Saturday, February 24, 2024

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ఎన్నో గుణపాఠాలు

  • ఏదీ, ఎవ్వరూ శాశ్వతం కాదని గుర్తించాలి
  • నిజాయితీగా సేవ చేసినవారిని ప్రజలు ఆదరిస్తారు
  • కేజ్రీవాల్ పంజాబ్ ఫలితాన్ని వినమ్రంగా స్వీకరించాలి
  • కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆత్మావలోకనం చేసుకోవాలి

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. విజేతలు, పరాజితులు తేలిపోయారు.  ఇక అందరి దృష్టి 2024 లో జరుగబోయే సార్వత్రిక ఎన్నికల మీద పడింది. వాటికి కాస్త ముందుగా 2023లో 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి వుంది. ఈ దిశగా కూడా కసరత్తులు ఆరంభించాల్సిన సమయం  ఆసన్నమవుతోంది. మొన్నటి ఎన్నికల రణక్షేత్రంలో బిజెపి తిరుగులేని శక్తిగా మరోమారు నిరూపించుకుంది. ఆశ్చర్యకర ఫలితాలతో పంజాబ్ లో పాగా వేసిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కోరలు చాస్తోంది. కుదిరితే ప్రధానమంత్రి పీఠంపైనే కూర్చోవాలని ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ కత్తులు సానపడుతున్నారు.

Also read: భారత్ పై అమెరికా ఆంక్షల భారమా?

సాకారమౌతున్న ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’

పూర్తిగా చతికిలపడి, చేవ చచ్చిన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అగమ్యగోచరంగా తయారయ్యింది. దిల్లీ రాజకీయాలను శాసించాలని చూస్తున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తగ్గేదే లే అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్త ఫ్రంట్ నిర్మాణం గురించి ఇక ఏమి చెబుతారో చూడాలి. మరి కొన్ని నెలల్లోనే రాష్ట్రపతి ఎన్నిక కూడా జరగాల్సి ఉంది. నిన్నటి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో చాలామంది హీరోలు జీరోలయ్యారు. కాంగ్రెస్ పార్టీ వలె బహుజన సమాజ్ పార్టీ అధ్యాయం కూడా ముగిసిపోయినట్లేనని విమర్శలు వినిపిస్తున్నాయి. నరేంద్రమోదీ మహా నాయకత్వంలోని బిజెపి  చేపట్టిన ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ చాలా వరకూ సాకారమైంది. కాంగ్రెస్ తీరు ఇలాగే ఉంటే అది సంపూర్ణమవుతుంది. ప్రత్యర్థుల ఎత్తులకు బలికావడం అటుంచి, స్వయంకృత అపరాధాలే కాంగ్రెస్ కొంప ముంచాయి. ఉత్తరప్రదేశ్ లో యోగి ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకత ఆ పార్టీ గెలుపును ఆపలేకపోయింది.  అఖిలేష్ నాయకత్వంలోని సమాజ్ వాదీ పార్టీ గట్టిపోటీనే ఇచ్చింది కానీ అధికారాన్ని దక్కించుకోలేక పోయింది. 2017 ఎన్నికలతో పోల్చుకుంటే రెట్టింపుకు పైగా సీట్లను గెలుచుకుంది. ఓటింగ్ శాతాన్ని కూడా పెంచుకుంది. ప్రియాంక గాంధీ ఎంత కష్టపడినా ఫలితం దక్కలేదు. గతం కంటే సీట్లు తగ్గిపోవడమే కాక, ఓటింగ్ శాతం ఘోరంగా పడిపోయింది. బిజెపి దాదాపు 50 స్థానాలను పోగొట్టుకున్నా, ఓటింగ్ శాతం పెరిగింది. ఇలా  అధికార పక్షం బిజెపి -ప్రధాన ప్రతిపక్షంగా భావించే సమాజ్ వాదీ 2022 ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించాయి. ఒకప్పుడు చరిత్ర సృష్టించిన సంచలన నాయకురాలు,బహుజన సమాజ్ పార్టీ అధినాయకురాలు మాయావతి అస్త్రసన్యాసం చేసి, చెడ్డపేరు మూట కట్టుకున్నారు. నరేంద్రమోదీ తర్వాత భవిష్య ప్రధానమంత్రి అభ్యర్థిగా యోగి ఆదిత్య నాథ్ పేరు మారుమోగుతోంది. యోగి వలె వయసు రీత్యా సమాజ్ వాదీ పార్టీ అధినాయకుడు అఖిలేష్ యాదవ్ కూడా చిన్నవాడే, భవిష్యత్తు ఉన్నవాడే.

Also read: మహిళా సబలగా వర్థిల్లు!

జాతీయ రాజకీయాలపై దృష్టి

ఇక నుంచి ఆయన మమతా బెనర్జీతో కలిసి జాతీయ రాజకీయాలపై ప్రధానమైన దృష్టిని కేంద్రీకరిస్తారనే మాటలు వినపడుతున్నాయి. నిన్నటి ఎన్నికల్లో, సమాజ్ వాదీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం చాలారోజులు జరిగింది. గతంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన తప్పులు ఈసారి ఎన్నికల్లో బలంగా వెంటాడాయి. యాదవ్, ముస్లిం వర్గాల రౌడీరాజ్యం నడిచిందని, అవినీతి ఆకాశాన్ని అంటిందని ఆ పార్టీకి పెద్దఎత్తున చెడ్డపేరు వచ్చింది. ఈ ఎన్నికల్లో గెలుపు తీరానికి చేరలేకపోవడానికి అవే ప్రధానమైన కారణాలని ఎక్కువమంది వ్యాఖ్యాతల అభిప్రాయం. రేపటి సార్వత్రిక ఎన్నికల్లో సైతం అవే పాపాలు మరోమారు వెంటాడక తప్పవు. పార్టీని ప్రక్షాళన చేస్తేనే అఖిలేష్ కు భవిష్యత్తు ఉంటుందని సీనియర్ పాత్రికేయులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభావంతో మరోసారి అధికారాన్ని దక్కించుకున్న యోగి ఆదిత్యనాథ్ సైతం ఆత్మపరీక్ష చేసుకొని ముందుకు సాగాల్సి ఉంటుంది. తనపై ఇంత వరకూ వచ్చిన వ్యతిరేకతను దూరం చేసుకుంటేనే  ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది,కాకపోతే ఉత్తరప్రదేశ్ కే పరిమితం కావాల్సి ఉంటుందని దేశ రాజకీయాలు తెలిసిన పెద్దలు అంటున్నారు. దిల్లీలో వరుసగా రెండు సార్లు అధికారం చేజిక్కించుకొని, ఇప్పుడు మరో రాష్ట్రం పంజాబ్ లోనూ రాజ్యపీఠం స్థాపించిన కేజ్రీవాల్ ఈ విజయాలకు గర్వపడి, అదంతా తన గొప్పే అనుకుంటే  ఆ బండి ఎక్కువ కాలం నడవదు. మిగిలిన రాష్ట్రాల్లోనూ విస్తరించి, దేశ రాజకీయ యవనికపై పెద్దపాత్ర పోషించాలనేఆ కలలు నెరవేరవు.”ఒకప్పటి కేజ్రీవాల్ కాడు, అతను కూడా మామూలు రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తుతున్నాడు”అనే మాటలు దిల్లీ వీధుల్లో వినిపిస్తున్నాయి. పార్టీలో, పాలనలో  కొందరు తప్పులు చేస్తున్నా ‘ధృతరాష్ట్ర’ పాత్రను పోషిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సరికొత్త రాజకీయ సంస్కృతిని స్థాపిస్థానని మాట ఇచ్చి, క్షేత్రంలోకి దిగిన కేజ్రీవాల్ తన మాటలు నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కురువృద్ధ నాయకులు, కుళ్ళు పార్టీలపై కోపం వచ్చి, ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించారని ఆయన గ్రహించాలి. ఆయన గెలుపులో, మిగిలిన పార్టీలపై ప్రజలకు విశ్వాసం పోవడం ప్రధాన కారణం. అతని నాయకత్వంపై నమ్మకం ఉండడం మరో కారణం. ఆ విశ్వాసాలు సన్నగిల్లకుండా ఆయన చూసుకోవాలి. దేశ ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంపై విశ్వాసం సన్నగిల్లలేదని చెప్పడానికి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ పై ప్రజలు ఇంకా సానుకూలంగానే ఉన్నారని భావించడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఈ గెలుపులో విపక్షాల వైఫల్యం విస్మరించ జాలనిది. ఆచరణలో సత్ఫలితాలను అందిస్తే పార్టీలకు,నాయకులకు ఓటర్లు బ్రహ్మరథం పడతారు. లేకపోతే  మెడలు వంచి గద్దె దించుతారని ఇప్పటి వరకూ వచ్చిన అనేక ఎన్నికల ఫలితాలు చెబుతూనే ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుంచి నాయకులు,పార్టీలు పాఠాలు, గుణపాఠాలు నేర్చుకుంటారని ఆశిద్దాం. ఏదీ, ఎవ్వరూ శాశ్వతం కాదని తెలుసుకుంటారని భావన చేద్దాం.

Also read: కొత్త కూటమికోసం కేసీఆర్ సమాలోచనలు

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles