Sunday, June 16, 2024

“ఆర్ధిక ప్రగతి – విద్య”

ఈనాడు అందరూ కోరుకునేది ఆర్ధిక ప్రగతి. కరోనా ప్రభావంతో అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలు దెబ్బతిన్న సందర్భంలో మన ఆర్ధిక వ్యవస్థ గురించి, దాన్ని బాగు చేసుకునే మార్గాల గురించి ఆలోచన, ఆచరణ తప్పనిసరి. ఆర్ధక వ్యవస్థకు మూలం వ్యావసాయిక, సేవా, పారిశ్రామిక రంగాల ప్రగతి. వ్యవసాయంద్వారా మనకు అవసరమైన దానికంటే ఎక్కువ పండించి కొంత ఎగుమతి చేస్తున్నాం.  సేవా రంగంలో, ముఖ్యంగా సాఫ్ట్ వేర్ పరిశ్రమలో మనమే ప్రపంచంలో అగ్ర స్థానంలో ఉన్నాం. పారిశ్రామిక రంగం ఏ దేశ ఆర్ధిక వ్యవస్థలోనైనా కీలక మైంది. అందుకే ప్రపంచంలో చాలా దేశాలు పెట్టుబడులకోసం ధనిక దేశాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి.

Also read: “చరిత్ర వక్రీకరణ”

ప్రధానమైన వనరులు

పరిశ్రమలు స్థాపించడానికి కావాల్సిన ముఖ్యమైన అవసరాలు: భూమి, సమర్ధులైన మనుషులు, ముడిసరుకుల లభ్యత, రవాణా సౌకర్యం, సాంకేతిక పరిజ్ఞానం, అనుకూలమైన చట్టాలు, కొనుగోలుదారులు, డబ్బు వగైరా. విశాల భారత దేశంలో అనేక రకాల ముడిసరకులు, ఖనిజాలు మనకు ఉన్నాయి. కాని కొన్ని వనరులను ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం లేక ముడి సరుకును మనం ఎగుమతి చేస్తున్నాం. దోశపిండికి, దోశకు ధరలో ఎంత తేడా ఉందో మనకు తెలుసు. మనం ఇనుప ఖనిజాన్ని అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఆ సరుకును ఉపయోగించి మనమే అవసరమైన వస్తువులు తయారు చేయగలిగితే ఎంతో ఎక్కువ లాభం ఉంటుంది. ఆ సాంకేతికత మనదగ్గర లేని కారణంగా అది కలిగిన మరో విదేశీ కంపెనిని మన దేశానికి రప్పించుకుని వారు ఇక్కడ పెట్టుబడి పెట్టి, పరిశ్రమ స్థాపించి, వస్తువులు తయారుచేస్తే వారికి మనకు కూడా లాభదాయకంగా ఉండే విధంగా  ప్రయత్నం చేయాలి. అలా మన దేశంలో వస్తువులు తయారు కావడానికి మనషులు అవసరం కనుక మన వాళ్లకు ఉద్యోగాలు కూడా లభిస్తాయి.

Also read: “మన శౌరి” 

వ్యాపారానికి అనువైన దేశం భారత్

ప్రపంచంలో వ్యాపారం చేయడానికి అనువైన (Ease of doing business) దేశాలలో ఒకటిగా భారత దేశం ఇటివల గుర్తింపు పొందింది. ఒక పరిశ్రమ లాభదాయకంగా నడవడానికి కావలసినవన్నీఇక్కడ ఉన్నాయి. పరిశ్రమలను ప్రోత్సహించే ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉంది. పరిశ్రమకు అనుకూలమైన ‘మార్కెట్ ఎకానమీ’ విధానం ఉంది. అధిక జనాభా గల దేశం కాబట్టి వస్తువులకు కొనుగోలుదారులు ఉంటారు. సరళీకరించిన పారిశ్రామిక చట్టాలు, పన్ను విధానం ఉంది. కరోనా కారణంగా చైనాపై కోపంతో ఆ దేశంనుండి బయటకు వస్తున్న అనేక అంతర్జాతీయ కంపెనీలు ఈనాదు భారత దేశం వైపు చూస్తున్నాయి. అవసరమైన ఆర్ధిక సంస్కరణలు చేపడుతూ భారత ప్రభుత్వం వారిని మన దేశానికి రప్పించే ప్రయత్నంలో ఉంది.

Also read: ‘‘అభయం’’

సాంకేతికతలో పుంజుకోవాలి

ఏ విషయంలోనైనా ఎక్కడో ఒక లోపం ఉండకపోదు. అలా మన దేశంలోనూ ప్రస్తుత పరిస్థితికి, ఆర్ధిక ప్రగతికి అవసరమైనంత  సాంకేతికత లేకపోవడం మన ప్రగతిని దెబ్బతీసే విషయం. ఈ సాంకేతిక పరిజ్ఞానం విద్యాలయాల ద్వారా రావాలి. కానీ దేశంలో చాలా విద్యాలయాలు నిరుద్యోగులను తయారు చేసే ఫ్యాక్టరీలుగా తయారయ్యాయి. మన విద్యా విధానంలో లోపాలవల్ల మనం విదేశీ పరిశ్రమలనుండి పెట్టుబడులే కాకుండా సాంకేతిక పరిజ్ఞానం కూడా తెచ్చుకోవలసిన దశలో ఉన్నాం. ఇటీవల “స్కిల్ డెవలప్ మెంట్” పేరుతొ ప్రభుత్వం నైపుణ్యాలను పెంచే ప్రయత్నం చేస్తున్నది. కాని లక్ష్యం మనకు చాలా దూరంలో ఉంది. కాబట్టి విద్యా విధానంలోని లోపాలను గుర్తించి సరిదిద్దడం మన ఆర్ధిక ప్రగతికి తప్పనిసరి అవసరం.

Also read: “లాల్ బహదూర్ శాస్త్రి”

విద్యాప్రమాణాలు పెరగాలి

ప్రాధమిక విద్యా వ్యాప్తికి ప్రపంచ ఆర్ధిక సంస్థల తోడ్పాటుతో అనేక విద్యాలయాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. చాల ప్రైవేట్ స్కూళ్ళు కూడా ఏర్పడ్డాయి. ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చాయి. ప్రభుత్వ స్కూళ్ళలో బోధన సరిగ్గా జరగడం లేదు. కారణం అజమాయిషీ లోపం. ప్రైవేట్ స్కూళ్ళలో అజమాయిషీ ఉంటుంది కాని జీతం తక్కువ, పని ఎక్కువ. కాబట్టి బోధనా శక్తి, ఆసక్తి తక్కువ. ఈ కారణాలతో పిల్లలకు పాఠాలు సరిగా రావు. కాని పరీక్షలలో పిల్లలు ఎక్కువ మంది పాస్ కాకపోయినా, మార్కులు తక్కువ వచ్చినా ఉపాద్యాయుల జీతాల్లో కోతలు పెడతారనే భయంతో పరిక్షల ముందు కొన్ని ప్రశ్నలకు జవాబులు నేర్పించి పరీక్షలో వాళ్ళు సరిగ్గా రాసినా రాయకపోయినా మార్కులు దండిగా వేసేస్తున్నారు. దీంతో చదివే పిల్లలు కూడా చదవకపోయినా మార్కులు వస్తాయిగా  అని  చదవడం మానేస్తున్నారు.

Also read: “విద్యార్ధి” 

ప్రాథమిక విద్య నుంచే మరమ్మతు అవసరం

నిన్నటి పాఠం చదవకపోతే నేటి పాఠం అర్దం కాదు. కాబట్టి ప్రాధమిక విద్యలో లోపం మాధ్యమిక, ఉన్నత విద్యలలోకూడా కొనసాగుతుంది. ఉన్నత విద్యలో పుస్తకాల ద్వారా  నేర్చుకున్నది ప్రయోగశాలలో కార్యరూపంలో పరిశీలించ వలసి ఉంటుంది. కాని పాఠాలను సరిగ్గా నేర్చుకోని విద్యార్దులు ప్రయోగశాలలో ఏమి చేయలేక చతికిల పడుతున్నారు. ప్రాజెక్ట్ వర్క్ అంటూ ఉన్నా చాలామంది బయటివారితో చేయించి తాము చేసినట్లుగా చూపిస్తారనేది బహిరంగ రహస్యం. విద్యార్ధులు ఏ తరగతిలోనూ పూర్తి  సిలబస్ చదవకుండా కొన్ని భాగాలు లేదా ముక్కలు మాత్రం చదివి పరీక్షలు రాసేస్తున్నారు. ఏ సబ్జెక్టు మీద సమగ్ర అవగాహన, ప్రాక్టికల్ గా ఏమీ చేయడం చేతకాని స్థితిలో డిగ్రీలు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి విద్యార్ధులు పరిశోధనలు చేసి కొత్త విషయాలను ఆవిస్కరిస్తారని ఎదురుచూడడం దురాశ అవుతుంది.

Also read: “వృద్ధాప్యం”

నూతన ఆవిష్కారాలు జరగాలి

చదువుపై ఆసక్తి ఉండి అన్ని పాఠాలను చదివి, ఆ విజ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో తెలుసుకున్న కొద్దిమంది విద్యార్హులు మాత్రం ఉద్య్యోగాలు సంపాదించుకో గలుగుతున్నారు. పరిశోధనలు చేయడానికి  సిద్ధమవుతారు. కొత్త విషయాలు ఆవిష్కరిస్తారు. ఈ ఆవిష్కారాలను పారిశ్రామికవేత్తలు వాడుకొని అధిక ఉత్పత్తిని, నాణ్యతను సాధిస్తారు. అధిక ఉత్పత్తి కారణంగా అధిక లాభాలు. తద్వారా మరెన్నో పరిశ్రమలు వస్తాయి. మరింత లాభం. చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి. దేశ సంపద పెరుగుతుంది. అంటే ప్రజా జీవన ప్రమాణం (standard of Living) పెరుగుతుంది. జనం సుఖంగా ఉంటారు.

Also read: “అక్షర ధాం, ఢిల్లీ – అపరూప కళా ఖండం”

ప్రతిభావంతులు స్వదేశానికి రావాలి

అన్ని రకాల ప్రగతికి ,మూలమైన విద్యనూ అశ్రద్ద చేస్తే ఆర్ధిక ప్రగతి అసాధ్యం. ప్రస్తుతానికి పెట్టుబడులు ఎక్కువగా వస్తే విదేశాల్లో ఉద్యోగాలు పోగొట్టుకున్న మనవాళ్ళు వెనక్కి వచ్చి (Reverse Brain-drain) అవసరమైన నాణ్యమైన సాంకేతిక సామర్ధ్యాన్ని అందించి భారత ప్రగతికి తోడ్పడే అవకాశo ఉంది. కానీ దీర్ఘకాలిక ప్రయోజనంకోసం మన విద్యా విధానంలోని లోపాలను సరిదిద్ది విద్య పట్ల ఇష్టం, అవగాహన, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించే విధంగా చర్యలు వెంటనే తీసుకుని భారత ప్రగతికి ఆర్ధిక పరిపుష్టికి గట్టి ప్రయత్నం చేయాల్సిన సమయమిది.

Also read: “కాశ్మీర్”

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles