Tuesday, April 30, 2024

‘కశ్మీర్ ఫైల్స్’ కలవరం, కలకలం

  • బీజేపీ అభిమాన బృందం నిర్మించిన సినిమా
  • మానుతున్న గాయాన్నిరేపడంలో ఔచిత్యం ఏమిటి?
  • సినిమా చూసి అవగాహన పెంచుకుందాం, క్షేత్రవాస్తవికతను పట్టించుకుందాం

ఇటీవలే ‘ది కశ్మీర్ ఫైల్స్’ పేరుతో  ఒక సినిమా విడుదలై సంచలనం సృష్టిస్తోంది. 5/5 రేటింగ్స్ దక్కించుకుంది. చాలా రాష్ట్రాల్లో వినోదపన్ను రాయితీలు పొందింది. ఈ సినిమా బృందం ప్రధానమంత్రిని కలిసింది. ప్రధాని నరేంద్రమోదీ మన్ననలు పొందింది. వివిధ వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో  విమర్శలను మూటకట్టుకుంటోంది. ఈ సినిమాను ఆపాలంటూ కొందరు న్యాయస్థానాలలో వ్యాజ్యాలు కూడా వేశారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి, హిందువులను ఏకీకృతం చేసి, రాజకీయంగా ప్రయోజనాలు పొందడం కోసం బిజెపి అనుకూలురందరూ ఏకమై రూపొందించిన సినిమాగా కొందరు అభివర్ణిస్తున్నారు.

Also read: కాంగ్రెస్ కు కాయకల్పచికిత్స జరిగేనా?

 సినిమా అద్భుతం

 ఇందులో నటించిన అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి బిజెపి అనుకూలురుగా పేరుండడం ఆ అనుమాలకు ఆస్కారం కలిపిస్తున్నాయి. అనుపమ్ ఖేర్ భార్య కిరణ్ ఖేర్ బిజెపి సభ్యురాలు కూడా. ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం జరిగిన గాయాన్ని మళ్ళీ గుర్తుచేయడం ప్రమాదకరమని కొందరి వాదన. కొందరి స్వార్ధ ప్రయోజనాలకు రేపటి తరాలు బలి కాకూడదని, శాంతి స్థాపన బదులు మత విద్వేషాలను రెచ్చగొట్టడం దేశానికి క్షేమదాయకం కాదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సినిమా రూపకల్పన పరంగా చూస్తే ఎన్నో కితాబులను దక్కించుకుంటోంది. పాటలు, ఫైట్స్, భారీ సెట్టింగ్స్, మసాలాలు మొదలైన వాణిజ్య వస్తువులు, వినోద భరిత సన్నివేశాలు లేకుండా వాస్తవగాథను సెల్యులాయిడ్ పై చూపించడం దర్శకుడి అద్భుతమైన ప్రతిభకు నిదర్శనం. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి గతంలో ‘ది తాష్కెంట్ ఫైల్స్’ పేరుతో తీసిన సినిమాకు కూడా గొప్ప గుర్తింపు వచ్చింది. ఇప్పుడు వచ్చిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ అతడి ఖ్యాతిని మరోఎత్తుకు తీసుకెళ్లింది. 1990లో జమ్మూ -కశ్మీర్ లో చోటుచేసుకున్న ఉగ్రదాడుల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఉగ్రవాదుల మారణకాండలో వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. కశ్మీర్ పండిట్స్ ప్రాణభయంతో  జన్మభూమిని వదిలి మిగిలిన రాష్ట్రాలకు, దేశాలకు పారిపోయారు. చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురై పోయారు. మానప్రాణాలను, ఆస్తులను, సర్వం పోగొట్టుకొన్నారు. వెళ్ళలేక అక్కడ ఉన్నవారు  నేటికీ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఆ భూమిపుత్రుల ఘోష సామాన్యమైంది కాదు. ఆ జీవితాలు కరుణరస సాగరాలు. పండిట్స్ (బ్రాహ్మణులు) తో పాటు సిక్కులు, మిగిలినవారు కూడా ఆ నరమేధంలో నరకం చూశారు. ఈ వ్యధామయగాథ నేడు సినిమా రూపంలో వచ్చింది. ఈ సినిమాను చూస్తున్నంత సేపు ఎందరో ప్రేక్షకుల హృదయాలు కన్నీళ్లతో తడిసి ముద్దయి పోతున్నాయి. ఆ కథాకథనం, సంభాషణలు, పాత్రపోషణ అన్నీ అద్భుతంగా దృశ్యమానమయ్యాయి.  ఇటువంటి పాత్రల పోషణలో అనుపమ ఖేర్ కు తిరుగే ఉండదని మరోమారు నిరూపించారు. మిథున్ చక్రవర్తి కూడా ఈ తరహా సినిమాల్లో అలవోకగా వదిగిపోతారు. పుష్కర్ నాథ్ పాత్రలో ఆ భూమిపుత్రుడిగా అనుపమ్ ఖేర్ అందరితో కన్నీళ్లు తెప్పించాడు. వాస్తవానికి కూడా అనుపమ్ ఖేర్ కశ్మీర్ పండితుడే. కాబట్టి, మరింతగా ఆ పాత్రలో జీవించగలిగాడు. నవతరం ప్రతినిధిగా దర్శన్ కుమార్ ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ఆచార్య పాత్రలో పల్లవీ జోషి జీవించేశారు. అప్పటి ఘోరకలిని వినిపిస్తూనే…కశ్మీర్ అందాలను కెమెరాలో బంధించి, కళ్ళకు, హృదయానికి గొప్ప రసానందాన్ని పంచారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి సాంకేతిక నిపుణుడూ తన కళాప్రతిభను గొప్పగా చాటిచెప్పారు. నిర్మాణం పరంగా సినిమాకు 100 మార్కులు పడతాయి. నిజజీవితంలో,కశ్మీర్ రాష్ట్ర వాసులకు,పండిట్స్ కు సంపూర్ణమైన న్యాయం జరిగితేనే.. నిజమైన ప్రయోజనం దక్కుతుంది.

Also read: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ఎన్నో గుణపాఠాలు

తిలాపాపం తలాపిడికెడు

రగులుతున్న కశ్మీర్ లో మంటలు ఆర్పాల్సిన బాధ్యత, ఆకలి తీర్చాల్సిన కర్తవ్యం ప్రభుత్వాలదే. రాజకీయంగా తప్పు నీదంటే నీదంటూ ఒకపార్టీపై మరొక పార్టీ నెట్టుకోవడం వల్ల ప్రయోజనం శూన్యం. 1990 లో ఏ పార్టీ అధికారంలో ఉంది? అంతకు ముందు ఎవరు? ఆ తర్వాత ఎవరు? కశ్మీర్ కల్లోలానికి కారకులెవరు? అని తవ్వితే.. తిలాపాపం తలా కాస్త.. లాగా అందరికీ అందులో వాటా ఉంటుంది.వాటాల్లో శాతాలు తేడా ఉండవచ్చు అంతే. ఇప్పటికీ కశ్మీర్ లో అలజళ్ళు ఆగలేదు. శాంతి స్థాపన జరుగలేదు. అభివృద్ధికి నోచుకోలేదు. ప్రజాస్వామ్యం వెల్లివిరియ లేదు. పెట్టుబడుల వరదలు పారడం లేదు, సినిమాల షూటింగ్స్, వ్యాపారాలు వెల్లువెత్తడం లేదు. ఆ మధ్య జమ్మూలో జరిగిన డ్రోన్స్ అలజడి, కశ్మీర్ ప్రాంతంలో జరిగిన దాడులు మళ్ళీ భయపెట్టాయి. తమ మాతృభూమికి మళ్ళీ చేరుకుందామనే తపన,తడి వున్న కశ్మీర్ పండిట్స్ లో మళ్ళీ భయాందోళనలు అలుముకున్నాయి. పాకిస్తాన్, చైనా మనపై దొంగదెబ్బలు కొడుతూనే ఉన్నాయి. కశ్మీర్ లో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలి. పాలన సజావుగా సాగే పరిస్థితులు నెలకొనాలి. కశ్మీర్ పండిట్స్ తో పాటు, సిక్కులు, మిగిలినవారిలోనూ ధైర్యం నూరిపోయాలి. జమ్మూ, కశ్మీర్ భూభాగాలను మనం కాపాడుకోవాలి. ఆ భూమిపుత్రులందరికీ రక్షణ కల్పించాలి. ఇప్పటికీ సైనికుల రక్షణలోనే ప్రజలు జీవిస్తున్నారన్నది చేదునిజం. వారంతా స్వేచ్చావాయువులు పీల్చుకొనే రోజులు రావాలి. ఇవ్వన్నీ ప్రభుత్వాల చేతిలో, వాటిని నడిపించే నాయకుల చేతుల్లోనే ఉన్నాయి. సినిమా వేరు.. జీవితం వేరు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా సంగతి అటుంచి, కశ్మీర్ గురించి అలోచిద్దాం.

Also read: భారత్ పై అమెరికా ఆంక్షల భారమా?

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles