Thursday, May 2, 2024

బైడెన్ పరపతి పడిపోతోంది

  • అంచనాలకు మించి ఎదుగుతున్న చైనా
  • అగ్రరాజ్యం హోదాను నిలబెట్టుకోవడానికి అమెరికా ప్రయత్నం
  • ఆర్థిక నిర్వహణలో అగ్నిపరీక్ష ఎదుర్కొంటున్న జోబైడెన్

జాత్యహంకారం, కీర్తి కండూతి, చిత్త చాపల్యం, విలాసాలు, వినోదాలు, పాలనా వైఫల్యాలు, ఆర్ధిక మందగతి నడుమ అమెరికా పూర్వ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు ఇంటాబయటా చాలా చెడ్డపేరు వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఆయన్ని గద్దెదింపి, సాత్వికుడిగా, అనుభవజ్నుడుగా పేరున్న జోబైడెన్ కు పట్టంకట్టారు. బైడెన్ అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తయింది. ఇంతవరకూ ఆయన చేసిన అద్భుతాలు ఏమీ లేకపోగా, ద్రవ్యోల్బణం, ఆర్ధిక మాంద్యం మొదలైన అంశాల పట్ల ప్రజల్లో భయం పట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో బైడెన్ పరపతి, ప్రాచుర్యం తగ్గుముఖం పట్టినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజామోదంలో ఆయన రేటింగ్ గణనీయంగా పడిపోయింది. మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు గతంలో వచ్చిన రేటింగ్ కంటే కూడా కిందకు వెళ్లిపోయింది. జో బైడెన్ ప్రజామోద రేటింగ్ 36 శాతానికి దిగి వచ్చింది. అమెరికా పాలకులలో అతి దారుణంగా 37 శాతం రేటింగ్ పొంది, ట్రంప్ అప్పుడు వార్తల్లోకి ఎక్కాడు. ట్రంప్ కంటే కూడా దిగిపోయి ఇప్పుడు బైడెన్ వార్తల్లోకి ఎక్కుతున్నాడు. సీ ఎన్ బీ సీ జూలైలో నిర్వహించిన ‘ఆల్ అమెరికా’ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

Also read: అవునా, క్లౌడ్ బరస్టా?

దారుణంగా రేటు తగ్గిన బైడెన్

ధరలు మరింతగా పెరుగుతాయని, మరోమారు ఆర్ధిక మాంద్యంలోకి వెళ్లిపోతామేమో  అనే భయం అమెరికన్ లకు పట్టుకుంది. ఆర్ధిక నిర్వహణ పరంగా చూసినా ఆమోద రేటింగ్ ఘోరంగా 30శాతనికి పడిపోయింది. ఇదే అంశంలో గతంలో డోనాల్డ్ ట్రంప్ కు 41శాతం వచ్చింది. 2008లో ఆర్ధిక మాంద్యం వచ్చింది. అప్పుడు అధ్యక్షుడుగా ఉన్న బరాక్ ఒబామా 37 శాతం రేటింగ్ సాధించాడు. దానిని పరమచెత్త రేటింగ్ గా అప్పుడు అమెరికావాసులు అభివర్ణించారు. ఇప్పుడు బైడెన్ వీరిద్దరి కంటే కూడా తక్కువ రేటింగ్ తెచ్చుకొని చర్చనీయాంశంగా మారాడు. సొంత  డెమోక్రాటిక్ పార్టీలోనూ బైడెన్ ఆదరణ తగ్గిపోతోందని కథనాలు వస్తున్నాయి. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ఆయన తీసుకుంటున్న చర్యలు కూడా కానరావడం లేదు. అగ్రరాజ్యమైన అమెరికాలో ఆర్ధిక నిర్వహణ అత్యంత కీలకం. అగ్రరాజ్య హోదాను నిలబెట్టుకోవడం ప్రతి అధ్యక్షుడికీ అతిపెద్ద సవాల్. కరోనా సమయంలో సరిగ్గా వ్యవహరించకపోవడం, బాధ్యతగా మెలగక పోవడం వల్ల డోనాల్డ్ ట్రంప్ భారీ మూల్యం చెల్లించుకున్నాడు. అధికారానికి దూరమవ్వడమే కాక, ప్రపంచ ఆర్ధిక సమాజాల్లో పరపతిని కోల్పోయాడు. జో బైడెన్ పై అమెరికా ప్రజలతో పాటు మిత్రదేశాలు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. శ్రీలంక మొదలుకొని అనేక దేశాల్లో అసమర్ధత,అవినీతి, అరాచకత్వం వల్ల పాలకులు ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటున్నారు. బ్రిటన్ లో బోరిస్ జాన్సన్ పరిస్థితి మరో ఉదాహరణ. దేశం ఏదైనా..పాలనలో ఎవరున్నా.. పాలకులను  ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉంటారన్న స్పృహను కోల్పోరాదు. కరోనా అందరినీ చావుదెబ్బ కొట్టింది. చైనా కూడా ఆ దుస్థితి నుంచి ఇంకా బయటకు రాలేదు. ఇంకో పక్క, అగ్రరాజ్య స్థానాన్ని ఆక్రమించాలనే యావ చావలేదు. నయా సామ్రాజ్యవాదం పచ్చిగా ఉంది. గడచిన 30 ఏళ్లలో చైనా అంచనాలకు మించి అన్ని రంగాల్లో ఎదిగిపోయింది. అతి త్వరలోనే అమెరికాను కూడా మించిపోయి అగ్రరాజ్య హోదాను దక్కించుకుంటుందనే కథనాలు అంతర్జాతీయ మీడియాలో ఆ మధ్య వెల్లువెత్తాయి. ప్రపంచంలోని అనేకమంది ఆర్ధిక నిపుణులు కూడా చైనా అనూహ్య ప్రగతి పట్ల ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చైనా మొదటి నుంచీ చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా,జిన్ పింగ్ అధ్యక్షుడుగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ వ్యూహంలో, ప్రగతిలో వేగం శరపరంపరగా దూసుకు వెళ్తోంది. అనేక ఆశలు చూపి, తాయిలాలు ఇచ్చి భారత్ తప్ప సరిహద్దు దేశాలన్నింటినీ తన గుప్పెట్లోకి తెచ్చుకుంది. రష్యాతో దోస్తానాను పెంచుకుంది. అమెరికా వ్యతిరేక దేశాలన్నింటినీ ఏకీకృతం చేసి, తన వైపు తిప్పుకోడానికి కావాల్సిన ప్రయత్నాలన్నింటినీ చైనా నిరాఘాటంగా చేస్తూనే వుంది.

Also read: ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ లో ముసలం

బైడెన్ శక్తియుక్తులు పుంజుకోవాలి

కరోనా సృష్టించిన విలయం నుంచి బయటపడడం ఒక ఎత్తు – అనకొండలా ఎదుగుతున్న చైనాను ఎదుర్కోవడం మరో ఎత్తుగా అమెరికా ముందుకు కదలాల్సి వుంది. భారత్ వంటి విలువలు కలిగిన దేశం పట్ల అమెరికా ఇంకా స్ఫటిక సదృశంగా మెలగాలి. పాకిస్థాన్ వంటి దేశాలతో స్నేహం కొనసాగిస్తూ ద్వంద్వనీతిని పాటిస్తోంది.ఈ వైనం మారాలి. చైనా తర్వాత అత్యధిక జనాభా కలిగి, ప్రపంచంలో పెద్ద మార్కెట్ కేంద్రమైన భారత్ తో ఆర్ధిక, వ్యాపార, వాణిజ్య బంధాలను అమెరికా మరెన్నో రెట్లు పెంచుకోవాలి. జో బైడెన్ కు మొదటి నుంచీ భారత్ పట్ల ప్రత్యేకమైన గౌరవం, ప్రేమ ఉన్నాయన్నది వాస్తవం. వ్యూహాత్మక భాగస్వామ్యంలో, ప్రగతి రథచక్రాలను నడిపించడంలో ఉభయ తారకంగా వ్యవహరించడంలో ఆచరణాశీలత అమెరికాకు ఎన్నో రెట్లు పెరగాలి. బైడెన్ కు ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఇంకా పాలనా కాలం చాలా ఉంది. ఇప్పటి నుంచి వేసే ఆయన వేసే ప్రతి అడుగూ వ్యక్తిగతంగానూ, దేశప్రతిష్ఠ పరంగానూ కీలకం. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడుగా వున్న సమయంలో అమెరికాకు చాలా దేశాలతో సంబంధాలు దెబ్బతిన్నాయి. పెద్దన్న పాత్రకు చిల్లులు పడ్డాయి. వీటన్నిటిని మరమ్మత్తు చేసుకోవాల్సిన బాధ్యత కూడా జో బైడెన్ పై ఉంది. మెరుపువేగంగా ముందుకు వెళ్తూ, రాజనీతిజ్ఞతో వ్యవహరిస్తూ అచిరకాలంలోనే ప్రగతిని,పరపతిని, ప్రాచుర్యాన్ని జో బైడెన్ సాధించాలని ఆశిద్దాం. భారత్ – అమెరికా బంధాలు మరింతగా బలపడాలని కోరుకుందాం.

Also read: అధికార మదాంధులకు శ్రీలంక గుణపాఠాలు

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles