Friday, March 29, 2024

మల్లికార్జున్ ఖడ్గే విజయం నల్లేరుపైన బండి తీరు

  • మల్లికార్జున్ ఖడ్గే విజయం నల్లేరుపైన బండి తీరు

ఇరవై రెండేళ్ళలో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీఅధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలలో గాంధీ కుటుంబేతరుడు మల్లికార్జున్ ఖడ్గే ఎన్నికైనారు. ఖడ్డే శశిథరూర్ పైన ఘనవిజయం సాధించారు. మొత్తం పోలైన ఓట్లలో 80 ఏళ్ళ ఖడ్గేకి 80 శాతం ఓట్లు వచ్చాయి. ఖడ్గేకి 7,897 ఓట్లు పడగా థరూర్ కి 1,072 ఓట్లు పడ్డాయి.  2019 ఎన్నికలలో పరాజయం తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నప్పుడు పార్టీని తాత్కాలికంగా నడిపించేందుకు సోనియా అంగీకరించారు. ఎన్నిక ఫలితం ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో సంబరాలు జరిగాయి. ఇటువంటి వేడుక గత రెండు దశాబ్దాలలోనూ ఎన్నడూ చూడలేదు.

ఖడ్గే గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. వీరవిధేయుడు. ఆయన హయాంలో పెద్దగా మార్పులు చోటు చేసుకునే అవకాశాలు లేవు. మార్పు తెస్తానంటూ గట్టిగా ప్రచారంలో చెప్పిన థరూర్ ఓడిపోయారు. ‘మన పార్టీ పునరుజ్జీవనం ఈ రోజు ప్రారంభమైనదని అనుకుంటాను. నేను అందరు కాంగ్రెస్ వాదులతో కలసి ప్రధానమైన ప్రమాదాన్ని నివారించడానికి (బీజేపీని ఓడించడానికి) కృషి చేస్తాను’’ అని థరూర్ అన్నారు.

సార్వత్రిక ఎన్నికలలో గెలవలేకపోయినందుకు నైతిక బాధ్యత స్వీకరించిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. కానీ ఖడ్గే నామినేషన్ వేసింది సోనియాగాంధీ నిర్ణయం మేరకే అన్న విషయం జగద్విదితమే. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎక్కువ కాలం గాంధీ-నెహ్రూ కుటుంబ సభ్యులే సారథ్యం వహించారు. ముందు జవహర్ లాల్, అనంతరం ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, ఆపైన అందరికంటే ఎక్కువ కాలం సోనియాగాంధీ, తదుపరి రాహుల్ గాంధీ, మళ్ళీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ. సాధారణంగా నెహ్రూ-గాంధీ కుటుంబీకుల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగేది.  137 ఏళ్ళ కాంగ్రెస్ చరిత్రలో అధ్యక్ష పదవికి ఇప్పటి వరకూ ఆరు విడతల మాత్రమే ఎన్నికలు జరిగాయి. 1939లో గాంధీ మద్దతు కలిగిన భోగరాజు పట్టాభి సీతారామయ్య నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేతిలో ఓడిపోయారు. కానీ గాంధీ పట్టింపుతో నేతాజీ పదవికి రాజీనామా చేయగా సీతారామయ్య అధ్యక్షుడిగా ఎన్నికైనారు.  1939లో జరిగింది మొదటి ఎన్నిక. ఆ తర్వాత స్వతంత్ర భారతంలో 1950లో జరిగిన ఎన్నికలలో ఆచార్య జేబీ కృపలానీ, పురుషోత్తమ్ దాస్ టాండన్ మధ్య హోరాహోరీగా పోటీ జరిగింది. కృపలానీకి నెహ్రూ మద్దతు ఉండగా, టాండన్ కు సర్దార్ వల్లభాయ్ పటేల్ మద్దతుగా నిలిచారు. టాండన్ గెలుపొందారు. నెహ్రూ జీర్ణించుకోలేకపోయారు. 1977లో దేవ్ కాంత్ బారువా రాజీనామా చేసిన తర్వాత సిద్ధార్థశంకర్ రేనీ, కరణ్ సింగ్ నీ ఓడించి కాసు బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నికైనారు. కాంగ్రెస్ నుంచి ఇందిరాగాంధీని బహిష్కరించారు. మళ్ళీ ఇరవై ఏళ్ళకు 1997లో శరద్ పవార్ నూ, రాజేష్ పైలట్ నూ ఓడించి సీతారాంకేసరి అధ్యక్ష పదవి చేపట్టారు. 2000 సంవత్సరంలో సోనియాగాంధీతో జీతేంద్ర ప్రసాద పోటీ పడి ఓడిపోయారు. సోనియాగాంధీ 1998 నుంచి 2017 దాకా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఇరవై ఏళ్ళూ, 2019 నుంచి 2022 వరకూ తాత్కాలిక అధ్యక్షురాలిగా పనిచేశారు. కాంగ్రెస్ చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం అధ్యక్ష పదవిలో ఉన్న ఘనత సోనియాగాంధీదే. 2017 నుంచి 2019 వరకూ రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. కేసరికి 6224 ఓట్లు రాగా  శరద్ పవార్ కి 882,రాజేష్ పైలట్ కు 354 ఓట్లు వచ్చాయి. సోనియాగాంధీకి 2000లో 7,400 ఓట్లు రాగా జీతేంద్ర ప్రసాదకు కేవలం 94 ఓట్లు పడ్డాయి. ఈ లెక్కన చూసుకుంటే శశిథరూర్ కి వెయ్యి ఓట్లకు పైగా రావడం విశేషం.

ముందుగానే వ్యాఖ్యానించిన రాహుల్

‘‘పార్టీలో నా పాత్ర ఏమిటో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖడ్గేని అడగండి’’ అని కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖడ్గే ఎన్నికైనట్టు ప్రకటించడానికి అరగంట ముందుగానే విలేఖరులతో మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం విశేషం. ఆ తర్వాత కొద్ది సేపటికి ‘‘ఖడ్గేజీనీ, సోనియాజీనీ అడగండి,’’ అని కర్నూలులో పాదయాత్ర చేస్తూ అన్నారు. రాహుల్ గాంధీ బుధవారం మద్యాహ్నం 1.30లకు విలేఖరులతో మాట్లాడినప్పుడు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో పోలైన ఓట్ల లెక్కింపు జరుగుతూనే ఉంది. ఫలితాన్ని రెండు గంటల ప్రాంతంలో ప్రకటించారు.

ఓట్ల లెక్కింపు అవసరం లేకుండానే కాంగ్రెస్ పార్టీకి రెండున్నర దశాబ్దాల తర్వాత గాంధీయేతర అధ్యక్షుడుగా ఖడ్గే ఎన్నిక అవుతారన్నది బహిరంగ రహస్యమే. ‘‘కాంగ్రెస్ అధ్యక్షుడి పాత్ర గురించి వ్యాఖ్యానించవలసింది నేను కాదు. అది ఖడ్గే నిర్ణయించుకోవలసిన అంశం. నా పాత్ర గురించి మాత్రం నాకు స్పష్టత ఉన్నది. నా పాత్ర ఏమిటో, నన్ను ఎట్లా వినియోగించుకుంటారో కొత్త అధ్యక్షుడు నిర్ణయిస్తారు. మీరు ఖడ్గేజీనీ, సోనియాజీనీ అడగాలి’’ అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్ పార్టీలో అంతిమ నిర్ణయం కాంగ్రెస్ అధ్యక్షుడిదే. మాకు కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. పార్టీ ఎట్లా ముందుకు పోవాలన్నది ఆ పెద్దమనిషి నిర్ణయిస్తారు’’ అని అన్నారు.

పరాజయం పొందిన శశిథరూర్ ఖడ్గేని అభినందించారు. ఇది పోటీ సమాన పరిస్థితులలో జరగలేదనీ, మైదానం ఎగుడుదిగుడుగా ఉన్నదనీ, యూపీ లో జరిగిన అక్రమాల  గురించి ఎన్నికల అధికారి మదుసూదన్ మిస్త్రీకి ఒక లేఖలో ఫిర్యాదు చేశాననీ అన్నారు. ఆ ఫిర్యాదు కూడా పార్టీకి అంతర్గతమైనదనీ, తాను ముందుకు నడవదలచుకున్నాననీ, అంతర్గతంగా ఉండవలసిన లేఖ బయటకు పొక్కడం దురదృష్టకరమనీ శశిథరూర్ వ్యాఖ్యానించారు.  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles