Saturday, May 4, 2024

గ్రామాలు గర్వించేలా ఉండాలిగా? మా ఊరే ఒక ఉదాహరణ!

ఒక సమీక్ష

అరవై సంవత్సరాలకుపైగా దిల్లీలో నివసిస్తున్న డాక్టర్  నాగులపల్లి భాస్కరరావు ప్రతి సంవత్సరం కృష్ణాజిల్లాలో ఉన్న తన స్వగ్రమాం ముదునూరు సందర్శించేవారు. ఈ సారి గ్రామంలోనే కొన్నినెలలు మకాం పెట్టి గ్రామంలోని పరిస్థితులను పరిశీలించారు. తన చిన్న తనంలో, తాను ఎదుగుతున్న క్రమంలో నాడు గ్రామంలో ఉన్న పరిస్థితులతో పోల్చుకొని చాలా మధనపడ్డారు. అన్ని రంగాలలో ప్రమాణాలు అడుగంటడం గమనించారు. సత్తువ ఉన్నవారు వలస వెడితే గ్రామంలో మిగిలిపోయినవారు బిక్కుబిక్కుమంటూ జీవించడం చూశారు. తన గ్రామ ప్రజలలో కొత్త విశ్వాసం నింపాలనీ, కొత్త జీవితం వైపు అడుగులు వేయించాలనీ, గ్రామాన్ని ఆదర్శంగా నిలపాలని తన ప్రయత్నాలు తాను చేస్తూ వచ్చారు. అందులో భాగంగానే ఆత్మకథల, జీవిత కథల గ్రంథాలయాన్ని తన నివాసంతో స్థాపించారు. దానిని బాగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. అంతటితో ఆగకుండా, ఎనభై ఏళ్ళ వయసును కూడా లెక్క చేయకుండా గ్రామంలో విస్తృతంగా పర్యటించి, ఇరుగుపొరుగు గ్రామాలను సందర్శించి, అక్కడి పరిస్థితులను పరిశీలించి తెలుగులో ఒక మంచి  పుస్తకం రాశారు.

గ్రామంలో పరిస్థితులు దిగజారడంపైన ఆవేదన వెలిబుచ్చారు. అధికారులూ, ప్రభుత్వ ప్రతినిధులూ, సంస్థలూ ఎక్కువైనప్పటికీ ప్రజల జీవన పరిస్థితులు మెరుగు కాకపోగా పతనం అవుతున్న వాస్తవాన్ని తెలుగువారందరికీ చెప్పాలనుకున్నారు. ముదునూరును వేధిస్తున్న వైఖరులనూ, సమస్యలనూ విస్తారంగా చర్చించి ఆ గ్రామం అభివృద్ధి చెందాలంటే ఏమి చేయాలో సూచనలు ఇచ్చారు. ముదునూరు అనుభవాల నుంచి ఇతర గ్రామాలు గుణపాఠాలు నేర్చుకోవాలని ఆయన ఆశ. ముదునూరు మళ్ళీ ఏడెనిమిది దశాబ్దాల కిందటి అనుభవాలను గుర్తు తెచ్చుకొని ప్రగతి పథంలో పయనించాలని అభిలాష. డాక్టర్ భాస్కరరావు రచించిన గ్రంథం ‘గ్రామాలు గర్వించేలా ఉండాలిగా!, మా ఊరే ఉదాహరణ’ ఎంతో మందికి స్ఫూర్తిని ప్రసాదించాలని ఆకాంక్ష. ఈ పుస్తకంలో డాక్టర్ నాగులపల్లి భాస్కరరావు ప్రాధాన్యం ఇచ్చిన అంశాలలో కొన్ని:

ముదునూరు రికార్డు. ప్రతి దశాబ్దానికీ ఒక కొత్త అంశానికి ప్రాధాన్యం లభించింది.

1920లో సాంస్కృతిక కార్యక్రమాలకీ, పుస్తకాలకీ, పద్యనాటకాలకీ ఆదరణ ఉండేది. 1930 దశకంలో స్వాంతంత్ర్యసమరానికి శంఖంపూరించారు. కదం కలిపారు. భుజం కలిపారు. 1940లలో కులాంతర వివాహాలకూ, నాస్తికవాదానికీ ప్రాముఖ్యం పెరిగింది. 1950లలో పిల్లల చదువుపట్ల ఆసక్తి ఇనుమడించింది. 1960లలో రోడ్లు, ఇతర ప్రాథమిక అవసరాల వృద్ధి జరిగింది. ప్రజాసంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారు. 1970లో పరిపాలనకూ, అధికార వికేంద్రీకరణకూ అధిక ప్రాముఖ్యం లభించింది. 1980లలో రాజకీయపార్టీలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. 2000లలో విచ్ఛిన్నకర రాజకీయాలు, ఎన్నికల తంతు గురించి ఆందోళన పెరిగింది. అంటే, 1980ల నుంచి విలువల పతనం ఆరంభమైనదని అనుకోవచ్చు.  

కేవలం స్వాంతంత్ర్య సమరానికి కేంద్రంగానే కాదు, ముదునూరు చాలా చురుకుగా ఉండేది. కష్టపడి పనిచేసే కర్షకులూ, సోదరభావంతో సామరస్యంగా జీవించే ప్రజలు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా హేతువాద ప్రచారం. కులాంతర వివాహాలు. 1931లో మహాత్మాగాంధీ ముదునూరు సందర్శించారు. 1939 నుంచి 1945 వరకూ గోరా నాస్తికోద్యమం. హరిజనుల ఆలయ ప్రవేశం. అజ్ఞాతంగా ముద్రణాలయాన్ని నిర్వహించడం, నాస్తికోద్యమం. మహిళల ముందడుగు. దేవాలయ ప్రాంగణాలు తెరిచి ఉండేవి. పిల్లలు ఆడుకునే స్థలాలుగా మారేవి. ముదునూరుకు పాఠశాల రాకపూర్వమే గ్రంథాలయం వచ్చింది.

అధికారుల పెత్తనం, పాఠశాలలు

బయటి నుంచి అధికారుల రాక ముమ్మరం. గ్రామ పంచాయితీ. రాష్ట్ర ప్రభుత్వం, సచివాలయం. కేంద్ర ప్రభుత్వం, ప్రత్యక్ష, పరోక్ష నిధులు. జిల్లా పరిషత్ స్కూళ్ళు. ముదునూరు సమీపంలో కార్పొరేట్ విద్యాసంస్థలు. ప్రైవేటు పాఠశాలలు. ప్రైవేటు పాఠాలు.

నేటి పరిస్థితి దారుణం

చారిత్రక స్పృహ లేదు, ఆత్మగౌరవం లేదు. భవిష్యత్తు అనుమానాస్పదం. పచ్చదనం లేదు. ఆరోగ్యం అంతంత మాత్రం. నగర జీవితానికి దీనికీ తేడా ఉన్నదా? చిన్న వ్యాపార సంస్థల మనుగడ కష్టసాధ్యమైంది. ట్రాక్టర్లూ, మోటారు సైకిళ్ళూ, కార్లూ, సెల్ ఫోన్ లూ గ్రామస్థుల ఆదాయం పెంచాయా?

చేతనైనవారు ఊళ్ళు వదిలి వలస వెడుతున్నారు. ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. కొద్ది మంది మాత్రమే నివాసం ఉంటున్నారు. పాఠశాలలు మూతబడ్డాయి. పబ్లిక్ టాయ్ లెట్లు ఉపయోగంలో లేవు. పంచాయతీ భవనంలో ఎవ్వరూ ఉండటం లేదు. గ్రామం ఉనికి కోల్పోయింది. పాత గ్రామం లేనేలేదు. వరదలు వస్తున్నాయి. ఫ్లయ్ ఓవర్ల నిర్మాణం జరుగుతోంది. అంటురోగాలు విజృంభిస్తున్నాయి. పంటలు బాగా పండినప్పటికీ వైకల్యాలు తప్పడం లేదు. స్థానిక సంస్థలు లేనేలేవు. యువత వలస వెళ్ళగా మిగిలిపోయిన వృద్ధులు ఈ లోకం విడిచి ఒక్కొక్కరే వెళ్లిపోతున్నారు. వెనక్కి తిరిగి చూసుకోవడానికి ఏమీ లేదు.

కింకర్తవ్యం?

ఈ దుస్థితి పోవాలంటే, ఈ పరిస్థితుల మారాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలి. ఉద్పాదన పెంచాలి. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలగాలి. సంపాదన దాచుకోవాలి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. ఎవరైనా గ్రామం వదిలి వలస వెడితే ఆ గ్రామంలో తమ ఆస్తిపైన హక్కు కోల్పోయే విధంగా చట్టం చేయాలి. గ్రామంలో వనరులపైన పౌరసంస్థ అదుపు ఉండాలి. గ్రామంలో అభివృద్ది కార్యక్రమాలలో ప్రజలు సగర్వంగా పాల్గొనాలి. ప్రజల ప్రయోజనాలకు అంకితమైన నిజాయితీ కలిగిన నాయకులను ఎన్నుకోవాలి. అప్పుడు కానీ ముదునూరు గ్రామానికీ, ముదునూరు వంటి ఇతర గ్రామాలకీ పట్టిన జాడ్యం వదలదు. ప్రగతికి సోపానాలు పడాలంటే ప్రజల వైఖరి మారాలి. చైనా పురోభివృద్ధిని ఆదర్శంగా తీసుకోవాలి. అది ఒక మంచి నమూనా కావాలి. ఇతర గ్రామాలకు ముదునూరు ఆదర్శం కావాలి.  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles