Friday, April 26, 2024

అప్పుల ఉచ్చులో  ‘రొచ్చుపనుకు’ ఆదివాసీ రైతులు

మంగళవారం, 28 ఏప్రిల్ 2023న రొచ్చుపనుకు గ్రామానికి చేరుకున్నాను. అక్కడి ఆదివాసీల జీవితాలు  షావుకారు / వడ్డీ వ్యాపారం  రొచ్చులో పీకలలోతు కూరుకు పోయి వున్నాయి. 

మీరు ఒక అర సున్నాను  కాగితం మీద గీయండి.  లేదా నెల వంక  చంద్రుడ్ని వేయండి, సరిగ్గా దాని మద్యలో ఒక చుక్క (డాట్) పెట్టండి, రొచ్చుపనుకు ఆ చుక్క అయితే దాని వెనుక అర్ద చంద్రాకారoలో వున్నవి తూర్పు కనుమల పర్వత శ్రేణులు. అవి ఆకుపచ్చ అడవిని  దుప్పటినిలా  కప్పుకున్న కనుమలు. మీరు రొచ్చుపనుకు గ్రామానికి వస్తే , మీ  నాశికా పుటాలు ఎన్నడు శ్వాసించని పదహారణాల స్వచ్చమైన గాలి, మీ నేత్రాలు టీవీలలో మాత్రమె చూసే హరిత శోభ,  మీ చెవులు వినని నిశ్శబ్దం కొంత సేపైనా ఆస్వాదించగలరు.  అక్కడ మీ సెల్ ఫోన్ పని చేయదు గనుక, సెల్ ఫోన్ లేని యుగంలో మనుషులు ఎలా వుండేవారు మీకు అనుభవంలోకి వస్తుంది.  తీరుగా, కుదురుగా  వుండిన మూడు  గ్రామా వీధులలో నడుస్తుంటే అటు ఇటు నిటారుగా నిలబడిన వృక్షాలు మీకు సైనిక వందనం చేసే సిపాయిల్లా వుంటాయి.   కొండదొర తెగకు చెందిన అడవి బిడ్డల గ్రామం రొచ్చుపనుకు. అనకాపల్లి జిల్లా, రావికమతం మండలం, కళ్యాణ లోవ ఆవాసాలలో, చిట్టచివరన,   అల్లూరి సీతారామ రాజు జిల్లా  ఏజెన్సి చింతపల్లి మండలంకు సరిహద్దున ఈ గ్రామం వుంది. 20 ఏప్రిల్ 2023న నేను సబ్ కలెక్టర్ కార్యాలయం, నర్సిపట్టణంకు వస్తున్నాని తెలుసుకొని అక్కడికి వచ్చి కలిశారు ఆ గ్రామo, పొరుగు గ్రామాలైన తాటిపర్తి, రాయిపాడు, పెద్ద గరువు ఆదివాసీలు. తమ ఆవాస గ్రామం రావాలని కోరారు.

పోలీసులు పిలిస్తే నేను వస్తా, కోర్టు వారు పిలిస్తే తానొస్తుంది…. యువ మహిళా న్యాయవాది, రొచ్చిపనుకు ఆదివాసీలతో రచయిత అజయ్ కుమార్

నిజానికి అక్కడి వాతావరణo, భూములు, వాటిల్లో పంటలు, కొండలు,  వాటిపైన  పెంచిన  తోటలు చూసినప్పుడు రొచ్చుపనులు ఆదివాసీలు ఏంతో ఆరోగ్యంగా, నవ నవలాడుతూ కనిపించాలి. కాని ఇంచుమించుగా అందరూ పాలిపోయి వున్నారు . మహిళాలు, పిల్లల గూర్చి  చెప్పనక్కర లేదు. పోషకాహార లేమి స్పష్టంగా కనిపిస్తుంది. అందుకు కారణం ఏమిటో ఒకొక్క కుటుంబం గాధలు వింటూ నమోదు చేసుకుoటున్నప్పుడు నాకు అర్ధం కావడం మొదలయ్యింది.

Also read: ప్రత్యామ్నాయ భూములు కోరుతూ అనకాపల్లిలో దీక్షాశిబిరం

కట్ల చంటిబాబు, ఈ ఏడాది 27 బస్తాల జీడి మామిడి పిక్కలను షావుకారికి వేశాడు. ఒక బస్తా (షావుకారి చెప్పిన రేటు ప్రకారం సుమా) 8,500 రూపాయలు. అంటే 27 బస్తాల  విలువ 2,29,500 రూపాయాలు. చంటిబాబు  2020లో కుమార్తె  పెళ్ళికి 2,00,000 రూపాయలు షావుకారు నుండి అప్పు తీసుకున్నాడు. షావుకారి  చెప్పినదాని ప్రకారం 27 బస్తాల జీడి మామిడి పిక్కల ఖరీదులో 40,000 అసలుకు, మిగిలింది వడ్డికి జమ అయ్యింది.

జీడి మామిడి  తోట నుండి పిక్కలు  సేకరించడానికి  కట్ల చంటిబాబు కుటుంబం రెండు నెలలుగా అదే పనిలో వుంది. అయినా మనుషులు  సరిపోక కొందరిని కూలికి పెట్టుకోవలసి వచ్చింది. వారికి కట్ల చంటిబాబు బకాయి పడ్డాడు. తాను షావుకారికి వేసిన 27 బస్తాలలో ఒక్కదానికైనా నగదు ఇవ్వమని కట్ల చంటిబాబు భార్య షావుకారి కాళ్ళ వేల్ల పడింది. ఒక్క రూపాయి ఇచ్చేది లేదని తెగేసి చెప్పాడు షావుకారి.

ఇప్పటి ముఖ్యమంత్రి తండ్రి గారు వైఎస్ రాజశేఖరెడ్డి హయాంలో అటవీ హక్కుల చట్టం (ఉమ్మడి) రాష్ట్రంలో అమలయ్యిoది. చరిత్రలో మొదటిసారి అటవీ భూములు సాగు చేస్తున్న ఆదివాసీలకు పట్టాలు వచ్చాయి. వీటినే ఆర్ వో ఎఫ్ ఆర్ (ROFR) పట్టాలని లేదా కొండపోడు పట్టాలని అంటున్నారు.  వారి అబ్బాయి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రెండవ సారి  ROFR పట్టాలు వచ్చయి. వాటికి రైతు భరోసా  కూడా వస్తున్నది.

Also read: ‘MLA’ వంతంగి పేరయ్య భూమి కధ

సోముల సోమరాజుకు అలా 5.19 ఎకరాల అటవీ భూమికి  ROFR పట్టా వచ్చింది. ఆ భూమిలో జీడి మామిడి తోట పెంచాడు. షావుకారి వద్ద సోమరాజు తీసుకున్న అప్పు 2 లక్షలు. షావుకారి చెపుతున్న ప్రకారం అది 6 లక్షలు అయ్యికూర్చుంది. ఈ ఏడాది 10 బస్తాల జీడి మామిడి పిక్కల షావుకారికి వేశాడు సోమరాజు. అదంతా వడ్డికి జమయ్యింది. ROFR పట్టా షావుకారు చేతిలోకి పోయింది.

కట్ల చంటిబాబు తన కుమార్తెతో… తాను ఎంత బాకీ ఉన్నాడో వడ్డీ వ్యాపారి రాసి ఇచ్చిన కాగితాన్ని చూపిస్తున్నాడు.

 

పోటుకూరి గంగమ్మకు సర్వే నెంబర్ 431/1లో 2.14 సెంట్లు భూమి వుంది. పట్టా నెంబర్ 915, పాసు పుస్తకం నెంబర్ 527095. ఇది ప్రభుత్వం ఇచ్చిన D-పట్టా భూమి. గంగమ్మ తీసుకున్న అప్పు  2 లక్షలు.  అది కాస్త హనుమంతుని వాలంలా ఈ ఎడాదికి రూ. 7,50,000 కు చేరుకుంది. అసలు అంత ఎలా అయ్యింది? గంగమ్మకు ఆ లెక్కలు తెలీదు. అంత అప్పుతానూ ఎలాను కట్ట లేదుగనుక మొత్తం భూమిని 99 సంవత్సరాలకు స్టాంప్ పేపర్ పై రాయించుకున్నాడు షావుకారి. ఇప్పుడు అదే భూమిలో షావుకారు ఇచ్చే కూలీకి జీడి పిక్కలు ఏరుతున్నారు గంగమ్మ, ఆమె పరివారం.

అది అటవీ హక్కుల పట్టా అయినా, D-పట్టా భూమైనా  ఎలాంటి ‘అన్యాక్రాంత’ చెల్లదని “ఆంధ్రప్రదేశ్ అసైన్ మెంట్ భుముల బదలాయింపు నిషేధ చట్టం” (Act 9/77) అంటుంది. ‘అన్యాక్రాంతం’ అనే మాటకు చాల విస్తృతమైన నిర్వచనం  ఇచ్చింది చట్టం. అంతేకాదు, చట్ట విరుద్దంగా D-పట్టా భూమి ‘అన్యాక్రాంతo’ పొందిన వారికి ఆరు (6) నెలలు జైలు శిక్షా, రెండు (2) వేల రూపాయలు జరిమానా కూడా వుంది.

రోచ్చుపనుకు నుండి కళ్యణలోవ గ్రామ సచివాలయం అయిదు కిలోమీటర్లు, కొత్తకోట పోలీస్ టాణ ఎనిమిది కిలోమీటర్లు, రావికమతం మండల రెవిన్యూ కార్యాలయం 19 కిలోమీటర్లు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం 45 కిలోమీటర్లు, అంటే రాజ్య వ్యవస్థలన్నీ రొచ్చుపనుకు ఆదివాసీ గ్రామానికి 50 కిలో మీట్లరలోపు మొహరించి  వున్నాయి. ఇవన్ని చట్టాన్ని కాపాడి, అది అమలయ్యేలా చూడవలసినవే సుమా!

36 కుటుంబాలతో వున్న కొండదొరల రోచ్చుపనుకు గ్రామం, నేడు 2 కోట్ల అప్పులలో నిండా మునిగి వుంది. వారి జీడి మామిడి తోటలు, భూములు షావుకారుల కబంధ హస్తాలలో చిక్కుకున్నాయి.  ఆ భూములన్ని  అయితే ప్రభుత్వ బంజరు భూమికి గాను ఇచ్చిన D-పట్టా భుములు లేదా అటవీ హక్కుల చట్టం ద్వారా ROFR పట్టాలతో ఇచ్చిన ‘అటవీ భూములు’. నేను చెప్పిన చట్టం (Act 9/77) వచ్చి 46 ఏళ్ళు.

Also read: పేదలకు ఇళ్ళ కోసం .. పేదల భూములు ..

ఎవరీ షావుకార్లు / వడ్డీ వ్యాపారులు?

అందరూ దిగువ (పల్లం) ప్రాంతానికి చెందిన గిరిజనేతరులే. ఈ ప్రాంతంలో మోహరించిన ప్రధాన స్రవంతి పార్టీల నాయకులుగా  వున్న సామాజికి వర్గాలకు చెందిన వారే ఈ షావుకార్లు. ఆయా పార్టీల కీలక నాయకులకు వారు మదుపరులు. పట్టు పట్టు వస్తే, ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేదు. అందరూ వారికే సపోర్టు.

కళ్యణలోవ ప్రాంతంలో ఎదుగుతున్న  కొత్త తరం ఆదివాసీ రాజకీయ  నాయకత్వానికి కూడా ఈ షావుకారు / వడ్డీ వ్యాపారులు మదుపరులు. అధికారం – ప్రతిపక్షం రెండు ఈ షావుకార్ల  చేతిలోనే వుంటాయి. ఇక చేతిలో మూడు సింహాల (రాజ) ముద్రను  ధరించిన, స్థానిక  రాజ్య వ్యవస్థల “సింహాలకు” వారే రింగ్ మాష్టర్లు. రొచ్చుపనుకు ఆదివాసీలు తప్పించుకోలేని సాలెగూడులో చిక్కుకున్నారు. ఇది రోచ్చుపనుకు కధ మాత్రామే కాదు. దానిని అటు ఇటుగా వున్న ఆదివాసీ ఆవాస గ్రామాల కధ ఇది.

పంట ఫలం చేతికి రాదు  –  రేషన్ నోటికి అందదు

జనవరి నుండి (మెట్టు ప్రాంతాలలో) వ్యవసాయంలో ‘అన్-సీజన్’ మొదలౌతుంది. ఫిబ్రవరి నుండి జీడి తోటల పనులు  మొదలౌతాయి. తోటలు బాగు చేసి, జీడి పిక్కలు సేకరించి షావుకార్లుకు వేయాలి. ఇప్పటికే షావుకార్లు 99 ఏళ్లకు లీజులు రాయించుకున్న తమ భుములలో అదే పనిని రోజు కూలికి చేయాలి. అలాంటి కష్టకాలంలో గత మార్చి, ఏప్రిల్ నెలలలో వారికి  రేషన్ అందలేదు.

తగ రెండు నెలలుగా రొచ్చుపనుకు దాని పరిసర ఆవాస గ్రామాలకు ప్రభుత్వ ఇచ్చే చౌక ధరల రేషన్ అందటం లేదు.

కళ్యణలోవ ప్రాంతంలోని ఆవాస గ్రామాలన్నీ రేషన్ డిపో నెంబర్ 24 పరిధిలోకి వస్తాయి. ఈ డిపోలో మొత్తం 596 తెల్ల  కార్డులు వున్నాయి. 90 % ఆదివాసీలకు చెందినవే. ఈ 596  కార్డులలో, 2023, మార్చి నెలలో 279 కార్డులకు రేషన్ ఇవ్వలేదు (ఇదీ 47% శాతం). ఏప్రిల్ నెలలో 317 కార్డులకు రేషన్ ఇవ్వలేదు(53%).

Also read: ఉపాధి హామీ పధకoలో కేంద్ర తీసుకువస్తున్న కార్మిక వ్యతిరేక మార్పులను రద్దు  చేయాలి!

ఆధునిక సాంకేతిక ప్రక్రియలు ఉపయోగించి తాము ‘లీకేజీ’ని అరికడుతున్నామని, బయో మెట్రిక్ గుర్తింపును ఉపయోగించి ఖచ్చితంగా లబ్దిదారునికే చేరాలా రేషన్ ఇస్తున్నామని  పాలకులు చెపుతుంటారు. అంతేకాదు ‘ఆన్ లైన్ – రియల్ టైo’ లో రేషన్ అందింది లేనిది తాము పర్యవేక్షణ (మోనిటరింగ్) చేస్తున్నామని కూడా “క్లయిం” చేస్తూవుంటారు. అంతటి అఘటన ఘటన సమర్డులకు, మార్చి నెలలో,  మొత్తం రేషన్ కార్డులలో 47 % మందికి రేషన్ అందలేదని ఎందుకు తెలియ లేదు? ఏప్రిల్ వచ్చే సరికి రేషన్ అందని వారి సంఖ్య 47 % (279) నుండి 53 % (317) పెగిపోయింది. దీనిని బట్టి మనకు ఏమి అర్ధం అవుతోంది?  డేటా రియల్ టైంలో వున్నా ఏలిన వారు ‘ఆఫ్  టైం’లో ఉన్నారన్న మాట. రేషన్ కార్డులు అందని గ్రామాలలో ద్వితీయ స్థానంలో రొచ్చుపనుకు, తృతీయ స్తానంలో తాటిపర్తి వున్నాయి. నా దగ్గిర వున్న సమాచారం ప్రకారం రెండు గ్రామాలు అప్పులలో పీకలలోతు కూరుకుపోయి వున్నాయి.

ఇప్పుడు మొత్తం చిత్రాన్ని కలిపి చూడండి. జీడి పిక్కల సీజన్ లో ఆదివాసీ చేతిలో ధన లక్ష్మి తాండవం ఆడాలి. కాని కాబోలి షావుకారు (com) వడ్డీ వ్యాపారి పైశాచిక తాండవం సాగుతుంది. అదే సమయంలో ‘గోరు చుట్టు మీద రోకటి పోటులా’ రెండు నెలలు రేషన్ అందలేదు.

సోమేల సోమరాజు ఆయన భార్య… ఒరిజినల్ పట్టా కాగితం షావుకారి పట్టుకుపోగా వారి వద్ద మిగిలిన జిరాక్స్ కాపీ

సాధారణంగా ఆదివాసీ కుటుంబాల సభ్యులు  5 గురికి తక్కువ వుండరు.  నేను కార్డుకు నలుగురు చొప్పున లెక్కగట్టాను. ఆహార భద్ర చట్టం ప్రకారం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న (BPL) కుటుంబాలకు చెందిన ప్రతివ్యక్తి నెలకు అయిదు కేజీల రేషన్ పొందుటకు అర్హుడు. అలా చూస్తే మార్చి నెలలో 279 కుటుంబాలకు అందని రేషన్ 5,580 కేజీలు, ఏప్రిల్ నెలలో 317 కార్డులకు అందని రేషన్  6,340 కేజీలు, మొత్తం 11,920 కేజీల రేషన్  (బియ్యం) ఆదివాసీలకు అందలేదు. బహిరంగ మార్కట్ లో ఇప్పుడు ఒక కేజీ బియ్యం 50 నుండి 52 రూపాయాలు వుంది.

బతుకంతా  భయం … భయం

వారి గొంతుకలో విషాదం. వారి కళ్ళలో భయం. వారి మొహంలో దైన్యం.  ఏ ఒక్కరిలోను జీవ కళ లేదు. అప్పులు, వాటికి వడ్డీలు. ఆ వడ్డిలు అసలులో కలసి మళ్ళీ దానికి వడ్డీలు. వడ్డీలకు వడ్డీ చక్ర వడ్డీలు.

వసంతాడ రామలింగాచారి గారు పార్వతీపురం కుట్ర కేసులో కోర్టు వారికి ఇచ్చిన ప్రకటనలో శ్రీకాకుళం జిల్లా ఆదివాసీలను మైదాన ప్రాంత వలస వ్యాపారులు / వడ్డీ వ్యాపారులు  ఎలా దోపిడీ చేసారో వివరించారు. అలాంటి దోపిడీ గూర్చి  రొచ్చుపనుకు ఆదివాసీలు వివరిస్తూ వుంటే కడుపు తరుక్కుపోయింది.

షావుకారి అప్పు ఇస్తాడు. ఏవో కాగితాల మీద వేలి ముద్రలు తీసుకుంటాడు. ఒరిజినల్ పట్టా కాగితాలు పట్టుకుపోతాడు. వడ్డీ ఎంత పడిందో,  ఇంకా ఎంత కట్ట వలసి వుందో ఆయనే చెపుతాడు. ఆ లెక్కలలోని అంకెలు  ఎప్పటికి కిందికి దిగిరావు. అసలు, వడ్డీ జీడి పిక్కల రూపంలో మాత్రేమే తీసుకుంటాడు. అంటే తానె వాటిని కొంటాడు. మార్కట్ లో రేటు ఎంత ఉందో  తానే చెపుతాడు. అదే దాని  రేటు. బరువు తానే తూస్తాడు. అవి దొంగ కాటా (త్రాసు)లు. బస్తాలు కట్టడానికి తానె గోనెలు తెస్తాడు. దానికి రెండు కేజిల పిక్కలు అదనంగా లెక్క వేస్తాడు, తీసుకుంటాడు. ప్రతి వందకు రెండు కేజీలు తరుగు పేరున లెక్క తగ్గించి కొలుస్తాడు.  తనకు తప్ప మరెవరికి పంట అమ్మకూడదు. అక్కడ షావుకారె మూడు సింహాల రాజముద్ర.

వారి వద్ద మిగిలిన క్సెరాక్స్ కాపీ

గిరిజనేతర షావుకారులు ఆదివాసీలను గోడ   చివరికి నెట్టేశారు. ప్రతి ఏడాది జీడి తోటల పిక్కలు ఏరడం షావుకారు కాటాకు వేయడం లేదా తమ భూమిని 99 ఏళ్లకు రాసి ఇచ్చేసి, అదే తోటలో కూలిలుగా పని చేయడం. మరో మార్గం లేదు. అయితే, వారిని ప్రతిఘటిoచకుండా చేస్తున్నది ఏమిటి ? వారి అంతరాoతరాలలో గూడు కట్టుకొని వున్న భయాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేసాను.

పోలీసులు పిలిస్తే నేను వస్తా, కోర్టు వారు పిలిస్తే తాను వస్తుంది

వారి మనో ప్రపంచంలో వున్న భయాలే నిజానికి షావుకారు / వడ్డీ వ్యాపారుల పెట్టుబడులు. మొదటది నైతికత. 1. వడ్డీ మీద వడ్డీ వేసినా తీసుకున్న అసలుకంటే ఎన్నో రెట్లు అప్పు పెరిగిపోయినా, అది అన్యాయం అయినా, “అప్పు అయితే తీసుకున్నాం కదా” అన్న భావన.

2. పట్టా కాగితాలు (ఒరిజినల్స్) వాళ్ళ చేతుల్లో వుండిపోయాయి కదా అని భయం.

3.వాళ్ళు తెచ్చిన కాగితాల మీద వేలిముద్రలు వేసేశాం అని భయం

4. ఇక ఈ ‘అప్పులు మేము కట్టలేం’ అని మొండికేస్తే, మా జీడి మామిడి పిక్కలు ఎవరు కొంటారు? వేరే షావుకారిని  రానివ్వకపోతే ఏమి చేయాలని భయం.

 5. “ఆల్లకి పలుకుబడి వుంది. కొత్తకోట పోలీస్ స్టేషన్ లో పెడితే మాకు దిక్కు ఎవర”న్నది భయం.

6. మేము సంతకాలు పెట్టిన కాగితాలతో కోర్టులో కేసు వేస్తె కోర్టుల చుట్టూ తిరగాలి,  ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలీదు. ఇవీ నాకు అర్ధమైన భయాలు.

ఏప్రిల్ 28న రొచ్చు పనుకు గ్రామంలో ఆదివాసీల గ్రామసభ

ఒకటి నుండి నాలుగు వరకు వున్న భయాలను నివృత్తి చేశాను.ఇక నాలుగవది, పోలీసులు పిలిస్తే నేను వస్తాను. కోర్టు వారు పిలిస్తే ఇదిగో ఈ యువ లాయరమ్మ వస్తుందన్నాను.  వారి కళ్ళలో వెలుగును, మొదటిసారి నవ్వులు చూశాను. ఆ వెలుగుని నిలబెట్టడానికి, మరిన్ని నవ్వులు పూయించడానికి త్రికరణ శుద్దిగా పనిస్తూనే ఉంటాము.

“మైదాన ప్రాంతాల నుండి వచ్చిన వడ్డి వ్యాపారులు ఈ గిరిజనులకు 10 రూపాయలు అప్పులు ఇచ్చి 100 లేదా అంతకంటే ఎక్కువకు ప్రోనోట్ వ్రాయించుకుంటారు.  కొన్ని సందర్బాలలో అచ్చంగా తెల్ల కాగితాలపైనే వేలిముద్రలు వేయించుకుంటారు. బదలు చెల్లించిందoతా వడ్డీగా లెక్క గట్టుకుంటారు. పెద్ద మొత్తాలు బాకీ తేల్చి వారికున్న భుములు కాస్తా వదులు కొమ్మని డిమాండ్ చేస్తారు. దానికి అంగీకరించకపొతే స్థానిక పోలీసు, రెవిన్యూ అధికారుల సహాయంతో ఆ భూముల నుండి గిరిజనులను నెట్టి వేస్తారు”

14 మార్చి 1973న “డైలీ న్యూస్” లో ప్రచురితమైన నివేదిక నుండి (తాకట్టులో భారత దేశం – తరిమెల నాగిరెడ్డి, పేజి 524). 50 ఏళ్ల తరువాత ఎక్కడ వున్నాం? అమృత్ కాల్ ఎవరికీ వచ్చింది? రోచ్చుపనుకు ఆదివాసీలక లేక షావుకార్లకా?

Also read: దండోరా రిపోర్టు చెప్పిన భూసంస్కరణల కథాకమామీషూ

పీ. ఎస్. అజయ్ కుమార్

జాతీయ కార్యదర్శి, అఖిల భారత వ్యవసాయ & గ్రామీణ కార్మిక సంఘం (AIARLA)

అజయ్ కుమార్ పీ ఎస్
అజయ్ కుమార్ పీ ఎస్
పీఎస్ అజయ్ కుమార్ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో సోషల్ వర్కులో మాస్టర్స్ డిగ్రి (MSW) చేశారు. గత 30 ఏళ్లుగా ఆదివాసీల భూమి సమస్య, నిర్వాసిత, గ్రామీణ కార్మికుల హక్కుల కోసం పని చేస్తున్నారు. ‘ప్రభుత్వ భూమి పేదలదే’, ‘భూమి సమస్య – వ్యాసాలు 1, 2’, ‘కళ్యాణలోవ కధలు’ ప్రచురితమైన పుస్తకాలు. భూమి సమస్య వ్యాసాలు – 1కి, DNF Rural Journalist award foundation –Hyderabad వారి Rural journalist award for year 2008 లభించింది. ప్రస్తుతం అఖల భారత వ్యవసాయ & గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శిగా పని చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles