Saturday, April 20, 2024

దండోరా రిపోర్టు చెప్పిన భూసంస్కరణల కథాకమామీషూ

“దండోరా” అనగానే ఇదేదో విప్లవం గురించి, మార్పు, తీర్పు గురించో అనుకోకండి. అచ్చంగా ‘దండోరా ప్రకటన’ గురించే. నేను దిగువన ఇస్తున ఒక ‘దండోరా రిపోర్టు’ పత్రాన్ని  చూడండి. అది తేది: 28-06-1975న ఇవ్వ బడింది. ఈ రిపోర్టు  ఇచ్చి 48 ఏళ్ళు గడుస్తున్నది.

దండోరా అంటే,  గ్రామంలో  ‘వార్త’ను ప్రజలకు  చెప్పే ఆసామి, గ్రామ ప్రజల దృష్టిని ఆకర్షించడానికి కొద్ది సేపు డప్పు కొట్టి, దరువును ఆపి, సదరు సమాచారాన్ని బిగ్గరగా అరచి చెపుతాడు. అలా గ్రామం అంతా తిరుగుతాడు. అదే దండోరా.  ఇదేదో పురాతన  కాలం నాటి సంగతి అనుకోకండి. మొన్న రాత్రి (ఎప్రిల్ 13, 2023న) మా ప్రక్క గ్రామమైన సంపతిపురంకు  వేళ్ళాను. మరుసటి రోజు, అనగా ఈ రోజు, ఏప్రిల్ 14న అక్కడ జరపనున్న డాక్టర్ బిఆర్ అంబెద్కర్ జయంతి ఉత్సవాలు ఏర్పాట్లు చూసేందుకు వెళ్లాను. సపంతిపురంలో  దండోరా  జరుగుతుంది, రేపు గ్రామా పంచాయితీ కార్యాలయంలో “గ్రామ సభ” వుందని ఆ దండోరా  ప్రకటన సారాంశం. ఇప్పటికి గ్రామాలలో “దండోరా” వుంది.

దండోరా జరిగినట్టు దొంగ సర్టిఫికెట్టు

బ్రిటీష్ వారు ప్రజలకు సమాచారం తెలియవలసిన ప్రతి సందర్బంలోనూ, తమ  నియమావళిలో “దండోరా” ప్రకటనను ఒక తప్పనిసరి షరతుగా పెట్టారు. దీనినే వారు “Tam Tam” అన్నారు. ఈ  “Tam Tam” వేయకుండా, చేపట్టే తదుపరి చర్యలు చెల్లవు. అంతటి ప్రాధాన్యత వుంది Tam Tamకి. సమాచారం ఇవ్వకుండా తీసుకనే నిర్ణయాలు “సహజ న్యాయ సూత్రాలకు” విరుద్దం. కనుక “Tam Tam” జరగలేదని నిరూపిస్తే, ఆ ‘నిర్ణయం’ రద్దు చేయమని అడగడానికి అది ఒక బలమైన (న్యాయ) కారణం కాగలదు.

అయితే, డప్పుకొట్టుకుంటూ చేసే ఆ మౌఖిక (నోటిమాట)  ప్రకటన ( ఎనౌన్స్మెంట్) జరిగిందనడానికి సాక్ష్యం ఏమిటి? దానికి జవాబు ఈ “దండోరా ప్రకటన” అనే రిపోర్టు. ఆ రిపోర్టుపై  ఆ ప్రకటనకు ఆదేశాలు ఇచ్చిన అధికారి సంతకం వుండాలి. “Tam Tam” జరిగినట్లు ఇద్దరు పెద్ద మునుషుల సాక్షి సంతాకాలు వుండాలి. అప్పుడది “దండోరా రిపోర్టు” అవుతుంది. 

నేను ఇచ్చిన ఒక  దండోరా రిపోర్టును  నిశితంగా గమనించండి. అందులో అడుగున ఒక సంతకం కనిపిస్తుంది. ఆ సంతంకం కింది  V.H.M అనే అక్షరాలు వున్నాయి. అంటే విలేజ్ మున్సబ్ లేక విలేజ్  హెడ్ మెన్ అని అర్ధం. సాక్షి సంతకాలు వద్ద ఖాళిగా వుండటాన్ని మీరు గమనించ వచ్చు (ఈ  భు వివాదం, రావణ కాష్టంలో ఇంకా  నడుస్తుంది గనుక నేను ఇందులో కొంత సమాచారానికి నల్ల రంగు పుసాను. In the interest of struggling Adivasisi).

 ఎందుకు ఈ దండోరా ప్రకటన?

డప్పు వాయిస్తూ (కోడవంటి కుటుంబరావు గారి రచనల నుండి నేను  ఒక పేరు అప్పు తెచ్చుకుంటున్నాను) “దిబ్బరాజ్యం” అనే ఒక  గ్రామంలో, ఈ దండోరా ద్వారా  ఒక ‘ప్రకటన’ ప్రజలకు చెప్పారు అనడానికి  ఈ  ‘దండోరా రిపోర్టు’  ఒక  సాక్ష్యపత్రంగా  దస్త్రాల(ఫైల్స్ ) లో వుంది. నిజంగా దండోరా వేశారా? లేక వేసినట్లు రిపోర్టు రాసుకున్నారా? మనం రిపోర్టు చూస్తే కేవలం రాసుకున్నదేనని  సులువుగా చెప్పవచ్చును. ఎందుకంటే దండోరా రిపోర్టులో దిగవున, దండోరా జరిగినట్లు సాక్షి సంతకాలు లేవు. ఇప్పుడు చెప్పండి,      తేది: 28-06-1975న గ్రామంలో దండోరా ద్వారా సమాచారం చెప్పినట్లు చూపిస్తున్న ఈ “దండోరా రిపోర్టు”  చట్టాబద్దమైనదా?

అసలు ప్రశ్న అలానే వుండి పోయింది. ఇంతకీ తేది: 28-06-1975న ‘దిబ్బరాజ్యం’ గ్రామంలో దండోరా ప్రకటన దేనికట?

ఎందుకంటే, పెద్ద పెద్ద భుస్వాముల వద్ద వున్న భూముల లెక్కలు చూసి, అందులో ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట (ఎక్కువలో ఎక్కవ) పరిమితికి మించి వున్న భుములను స్వాధీనం చేసుకొని, వ్యవసాయం చేసే భూమి లేని గ్రామీణ పేదలకు ఇవ్వాలన్నది ప్రభుత్వం ఉద్దేశం(అట). అందుకు భూ సంస్కరణ చట్టం తీసుకువచ్చింది.

భూ సంస్కరణల ట్రిబ్యునల్ ముందు 10 ఎకరాలకు పైగా భూములు వున్న వారందరూ ఒక డిక్లరేషన్ (ఫారం 4 అనే నమూనాలో) విధిగా ఇవ్వాలి. దానిని తెలుగులో ‘రూఢి ప్రకటన’ అన్నారు. అయితే, ఒక డిక్లరెంట్ అలాంటి ప్రకటన ఇవ్వగానే, అందులో నిజాలు ఏమిటి? అబద్దాలు ఏమైనా ఉన్నాయా? అని పరిశీలిoచి ట్రిబ్యునల్ ముందు ఉంచడానికి, ఆ డిక్లరేషన్ (ఫారం 4 ) అనే పత్రపు  నఖలును        భూ సంస్కరణల  ట్రిబ్యునల్ కార్యాలయంలో ఒకటి,  తాలుకా ఆఫీసులో మరొకటి,  గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఒకటి వుందిని  చెప్పాడానికే ఆ దండోరా. అంటే ఎవరైనా పౌరులు పంచాయీతి, తాలుకా ఆఫీసు, ట్రిబ్యునల్ ఆఫీసుకు వెళ్ళే ఆ డిక్లరేషన్ చూడవచ్చును.  దండోరా వేశామనడానికి  సాక్ష్యంగా ఆ దండోరా రిపోర్టు.

అంటే ప్రతి డిక్లరేషన్ ఒక పబ్లిక్ (ప్రజలు చూడదగిన) డాక్యుమెంట్ అని అర్ధం. అప్పటికి RTI కలగా కూడా లేదు. అయినా, సమాచారాన్ని ప్రజల ముందు పెట్టడాన్ని Tam Tam ద్వారా  తప్పని సరి చేసింది భు సంస్కరణల చట్టం.

పరమార్థం ఏమిటి?

ఇందులో ఉద్దేశం ఏమిటంటే, ఒక భూ యజమాని / భూస్వామి ఇచ్చిన (ఫారం 4 అనే నమూనాలో) డిక్లరేషన్ సమాచారాన్ని ప్రజల ముందు ఉంచితే వారు దానిని చూసి, ఒకవేళ ఆయనకు అందులో చెప్పిన దానికంటే ఎక్కువ భూములు వుండి, ఆ సమాచారాన్ని గుప్తంగా దాచేస్తే, దానిని ప్రజలు లేదా ఆ ప్రజలతో పని చేసే వారు, ఎవరైనా భూసంస్కరణల ట్రిబ్యునల్ కు సమాచారం ఇస్తారని, తద్వారా భుస్వాముల వద్ద గుప్తoగా వున్న భుముల వివరాలు బయటకు వస్తాయని చట్టం ఆశించింది. అందుకే ప్రజలను భాగస్వాములను చేయడానికి ఒక భూ యజమాని ట్రిబ్యునలకు ఇచ్చిన సమాచారాన్ని బహిర్గత పరిచింది. అలా బహిర్గత పరిచాము అని  తెలియజేయడానికి దండోరా, అలా దండోరా వేశాo అని నిర్దారించాడానికి ఈ దండోరా రిపోర్టు.

ఇప్పుడు చెప్పండి, ఒక భూయజమాని భూ సంస్కరణల ట్రిబ్యునల్ ముందు, తన భూముల వివరాలను తెలియజేస్తూ  దాఖలు చేసిన “డిక్లరేషన్” పబ్లిక్ డాక్యుమేంట్ అవునా కాదా? ఖచ్చితంగా అది  పబ్లిక్ డాక్యుమేంటే. అంటే ఎవరైనా దానిని చూడవచ్చును. అసలు ప్రశ్న ఏమిటoటే :

గ్రామీణ పేదలకు భూమి కావాలని పోరాటం చేస్తున్నామని చెప్పుకున్నవారు, ఎన్ని ‘డిక్లరేషన్’ లను  సేకరించి అందులోని సమాచారం (ఆ సమాచారం ‘పబ్లిక్ డాక్యుంమెంట్’ అని ముందు చెప్పాను)  ప్రజల ముందు పెట్టి భుస్వాముల అసలు స్వరూపాన్ని ట్రిబ్యునల్స్ ముందు ఉంచారు? ప్రతి భూ సంస్కరణల ట్రిబ్యునల్ ను భూ పోరాట కేంద్రాలుగా  మలిచారా? అసలు, డిక్లరేషన్ ఒక పబ్లిక్ డాక్యుమెంట్ అని వారికి తెలుసా?

AP లో భూ సంస్కరణలు:

‘AP లో భు సంస్కరణలు’ అనే పేరుతొ ఒక మోనో గ్రాఫ్ ను తెలుగు అకాడమి 1998లో ప్రచురించింది. అందులో , “చట్టం అమలు జరిగిన విధానం” (పేజి 79) అనే హెడ్డింగ్ కింద ఇలా రాశారు.

“1976-77 లెక్కల ప్రకారం ప్రాంతాలవారీ పరిశీలనలో కోస్తా ఆంద్ర జిల్లాలలో నాలుగు హెక్టార్ల (అంటే సుమారుగా 10 ఎకరాలు – వ్యాసకర్త) కంటే హెచ్చు పరిణామంగల కమతాల  సంఖ్య  2,53,837 ఉండగా 1,49,549 డిక్లరేషన్ లు (58.9 శాతం) ట్రిబ్యునల్స్ కు సమర్పించారు. అంటే 41 శాతం కమతాలు చట్ట పరిధిలో వున్నప్పటికీ  డిక్లరేషన్ లే దాఖలు చేయలేదు. రాయలసీమలో  2,25,154 కమతాలు వుండగా 83,514 డిక్లరేషన్ లు (37.1 శాతం), తెలంగాణలో 4,79,277 కమతాలు వుండగా 2,08,079 డిక్లరేషన్ లు (43.4శాతం) సమర్పించడం జరిగింది.” అంటే (ఉమ్మడి) ఆంద్రప్రదేశ్ లో నూటికి 37 నుండి 43 మంది భూయజమానులు అసలు డిక్లరేషన్లే దాఖలు చేయలేదు. అలా డిక్లరేషన్లు దాఖలు చేయకపోవడం అదే చట్టం కింద క్రిమినల్ నేరం.

ఇక ట్రిబ్యునల్ ముందు దాఖలైన డిక్లరేషన్లను పరిశీలించి, వాటి చుట్టూ గ్రామీణ పేదలను సమీకరించే పనిని వదిలేసారు. భూ యజమానులు ఇచ్చిన డిక్లరేషన్ల పరిశీలన  పనిని పూర్తిగా అధికారులకు వదిలేశారూ. ప్రజలను,  గ్రామీణ కార్మిక వర్గన్ని భాగస్వామ్యం చెయడానికి చట్టం వెసులుబాటు ఇచ్చినా  దానిని వాడుకుంటూ, విశాలపరిచే పనిని ‘భూ పోరాట’ ఉద్యమకారులు చేయలేదు. అసలు వారు చట్టాన్ని, దాని అమలుకు ఇచ్చిన ఆదేశాలను, ఆ ఆదేశాలను అమలు పరిచే ప్రక్రియ(ప్రాసెస్)లను పట్టించికున్నారా? లోతుగా అధ్యాయనం చేశారా? వాటిపై పట్టు సాధించే ప్రయత్నం చేశారా? 

ఇప్పుడు చెప్పండి, భూ సంస్కరణల వైఫ్యల్యానికి ప్రభుత్వ వ్యవస్థలు  మాత్రమే కారణమా …. మన వైఫల్యం లేదా?

ఈ దండోరా రిపోర్టు:

తేది: 28-06-1975న ‘దిబ్బరాజ్యం’ అనే గ్రామంలో దండోరా వేసినట్లుగా చేపుతున్న ఈ ‘దoడోరా రిపోర్టు’ ఒక అబద్దం. అసలు దండోరా వేయలేదు. వేసినట్లుగా VHM (విలేజ్ మున్సబ్ లేక హెడ్ మెన్) ప్రోఫార్మ నింపేసి ట్రిబ్యునల్ ముందు దండోరా వేసినట్లు ఈ రిపోర్టును దాఖలు చేశాడు. భూ సంస్కరణల ట్రిబ్యునల్ ముందు ప్రభుత్వo తరుపున 1.ఆధరైజ్డ్ ఆఫీసర్ (AO)అనే పేరుతొ ఒక అధికారి ఉంటాడు. ఇక 2. భూ యజమాని తరపున ఆయన పెట్టుకున్న న్యాయవాది ఉంటాడు. ఆధరైజ్డ్ ఆఫీసర్ ఈ దండోరా రిపోర్టు మీద అభ్యంతర చెప్పి వుండడు. అందుకుగాను ఆయనకు ‘తాంబూలం’ అంది వుంటుంది. ఈ డిక్లరెంట్ (భూ యజమాని) వద్ద చట్టం ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసుకోదగిన (surplus) భూమి లేని (non-surplus) కేసుగా భూ సంస్కరణల ట్రిబ్యునల్ తేల్చివుంటుంది.

కొస మెరుపు , తాజా కలం:

(కొత్త) భూ కుంభకోణంలో చిక్కుకున్న ఆదివాసీలను  గట్టు ఎక్కించాలంటే పాత చిట్టాలు తిరగేయాలి. అందులో భాగంగా RTI ఇచ్చిన వెసులుబాటు (section 2 (J)- ద్వారా మీరు రికార్డులు తనిఖి చేయవచ్చును) ను ఉపయోగించుకొని  రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్(RDO)  కార్యాలయంలో  పాత సీలింగ్ దస్త్రాల పరిశీలనలో ఈ దొంగ దండోరా రిపోర్టు నాకు తారస పడి ఈ కధనంత మీకు చెప్పించింది.

Also read: అంతటివాడు చెప్పినా పరిష్కారానికి నోచుకోసి సమస్య

PS అజయ్ కుమార్

జాతీయ కార్యదర్శి,అఖిల భారత వ్యవసాయ & గ్రామీణ కార్మిక సంఘం (AIARLA)

అజయ్ కుమార్ పీ ఎస్
అజయ్ కుమార్ పీ ఎస్
పీఎస్ అజయ్ కుమార్ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో సోషల్ వర్కులో మాస్టర్స్ డిగ్రి (MSW) చేశారు. గత 30 ఏళ్లుగా ఆదివాసీల భూమి సమస్య, నిర్వాసిత, గ్రామీణ కార్మికుల హక్కుల కోసం పని చేస్తున్నారు. ‘ప్రభుత్వ భూమి పేదలదే’, ‘భూమి సమస్య – వ్యాసాలు 1, 2’, ‘కళ్యాణలోవ కధలు’ ప్రచురితమైన పుస్తకాలు. భూమి సమస్య వ్యాసాలు – 1కి, DNF Rural Journalist award foundation –Hyderabad వారి Rural journalist award for year 2008 లభించింది. ప్రస్తుతం అఖల భారత వ్యవసాయ & గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శిగా పని చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles