Wednesday, December 6, 2023

విరాట్ కొహ్లీ అద్భుత శతకం

  • మూడేళ్ళ శతక అనావృష్టిని తీర్చిన మేటి బ్యాటర్ విరాట్
  • శ్రీలంకతో దరిద్రంగా ఆడిన భువనేశ్వర్  కుమార్ అయిదు వికెట్లతో వెలుగు
  • అఫ్ఘానిస్తాన్ పైన 101 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం

భారత అద్భుత బ్యాటర్ విరాట్ కొహ్లీ ఎట్టకేలకు శతకాల కరువును అధిగమించాడు. అఫ్ఘానిస్తాన్ పైన మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా ఇరవై ఓవర్లలో 212 పరుగులు చేసింది. వాటిలో అత్యధిక పరుగులు విరాట్ కొహ్లీ చేసినవే కావడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్ లో చివరి శతకాన్ని 2019 నవంబరులో సాధించిన విరాట్ కొహ్లీ గురువారంనాడు అమోఘంగా ఆడి శతకం సాధించాలనే తపన తీర్చుకున్నాడు. 19 వ ఓవర్లో ఫరీద్ అహ్మద్ బౌలింగ్ లో సిక్స్ కొట్టి మూడంకెల స్కోరుకు చేరుకున్నప్పుడు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కొహ్లీ అభిమానులు ఆనంద సముద్రంలో మునిగి తేలారు. అన్ని ఫార్మాట్లలో కలిపి 71వ శతకాన్ని సాధించాడు. దీనికోసం మూడేళ్ళు వేచి ఉండవలసి వచ్చింది. ఈ ఇన్నింగ్స్ లో కొహ్లీ 61 పరుగులలో 122 పరుగులు సాధించి అజేయుడుగా నిలవడం ఘనకార్యం. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ 2017లో శ్రీలంక జట్టుతో ఆడినప్పుడు సాధించిన 118స్కోరును కొహ్లీ ఈ రోజు అధిగమించాడు. అంతర్జాతీయ సెంచరీలు చేసిన ఘనులలో ఆస్ట్రేలియా బ్యాటర్ రికీ పాంటింగ్ తో సమ ఉజ్జీగా నిలిచాడు. కొహ్లీ, పాంటింగ్ కంటే ఎక్కువ సెంచరీలు సాధించిన ఒకే ఒక బ్యాటర్ చరిత్రలో సచిన్ టెండూల్కర్. అతడి ఖాతాలో వంద శతకాలు ఉన్నాయి.

వచ్చే నెల 34వ ఏట లో  అడుగుపెట్టనున్నకొహ్లీ కొన్ని మాసాలుగా విమర్శకుల దాడిని ఎదుర్కాన్నాడు. అతడిని జట్టు నుంచి మినహాయించాలని కూడా ప్రముఖ క్రికెటర్ల సూచించారు. పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ కొహ్లీని తిట్టిపోశారు. అటువంటి విమర్శకులందరి నోళ్ళూ గురువారం బాదిన శతకంతో మూయించాడు. ఇటీవల కొన్ని మ్యాచ్ లలో బాగా ఆడి ఫామ్ లోకి వచ్చాడనింపించాడు. రెండు అర్ధశతకాలు చేసి రోహిత్ రికార్డు సమం చేశాడు. 12 ఫోర్లూ, ఆరు సిక్స్ లూ కొట్టి అబ్బురపరిచాడు.

‘‘గత రెండు సంవత్సరాలూ నాకు చాలా గుణపాఠాలు నేర్పాయి. ఆగ్రహంతో ఉత్సవాలు చేసుకోవడం చిన్నప్పటి మాట. ఈ ఫార్మాట్ లోనే సెంచరీ చేయాలని అనుకన్నా. నేను దిగ్భ్రాంతి చెందాను. ఎన్నో విషయాలు పేరుకొని పోయాయి. జట్టు సంపూర్ణంగా సాయం చేసింది. బయట రకరకాలుగా మాట్లాడుకుంటున్నారన్న సంగతి నాకు తెలుసు. నేను నా ఉంగరాన్ని ముద్దాడాడాను. నన్ను ఇక్కడ మైదానంలో నిలిపింది ఒకే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి పేరు అనుష్క. ఈ శతకం ఆమెకీ, మా చిన్నారి కుమార్తె వమికకీ అంకితం. నేను ఎప్పుడూ నిస్పృహ  చెందలేదు. ఎందుకంటే అనుష్కవంటి వ్యక్తి నా పక్కన ఉండి కాలమాన పరిస్థితులను విశ్లేషించి చెబుతూ ఉండే నిరాశకు చోటే ఉండదు. ఆరు వారాలు విరామం తీసుకోవడంతో నేను తిరిగి ఆటలోకి వచ్చాను. నాకు అర్థమైంది నేను ఎంతగా అలసిపోయానో. కానీ నాలో ఉన్న పోటీ మనస్తత్వం అలసటను దరి చేరనివ్వదు. కానీ ఆరువారాల విరామం నాకు కావాల్సిన శక్తిని ప్రసాదించింది,’’అని విరాట్ కొహ్లీ అన్నాడు.

ఈ ఆసియా కప్ మనది కాదని మొన్న శ్రీలంక చేతిలో ఓడిపోయినప్పుడే సూచన ప్రాయంగా తెలిసింది. బుధవారంనాడు పాకిస్తాన్ అఫ్ఘానిస్తాన్ ని ఓడించడంతో ఆ విషయం రూఢి అయింది. కానీ అఫ్ఘానిస్తాన్ ఆడవలసి ఉండటంతో ఇంకా రోహిత్ బృందం దుబాయ్ లో ఉంది. అఫ్ఘానిస్తాన్ పైన ఘనవిజయం సాధించడంతో పాటు కొహ్లీ అద్భుతంగా ఆడి సెంచరీ కొట్టడాన్ని భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. అంతే కాదు. శ్రీలంకతో ఆడినప్పుడు 19వ ఓవర్ ను పరమదరిద్రంగా వేసి 14 పరుగులు ఇచ్చి లంక విజయానికి బాటలు వేసిన భువనేశ్వర్ కుమార్ అఫ్ఘానిస్తాన్ పైన బ్రహ్మాండంగా బౌలింగ్ చేసి అయిదు వికెట్లు తీసుకొన్నాడు.  

చివరికి ఇరవై ఓవర్లలో 111 పరుగులు చేసింది అఫ్ఘానిస్తాన్. 101 తేడాతో ఇండియా గెలిచింది. బుధవారంనాడు ఇదే అఫ్ఘానిస్తాన్ పైన పాకిస్తాన్ గెలుపొందడానికి నానా యాతనా పడింది. ఇండియా అవలీలగా అఫ్ఘానిస్తాన్ పైన గెలిచింది. ఇదే ఇండియాపైన పాకిస్తాన్, శ్రీలంకలు చివరి ఓవర్ లో విజయాలు సాధించాయి. క్రికెట్ అంటే అంతే. అనూహ్యమైన, విచిత్రమైన ఆట ఇది. మొత్తంమీద భారత జట్టు మరీ అంత బాధపడకుండా దుబాయ్ నుంచి తిరిగి రావచ్చు. అన్నట్టు ఈ మ్యాచ్ లో రోహిత్ ఆడకుండా పెవెలియన్ లో కూర్చున్నాడు. రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించాడు.   

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles