Friday, April 26, 2024

వినాశకాలే విపరీత బుద్ధి

డైరెక్టర్ లీనా మణిమేగలైై, కాళీ చిత్రం పోస్టర్

  • శక్తిమంతమైన వేదికల దుర్వినియోగం
  • అలజడి సృష్టిస్తోన్న ‘కాళీ’ డాక్యుమెంటరీ

వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛలు సంస్కారం, సంప్రదాయపు పరిధులు దాటి విశృంఖలంగా విస్తరిస్తున్నాయి. సినిమా, వినోదం, సోషల్ మీడియా మొదలైన శక్తివంతమైన వేదికలను దుర్వినియోగం చేసుకొనే పరిణామాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇటువంటి వేదికలు సక్రమమైన మార్గంలో నడిస్తేనే వాటి ప్రయోజనం. టీవీల్లో జరిగే చర్చా వేదికలు తరచూ వివాదస్పదమవుతూనే ఉన్నాయి. నుపుర్ శర్మ అంశం ఎన్ని మంటలు పుట్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఆ మధ్య ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా సంచలనమైంది. తాజాగా  ‘కాళీ’ డాక్యుమెంటరీ చిత్రం వివాదాస్పదంగా మారి మానవ సమాజంలో అలజడిని  సృష్టిస్తోంది. ఇదే చిత్రంపై మంగళవారం జరిగిన ఒక చర్చా వేదికలో తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఎంపీ మహువా మొయిత్రాపై కేసు నమోదైంది. ఆ చిత్ర పోస్టర్ ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. ఆమెను అరెస్టు చేయాలని బిజెపి నేతలు డిమాండ్ చేస్తుండగా,కాంగ్రెస్ నేత శశిథరూర్ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలనే డిమాండ్లు కూడా బిజెపి శ్రేణుల నుంచి బయలుదేరాయి. ఇది ఇలా ఉండగా, సొంతపార్టీవారు కూడా కొందరు ఆమె మాటలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

Also read: మణిపూర్ లో మరణమృదంగం

మతపరమైన మంటలు

ఈ తీరుతెన్నులు మతపరమైన మంటలను రేపుతున్నాయి. ఈ పరిణామాలు రేపటి రోజుల పట్ల పెద్ద భయాన్ని కలిగిస్తున్నాయి. ‘కాళీ’ డాక్యుమెంటరీ చిత్రం పోస్టర్ దశ నుంచే తీవ్ర వివాదాస్పదంగా మారింది. ‘రిథమ్స్ అఫ్ కెనడా’ లో భాగంగా టోరంటోలోని అగాఖాన్ మ్యూజియంలో ఈ డాక్యుమెంటరీ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను ఇటీవలే విడుదల చేశారు. ఓ సాయంకాలం వేళ ఓ మహిళ షికారు చేసే నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని చెబుతున్నారు. ఈ పోస్టర్ హిందూ దేవతామూర్తిని కించపరచేలా ఉంది. దీనితో సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు బయలుదేరాయి. నిర్మాతలు, దర్శకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం హోరందుకుంది, ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మత విశ్వాసాలను దెబ్బతీయడమే కాకుండా హిందూ దేవతలను కించపరిచే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ హిందూసేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా దిల్లీ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఉత్తరప్రదేశ్ లోనూ కేసులు నమోదయ్యాయి. ఈ చిత్ర దర్శకురాలు భారతదేశానికి చెందిన వ్యక్తి. ఆమె పేరు లీనా మణిమేగలై. ఆమెది తమిళనాడులోని మధురై ప్రాంతం. భారతీయురాలై ఉండి కూడా హిందూ దేవతలను కించపరచడం మరింత నీచమైన చర్యగా భావిస్తూ ప్రపంచవ్యాప్తంగా విమర్శలు బయలుదేరాయి. లీనా మణి  మేగలై వీటన్నింటినీ ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. “నేను కోల్పోయేది ఏమీ లేదు. నేను బతికున్నంత కాలం నేను విశ్వసించిన మాటలను భయం లేకుండా వినిపిస్తాను. అందుకు నా ప్రాణమే మూల్యమైతే దానిని చెల్లించుకునేందుకు కూడా సిద్ధమే” అంటూ ట్విట్టర్ లో ప్రతిస్పందించారు. పోస్టర్ చూసి కాదు, చిత్రాన్ని పూర్తిగా చూస్తే మీరే నన్ను ప్రేమిస్తారంటూ  ‘కాళీ’ దర్శకురాలు సమాధానం చెబుతున్నారు. చిత్రం సంగతి తర్వాత, ముందు పోస్టర్ నిర్మాణంలో సభ్యతను పాటించాలి కదా? హిందూ దేవతల పట్ల, ఆచారాల పట్ల ఒంటికాలుపై  లేచే కుసంస్కృతి పెరిగిపోతోంది. ఏ మతాన్ని, ఏ సంప్రదాయాన్ని, ఏ ఆచారాన్ని కించపరచడం రాజ్యాంగ విరుద్ధమే కాదు, అప్రజాస్వామికం,అనైతికం. ఆ విజ్ఞత,ఆ వివేకాన్ని మరవడం, ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం, వ్యాఖ్యానాలు చేయడం, వర్తించడం వల్లనే వైషమ్యాలు పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియా, అధునాతన సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో,మంచి -చెడు ఎటువంటి విషయాలైనా వేగంగా వ్యాపిస్తున్నాయి. ప్రభుత్వాలు ఐటీ చట్టాల ద్వారా నియంత్రించే ప్రయత్నాలు చేబడుతున్నా, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది వేదికల నుంచి కోట్లాదిమందిని అదుపుచేయడం, నియంత్రణ సాధించడం అంత సునాయాసంగా సాధ్యమయ్యే పనికాదు.

Also read: విప్లవశిఖరం, నిలువెత్తు పౌరుషం

ట్విట్టర్ వివాదం

తాజాగా ట్విట్టర్ – భారత ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తోంది. పోయిన సంవత్సరం మన దేశంలో కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ నియమావళిని తీసుకొచ్చింది. భారతదేశసార్వభౌమాధికారం, చట్టాలను అన్ని మీడియా, సోషల్ మీడియా వేదికలు అనుసరించి తీరాల్సిందేనని కేంద్రం తాజాగా పునరుద్ఘాటన చేసింది. వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ, కంటెంట్ నిర్మాణంపై నియంత్రణ ఉండాలనే అంశాలపై ఇంకా చర్చోపచర్చలు సాగుతూనే ఉన్నాయి. కొందరిపై, కొన్నింటిపై  చట్టపరమైన చర్యలు తీసుకోగలుగుతున్నా, విశృంఖలత కొనసాగుతూనే వుంది. 2017లో ‘సెక్సీ దుర్గా’ పేరుతో మళయాళీ చిత్రదర్శకుడు సనాల్ కుమార్ శశిథరన్ తీసిన సినిమా తీవ్రవివాదాన్ని రేపింది. ఆ సమయంలో కేరళలో కొన్ని వర్గాల మధ్య ఘర్షణకు కూడా ఆ సినిమా హేతువైంది. పోయిన సంవత్సరం వచ్చిన ‘తాండవ్’ చిత్రం కూడా పెనువిమర్శలకు వేదికైంది.ఇప్పుడు ‘కాళీ’ సినిమా అలజడి రేపుతోంది. కాళీమాత రూపంలో పొగతాగుతూ  ఉన్న చిత్రాన్ని పోస్టర్ గా నిర్మించడం సభ్యతేనా? అదేనా భావ ప్రకటనా స్వేచ్ఛ ? అని పెల్లుబుకుతున్న విమర్శలు సమర్ధనీయమనే చెప్పవచ్చు. వారి వెర్రివేషాలకు హిందూ దేవతలే దొరికారా? అంటూ పొంగుకొస్తున్న ఆగ్రహంలో న్యాయం ఉందనే భావించాలి. ఇటువంటి చేష్టల వల్లనే వివాదాలు ముదురుతున్నాయి, సామాజిక శాంతి ప్రశ్నార్ధకమవుతోందని మేధావులు ఆవేదన చెందుతూనే ఉన్నారు.’కాళీ’ చిత్రం పోస్టర్ కు సంబంధించి కెనడాలోని హిందూ సమాజం నుంచి విజ్ఞప్తులు రావడంతో అక్కడి భారత్ హై కమీషన్ మొన్న సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.ఈ నేపథ్యంలో, మత విశ్వాసాలను రెచ్చగొట్టేలా ఉన్న ఆ పోస్టర్ ను తొలగించాలంటూ కెనడా అధికారులు ఈవెంట్ నిర్వాహకులకు ఆదేశాలను జారీచేశారు.ఈ చిత్రం విడుదల తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ సందర్భంలో, భరతమాత,హిందూదేవతల చిత్రాలను అశ్లీలంగా చిత్రించిన దివంగత సుప్రసిధ్ధ చిత్రకారుడు ఎమ్ ఎఫ్ హుసేన్ ను కొందరు గుర్తు చేసుకుంటున్నారు.

Also read: సొంతింటి కల నెరవేరడం ఇక కష్టం కాదు

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles