Monday, April 22, 2024

రైతుల ఆదాయం రెట్టింపుకు ప్రభుత్వం కృషి

  • కౌలురైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు చొరవ చూపాలి
  • ఎస్ఎల్ బీసీ సమావేశంలో సీఎం జగన్
  • మహిళల ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట
  •  సంక్షేమ పథకాల అమలుపై జగన్ పై బ్యాంకర్ల ప్రశంసలు

ముఖ్యమంత్రి వైయస్‌ అధ్యక్షతన క్యాంప్‌ కార్యాలయంలో 213 వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్  ద్వారా యూబీఐ జీఎం లాల్‌సింగ్, ముంబయి నుంచి యూబీఐ ఎండీ, సీఈఓ రాజ్‌కిరణ్‌రాయ్‌   హాజరయ్యారు. సమావేశంలో రైతుల సంక్షేమానికి, మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల తీరు తెన్నులను సీఎం జగన్ బ్యాంకర్లకు వివరించారు. ఆపత్కాలంలో రైతులకు అండగా నిలబడాలని బ్యాంకర్లను కోరారు. మహిళలు ఆర్థికంగా నిలబడినపుడే ఆ కుటుంబం నిజమైన వెలుగులు నింపినట్లవుతుందని సీఎం జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల తీరు తెన్నులను బ్యాంకర్లకు వివరించారు.

 వృద్ధి రేటుపై సీఎం సంతృప్తి

గడచిన త్రైమాసికంలో 7.5 శాతం వృద్ధి రేటు నమోదు కావడం సంతోషంగా ఉందన్నారు. పంట రుణాలు 99 శాతం ఇచ్చారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కావాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని బ్యాంకర్లను కోరారు. పెట్టుబడి వ్యయం తగ్గించి  పంటలకు సరైన మార్కెట్‌ సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రకృతి విపత్తులు సంభవించినపుడు రైతులకు అండగా నిలబడాలని బ్యాంకర్లను కోరారు.

రైతు భరోసా:

రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గించే ప్రయత్నాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రైతు భరోసా ద్వారా ఏటా 13,500 రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 50 శాతం రైతులకు అర హెక్టారు కన్నా తక్కువ భూమి ఉంది. రైతు భరోసా కింద ఇచ్చే 13,500 రూపాయలు ఆ రైతులకు 80 శాతం పెట్టుబడి వ్యయం కింద లభించినట్లవుతుందని అన్నారు.  ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభానికి ముందు మే నెలలో 7,500 రూపాయలు, పంట కోత సమయంలో మరో 4 వేల రూపాయలు ఆ తర్వాత సంక్రాంతి సమయంలో మిగిలిన 2 వేల రూపాయలు ఇస్తున్నట్లు సీఎం బ్యాంకర్లకు తెలిపారు.

సున్నా వడ్డీ రుణాలు:

వడ్డీ లేని రుణాల కింద ప్రయోజనం పొందడానికి రైతులను చైతన్య పరుస్తున్నట్లు సీఎం తెలిపారు.  వడ్డీ లేని రుణాల కింద గతంలో పలు కారణాల రీత్యా ఏర్పడ్డ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా  చెల్లించామని తెలిపారు. రైతులు కట్టాల్సిన ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని అన్నారు.

రైతు భరోసా కేంద్రాలు:

 ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల వల్ల రైతులు పండించే పంటలకు భద్రత లభించింది.  రాష్ట్ర వ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్న సీఎం జగన్ రైతులకు కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు ముందుంటాయని ముఖ్యమంత్రి తెలిపారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రైతులకు అందుబాటులోకి ఉంచే బాధ్యతను రైతు భరోసా కేంద్రాలు తీసుకుంటాయన్నారు.

కౌలు రైతులు:

ఆర్థిక అండదండలు లేక కౌలు రైతులకు సకాలంలో రుణాలు అందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వీరికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు మరింత కృషి చేయాలని సీఎం కోరారు., రుణాల మంజూరులో బ్యాంకులు చొరవ చూపి కౌలు రైతులను ఆదుకోవాలన్నారు..

జగనన్న తోడు:

జగనన్న తోడు కింద చిరు వ్యాపారులకు 10 వేల రూపాయల వడ్డీ లేని రుణాలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. వాస్తవానికి అసంఘటిత రంగం కూడా ఆర్థిక వ్యవస్థకు దోహదం చేస్తోంది. అయితే వారు ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక వడ్డీలకు రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం దుర్వినియోగం కాకుండా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నామని బ్యాంకర్లకు తెలిపారు. చిరు వ్యాపారులను బ్యాంకర్లు ప్రోత్సహించి రుణాలు మంజూరు చేస్తే ఆ రుణాలపై  వడ్డీని ప్రభుత్వం  చెల్లిస్తుందని సీఎం జగన్ బ్యాంకర్లకు హామీ ఇచ్చారు. చిరు వ్యాపారుల జీవితాలలో వెలుగులు నింపేందుకు  బ్యాంకర్లు చొరవ చూపాలని ముఖ్యమంత్రి కోరారు.

మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తున్న జగన్ సర్కార్:

ఆసరా, చేయూత పథకాల ద్వారా మహిళల స్వయం సాధికారితకు ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల జీవితాలను మార్చేలా పథకాలను అమలు చేస్తున్నామన్నారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు మహిళలు వారి కుటుంబంలో అత్యంత ప్రభావంతమైన పాత్ర పోషిస్తారు. అందుకే చేయూత పథకంలో గుర్తించిన మహిళలకు ఏటా 18,750 రూపాయల చొప్పున చెల్లిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే విధంగా అమూల్, అల్లానా,ఐటీసీ, ప్రాక్టర్‌ అండ్‌ గాంబుల్, హెచ్‌యూఎల్, రిలయెన్స్‌ వంటి ప్రఖ్యాత సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామన్నారు. జగనన్న జీవక్రాంతి పథకం ద్వారా మహిళలకు గొర్రెలు, మేకల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.  

స్వయం సహాయక బృందాలు:

 రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు 2020–21లో తమ ఖాతాల్లో 7,500 కోట్లు జమ చేశాయి. వాటికి బ్యాంకులు ఇస్తున్న వడ్డీ కేవలం 3 శాతం మాత్రమే.  కానీ అవే బ్యాంకులు రుణాలపై 11 శాతం నుంచి 13 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయని సీఎం జగన్ బ్యాంకర్లను ప్రశ్నించారు.   

ఎంఎస్‌ఎంఈలకు బ్యాంకర్లు అండగా ఉండాలన్న సీఎం జగన్:

ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ఎంఎస్‌ఎంఈ రంగానికి బ్యాంకులు తోడ్పాటునందించాలని సీఎం కోరారు. ప్రతి ఎంఎస్‌ఎంఈలో ప్రత్యక్షంగా, పరోక్షంగా కనీసం 10 మంది జీవనోపాధి పొందుతున్నారు. 2014 నుంచి ఆ పరిశ్రమలకు 1100 కోట్ల రూపాయల రాయితీలు చెల్లించినట్లు జగన్ స్పష్టం చేశారు.  

టిడ్కో గృహాలు:

టిడ్కో ఇళ్లను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. 2.69 లక్షల యూనిట్లను 2021 డిసెంబర్, 2022 డిసెంబర్‌లో రెండు విడతలుగా పూర్తి చేస్తామని సీఎం ప్రకటించారు. దీనికి బ్యాంకర్లు తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు.

పథకాల అమలుపై సీఎంను ప్రశంసించిన బ్యాంకర్లు

సమావేశంలో రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు పట్ల బ్యాంకర్లు  హర్షం వ్యక్తం చేశారు. పథకాల అమలుకు సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈవో రాజ్‌ ‌కిరణ్‌రాయ్ కొనియాడారు.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles