Thursday, March 28, 2024

మనుస్మృతిలో మాంసభక్షణ గూర్చి ఏముంది?

భారత రాజ్యాంగం యొక్క గొప్పదనం తెలియాలంటే, దాని కంటే ముందున్న మనుధర్మశాస్త్రం గురించి, అప్పటి దారుణ పరిస్థితుల గూర్చి కొంత తెలుసుకోవాలి. ఇప్పుడున్న రాజ్యాంగాన్ని పక్కనపెట్టి అదే పాత మనుస్మృతిని మళ్ళీ అమలు చేయాలని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అది మళ్ళీ వేరే విషయం. అణిచివేత గురించి పెరియర్ ఇ. వి. రామస్వామి ఏమన్నారో ఒకసారి శ్రద్ధగా గమనించండి – ‘‘ఒక పెద్ద దేశం, చిన్న దేశాన్ని అణిచివేయాలని చూస్తే, నేను  చిన్న దేశంవైపు నిలబడతాను. ఆ చిన్నదేశంలోని మెజారిటీ మతం చిన్న మతాన్ని అణగదొక్కాలని చూస్తే, నేను చిన్న మతంవైపు నిలబడతాను. ఆ మైనారిటీ మతంలో కులాలుండి, అందులో ఒక కులం మరో కులాన్ని అణగదొక్కాలని చూస్తే – నేను, అణిచివేతకు గురయ్యే కులం వైపు నిలబడతాను. ఆ అణచివేతకు గురైన కులంలో ఒక యజమాని తన నౌకరును అణిచివేస్తుంటే నేను ఆ నౌకరు వైపు నిలబడతాను. ఆ నౌకరు తన ఇంట్లో తన భార్య హక్కుల్ని కాలరాస్తుంటే నేను ఆ నౌకరు భార్యవైపు నిలబడి గొతెత్తుతాను. చివరికి నేను చెప్పేది ఏమిటంటే – అణిచివేత అనేది ఏ స్థాయిలో ఏ స్థితిలో ఉన్నా అది నా శత్రువు.’’ మానవవాదులందరూ ఈ అభిప్రాయాన్ని గౌరవిస్తారు. వివక్ష అనేది ఎక్కడ ఉన్నా, ఏ రకంగా ఉన్నా ఖండించాల్సిందే.

Also read: మనల్ని మనం ఖాళీ కప్పులుగా చేసుకుంటే?

ఇంకా విభజనలు ఎందుకున్నాయి?

సహజంగానే మనలో కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. దేశంలో కులమతాల భేదాలతో జనం ఇంకా ఎందుకు విడిపోయి ఉన్నారు? ఉన్నత వర్గాలు, నిమ్నవర్గాలు అని ఇంకా విభజనలు ఎందుకున్నాయీ? సమాజంలోని ఆ బలహీనతను ఉపయోగించుకునే కదా రాజకీయ నాయకులు ఆటలాడుతున్నారు. సమాజంలో బ్రహ్మణులు, పూజారులు దైవభక్తి గల సచ్ఛీలురని, మాంసభక్షణ చేయరని ఒక తప్పుడు అభిప్రాయం ప్రచారమైంది. మొదట వారు ఎలా ఉండేవారు, తర్వాత కాలం ఎలా మారారు? ఎందుకు మారారు? అనే విషయాలకు చారిత్రక ఆధారాలు లభించిన తర్వాత కూడా తప్పుడు అభిప్రాయంలో ఉండడం న్యాయమా? దేశంలో బౌద్ధాన్ని నాశనం చేసే ఉద్దేశంతో బుద్ధుణ్ణి దశావతారాలలో చేర్చుకుని, చౌద్ధారామాల్ని ఆలయాలుగా మార్చుకుని, అహింస పాటిస్తూ, బౌద్ధుల కాషాయాన్ని స్వంతం చేసుకుని వైదికవర్గం మారిపోయింది. అసలైతే జంతుబలులు, మాంసభక్షణ వారికి వేదకాలం నుండీ ఉంది. అందుకు స్పష్టమైన ఆధారాలు మనస్మృతిలో, వేదాలలో, పురాణాలలో కనిపిస్తున్నాయి. అన్ని అబద్ధాల వలెనే వారి అహింసా సిద్ధాంతం అబద్ధం. వారి శాకాహార భక్షణ అబద్ధం. కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మనువాదులు నిజాయితీగా ఆ విషయాలు ఒప్పుకోవాలి. మాంసం తినే ఇతర మతస్థులపై దాడులు చేయడం మానుకోవాలి. కొన్నేళ్ళ క్రితం అఖ్ లక్ అనే ముస్లిం ఇంట్లో జొరబడి అతడి ఫ్రిజ్ లో మాంసం ఉందని అతణ్ణి కొట్టి చంపిన ఉదంతం మనకు గుర్తుంది. మనువాద దేశభక్తులు అలాంటి దాడులు చేసేముందు తమ పూర్వీకుల మాంసభక్షణ గురించి తెలుసుకుంటే మంచిది. మనుస్మృతిలోని విషయాలు నెమరు వేసుకోవడం మంచిది –

‘‘క్రీత్వా స్వయం వా వ్యుత్పాద్య పరోపకృత మేవ వా,

దేవాన్ పితృంశ్చార్చయిత్వా ఖాదన్ మాంసం న దుష్యతి         32

నాద్యాద విధినా మాంసం విదిజ్ఞో నాపది ద్విజః

జగ్ద్వా హవిధినా మాంసం ప్రేత్య తైరద్యతే వశః                         33

న తాదృశం భవత్యేనో మృగహంతుర్థనార్థినః

యాదృశం భవతి ప్రీత్య వృధా మాంసాని ఖాదతః                     34

ఈ శ్లోకాల తాత్పర్యం ఏమిటంటే – కదిలే ప్రాణులకు కదల లేని ప్రాణులు, కోరలు గల ప్రాణులకు కోరలు లేని ప్రాణుల, చేతులున్న ప్రాణులకు చేతులు లేని ప్రాణులు, శూరులకు పిరికి పందలు ఆహారంగా కల్పించబడ్డారు. ప్రతిదినం అన్నంతో (తినదగిన) ప్రాణుల మాంసం తనడం పాపం కాదు. బ్రహ్మదేవుడే భక్షించగలవాటిని ఏర్పరిచాడు. యజ్ఞంకోసం పశువును హింసించి, హోమం చేసి ఆ హవిశ్శేషాన్ని (యజ్ఞంలో మిగిలిన శేషాన్ని) తినడం మంచిది. అది దైవవిధి! అలా కాకుండా, స్వార్థానికై ప్రాణుల్ని చంపి తినడం రాక్షస విధానం. కొన్నదాన్ని, సమకూర్చుకున్నదాన్ని, ఇతరులు ఇచ్చింది ఏ మాంసమైనా దేవతలకు,  పితృదేవతలకు నైవేద్యం పెట్టి తినాలి. నైవేద్యం పెట్టని మాంసం తినగూడదు. ఒక వేళ అలా తింటే జన్మాంతరంలో ఆ జంతువులే అతణ్ణి తింటాయి. బతుకుదెరువుకు, ధనం కోసం, జంతువుల్ని చంపి మాంసం అమ్ముకునేవారు పాపులు!  బోయలైనా, కటికవారైనా, రుచికోసం జంతువుల్ని చంపేవారైనా…పాపం మూటగట్టుకుంటారు. దేవతలకు నైవేద్యం పెట్టేవారికి మాత్రం పాపం అంటదు. ఇక్కడ మాంసభక్షణలో కూడా దైవాన్ని, దైవభక్తిని, వారి సంప్రదాయాల్ని ప్రచారం చేసుకోవడం కనిపిస్తుంది. ముస్లింలలో కూడా హలాల్ చేయని మాంసం తినరు. హలాల్ అంటే దేవుడికి/అల్లాకు సమర్పించడం – నైవేద్యమే! పాట్టకూటికి వేటాడి, మాంసం అమ్ముకునేవారికి మాతరం పాపం తగులుతుందని ప్రచారం చేశారు. అంటే బలవంతంగా సంప్రదాయాలవైపు, మూఢనమ్మకాలవైపు జనాన్ని మళ్ళించడం జరిగింది. దేశంలో అధిక సంఖ్యాకుల్ని శూద్రులుగా ముద్రవేసి, ప్రతి చిన్న విషయంలోనూ వారి మీద ఆధిపత్యం కొనసాగించడం వైదిక మత బోధకుల నైజమని అర్థమవుతూ ఉంది. యజ్ఞం పేరుతో మాంసభక్షణ చేసి, సురాపానం చేసి విలాసాల్లో తేలిపోవడం… అయితే అదంతా దేవుడి పేరుతో జరిగేది కాబట్టి, వారి చర్యల్ని గౌరవభావంతో చూడాలన్నది వారి కోరిక!

Also read: ఫేక్ వర్సెస్ రియల్

నియుక్తస్తు యథాన్యాయం యో మాంసం నాత్తి మానవః

న ప్రేత్య పశుతాం యాతి సంభవానేకవిం శతిం                                35

అ సంస్కృతాన్ పశూన్ మంత్రైర్నాద్యాధ్విప్రః కదాచన

మంత్రైస్తు సంస్కృతానద్యాచ్ఛాశ్వతం విధి మాస్థితః                                   36   

కుర్యాధృతపశుం నంగే కుర్యాత్పిష్టపశుం తథా

నత్వేవ తు వృధా హతుం పశుమిచ్చేత్కదాచన                             37

యావంతి పశురోమాణి తాపత్కృత్వో హ మారణమ్

వృధా పశుఘ్నః ప్రొప్నోతి పేత్య జన్మని జన్మని                              38

ఈ శ్లోకాల తాత్పర్యం ఏమిటంటే – శాస్త్ర మర్యాదను అనుసరించి శ్రాద్ధంలో నియుక్తుడైన బ్రాహ్మణుడు పితృదేవతలకు సమర్పించిన మాంసాన్ని తినకపోతే గకన, అతడు ఇరవై ఒక్క జన్మలు పశువై పుడతాడు. వేద మంత్రాలతో ప్రొక్షణ చేయక, ఊరకనే చంపబడ్డ పశువులను బ్రాహ్మణుడు ఎప్పుడైనా సరే తినకూడదు. మంత్రాలతో సంస్కృతమైన పశుమాంసాన్ని తినడం న్యాయం – దీని ద్వరా మనకు ఏం అర్థమవుతూ ఉందంటే శ్రాద్ధకర్మలలో సమర్పించిన మాంసం బ్రాహ్మణుడు తప్పనిసరిగా తినాలి. సంస్కృత మంత్రాలు చదువుతూనీళ్ళు చిలకరించడమే ప్రోక్షణ. తమ సంస్కృత మంత్రాలకు లేని శక్తుల్ని ఆపాదించి, బుకాయించడం స్పష్టంగా కనిపిస్తోంది. సంస్కృత మంత్రాలతో మాంసమేమైనా శుభ్రపడుతుందా? దాని రుచి ఏమైనా పెరుగుతుందా? తినేదేదో తినకుండా దేవుడు, మంత్రాలు, సంస్కృతం పేరు చెప్పి, తాము అధికులమని ప్రకటించుకోవడమే- మనుస్మృతి – పంచమాధ్యాయం-లోని విషయాలు ఇలా ఉన్నాయి-

బభూవుర్హి పురోడాశా భక్ష్యాణాం మృగపక్షిణామ్

పురాణేష్వపి యజ్ఞేషు బ్రహ్మక్షత్ర సమేషు చ                          23

యత్కించిత్స్నే హసం యుక్తం భోజ్యం భోజ్యమగర్హితమ్

తత్పర్యుషిత మస్యాద్యం హవిశ్శేషం చ యద్భవేత్                  24

చిరస్థితమపి త్వాద్యమ స్నేహాక్తం ద్విజాతిభిః

యవగోధూమజం సర్వం పయసశ్పైవ విక్రియాః                      25

టూకీగా వీటి అర్థం ఏమిటంటే – బ్రాహ్మణులు యజ్ఞం కోసం వేద సమ్మతమైన మృగాల్ని, పక్షుల్ని చంపారు. పూర్వం ఆగస్త్య మనీంద్రుడు తన తల్లిదండ్రుల పోషణకోసం శాస్త్రవిహితాలైన పక్షుల్ని చంపినట్టు తెలుస్తూ ఉంది. అదే విధంగా పూర్వకాలంలో మునులు, ఇతర బ్రహ్మక్షత్రియులు చేసిన యాగాలలో శాస్త్ర సమ్మతంగా బక్షింపతగిన మృగపక్షులు పురోడాంశంగా ఉండేవి. నూనె, నేయిలతో ఉండి, దుర్గంధం లేని వస్తువులు చాలాకాలంగా ఉన్నవైనా సరే తినొచ్చు. యవలు, గోధుమలతో చేసిన పదార్థాలు నూనె నేయి లేకపోయినప్పటికీ తినొచ్చు. ఇంకా పాలనుండి ఏర్పడే పెరుగు, చల్ల, నెయ్యి వంటి పదార్థాలన్నీ చాలా కాలం నిలువ ఉన్నా బ్రాహ్మణులు తినొచ్చు.

Also read: దేశాన్ని సానిటైజ్ చేద్దాం!

ఏతదుక్తం ద్విజాతీనాం భక్ష్యాభక్ష్య మశేషతః

మాంసస్యాతః ప్రవక్ష్యామి  విధిం భక్షణ వర్జనే                          26

దీని అర్థం మిటంటే – ఇంతవరకు బ్రాహ్మణులు ఏవి తినాలో ఏవి తినగూడదో మీకు చెప్పాను కదా? ఇక మాంసాలలో ఏవి తినవచ్చో, ఏవి తినగూడదో అనే విషయాలు మీకు ఇప్పుడు చెప్తాను – అని అన్నాడు భృగుమహర్షి-’’

నా స్వంత కవిత్వం కాదు

ఈ వ్యాసంలో నేను చెప్పిన విషయాలు ఏవీ, నేను ఊహించి చెప్పిన నా స్వంత కవిత్వం కాదు. పండితులు డా. నల్లందిఘళ్ లక్ష్మీనరసింహాచార్యులుతెలుగు తాత్పర్యంతో  రాసిన ‘‘మనస్మృతి’’ గ్రంథంలోనివి. ఇది తిరుమల ఆస్థానం వారి ఆర్థిక సహాయంతో ముద్రింపబడిన గ్రంథం. తాత్పర్య రచన చేసినవారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రోపన్యాసకులు. ఈ వివరణలన్నీ ఎందుకు ఇవ్వాల్సి వస్తోందంటే, స్వతహాగా మనం సంస్కృత పండితులం కానప్పుడు, సంప్రదాయ రచనలమీద సాధికారత లేనప్పుడు….అవి ఉన్నవారి అనువాదాల మీద ఆధారపడతాం. ఇందులోని విషయాలపై విభేదించేవారు ముందుగా వెళ్ళి మనుస్మృతి, వేదాలు, పురాణాలు తిరగేసి అందులో ఉన్న అనైతిక అక్రమ సంబంధాల గూర్చి, స్త్రీలను, శూద్రులను హింసించడం గూర్చి, యజ్ఞయాగాదులపేర జరిగిన జంతుబలులగూర్చి, మాంసభక్షణ గూర్చి తెలుసుకోవడం మంచిది. జరిగిన తప్పుల్ని సరిదిద్దుకునే దిశలో ఆలోచించడం మంచిది. జంతు ప్రవర్తనను మాని, మనుషులుగా మారి, ఆధునికతను సంతరించుకుని ఈ కాలానికి అనుగుణంగా నడుచుకోవడం మంచిది. సమకాలీన సమాజంలో ఉన్న సంప్రదాయవాదుల్ని, బ్రహ్మణుల్ని, వైదిక మత బోధకుల్ని మానవవాదులెవ్వరూ అసహ్యించుకోరు. మనుషులంతా ఒకటే అనే భానవతో ఉన్నవారు గనక, అందరినీ ప్రేమించినట్టుగానే వీరినీ ప్రేమిస్తారు. వారి ఎదుగుతలకు తోడ్పడతారు. గతంలో జరిగిన హింసను, తప్పిదాల్ని బేరీజు వేసుకోవడం ఎందుకంటే – వాటి వల్ల ఎంత వెనకబడిపోయామో తెలుసుకోవడానికి మాత్రమే! ‘‘గతంలో ఎప్పుడో జరిగిన వాటిని తెచ్చి ఎందుకు భూతద్దంలో చూపెడతారు. ఇప్పుడు మీ కళ్ళ ఎదుట ఎన్ని ఘోరాలు జరగడం లేదూ?’’ అని కొందరు దారి మళ్ళించే ప్రయత్నం చెయ్యొచ్చు. కానీ, వారు తెలుసుకోతగ్గ విషయమేమంటే, తప్పు తప్పే – ఏ కాలంలో జరిగినా తప్పే. వాటిని నిరంతరం సవరించుకుంటూనే ఉండాలి. ‘గతమెంతో ఘనకీర్తి గలవాడా!’ అని పాడుకుంటూ గతంలో ఉండిపోతే కుదరదు. వర్తమానంలోకి రావాలి. భవిష్యత్తులోకి దారులు కూడా వేయాలి. మతరహిత, కులరహిత సమాజ స్థాపన మన ముందున్న పెద్ద లక్ష్యం! వైజ్ఞానిక దృక్పథం, మానవీయ విలువల పరిరక్షణ అందులో అంతస్సూత్రం కావాలి!!

Also read: మాల్గుడి సృష్టికర్త ఆర్. కె. నారాయణ్

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles