుల గురించి తెలుస్తాయని అన్నారు.

Also Read: తిట్టారంటూనే తిరిగి తిట్లా!?

నిజాం సంస్కృతిని పారద్రోలుతాం

స్వాతంత్ర్యం వచ్చినపుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ సమయస్ఫూర్తితో హైదరాబాద్ సంస్థానం ఇండియాలో విలీనమైందన్న అమిత్ షా ఇంకా నిజాం సంస్కృతి మిగిలే ఉందని బీజేపీకి అధికారమిస్తే నిజాం సంస్కృతిని పారద్రోలుతామన్నారు. 

ఓట్ల కోసం ప్రాణాలు తీయం

ఎన్నికల్లో మతవిద్వేషాలు చెలరేగుతాయన్న కేసీఆర్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ అమిత్ షా మాట్లాడారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మత కలహాలు జరిగాయా అని ప్రశ్నించారు. ఎంఐఎంతో దోస్తీ చేస్తున్న టీఆర్ఎస్ ఆ లక్షణాలు వచ్చాయని అమిత్ షా ఎద్దేవా చేశారు.  ఓట్ల కోసం ప్రాణాలు తీసే సంస్కృతి బీజేపీకి లేదన్నారు. చేసిన అభివృద్ధి ఉంటే దాని గురించి మాట్లాడాలని కేసీఆర్ కు హితవు పలికారు.

హైదరాబాద్ లో రోహింగ్యాలు

నగరంలో గల రోహింగ్యాల జాబితా ఇస్తే వారిని దేశం నుంచి తక్షణం పంపించి వేస్తామని అమిత్ షా అన్నారు. నగరంలో రోహింగ్యాలు, బంగ్లాదేశీయులకు ఎవరు మద్దతు నిస్తున్నారో  అందరికీ తెలుసన్నారు.  

Also Read: ఆ పొత్తుతో… చిత్ర పరిశ్రమలో రచ్చ

ఆశీస్సుల కోసమే అమ్మ దర్శనం

అమ్మవారి ఆశీస్సుల కోసమే భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించానన్నారు అమిత్ షా. ఇందులో రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదన్నారు.

Also Read: తెలంగాణకు మధ్యంతర ఎన్నికలు?

కుటుంబపాలన

రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందన్నారు. పరిపాలనా సామర్థ్యం ఇంకెవరికీ లేదా అని ప్రశ్నించారు. గల్లీ ఎన్నికలకు ఢిల్లీ నేతలు వస్తున్నారంటూ చేసిన విమర్శలకు ఆయన దీటుగా సమాధానమిచ్చారు. గల్లీ ఎన్నికలు అనే వాళ్లు గల్లీలను ఎందుకు అభివృద్ధి చేయడం లేదని అమిత్ షా ప్రశ్నించారు బీజేపీ కి ప్రతి ఎన్నికలూ ముఖ్యమైనవేనని అన్నారు.

Also Read: ప్రశాంతనగరం కోసం టీఆర్ఎస్ కే ఓటు : కేసీఆర్

Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles