Sunday, May 5, 2024

సంపద సృష్టించే బడ్జెట్..కాదు భారం పెంచేదే..

కేంద్ర బడ్జెట్  సంపద సృష్టికి, సంక్షేమానికి ఊతం ఇచ్చేలా, వాస్తవాలకు ప్రతిబింబంలా ఉందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అభిప్రాయపడ్డారు. వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయడం ద్వారా రైతుల ఆదాయాన్ని  పెంచే లక్ష్యంతో ఈ పథకం రూపొందిందని ఆయన చెప్పారు. కానీ, క్లిష్ట పరిస్థితుల్లో ప్రవేశ పెట్టిన `కాగిత రహిత` (పేపర్ లెస్) 2021-22 బడ్జెట్ కీలకమైందని, ఇది  `నెవర్ బిఫోర్ బడ్జెట్` అన్న
 కేంద్ర  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యను `నెవర్ అఫ్టర్` అనీ విశ్లేషకులు  వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా   ఒక కోణంలో చూస్తే ఇది సామాన్యుల  సంక్షేమం కంటే భారం పడేందుకే అవకాశం ఎక్కువగా ఉందని, నిధులు కేటాయింపుల్లో  రాష్ట్రాల మధ్య  వివక్ష కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని అంటున్నారు. చిరువ్యాపారులపై ఈ బడ్జెట్ ప్రభావం ఉంటుందంటున్నారు. ఉదాహరణకు,విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఇంకులు, సెల్ ఫోన్ విడిభాగాలు కెమెరా కనెక్టర్లు, బ్యాక్ కవర్లు,చార్జర్లపై  కస్టమ్స్  సుంకం పెంచాలనుకోవడం వల్ల వాటి ధరలు పెరుగుతాయి. ఫలితంగా జిరాక్స్ కేంద్రాల నిర్వాహకులు, సెల్ ఫోన్ మరమ్మతుదారులు కొంతమేర నష్టపోయే అవకాశం ఉందని అంటున్నారు. 

వేతన జీవుల  అసంతృప్తి

75 ఏళ్లు పైబడిన  వయోవృద్ధ పింఛన్ దారులు ఆదాయ పన్ను రిటర్న్ లు దాఖలు చేయవలసిన అవసరం లేకుండా వెసులుబాటు  కల్పించారు తప్ప కొత్త మినహియింపులేవీ లేవనీ, పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చే ఎలాంటి చర్యలు లేవనీ నిరశన వ్యక్తమవుతోంది.  వ్యక్తిగత  ఆదాయపు పన్ను రేట్లతో పాటు  సర్ చార్జి, సెస్సుల్లో  ఎలాంటి మార్పు ప్రతిపాదించ లేదు. గృహ రుణాల వడ్డీపై  అదనంగా లక్షన్నర రూపాయల పన్ను  మినహాయింపు సౌకర్యాన్ని  వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించినా భవిష్యనిధి  (పీఎఫ్)లో జమ  ఏడాదికి రూ. 2.5 లక్షలు  దాటితే  వడ్డీపై పన్ను విధించే ప్రతిపాదనపై  అసంతృప్తి వ్యక్తమవుతోంది. వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం  మంచి పరిణామమని అంటున్నారు.

ఎన్నికల బడ్జెట్?

ప్రతిపాదిత  బడ్జెట్   ఎన్నికల అవసరాలను తలపిస్తోందని  వ్యాఖ్యానాలు వినిపిస్తు న్నాయి. త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలపై  ప్రత్యేక  దృష్టి సారించిందని అంటూ ఆయా రాష్ట్రాలకు చేసిన  కేటాయింపులను   ఉదహరిస్తున్నారు. ఎకనమిక్  కారిడార్ పథకం కింద తమిళనాడులో 1.03 లక్షల కోట్లతో నేషనల్ హైవే నిర్మాణం, చైన్నై మెట్రో రెండో దశకు  రూ63,246 కోట్లు, కొచ్చి మెట్రో రెండో దశకు  రూ.1,957 కోట్లు కేటాయింపులను, కేరళలో 1100 కిలో మీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధి, పశ్చిమ బెంగాల్ – సిరిగురి మధ్య నేషనల్ హైవే , అస్సోంలో   మూడేళ్లలో ఎకనమిక్    కారిడార్‌తో పాటు రూ. 19వ వేల కోట్లతో  జాతీయ రహదారుల అభివృద్ధి  ప్రతిపాదనలను  ప్రస్తావిస్తున్నారు. అదే సమయంలో రెండు  తెలుగు రాష్ట్రాల ఊసే లేదని, ముఖ్యంగా విశాఖ  మెట్రో రైలు ప్రస్తావనే లేదని విశ్లేషకులు అంటున్నారు. ఖరగ్‌పూర్‌-విజయవాడ మధ్య ఈస్ట్‌- కోస్ట్‌ సరకు రవాణా కారిడార్‌ ఏర్పాటు ప్రకటన కొంత ఊరట అని విశ్లేషకులు అంటున్నారు.

ఏపీకి మొండిచేయి

నిబంధనల  మేరకు అన్ని రాష్ట్రాలతో పాటు  ఏపీకి కూడా   కేటాయింపులు జరుగుతాయి తప్ప అంతకు మించి ప్రత్యేకంగా ఏమీ కేటాయించలేదని  అధికారులు  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వివరించారు. పొరుగు రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో సమానంగా కేటాయింపులు లేవని, పీఎం కిసాన్, పీఎం ఆవాస్‌ యోజన, ఉపాధి హామీ పథకాలకు గత ఏడాదితో పోలిస్తే కేటాయింపులు తగ్గాయని బడ్జెట్ పై సీఎం  నిర్వహించిన సమీక్షలో అధికారులు  వివరించారు.  రాష్ట్ర విభజనతో రంగాలలో  మౌలిక సదుపాయాల రూపంలో  రూపేనా భారీ నష్టం   కలిగిందని, ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌ పట్ల పెంచుకున్న ఆశలు అడియాశలయ్యాని చెప్పారు. ఆహారం, పెట్రోల్, ఎరువుల రాయితీలను కూడా తగ్గించిందని చెప్పారు. కాగా,  బడ్జెట్‌లో కేటాయింపుల నను నుంచి వీలైనన్ని నిధులను రాబట్టడానికి సమన్వయంతో  కృఫి చేమాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఆ నాలుగు రాష్ట్రాల కోసమే బడ్జెట్

ఎన్నికలు జరిగే నాలుగు  రాష్ట్రాల కోసం మాత్రమే ఈ బడ్జెట్ పెట్టినట్టు కనపడుతుందనీ, ఈ బడ్జెట్ లో తెలంగాణకు మరోసారి మొండిచేయి చూపారని, ఆశగా ఎదురు చూసిన బడ్జెట్ నిరాశ  మిగిల్చిందని  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆశగా ఎదురు చూసిన కేంద్ర బడ్జెట్ నిరాశాజనకంగా ఉందన్నారు. పెండింగ్ పనులు, కొత్త ప్రాజెక్టులు, , డ్రై ఫోర్ట్  హామీ  ఊసే లేదని విమర్శించారు రాష్ట్రానికి  ఇంత అన్యాయం జరుగుతున్నా బీజేపీ నేతలు  ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బడ్జెట్‌ సామాన్యుని, పేదల  వెన్ను విరిచేలా ఉందని, చిన్న చిన్న ఆర్థిక రంగాలకు బడ్జెట్‌ ఏ మాత్రం చేయూతనివ్వలేదని అన్నారు.  దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని  బడ్జెట్  ప్రవశపెట్టినా, దేశంలోని ఆర్థిక వ్యవస్థలన్నింటిని విదేశీయులకు కట్టబెట్టే ప్రయత్నం అందులో కనిపిస్తోందని అన్నారు.  

ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం హర్షణీయం: జనసేన

కేంద్ర బడ్జెట్ పై  బీజేపీయేతర పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేసినా, జనసేన స్వాగతించింది. ఈ బడ్జెట్ లో  ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం హర్షణీయం అని ఆ పార్టీ  రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రభుత్వ – ప్రైవేట్  భాగస్వామ్యంతో విశాఖ ఓడరేవును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. చిత్తూరు నుంచి తమిళనాడుకు, విజయవాడ నుంచి ఖరగ్ పూర్ కు వరకు  సరకు రవాణా కారిడార్ ఏర్పాటు ప్రతిపాదన యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తమ పార్టీ  భావిస్తోందని  తెలిపారు.

ఏపీ పట్ల చిన్నచూపు: విజయసాయి

బడ్జెట్ లో ఆంధ్రప్రధేశ్ ను చిన్నచూపు చూశారని,  ఖరగ్‌పూర్‌-విజయవాడ మధ్య ఈ రవాణా కారిడార్‌  వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని   వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలో రూ. 55,656 కోట్ల సవరించిన అంచనాల గురించి కూడా బడ్జెట్‌లో చెప్పలేదు. దీని మీద నెలకొన్న అస్పష్టతను తొలగించే ప్రయత్నం చేయలేదనీ,  భూసేకరణ, నిర్వాసితుల పునరావాసంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదనీ అన్నారు. దేశంలో పండుతున్న వరిధాన్యంలో  ఏపీ వాటా 11.8 శాతం ఉన్నందున, ఇక్కడి నుంచి  దేశంలోని వివిధ నగరాలకు సత్వర  ఎగుమతికి  ఎక్కువ సంఖ్యలో  కిసాన్ రైళ్లు నడపాలన్న ముఖ్యమంత్రి    జగన్ మొహన్‌ రెడ్డి  వినతిని  కేంద్రం పట్టించుకోలేదని ఆయన అన్నారు.

ఆ విమర్శలు సహజం: జీవీఎల్

బడ్జెట్ పై విమర్శలు సమజమేననీ, బడ్జెట్ లో ప్రస్తావించనంత మాత్రాన  ఎవరినీ, దేనినీ నిర్లక్ష్యం చేసినట్లు, మొండిచేయి చూపినట్లు కాదనీ    రాజ్యసభ్య సభ్యుడు  జీవీఎల్ నరసింహారావు  అన్నారు.  ఈ బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందనే  విమర్శలకు స్పందిస్తూ, కేంద్ర నిధులను తెలుగు రాష్ట్రాలు ఉపయోగించుకోడంలేదని అన్నారు. పోలవరం  విషయమై కేంద్రం నుంచి అతి త్వరలో ప్రకటన వెలువడుతుందని చెప్పారు.

ఇదీ చదవండి: క్లిష్ట పరిస్థితుల్లో కీలక బడ్జెట్ :ఆర్థిక మంత్రి

Dr. Aravalli Jagannadha Swamy
Dr. Aravalli Jagannadha Swamy
సీనియర్ జర్నలిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles