Wednesday, May 1, 2024

బీహార్ సీఎం నితీశ్ కుమారే – బీజేపీ

స్పష్టం చేసిన బీజేపీ నేత సుశీల్ మోదీ

బీహార్ ముఖ్యమంత్రి పీఠంపై నెలకొన్న సందిగ్ధతకు బీజేపీ తెరదించింది. బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీశ్ కుమారే ఉంటారని ఇందులో ఎలాంటి సందేహాలకు తావు లేదని బీజేపీ స్పష్టం చేసింది. సీఎం విషయంలో ఎలాంటి సంధిగ్థతకు తావులేదని సీనియర్ నేత సుశీల్ మోడీ స్పష్టం చేశారు. సీఎంగా నితీశ్ స్థానాన్ని ఇంకెవ్వరూ భర్తీ చేయలేరని ఎన్నికల ముందే ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశ్ కుమార్ అని బీజేపీ హామీ ఇచ్చిందన్నారు.

ఎన్నికల ముందే హామీ:

ఎన్నికల ఫలితాల్లో జేడీయు మూడో స్థానానికి పడిపోవడంతో నితీశ్ రాజకీయ భవితవ్యం పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో నితీశ్ ను సీఎంగా కొనసాగించేందుకు బీజేపీ అంగీకరిస్తుందా లేదా అనే అనుమానాలు తలెత్తాయి. అయితే దీనిపై బీహార్ ఉపముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ స్పందించారు. బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమారే ఉంటారని స్పష్టం చేశారు.

ఫలితాలను జేడీయు బేజారు:

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. అయితే నితీశ్ కుమార్ కు చెందిన జేడీయూ కంటే బీజేపీ ఎక్కువ స్థానాలలో విజయం సాధించింది. గతంలో జేడీయుకి ఎక్కువ సీట్లు వచ్చినపుడు ఆ పార్టీకి చెందిన నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి గానూ…బీజేపీకి చెందిన సుశీల్ మోడీ ఉప ముఖ్యమంత్రిగానూ ఉన్నారు. ఈ సారి ఫలితాలు తారుమారయ్యాయి. ఈ సారి బీజేపీ 74 స్థానాల్లో విజయం సాధించగా, జేడీయూ 43 స్థానాల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తక్కువ సీట్లు సాధించిన జేడీయు కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వరని ఊహాగానాలు మొదలయ్యాయి. ఊహాగానాలు విస్తృతంగా ప్రచారం అవుతుండటంతో రంగంలోకి దిగిన బీజేపీ దీనిపై స్పష్టత నిచ్చింది. కూటమిగా ఎన్నికల బరిలో ఉన్నపుడు ఒకరికి ఎక్కువ, మరొకరికి తక్కువ సీట్లు వస్తాయని అంతమాత్రాన ముఖ్యమంత్రి అభ్యర్థిని మార్చడం సమంజసం కాదని సుశీల్ మోదీ అన్నారు.

సీట్లు తగ్గడంతో ఆందోళనలో జేడీయు:

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు నితీశ్ ప్రయత్నాలు మొదలు పెట్టిన ఆ పార్టీ నేతలను ఓటమి ఆందోళన వెంటాడుతోంది. 115 స్థానాల్లో పోటీ చేసి కేవలం 43 స్థానాల్లో విజయం సాధించింది. అంటే పోటీ చేసిన సగానికి పైగా స్థానాల్లో ఓటమి పాలయింది. ఇవే చివరి ఎన్నికలు అని నితీశ్ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించడం పార్టీకి తీరని నష్టం చేకూర్చిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ బాగా పుంజుకుంది. మహారాష్ట్రలో శివసేన నేర్పిన పాఠాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతానికి ముఖ్యమంత్రిగా నితీశ్ ను కొనసాగించినా …మంత్రివర్గ కూర్పులో బీజేపీ తన మాటే నెగ్గించుకొనే అవకాశం ఉంది.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles