Tuesday, September 10, 2024

విప్లవశిఖరం, నిలువెత్తు పౌరుషం

  • ప్రధాని చేతులమీదుగా  మన్యంవీరుడి జయంత్యుత్సవాలు
  • అల్లూరి సీతారామరాజు తెలుగు హృదయాలనేలే రారాజు
  • స్వాతంత్ర్య సమరంలో సమిధైన చరితార్థుడు

తెల్లవారి గుండెల్లో నిదురించినవాడు,నిదురించిన పౌరుషాగ్ని రగిలించినవాడు అల్లూరి  సీతారామరాజు. దేశమాత స్వేచ్ఛ కోసం దీక్షబూని సాగి, తిరుగుబాటు చేసిన తెలుగువీరుడు. ఈ దేశం, ఈ రాజ్యం నాదేనని చాటించి, తొడలు కొట్టి, శృంఖలాలు పగులగొట్టి, చురకత్తులు పదునుపెట్టి, తుది సమరం మొదలుపెట్టి తుది వరకూ క్షాత్రోచితంగా పోరాడిన తెలుగుసింహం అల్లూరి. నేడు, ఈ మహనీయుని 125 వ జయంతి ఉత్సవాలు తెలుగునాట ‘న భూతో న భవిష్యత్’ అన్నట్లుగా రూపకల్పన చేశారు. ఆ వీరుని సీమలో నిలువెత్తు విగ్రహాన్ని స్థాపించడం ఒక ఎత్తు – సాక్షాత్తు భారతదేశ ప్రధాని చేతుల మీదుగా ఈ వేడుక జరగడం మరో ఎత్తు. ఆజాదీ కా అమృతోత్సవ్ లో భాగంగా ఈ మహోత్సవం జరుగుతున్నప్పటికీ తెలుగునాడు దానికి వేదిక కావడం గొప్ప సందర్భం,గొప్ప సంరంభం. ఈ సంకల్పం చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీని తెలుగువారంతా అభినందించి తీరాలి, కృతజ్ఞతలు తెల్పాలి. దేశభక్తి మృగ్యమై పోయిన నేటి కాలంలో స్వరాజ్య సాధనా స్మృతి చిహ్నంగా ఉత్సవాలు జరుపుకోవడం, తరతరాల ప్రజల్లో ఉత్సాహాన్ని నింపడం ఎంతో దీప్తిమంతం, స్ఫూర్తిమంతం. స్వాతంత్ర్య పోరాటంలో ఎందరెందరో త్యాగధనులైన తెలుగువారు సమిధలై పోయారు, సర్వస్వం కోల్పోయారు. ధన,మాన,ప్రాణాలు పోగొట్టుకున్న ఆ మహనీయుల జాబితా చాలా పెద్దది.

Also read: సొంతింటి కల నెరవేరడం ఇక కష్టం కాదు

అందరూ అగ్రగణ్యులే

కన్నెగంటి హనుమంతు నుంచి అల్లూరి సీతారామరాజు వరకూ అందరూ అగ్రగణ్యులే. టంగుటూరి ప్రకాశం పంతులు నుంచి కొండా వెంకటప్పయ్యపంతులు వరకూ అందరూ విభిన్న రూపాల్లో అవిక్రమ పరాక్రమంతో పోరాడినవారే. దారుణ మారణకాండను చూసినవారు, నీతిలేని శాసనాల మధ్య నలిగి పోయినవారు, చెరసాలలు, ఉరికొయ్యలలో కరిగిపోయిన వారెందరో! వారి అనన్య త్యాగాల ఫలం నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం. వీరిలో కొందరే చరిత్రకెక్కారు, ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు.అదృష్టవశాత్తు అల్లూరి సీతారామరాజు చరిత్ర ఎంతోకొంత మిగుల్చుకోగలిగాం. ఈ సందర్భంలో అల్లూరి సీతారామరాజు చరిత్రను అద్భుతంగా సెల్యులాయిడ్ కు ఎక్కించి పరమాద్భుతమైన చిత్ర కళాఖండంగా మలచిన హీరో కృష్ణను,అచ్చెరువు చెందేలా కథనాన్ని అల్లిన త్రిపురనేని మహారథిని,రక్తం మరిగేలా, ఒళ్ళు గగుర్పొడిచేలా, గుండెలు సంద్రమై పొంగేలా పాటలు రాసిన మహాకవి శ్రీశ్రీని తలచుకొని తీరాలి. అల్లూరి సీతారామరాజు పాత్రలో కృష్ణ ఒదిగిన తీరు అనిర్వచనీయం, అనితరసాధ్యం. దాదాపు 50 ఏళ్ళ క్రితమే ఈ సినిమా వచ్చింది. సినిమాలో కొన్ని కల్పనలు వున్నా, అవి రసాత్మకం. ఈ సినిమా చేసిన మేలు అంతాఇంత కాదు. కొన్ని తరాల తెలుగువారికి అల్లూరి గురించి కాస్త తెలిసిందంటే ఈ సినిమా వల్లనే అన్నది అతిశయోక్తి కానే కాదు. నేటి ఉత్సవాల సందర్భంలో అల్లూరి పాత్రధారి,సినిమా సూత్రధారియైన కృష్ణను ప్రత్యేకంగా సత్కరించాలి. అది జరుగుతున్నట్లు కనిపించడం లేదు. ఈ అంశం ప్రభుత్వాల ముందుకు వెళ్లిందో లేదో తెలియదు. సీతారామరాజు మన్యంవీరులతో కలిసి చేసిన పోరాటంలో గంటందొర, మల్లుదొర ఆయన వెంటనే ఉన్నారు. వారికి కూడా నివాళులు అర్పించాలి. బుర్రకథ పితామహుడుగా చెప్పుకొనే నాజర్ తన బుర్రకథల ద్వారా అల్లూరి సీతారామరాజు చరిత్రను ఊరూవాడా ఊగించారు. అల్లూరిపై ఎన్నో కథలు, గాథలు, నాటకాలు కూడా వ్యాప్తిలో ఉండేవి.ఇంతటి చరిత్ర సృష్టించిన అల్లూరి జీవించింది కేవలం 27 ఏళ్ళు మాత్రమే. అంతచిన్న వయస్సులోనే  అనంతమైన కార్యం నిర్వహించాడు. అన్ని విద్యలను కాచివడపోశాడు. అల్లూరి కేవలం స్వాతంత్ర్య సమరయోధుడు కాడు, తపస్వి. రుషివంటివాడు. అపార జ్ఞానధనుడు. విలువిద్యయే కాదు, విలువైన ఎన్నో విద్యలలో ఆరితేరినవాడు.జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం, ఆయుర్వేదం, హఠయోగం వంటివాటిని ఎంతో సాధన చేసినవాడు. వారణాసిలో కొంతకాలం ఉండి సంస్కృతం కూడా నేర్చుకున్నాడు. కవిత్వం పట్ల, కావ్యాల పట్ల మక్కువ ఎక్కువగా కలిగినవాడు. సంస్కృతాంధ్ర కావ్యాలను ఎన్నింటినో చదివినవాడు. బ్రహ్మకపాలంలో సన్యాసదీక్ష కూడా తీసుకున్నాడు. గృహవైద్యం,అశ్వశాస్త్రం, గజశాస్త్రం, మంత్రపుష్పమాల, రసాయన ప్రక్రియలకు సంబంధించి స్వయంగా నోట్స్ రాసుకొని పెట్టుకున్న విశేష  చరితుడు.

Also read: జగన్నాథుని రథచక్రాల్

ఉత్తరాంధ్రతో అనుబంధం

ఈ ఆంధ్రవీరుడికి గోదావరి జిల్లాలతోనూ, విశాఖపట్నంతోనూ, యావత్తు ఉత్తరాంధ్రతోనూ విడదీయలేని అనుబంధం పెనవేసుకొని ఉంది. దేశమంతా తిరిగాడు. కొండలు, కోనలు, నదీనదాలు చుట్టివచ్చాడు. అమాయకులు, అనాధలు, అభాగ్యులకు అండగా నిలుచున్నాడు. మానసికమైన తపస్సుతో పాటు స్వరాజ్య సాధనా పోరాటాన్ని తపస్సుగా చేశాడు. చిన్ననాడే జీవితంలో కష్టాలు ప్రవేశించిన నేపథ్యంలో, పోరాటపటిమ చిన్ననాడే అలవడింది. ఆ అభ్యాసం స్వాతంత్ర్య ఉద్యమ సారధ్యానికి ఇరుసై, ఇంధనమై నిలిచింది. గిరిజనులకు అండగా నిలవడానికి, వారిలో చైతన్యం నింపడానికి, స్వరాజ్య సాధనా కాంక్షను నిలువెల్లా నిలపడానికి అల్లూరి అహరహం శ్రమించాడు. శాంతివచనాలకు తెల్లదొరలు లొంగరని గ్రహించాడు. గిరిపుత్రులను విప్లవబాటలో నడిపించాడు, పోరాట మార్గంలో దుమికించాడు. ఎన్నో యుద్ధ విద్యలు, గెరిల్లా యుద్ధ వ్యూహాలు నేర్పాడు. అడవుల్లో అందుబాటులో ఉన్న విల్లంబులు,బల్లెములు,బాకులు, కత్తులు,గొడ్డళ్ళు,బరిశెలు వంటి వాటితోనే ఎక్కువ కాలం పోరాటం చేయవలసి వచ్చింది. పోలీస్ స్టేషన్లు ముట్టడించి తుపాకీలు కూడా సొంతం చేసుకున్నాడు. నిదుర వద్దు.. బెదర వద్దు.. నింగి నీకు హద్దురా.. అంటూ మన్యంవీరులను సింహాలై  గర్జించి, సంహారం గావించేలా వందేమాతరం  నినాదాన్ని వినిపించాడు. బ్రిటిష్ వారి ఆధునిక యుద్ధ సామాగ్రి, సైనికబలం ముందు ఎక్కువ కాలం నిలువలేక పోయారు. గిరిజనులను బ్రిటిష్ వారు తీవ్రంగా హింసించడం మొదలు పెట్టారు. ఆ దారుణ దమనకాండను ఆపడానికి బ్రిటిష్ వారి ముందు అల్లూరి నిలిచాడు. ఆ అధర్మ యుద్ధంలో ఆ వీరుడు అశువులు బాశాడు. బ్రిటిష్ వారి తూటాలకు బలయ్యాడు. అల్లూరి దేశభక్తికి, సంగ్రామ శక్తికి, స్వరాజ్యస్ఫూర్తికి బ్రిటిష్ దొరలు రూధర్ ఫర్డ్ వంటివారు కూడా చలించిపోయారు. తారీఖులు, దస్తావేజుల జోలికి వెళ్ళకుండా రామరాజు త్యాగనిరతిని, దేశభక్తిని భారతీయులంతా కలకాలం గుండెల్లో నిలుపుకోవాలి. దొరికిన మేరకు ఆయన చరిత్రను ఇంగ్లిష్ సహా దేశభాషలన్నింటిలోనూ రాయించాలి.వివిధ భాషల్లో డాక్యుమెంటరీలుగా రూపొందించాలి.

Also read: ఉసురు తీసిన ఉగ్రవాదం

ప్రభుత్వ నివాళి

ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు పేరుతో విశాఖ మన్యం ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా రూపొందించింది. ఇది అల్లూరికి అందించిన మంచి నివాళి. అల్లూరి కుటుంబీకులు కొందరు నిన్నటి వరకూ గుంటూరు జిల్లాలో వున్న నరసరావుపేట ప్రాంతంలోని బొప్పూడి గ్రామంలో స్థిరపడినట్లు కూడా తెలుస్తోంది. రామరాజును మన్యసీమ ప్రాంతంలో ఒక చెట్టుకు కట్టేసి కాల్చి చంపినట్లుగా చరిత్ర చెబుతోంది. అక్కడి కృష్ణదేవిపేటలో ఆయన సమాధి ఉంది.ఆ పక్కనే స్మృతి భవనం ఉంది. వాటి ఆలన,పాలనా అరణ్యరోదనగానే ఉన్నాయి. అల్లూరికి సంబంధించిన అన్ని స్మృతులను పరిరక్షించాలి. ప్రదర్శనగా ప్రజలకు అందుబాటులో ఉంచాలి. మన్యసీమను మాన్యసీమగా మలచిన మగటిమ గల మనగాడు, తెల్లదొరల అడలించిన తెలుగుతల్లి బిడ్డడు అల్లూరికి కైమోడ్పులు.

Also read: అమరనాథ్ యాత్రికులకు పొంచి ఉన్న ముప్పు!

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles