Friday, May 3, 2024

తెలంగాణకు మధ్యంతర ఎన్నికలు?

  • ముగింపు దశ ప్రచారంలో రాజుకున్న వేడి
  • కేసీఆర్ సర్కార్ కూలిపోతుందన్న బండి సంజయ్
  • గ్రేటర్ లో బీజేపీ ప్రభంజనం వీస్తోందని జోస్యం
  • వ్యక్తిగత విమర్శలతో పక్కదారి పట్టిన ప్రచారం

జీహెచ్ఎంసీ ఎన్నికల పోరాటం అత్యంత ఆసక్తిదాయకమైన మలుపులు తిరుగుతోంది. అభివృద్ధి,  ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడాల్సిన ప్రభుత్వ, ప్రతిపక్షాలు వ్యక్తిగత విమర్శ, ప్రతివిమర్శలతో ప్రచారాన్ని పక్క దారి పట్టిస్తున్నాయి.  ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ఓటర్లు పోలింగ్ లో వారు తీసుకునే నిర్ణయానికి  ప్రధాన పార్టీలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు.

టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కంటిలో నలుసులా మారారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.  పార్టీ జాతీయ స్థాయి నేతల నిరంతర పర్యటనలతో వివిధ సామాజిక వర్గాల్ని సమన్వయం చేస్తూ వారి ఆదరణ చూరగొనేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయలు వెనకేసిందని ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు.

చౌకబారు విమర్శలతో అభాసుపాలు

ముమ్మరంగా సాగుతున్న జీహెచ్ ఎంసీ ఎన్నికల ప్రచారంలో  సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ప్రధాన పార్టీల నేతలు చౌకబారు విమర్శలతో రక్తి కట్టిస్తున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు తమ స్థాయిని మరిచి విమర్శలకు దిగుతున్నారు. పాత బస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటూ వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారంలో ఎక్కడా తగ్గడంలేదు. ఎన్టీఆర్, పీవీ విగ్రహాలను కూల్చాలన్న అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా దారుస్సలాంను నేలమట్టం చేస్తామన్నారు. భాగ్యలక్ష్మి ఆలయానికి రావాలని అటు కేసీఆర్ కూ సవాల్ విసిరారు.

Also Read: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చక్రం తిప్పనున్న జిల్లాల నేతలు

తన పదునైన మాటలతో శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్న బండి సంజయ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. తూటాల్లాంటి మాటలతో ప్రత్యర్థులను విమర్శిస్తూ ఎన్నికల ప్రచారంలో వేడిని రగిలిస్తున్నారు. హైదరాబాద్ మేయర్ పీఠంపై బీజేపీని గద్దెనెక్కించాలనే ఏకైక లక్ష్యంతో సాగిపోతున్న బండి సంజయ్ కు జాతీయ స్థాయి నేతలు ప్రచారంలో పాల్గొనడంతో అమిత శక్తి సంపన్నుడిగా మారారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకున్న తరుణంలో బీజేపీ నేతల మాటల్లో వాడి పెరుగుతోంది. ఆ పార్టీ ప్రచార కర్తలు కూడా సంజయ్ వ్యాఖ్యలను ఖండించకపోగా వత్తాసు పలకడంతో ప్రచారంలోవేడి మరింత రాజుకుంది.

టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ

ముందుగా రచించుకున్న వ్యూహంలో భాగంగానే తాము కోరుకున్న ఎజెండాను ప్రజల ముందుకు తేవడంలో బీజేపీ సఫలీకృతమైందనే చెప్పాలి. గెలుపోటములు ఎలా ఉన్నా ఈ ఎన్నికలద్వారా రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమనే విషయాన్ని ప్రజలకు తెలిసేలా సంకేతాలు ఇస్తున్నారు. కాంగ్రెస్ నేతలను ఆకర్షించడంద్వారా ఈ పని మరింత సులువుకానుంది. రాష్ట్ర స్థాయి నేతలు మాట్లాడుతున్న భాషను, వ్యవహార శైలి పట్ల జాతీయ స్థాయి నేతలు మౌనం వహిస్తున్నారంటే వారి ఆశీస్సులతోనే ఇదంతా జరుగుతున్నట్లు భావించాల్సి ఉంటుంది.

Also Read: ఇద్దరు తెలుగు బిడ్డలు, ఇద్దరూ శాపగ్రస్థులు

తెలంగాణకు మధ్యంతర ఎన్నికలు

తెలంగాణకు మధ్యంతర ఎన్నికలు వస్తాయంటూ తాజాగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ముషీరాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బండి సంజయ్ జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత అవినీతిలో కూరుకుపోయిన కేసీఆర్ ప్రభుత్వం గ్రేటర్ ఎన్నికల తరువాత కూలిపోతుందని అన్నారు. కేసీఆర్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారని అన్నారు. సీఎం కేసీఆర్ తనపై కేసులు పెడితే భయపడేది లేదని సంజయ్ స్పష్టం చేశారు. పీవీ, ఎన్టీఆర్ ఘాట్ లను కూల్చేవేయాలన్న అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

సంజయ్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. మూడు రోజుల క్రితం ప్రధానమంత్రి జమిలి ఎన్నికలు దేశానికి అత్యంత ఆవశ్యకమని అన్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ వ్యాఖ్యలు ఉత్కంఠను రేకిత్తిస్తున్నాయి.

Also Read: ‘గ్రేటర్’ తాంబూలాలు

Also Read: ప్రశాంతనగరం కోసం టీఆర్ఎస్ కే ఓటు : కేసీఆర్

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles